Saturday, April 27, 2013

ఆదరణ కరువైన దొమ్మరులు ----బుద్ధారం రమేష్
కూటి కోసం కోటి విద్యలు’ అనేది అందరికీ తెలుసు. ఎన్ని విద్యలు తెలిసినా పూట గడవని పరిస్థితి ‘దొమ్మర’ కులానిది. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాల్లో దొమ్మరులు అతి దయనీయంగా బతుకులీడుస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 29 జాతులను విముక్త, సంచార, పాక్షిక సంచార జాతులుగా గుర్తించారు. ఈ జాతుల్లో దొమ్మరులు కూడా ఒకటిగా జస్టిస్ మనోహర ప్రసాద్ కమిషన్ (1968) గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో జరిపిన ‘హౌస్ హోల్డ్ సర్వే’ ప్రకారం వీరి జనాభా 48612. ప్రధానంగా దొమ్మరులు సంచారులు. దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లో దొమ్మరులున్నారు. మన రాష్ట్రంలో యాదగిరిగుట్ట, కాళహస్తి, పీలేరు, నారబైలు, నాయుడుపేట, మనుబోలు, చిలకలూరిపేట, గుంటూరు తదితర ప్రాంతాల్లో వీరి జనాభా ఎక్కువ. దొమ్మర కులం ప్రాచీనమైనదిగా చరివూతకారులు చెబుతున్నారు. విజయనగర రాజుల కాలంలోని చాలా శాసనాలలో మొదటిసారి దొమ్మరుల ప్రస్తావన ఉన్నదని సుప్రసిద్ధ శాసన పరిశోధకులు ప్రొఫెసర్ ఎస్.ఎస్.రామచంవూదమూర్తి పరిశోధనల్లో తేలింది. మెకంజీ కైఫియత్తులు, ఇతర లిఖిత ఆధారాలలో వీరి వివరాలున్నాయి. 1801లో వెంకటగిరి సంస్థానంలో ‘దొమ్మర తఫీరమ్’ పన్ను విధించారు. దొమ్మరులు ప్రజలను వినోదపరుస్తూ ఆటలు ఆడి సంపాదించిన దానిలో కొంత భాగం గ్రామాధికారులకు చెల్లించేవారు. దొమ్మర వాళ్లు గ్రామంలో అడుగుపెడితే శుభసూచకమనే భావన ఆ రోజుల్లో ఉండేది.

దొమ్మర కులంలో కూడా మదరాజులు, సలపక్షి, మల్లెకాపు, కొత్తకొండవాల్లు అనే ఉప కులాలున్నాయి. అలాగే వీరిలో ముఖ్యంగా రెండు తెగలు కాపు దొమ్మర, ఆరె దొమ్మర ఉన్నట్లు హసన్ అనే చరివూతకారుని రచనల ద్వారా తెలుస్తున్నది. ప్రజలకు వినోదాన్ని ఇవ్వటం వీరి ముఖ్య వృత్తి. దొమ్మరులు పసరిక వైద్యం చేయడంలో నిష్ణాతులు. ప్రదర్శనలు చేసే సమయంలో ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలినా, ఎముకలు విరిగినా వెంట తెచ్చుకున్న చెట్ల పసర్లతో వైద్యం చేసుకుంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్లి వైద్యం చేయించుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సంచార జీవులు కాబట్టి తమలోనే ఒకరు వైద్యాన్ని చేపట్టి అందులో నిష్ణాతులవుతారు. వీరి వైద్యం గురించి ఎక్కడా రాసి పెట్టిన దాఖలాలు లేవు. అంతా మౌఖికమే. తమ చుట్టూ ఉండే జంతువుల భాగాలనే వైద్యానికి ఉపయోగిస్తారు. నక్క కొమ్మును ఎప్పుడూ తమవద్ద ఉంచుకుంటారు. దీన్నికలిగి ఉన్నవాడు వారి వైద్యుడు. నక్క పాదాలు లేదా గోళ్ళను తన సంచిలో దాచి ఉంచుకుంటాడు. వేరెవరైనా మందుకోసం వస్తే వీటిని చూపుతాడు. అన్ని నక్కలకు కొమ్ములు ఉండవు. కాని ప్రత్యేకమైన ఒక జాతికి మాత్రమే కొమ్ము ఉంటుంది. కీళ్ళనొప్పులు, వాయు నొప్పులు, తేలు, పాము కాటుకు, పిచ్చి కుక్క కాటు, గుండె నొప్పులకు దొమ్మర వైద్యం బాగా పనిచేస్తుందని ప్రతీతి. ఇక వీరి ఆటల గురించి చూసినట్లయితే, ఈనాటి జిమ్నాజియంకు తీసిపోని విన్యాసాలు చేస్తారు దొమ్మరులు. గడ ఎక్కడం, పల్టీలు కొట్టడం, తీగమీద నడవడం, చిన్న ఇనుప రింగులో ఇద్దరు దూరి బయటికి రావడం లాంటి ఎన్నో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు దొమ్మరులు చేస్తారు. వీరు తమ కుటుంబాల్లో పదేళ్ల వయస్సు నుంచే పిల్లలకు శిక్షణ ఇస్తారు. శారీరక విన్యాసాలు చేయడంలో దొమ్మర స్త్రీలు ప్రతిభావంతులు. దొమ్మర మహిళలు తమ కుటుంబాలతో పాటు సంచార జీవనంలో ఉంటూనే చాపలు, బుట్టలు అల్లుతారు. పురుషులతో సమానంగా సాహస క్రీడలు చేస్తారు. రెండు గెడల మధ్య తాడుమీద నడవడం వీరి ప్రత్యేకత.

ఆధునిక ప్రపంచంలో దొమ్మరుల జీవితం దిన దిన గండం గా మారింది. వీరు విద్యపూన్ని ప్రదర్శించినా వారి పొట్టనింపలేకపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వీరి బతుకును బుగ్గిపాలు చేస్తున్నాయి. పూటగడవటమే కష్టంగా మారింది. కుల వృత్తి దెబ్బతిన్న ఫలితంగా వీరు ఈతచెట్ల ఆకులతో చాపలు అల్లి జీవ నం సాగిస్తున్నారు. ఆడవారు ఇళ్ళల్లో పాచి పనులు, మగవారు చెక్క దువ్వెనలు, ఈర్పెనలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. గేదెల కొమ్ములతో అందమైన అలంకరణ వస్తువులు తయారు చేయడం, కరవూలతో చెక్క దువ్వెనలు, ఈరిబానులు తయారు చేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని జీవనా న్ని నెట్టుకొస్తున్నారు. కొందరు పందులు, మేకల పెంపకాన్ని జీవనాధారం చేసుకోగా మరికొందరు చిరు వ్యాపారాలు చేస్తు న్నారు. కొందరు గత్యంతరం లేని పరిస్థితుల్లో పూట గడవడం కొసం వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకున్న సందర్భాలున్నాయి. అరవై అయిదేళ్ల స్వాతంవూత్యానంతర కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని కులాల్లో దొమ్మరులే ప్రథమ స్థానంలో నిలుస్తారు. దొమ్మరులు సొంత ఇల్లు, సొంత భూమి, రేషను కార్డు, ఓటు హక్కు లేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి సంచార జీవిత విధానమే ప్రధాన కారణం. ఇలాంటి సంచార జీవితం కారణంగా.. వీరి పిల్లలు చదువుకు నోచుకోవడంలేదు. వీరికి విద్యా, ఉద్యోగ రంగాలలో తగిన ప్రాతినిధ్యం లేదు. వెనుకబడిన వర్గాల కోసమని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నది. కానీ ఈ ప్రభుత్వ పథకాలేవీ దొమ్మరుల దరిచేరడం లేదు. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, కశ్మీర్ రాష్ట్రాల్లో వీరిని షెడ్యూల్డ్ కులంగా గుర్తిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం వెనుకబడిన తరగతుల జాబితాలో దొమ్మరలను చేర్చారు. గతం లో ఈ సామాజిక వర్గం ఎస్టీ జాబితాలో ఉన్న కాలంలో విద్యాపరంగా కొంత మేలు జరిగింది. ఆ తర్వాత వీరిని బీసీ జాబితాలో చేర్చడంతో వీరి అభివృద్ధి అటకెక్కింది. 

అలాగే వారి కులవృత్తి తాలూకు వెక్కిరింపులతో సామాజిక అణచివేతలకు బలవుతున్నారు. బిడ్డలను చదివించాలన్న ఆరాటం ఉన్నా ఆ కులం పేరు చెప్పుకోలేక, పాఠశాల విద్యకు దూరంగా ఉంటున్నారు. ఊరి శుభం కోరి తమ పూర్వీకులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి విన్యాసాలు చేస్తే వాటికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం. ఇదిలా ఉంటే , రోడ్ల మీద చూసే దొమ్మరివాళ్ళ వైద్య విజ్ఞానాన్ని ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. మీర్జాపురం తదితర ప్రాంతాల నుంచి తీసుకుపోయిన రంద్రాలు గల ఆవుకొమ్ములు, దుప్పి కొమ్ములతో చేయబడిన అచూషణ పాత్ర పరికరాలు అక్కడ భద్రపరచడం వీరి పనితనానికి, వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. వందేళ్ళ కిందే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దొమ్మర వైద్యానికి మన దేశంలో స్థానమెక్కడ? ఇంత విలువైన వారసత్వ సంపద కనుమరుగవుతుంటే దాన్ని నిర్లక్షం చేయడం ఎంత వరకు సబబు? చారివూతకంగా గుర్తింపు, ఆదరణ పొందిన ఈ జాతి నేడు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడడం విచారకరం. విముక్త సంచా ర జాతుల ఆర్థిక, సామాజిక సమస్యలు పరిష్కరించి వారికి గౌరవవూపదమైన స్థానం కల్పిస్తామని ఏలికలు ఎన్నో హామీలు ఇచ్చినా.. అవి అమలుకు నోచుకోవడం లేదు. బాలకృష్ణ రెనకె నేతృత్వంలోని జాతీయ విముక్త సంచార జాతుల కమిషన్ చేసి న సిఫార్సులను కేంద్ర సర్కారు విస్మరించడం, 2008 జూలై 2న కమిషన్ సమర్పించిన నివేదికను కేంద్రం తొక్కిపెట్టి, ఆ జాతుల ఆశలపై నీళ్లు చల్లడం ప్రభుత్వ నిర్లక్షానికి తార్కాణం. అవసాన దశలో ఉన్న ఈ జాతుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక రిజర్వేషన్లు, విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. పేదరిక నిర్మూలన కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి అమలు చేయాలి. యువతకు ఆధునిక పద్ధతుల్లో వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలి. అలాగే తరతరాలుగా వీరికి జీవనోపాధిగా ఉన్న ‘సర్కస్ విద్యల’ను ప్రోత్సహించి వాటిని అభివృద్ధి చేయాలి. ఒలింపిక్ క్రీడలను తలదన్నే రీతిలో ఉండే దొమ్మరుల సర్కస్ విద్యలకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను జోడించి పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టి వాటిని క్రీడలు గా అభివృద్ధి చేయాలి. అలాగే దొమ్మరుల కుటుంబాల నుంచి వృత్తి నైపుణ్యం గల వారిని ఒలింపిక్ పోటీలకు పంపేలా చర్యలు తీసుకోవాలి.

-బుద్ధారం రమేష్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెం


Namasete Telangana Telugu News Paper Dated : 28/4/2013

No comments:

Post a Comment