తరతరాలుగా రాముణ్ణి తెలుగువారు ఆదర్శ పురుషుడని నమ్ముతూ వచ్చారు. భర్త రాముడిలా ఏక పత్నీ వ్రతుడు కావాలనీ, భార్య సీతలాగా ఎన్ని కష్టాలొచ్చినా భర్తనే నమ్ముకుని ఉండాలనీ స్త్రీలూ, పురుషులూ నమ్మారు... టీవీ, సినిమాలు చూసి చెడిపోతున్న మగపిల్లలంతా ఈ యాత్రల్లో పాల్గొని కొంచెమయినా భక్తిని నేర్చుకున్నారనే ఆశ తల్లిదండ్రుల్లో చిగురించింది. అంతేకాదు, ఆ భయం, భక్తీ తమ పట్ల కూడా ప్రదర్శించేట్లు చూడు రామయ్యా అని, మనసులోనే అనేక దణ్ణాలు పెట్టుకుంటున్నారు కూడా...
హైదరాబాదులో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న హనుమాన్ యాత్రలూ, ఈ సంవత్సరం మొదలైన రాముడి శోభా యాత్ర అనేక మంది తెలుగు వారిని అయోమయానికి గురిచేస్తున్నాయి. ఒకపక్క కొత్త ఆశలు చిగురిస్తుంటే ఇంకో పక్క, కొంతమంది గందరగోళానికి కూడా లోనవుతున్నారు. రాముడితో, హనుమంతుడితో తరతరాలుగా రకరకాల బంధాలూ అనుబంధాలూ ఏర్పరచుకున్న తెలుగు వారి మనోగతాన్ని ఒకసారి విందాం.
మొదటిగా చెప్పుకోవాల్సింది రామ భక్త కోటి బాధ గురి ంచి. శ్రీరామనవమి అంటే ఇంట్లో, పక్కింట్లో వీధిగుళ్ళో పానకం, వడపప్పు సేవించి, సీతారామ కళ్యాణం తిలకించి, ఇంకా భక్తితో రేడియోలోనో టీవీలోనో, భద్రాచలంలో జరిగే రామ కళ్యాణం వినటం, చూడటం వీరి అలవాటు. రాముడి మీద భక్తిని రామదాసు కీర్తనలు విని పాడి ఇంకా ఎక్కువయితే రామకోటి రాసి నిరూపించుకోవటం కూడా వీరికి మామూలే. అయితే ఇప్పుడు రామభక్తిని నిరూపించుకోవటానికి ఇవి చాలవేమో అన్న భయం వీరిని ఆందోళనకు గురిచేస్తోంది. తామిన్నాళ్ళూ క్రమం తప్పకుండా శ్రీరామనవమి జరుపుకుని కూడగట్టుకున్న పుణ్యమంతా ఏమైపోతుందో అన్న భయం పట్టుకుంది వీళ్ళకి. ఈ యాత్రల్లో పాల్గొనకపోతే తమని రాముడు భక్తులుగా పరిగణించడా? ఇలా రామభక్తిని నిరూపించుకోవాలంటే, తమలో వయసు మీద పడిన వారికెలా సాధ్యమవుతుంది? తామూ ఈ యాత్రల్లో పాల్గొనటానికి ఏం చెయ్యాలి? ఇంతకీ, ఈ యాత్రల్లో ఊరేగుతున్నది భద్రాచలరాముడా లేక అయోధ్య రాముడా? హైదరాబాదులో ఈ యాత్రలకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇక భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించటం మానేస్తుందా? అప్పుడు భద్రాచల రాముడి పరిస్థితేమిటి? అంతేకాక, తాము రాసిన రామకోటి పరిస్థితేమిటి? దాన్నిప్పుడు భద్రాచలంలో సమర్పించాలా? లేక ఈ కొత్త యాత్ర తమ కాలనీకో, గల్లీకో వచ్చినప్పుడు సమర్పించేసేయ్యాలా?
హనుమంతుడు, రాముని బంటు అని గట్టిగా నమ్మిన వారు కాబట్టి 'హనుమాన్ యాత్ర'ల పట్ల కూడా వారికి సం దేహాలు వస్తున్నాయి. రాముని ప్రమేయం లేకుండా ఒంటరిగా హనుమంతుడు తనంతట తానూ యాత్రలు చెయ్యొచ్చా? అది సరైనదేనా? రాముని బంటయిన హనుమంతుడు కూడా రామనవమి నాడే యాత్ర చెయ్యొచ్చు కదా, వేరే ఎందుకు చేస్తున్నట్లు? రాముడిని, సీతారాముడు, జానకి రాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు అని మాత్రమే పిలుచుకుని, అవే పేర్లు పిల్లలకి పెట్టుకునే అలవాటున్న తెలుగు ప్రజలకి సీతారామ కల్యాణం రోజున సీతతో పాటు, పెళ్లి కళతో కనిపించాల్సిన రాముడు, సీత లేకుండా బాణాలు పట్టుకుని 'మిలటరీ రాముడు'లా కనిపించటం అశుభం కాదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.
తరతరాలుగా రాముణ్ణి తెలుగువారు ఆదర్శ పురుషుడని నమ్ముతూ వచ్చారు. భర్త రాముడిలా ఏక పత్నీ వ్రతుడు కావాలనీ, భార్య సీతలాగా ఎన్ని కష్టాలొచ్చినా భర్తనే నమ్ముకుని ఉండాలనీ స్త్రీలూ, పురుషులూ నమ్మారు. తమ కొడుకులు ఈ యాత్రల్లో పాల్గొంటే గమనిస్తున్న ఈ తల్లిదండ్రుల మనోభావాలు చూద్దాం. టీవీ, సినిమాలు చూసి చెడిపోతున్న మగపిల్లలంతా ఈ యాత్రల్లో పాల్గొని కొంచెమ యినా భక్తిని నేర్చుకున్నారనే ఆశ వీరిలో చిగురించింది. అం తేకాదు, ఆ భయం, భక్తీ తమ పట్ల కూడా ప్రదర్శించేట్లు చూడు రామయ్యా అని, మనసులోనే అనేక దణ్ణాలు పెట్టుకుంటున్నారు కూడా. అయితే, ఇంతమంది యువకులు కలిసినప్పుడు, రాముడి పేరు మీదయినా సరే, జరిగే అనర్థాల గురించీ వారికి తెలుసు. తమ పిల్లలు, తల్లిదండ్రులంటే భక్తీ, భయం కలిగిన దశరథ రాముడిలా కాక, రావణుడి మీద యుద్ధానికెళ్ళిన ఉగ్ర రాముడిలా తయారయితే ఎలా అనే భయం వీళ్ళకి పట్టుకుంది. సరైన పనికీ, నచ్చని పనికీ తేడా తెలియని వయసు కదా వీరిది, తమకి నచ్చని వారిమీద, ఈ యాత్ర స్ఫూర్తితో అనవసర తగవులకీ, గొడవలకీ దిగరు కదా పిల్లలు అన్న సందేహంతో సతమతమవుతున్నారు.
యాత్రల్లో తిరుగుతున్న పెళ్ళయిన యువకుల భార్యల మనోగతం వేరేలా ఉంది. తమ భర్తలకూ రాముడి లాగా ఏకపత్నీ వ్రతం రావాలనీ, పరాయి స్త్రీల పట్ల చూడని నిబద్ధత రావాలనీ వారు ప్రార్ధిస్తున్నారు. అయితే, వారి భయాలు వారికున్నాయి. ఈ ఆదర్శంతో పాటు, గర్భవతని కూడా చూడకుండా, పరాయివాళ్ళ మాటలు విని భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన 'ఆదర్శం' కూడా నేర్చుకుంటారా తమ భర్తలు, సీతలాగా తామూ పరాయి వారి పంచన, ఒంటరిగా పిల్లల్ని పెంచుకుంటూ జీవితం వెళ్లదీయాల్సిన పరిస్థితులు వస్తాయా? అంతే కాదు ఇరవయ్యొకటో శతాబ్దపు విలువలకు, రామాయణ విలువలకూ మధ్య ఉన్న అంతరాలూ వారిని అయోమయానికి గురిచేస్తున్నాయి.
సీతని రాముడు తరిమేస్తే ఆమె అడవికెళ్లింది కానీ, ఇప్పుడు మరి కుటుంబ హింస నిరోధక చట్టం వచ్చింది కదా, సీతకి లేని వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది కదా తమకు? మరి ఈ తరం స్త్రీగా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలా లేదా? రాజ్యం కోసమే భార్యను వదిలేసినా రాముణ్ణి ఆనాటి సీత గౌరవించింది కానీ, స్త్రీలకి కూడా, చీమూ నెత్తురు కోరికలు ఆత్మగౌరవం ఉంటాయని భావించే సమాజంలో పుట్టి పెరిగిన తాము అటువంటి భర్తలనెందుకు గౌరవించాలి? ఇం తకీ, అసలు రాముడు ఈ శతాబ్ద స్త్రీలకూ ఆదర్శ పురుషుడేనా? మరి ఇటువంటి సందేహాస్పదమైన ఆదర్శ పురుషుడి కోసం, తమ భర్తలెందుకు యాత్రలు చేస్తున్నారు?
రాముడు పోరాడి ఓడించిన జనం - రావణుడు, ఆయన అనుచరులు, వారసులు. ఈ దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు. తరతరాలుగా వచ్చిన జ్ఞాపకాలూ తాతలు, తండ్రులు చెప్పిన కథలతో, తమని తాము రావణుడి వారసులుగా భావించుకున్న తరం వారి ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. రాముడట, రాముడు! మా తాత ముత్తాతల్ని చంపి, తన రాజ్యాన్ని స్థాపించుకున్న రాముడి కోసం యాత్రలా? మమ్మల్ని రాక్షసులుగా చిత్రీకరించి తరతరాలుగా తొక్కిపెట్టి మా చరిత్రను వక్రీకరించి మమ్మల్ని మాక్కాకుండా చేసిన రామాయణం, రాముడూ మాకెట్ల ఆదర్శమవుతాడు? మా తాటకిని చంపి, మా శూర్ఫణఖ ముక్కు కోసిన రాముడికి మేము జై కొట్టాలా? ఏ పనులు ఈ రోజు తప్పని చెప్తున్నామో - స్త్రీలని హింసించటం, కురూపులని చెయ్యటం అత్యాచారాలు చెయ్యటం-ఆ పనులన్నీ చేసి న రాముడి కోసం యాత్రలు చెయ్యటం ఎంత సిగ్గుచేటు?
తాటకి, శూర్ఫణఖ వారసులుగా తమని తాము చూసుకుంటున్న స్త్రీల ఆలోచనలు వేరే రకంగా సాగుతున్నాయి. అడవులని బ్రాహ్మల నుంచి కాపాడి తమ ప్రజలకి అందించాలని పోరాడిన తాటకినే సంహరించాడు కదా రాముడు, మరిప్పుడు తమ తమ సమూహాల కోసం పోరాడుతున్న దళిత, బహుజన, ఆదివాసీ స్త్రీలనెట్లా రక్షిస్తాడు? అసలు రాముడికి లేని విలువలు రామసేన కెలా వస్తాయి? రామ సేనలలో చేరుతున్న తమ్ముళ్లనీ, అన్నలనీ ఎలా బయటకి లాగాలి? మగవారి అనుమతితో సంబంధం లేకుండా, స్త్రీలు తమ ఇష్టాన్ని వ్యక్తీకరించే సంస్కృతికి వారసురాలయిన తమ శూర్ఫణఖ వారసత్వాన్ని ఈ రామ సేనలు ఒప్పుకుంటాయా? లేక, నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఆవిడని కురూపిని చేసిన రాముడి సంస్కృతిని తిరిగి తెస్తాయా? నీ స్వేచ్ఛని, పరిధిని, పరిమితుల్ని మేము నిర్ణయిస్తాము మీకు గీతల్ని గీయాల్సింది మేము అని అంటాయా? మన గీతల్ని మనం గీసుకునే సమయం వచ్చిందని కాదూ, మొన్నకి మొన్న మనము నిర్భయ సంఘటన తరువాత అందరికీ అరచి చెప్పిందీ? అన్ని ఆధిపత్యాల్ని పడగొట్టాలని పోరాడుతున్న మనల్ని కొత్త గీతల్లోకి, పరిమితుల్లోకి, ఆధిపత్యంలోకి లాగరు కదా, ఈ కొత్త రాముడి అనుచరులు?
ఇంతకీ, రాముడేమనుకుంటున్నాడు? అయ్యో! నేనేదో త్రేతాయుగంలో నాకు తెలిసిన ధర్మం, న్యాయం ఏదో అమలు చేస్తే, వీళ్లిప్పటికీ, దాన్ని, నన్ను పట్టుకునింకా ఎందుకు వేళ్లాడుతున్నారు? కొత్త యుగాలకి, కొత్త ధర్మాలు, కొత్త శాసనాలు, కొత్త లోక పురుషులూ, కొత్త ఆదర్శాలు ఉండాలి కదా? ఈ యుగంలో కూడా నన్ను, నా ధర్మాన్నే కావాలనుకుంటున్న ఈ వింత మనుషులు ఎవరబ్బా? అని తల పట్టుకుని దీర్ఘాలోచనలో పడ్డాడు.
- సీత రామ వెంకట సునీత
అన్వేషి రీసెర్చ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్
Andhra Jyothi Telugu News Paper Dated : 30/4/2013
No comments:
Post a Comment