ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లును కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం గత నవంబర్ 30న శాసనసభలో ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టబద్ధతకు మూడు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీల నాయకులు ఎవరిస్థాయిలో వాళ్ళు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ జల్లులు కురిపించారు. అందరూ ఎస్సీ, ఎస్టీల క్షేమం కోరేవారైతే వారి బతుకులు, ఇప్పటికీ ఇంత దుర్భరంగా ఎందుకున్నాయి? అనే ప్రశ్నకు ఏ ఒక్కరి వద్ద సమాధానం లేదు. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులలో వేలకోట్ల రూపాయలు ఎందుకు దారిమళ్ళాయి? ఎవరు మళ్ళించారు? అనే ప్రశ్నకు అందరూ సమాధానం దాటవేసే వాళ్ళే.
కేంద్ర ప్రభుత్వం ఐదో పంచవర్ష ప్రణాళికలో ఎస్సీల అభివృద్ధి కోసమని స్పెషల్ కంపోనెంట్ ప్లాన్, ఎస్టీల అభివృద్ధి కోసం ట్రైబల్ సబ్‌ప్లాన్ రూపొందించింది. ఈ పథకం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. ఆ నిధులను వాళ్ళ సంక్షేమానికే ఖర్చుపెట్టాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు సక్రమంగా నిధులు కేటాయించడం లేదు. ఆ కేటాయించిన అరకొర నిధులు కూడా సరిగ్గా వినియోగించడం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలతో అంతర్గత కుమ్ములాటలతో ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ స్థానికసంస్థల ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే ఉపప్రణాళిక బిల్లును తెరమీదకు తెచ్చిందనేది స్పష్టం. కానీ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యమని అందుకే చట్టం తెచ్చామని ప్రజల్ని నమ్మించడానికి పార్టీలోని ఎస్సీ, ఎస్టీల నాయకుల్ని, కులసంఘాల నాయకుల్ని, ఎన్జీఓలను రంగంలోకి దింపి విస్తృత ప్రచారం చేస్తోంది.
1977 అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీల భూముల్ని బహుళజాతి కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎన్.ఎస్.ఎఫ్.డి.సి. (నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ని రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్‌ను అంపశయ్య మీదకు చేర్చారు. మరోవైపు దళిత విద్యావంతుల్ని పారిశ్రామికవేత్తలను చేస్తా, సంవత్సరం తిరక్కుండానే కోటీశ్వరుల్ని చేస్తానని దళితుల్ని మభ్యపెట్టి రెండవ సారి అధికారం చేజిక్కించుకున్నారు. అదే ఫార్ములా ఇప్పడు కిరణ్ కుమార్ రెడ్డి అమలు చేస్తున్నారు. కాకుంటే ఎన్.ఎస్.ఎఫ్.డి.సి.ని, ఎస్సీకార్పొరేషన్‌ని పునరుజ్జీవింప చేస్తామంటున్నారు.
ఆదివాసులు పోరాడి సాధించుకున్న 1/70 యాక్ట్, షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయేతర అటవీ హక్కుల గుర్తింపు చట్టం, వడ్డీవ్యాపార నిషేధ చట్టం లాంటి అనేక చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసులను అడవి నుంచి తరిమేస్తున్నారు. చట్టాలను అమలు చేయండని అడుగుతున్న ఆదివాసులపై తూటాల వర్షం కురిపిస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం వల్ల మన రాష్ట్రంలో 400 పైగా ఆదివాసీ గ్రామాలు, వ్యవసాయ భూములు ముంపునకు గురౌతున్నాయి. వాకపల్లి, భల్లుగూడ ఆదివాసీ మహిళలపై సామూహిక అత్యాచారం చేసిన పోలీసులపై కనీసం ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు కాలేదంటే చట్టాలకు పాలకులిచ్చే విలువేంటో అర్థమౌతుంది. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన చట్టాలను నిర్లక్ష్యం చేస్తూ వారి భూముల్ని, బతుకుని, బతుకుదెరువుని బుగ్గిచేస్తున్న పాలకులు ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో వాటా కేటాయించి, ఆ కేటాయింపునకు చట్టబద్ధత కల్పిస్తూ, దాన్ని అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 'ప్రాజెక్టుల కోసం, పరిశ్రమల కోసం ప్రభుత్వం సేకరించిన భూమి నిరుపయోగంగా ఉంటే అది పూర్వ యజమానులకు ఇవ్వరాదు.
భూమిలేని నిరుపేదలకు పంచవచ్చు' అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రభుత్వానికి కోర్టులపై, చట్టాలపై ఏ మాత్రం గౌరవమున్నా పది సంవత్సరాల క్రితం మొత్తం 250 ఎకరాల భూమిని లక్షింపేట దళితులకు, పక్కన ఉన్న కొట్టిశ గ్రామంలోని భూమిలేని పేదలకు పంచి ఉండాల్సింది. అక్రమంగా, చట్టవ్యతిరేకంగా భూమిని అనుభవిస్తూ దళితుల నుంచి దౌర్జన్యంగా కౌలు వసూలు చేస్తున్న పెత్తందారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాల్సింది. కానీ అగ్రకుల పక్షపాత ప్రభుత్వం ఆ పెత్తందారుల పక్షం వహించడమే కాకుండా దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. లక్షింపేట మాలలపై మారణకాండ జరిగిన తర్వాతైనా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం బాధితులందరికీ నష్టపరిహారం/పునరావాసం కింద కుటుంబానికి రెండెకరాల నుంచి ఐదెకరాల వరకూ భూమి ఇవ్వాలి. కానీ ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఒకటుందనే స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎస్సీ, ఎస్టీల వాస్తవ జీవితాలు ఇంత దుర్భరంగా ఉంటే అందుకు కారకులైనవారు ఎన్ని గారడీలు చేసినా ఎంత ప్రచారం చేసుకున్నా ఆశాభంగం తప్పదు.
- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి
Andhra Jyothi Telugu News Paper Dated: 12/4/2013
- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాటసమితి
No comments:
Post a Comment