Sunday, April 14, 2013

గొరయ్యా నా నేస్తం:జైలుపక్షి జీతన్ మరాండీmarandiపాట ఓ శరీరం కాదు ఉరివేసి చంపేయడానికి... పాట పెదవులు చేసే చప్పుడు కాదు చెట్టుకు కట్టేసి కాల్చేయడానికి పాటంటే ఉవ్వెత్తున ఎగిరిపడే కెరటం.. పొత్తిళ్లలో పసిపాప నవ్వు.. నిండుజీవితం... అందుకే తన గళంతో జాతి జాగృతి కోసం పోరాటం చేశాడు జార్ఖండ్ కళాకారుడు జీతన్ మరాండీ ఆ పోరాటమంటే ప్రభుత్వానికి భయం... అందుకే అది ఆయనను ఉరితీసి 
ఊపిరి పీల్చుకోవాలనుకుంది జైల్లో నిద్రకు మెలకువకూ మధ్య ఎన్నో రాత్రులు పగలయ్యాయిచివరకు ఉరితాడును పూల మాలగా ధరించి.. ప్రపంచానికి తన జాతిగీతాన్ని 
వినిపించాలనుకున్నాడు ‘వో సుబహ్ కభీతో ఆయేగీ’ అంటూ స్వేచ్ఛాగానం ఆలపించాడు ఆ గానం దేశవ్యాప్త ఉద్యమానికి ఊపిరులూదింది ఆయనను నోట కరుచుకున్న మరణం పట్టు జారింది.. ఉరితాడు ముడి వీడింది 30ఏళ్లకే వందేళ్ల జీవనసారాన్ని చవిచూసిన ఆ జైలుపక్షి మనసిది...

జార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా మారుమూల గ్రామం సుదూర్‌లో 1980లో ఓ ఆదివాసీ కుటుంబంలో పుట్టాను. నాన్న పేదరైతు. మా ఊరు చాలా పెద్దది. జన సంఖ్య కూడా ఎక్కువే. కానీ చదువు లేదు. మా ఊళ్లో ఎవ్వరూ మెట్రిక్యులేషన్ పాస్ కాలేదంటే... మేం చదువులో ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో పిల్లలు కావచ్చు... పెద్దవాళ్లు కావచ్చు. కొన్ని బాధ్యతలుంటాయి. నా బాధ్యత పశువులను, మేకలను కాయడం. అట్లా నేను పశువులు, మేకలను తోలుకొని అడవికిపోయేవాడిని. ఎక్కడైనా తప్పిపోతాయేమోనని గులకరాళ్లతో వాటిని లెక్కించుకునేవాడిని. 9, 10 ఏళ్లకు గానీ నాకు తెలివొచ్చింది. స్కూల్ అంటే తెలిసొచ్చింది. చదువుకోవాలనిపించింది. అన్నతోపాటు బడికి పొయిన. నేను వెళ్లిన మూడు, నాలుగు రోజులకే అన్న బడి బంద్ చేసిండు.

అయినా నాకు బడికి పోవాలని ఉండే. కానీ బడిలో పేరు ఎక్కియ్యలేదు. వెళ్లి మా నాన్నను అడిగిన ‘నాన్నా.. బడిలో నా పేరు ఎక్కియ్యండి’ అని. సరేనని నన్ను బడిలో చేర్పించారు. అయితే ఆరు నెలలు బడి ఉంటే మూడు నెలలు మాత్రమే వెళ్లేవాడిని. వ్యవసాయ పనులున్న కాలంలో ఆయా పనులను చూసుకోవడం, మిగిలిన సమయాల్లో మేకలు, పశువులు చూసుకోవడం టైం దొరికినప్పుడు మాత్రమే చదువుకోవడం. నిజానికి రెగ్యులర్‌గా బడికి వెళ్తూ... సెలవురోజుల్లో ఆయా పనులు చేయాలి. కానీ మాది అంతా వ్యతిరేకం. అట్లా మూడో తరగతిదాకా చదివిన. తరువాత పుస్తకాలకు పైసలు లేక... 93లో బడి వదిలేసిన. 

93 తరువాత... 
మా దగ్గర సామూహిక నృత్యాలు, సామూహిక గీతాలు పాడటం ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దోళ్లు అన్న తేడా లేదు. అందరూ ఆటపాటల్లో పాలుపంచుకుంటారు. అలా మా దగ్గర ఉన్న సంస్కృతి సంప్రదాయాలనే కొంచెం విశ్లేషించి... జార్ఖండ్ అభియాన్ (జాగృతి) సంస్థ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది. సామూహిక గీతాలు, నృత్యాలు, డ్రామా, మౌఖిక నాటకాలుండేవి. పాటలు నన్ను బాగా ఆకట్టుకున్నవి. ప్రత్యేకించి.. ఆ సమయంలో ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధం జరుగుతున్నది. నాకు అంతగా జ్ఞాపకం లేదు కానీ... సంతాలీలో ఓపాట ఉంది. 

ఆఫ్‌గనిస్తాన్‌రే... బమ్మబర్ద్‌సాడే కన్... భారత్ దీజామ్‌రే సాడే సెట్టేరా ( ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధగానం సాగుతున్నది. ఆ పాటను అందుకొమ్మని భారత్‌ను కూడా పిలుస్తున్నది) అని దానర్థం. ఈ పాట నన్ను బాగా ప్రభావితం చేసింది. అప్పటి నుంచి పాటలు పాడటం మొదలుపెట్టిన. ఎక్కడ పెళ్లి జరిగినా, ఏదైనా వేడుక జరిగినా పాటలు పాడేవాడిని. అందరూ ప్రశంసించేవారు. బాగుందనేవారు. ‘చిన్నపిల్లాడు... ఎంత బాగా పాడుతున్నాడు.. గొంతు అమ్మాయి గొంతులా ఎంత బాగుంది!’ అని మెచ్చుకునేవారు. వాళ్లలా అంటుంటే ఇంకా పాడాలన్న ఆసక్తి పెరిగేది నాలో. అది మొదలు మూఢనమ్మకాలు, భూస్వాముల తీరు, ఆదివాసీలు తమ సహజవనరులు ఎలా కోల్పోతున్నారు... ఇలాంటి వాటన్నింటిపైనా పాటలు రాయడం, పాడటం చేసేవాడిని. గతంలో బిర్సా ముండా ఆందోళన్ కావచ్చు.. తరువాత శిబూసోన్ ఉద్యమం కావచ్చు... ప్రగతిశీల భావాల సిల్‌సిలా జార్ఖండ్‌లో కొనసాగించాం. గ్రామక్షిగామానికి వెళ్లి కార్యక్షికమాలు చేసేవాళ్లం. పగలు, సాయంత్రం తేడా లేదు. సమయం ఉన్నప్పుడల్లా... మా పాటలతో ప్రజల మధ్యకు వెళ్లేవాళ్లం. 

మద్దతు పెరిగింది... 
మాకు మద్దతు పెరిగింది. మా పాటల్లో వినోదంతో పాటు.. విజ్ఞానం ఉన్నది. 2000 సంవత్సరానికి (జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడటానికి) ముందు ఆరేడు జిల్లాల్లో మా కార్యకలాపాలు ఉండేవి. ఆ తరువాత రాష్ట్రమంతటా కొనసాగించాం. ఆరోజుల్లో ఒక్క స్కూల్ కూడా లేదు. హాస్పిటల్స్ లేవు. రోడ్లు లేవు. కరెంటు లేదు.. అన్నీ బున్యాదీ పాథమిక) సమస్యలు. 2000 సంవత్సరం తరువాత కొద్దికొద్దిగా మార్పు వచ్చింది. స్కూల్స్ ఉంటాయి. కానీ టీచర్లుండరు. హాస్పిటల్స్ ఉంటాయి. డాక్టర్లుండరు, మందులుండవు. వీటన్నింటి మీదా జనంలో చైతన్యం కోసం సాంస్కృతిక కార్యక్షికమాలు నిర్వహిస్తూనే ఉన్నా. మూడో తరగతే చదివినా... తరువాత అనేక పుస్తకాలు చదివిన. ఆ స్ఫూర్తితో అన్ని సమస్యలపై పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టిన. నా పేరుతో పాటల పుస్తకాలొచ్చాయి. కేసెట్స్ కూడా తెచ్చాను. జనంలో ఎంత పేరొచ్చిందంటే... జీతన్ మరాండీ ఆధ్వర్యంలో ఏదైనా కార్యక్షికమం జరుగుతుందంటే... జనం తండోపతండాలుగా వచ్చేవాళ్లు. గంటలకొద్దీ ఎదురుచూసేవాళ్లు. అట్లా రోజురోజుకూ స్పందన పెరుగుతూ పోయింది. 

26 అక్టోబర్ 2007...
చిల్కారీలో ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కొడుకు అనుప్‌మరాండీ కొడుకును మావోయిస్టులు హత్య చేశారు. ఆ తరువాతి రోజు ప్రభాత్ ఖబర్‌లో వార్త. నా ఫొటో... పక్కన పెద్ద కథనం. ఆ హత్యాకాండలో ప్రధాన ముద్దాయి జీతన్ మరాండీ అంటూ ప్రచురించారు. రాంచీలో నారీవిముక్త్ కార్యక్షికమంలో నేను పాల్గొన్న ఫొటో తీసి... ఈ కార్యక్షికమంలో పాల్గొన్న తరువాతనే నేను ఆ హత్యాకాండలో పాల్గొన్నానని చెప్పి రాశారు. దానిని చూసిన నేను.. తీవ్రంగా ఖండించాను. మరుసటిరోజు ప్రభాత్ ఖబర్ వాళ్లు తప్పు జరిగిందని చెప్పి సవరణ వేశారు. నా ఖండనను ప్రచురించారు. పోలీసు యంత్రాంగంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. నామీద నుంచి పెద్ద బరువు దిగిపోయిందనిపించింది. అయితే ఇలాంటి వార్తల తరువాత నేనెందుకు ఓ ఆర్టికల్ రాయకూడదు అనుకుని ఒకటి రాసిన. ‘జార్ఖండ్ మే నక్సల్‌వార్ - ఏక్ నజర్’ అనే లేఖను ప్రభాత్ ఖబర్‌కు పంపాను. అది ప్రచురితమైంది. 

ఐదు రోజుల తరువాత... 
2008 ఏప్రిల్ 5న మఫ్టీలో ఉన్న పోలీసులు నన్ను అరెస్టు చేశారు. అందుకుకారణం ఆదివాసీ ప్రజల విస్థాపనకు వ్యతిరేకంగా 2007న అక్టోబర్ 1న ముఖ్యమంత్రి నివాసం ముందు రాస్తారోకో చేసి రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు అని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో కూడా అదే నమోదు చేశారు. కానీ నిజమైన కారణం ఏమంటే... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నాడు... ప్రజలను చైతన్యం చేస్తున్నాడు. సామాన్య వ్యవసాయకుటుంబం నుంచి వచ్చినవాడు.. మేధావుల్లోకి ఎదుగుతున్నాడు. అన్నింటినీ మించి... ‘జార్ఖండ్‌మే నక్సల్‌వార్- ఏక్ నజర్’ అనే లేఖను రాశాడు. ఈ విషయం పోలీసులు నన్ను అడిగే ప్రశ్నల ద్వారా అర్థమైంది. గిరిధ్ కోర్టులో విచారణలో ఉండగానే... రాంచీ పోలీసులు 10 రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. 

సీఆర్‌పీఎఫ్ క్యాంపులో... 
మానసికంగా వేధించారు. ‘నువు మూడో తరగతే చదివావు. అంత పెద్ద లేఖ ఎలా రాయగలిగావు? నీకు రాయడం రాదు... ఆ లేఖను ఎవరో రాసి, నీ పేరుతో అచ్చు వేయించారు. ఆ రాసిన వాళ్లెవరో చెప్పు. నువు రాసిన లేఖ తప్పు అని ఒప్పుకో.. ఇవే ప్రశ్నలు.. వేధింపులు. పగలు కాళ్లు మాత్రమే కట్టేసేవాళ్లు. రాత్రి చేతులను కూడా కట్టేసేవాళ్లు. ఏడు రోజులపాటు నా కళ్లను పూర్తిగా కప్పేశారు. నేను ఎవరి ముఖం చూడలేదు. కనీసం పళ్లు కూడా తోముకోలేదు. ‘అది నేనే రాశాను. కావాలంటే డిబేట్ పెట్టండి!’ అని చెప్పాను. కానీ నా మాటలు వినేవావ్లూవరు? తరువాత అండర్ ట్రయలర్(విచారణలో ఉన్న ఖైదీ)గా గిరిధ్ జిల్లా జైల్లో ఉంచారు. ఎస్పీ మురాలీలాల్ మీనా... పేరులో ఎరుపు ఉంది కానీ.. మూర్ఖుడు. 10రోజులు, 15రోజులకోసారి జైలుకు వచ్చేవాడు. తిట్టేవాడు, కొట్టేవాడు. బెదిరించేవాడు.. ధమ్‌కీ ఇచ్చేవాడు. మూడు నెలలు ఇదే పరిస్థితి. ఆ జైల్లో ఉన్న చాలా మందికి తెలుసు... ‘నేను ఆ నేరం చేయలేదు. కావాలని నన్ను ఇరికించారు’ అని. చివరకు... 2009 మార్చి 24న కోర్టుకు వెళ్లినప్పుడు గిరిధ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్... నన్ను పక్కకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న కొంతమందికి నన్ను చూపించి ‘జీతన్ మరాండీ అంటే ఇతనే!’ అని చెప్పారు. తరువాత నాకు తెలిసింది. వాళ్లంతా ఆ కేసులో సాక్ష్యం చెప్పేవాళ్లని. 2009 ఏప్రిల్ 1న సాక్ష్యాల ఆధారంగా మాకు శిక్ష విధించారు. మొదట హజారీబాగ్ సెంట్రల్ జైలుకు పంపారు. ఏడు రోజులుంచారు. జీతన్‌ను ఇక్కడుంచితే ఏ క్షణాన్నైనా మావోయిస్టులు దాడి చేసే అవకాశం ఉందని చెప్పి హఠాత్తుగా నన్నో పెద్ద మావోయిస్టు నాయకుడిని చేశారు. హుటాహుటిన రాంచీ సెంట్రల్‌జైల్ బిర్సాముండాకు తరలించారు. 

ఆ ఆరు నెలలు... 
బిర్సాముండా జైలులో ఒకరకమైన సున్నం కోడిగుడ్ల మిశ్రమంతో చేసిన కూల్చడానికి వీలులేని ఓ చిన్న సెల్. అందులో ఉంచారు. సరిగ్గా మనిషి కాళ్లు బార్లా చాపుకుని పడుకోవడానికి కూడా కష్టమైన గది. అందులోనే ఓ పక్కకు చిన్న టాయిపూట్. గది గోడలకు ఓ పక్కగా చిన్న వెంటిలేటర్. సెల్ ముందు దూరంగా ఓ సిపాయి. ఎప్పుడూ వందల మంది ప్రజల మధ్యలో తిరిగిన నేను.. చిన్న గదిలో ఒంటరిగా. ఓ అయోమయ స్థితి. వారం రోజులపాటు ఎక్కడున్నానో ఏమిటో కూడా తెలియని గందరగోళం. నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చాను. తరువాత తరువాత పేపర్లు పుస్తకాలు దొరకడం మొదలైంది. కానీ ఎన్ని పుస్తకాలని చదువుతా. ఎన్ని పేపర్లని చదువుతా. ఒంటరితనం బాగా వేధించేది. కొన్ని రోజులకు నా దగ్గరకు కొందరు నేస్తాలొచ్చారు. మొదటిది గొరయ్యా పక్షి (ఊర పిచ్చుక). పైన ఉన్న వెంటిలేటర్‌లోంచి నా గదిలోకి వచ్చేవి. చిక్‌చిక్ అంటూ చుట్టూ తిరిగేవి. ‘చుచ్చుచ్చు..’ అంటూ చిన్న పిల్లలను ముద్దు చేసినట్టుగా వాటితో ఆడుకోవడం మొదలుపెట్టాను. తరువాత పావురాలు రాక మొదలైంది. నేను ఒంటరిని కాదు... నాతో ఇంకొకరున్నారనే ధైర్యం వచ్చింది.

సాయంత్రం అయితే అవి వెళ్లిపోయేవి. గుండెల్లో గుబులు మొదలయ్యేది. సెల్‌లో నన్ను కరవడానికి వచ్చిన దోమలను చంపుతూనే రాత్రి గడిచిపోయేది. పొద్దునే పేపర్ చదవడం, అప్పుడప్పుడు సిపాయితో మాట్లాడటం... జైలును శుభ్రం చేయడానికి వచ్చిన సఫాయివాళ్లతో మాట్లాడటం. మళ్లీ ఒంటరితనం. సెల్‌లో వెల్లకిలా పడుకుని చూస్తే... మక్‌డా (సాలె పురుగు) గూడు అల్లుకుంటూ కనిపించేది. అది ఎట్లా తిరుగుతున్నది. గూడు ఎలా అల్లుతున్నది. అందులోకి వచ్చిన పురుగులను ఎలా చంపి తింటున్నది. ఇలా గంటల తరబడి గమనిస్తూ ఉండేవాడిని. ఇక రాత్రుల్లో లైట్‌కోసం వచ్చే చిన్న చిన్న పురుగులను తినడానికి బల్లి వచ్చేది. 

అది గోడను అతుక్కుని ఉండటం... ఎక్కడ లైట్ వెలిగితే అక్కడికి పురుగుల కోసం పరుగెత్తడం... తినడం. వచ్చి ఓ మూలన పడుకోవడం. ఇలా పిచ్చుక, పావురం, సాలెపురుగు, బల్లి, ఒంటరితనం.. ఆరు నెలలు నా జీవితంలో భాగమైపోయాయి. అప్పుడప్పుడు పేపర్లలో నాగురించి వచ్చే వార్తలను చదువుతుండేవాడిని. చిన్నవా్తైనా సరే... పది, ఇరవైసార్లు చదివేవాడిని. నాకోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, తెలంగాణలో మీటింగ్‌లు పెట్టడం... ఆందోళనలు దైనిక్ జాగరణ్‌లో వచ్చేవి. నా గురించి ఇంతమంది ఆందోళన చెందుతున్నారు కదా అనుకునేవాడిని. ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఓసారి హైదరాబాద్‌లో నాకోసం సిగ్నేచర్ కాంపెయిన్ కూడా జరిగింది. ఈ వార్తలన్నీ చదివినప్పుడు సంతోషమయ్యేది. నాకోసం ఇంతమంది ఉన్నారు కదా! అని ధైర్యం వచ్చేది. ఆరు నెలల తరువాత ఎక్కువమంది ఉన్న బ్యారక్‌లోకి మార్చారు. 

ఉరిశిక్ష పడ్డప్పుడు.. 
నన్ను విడుదల చేయాలని ఓవైపు దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంటే... మరోవైపు నాతోపాటు అనిల్‌రామ్, ఛత్రపతి మండల్, మనోజ్‌రాజ్వర్‌లకు ఉరిశిక్ష విధించారు. అయితే జైలు నాకు చాలా నేర్పింది. ఏదయినా సరే ధైర్యంగా ఉండాలనే స్థితవూపజ్ఞతను ఇచ్చింది. అందుకే ఉరిశిక్ష పడ్డప్పుడు నేను కన్నీరు పెట్టలేదు సరికదా.. నేను అనుకున్నదే జరిగిందని సంతోషించా. నిర్దోషినైన నాకు శిక్ష పడితే... ప్రభుత్వం తీరు ఏంటనేది ప్రజలకు తెలుస్తుందనుకున్నా. ప్రజల్లో చైతన్యం తేవాలనుకున్న ఓ కళాకారుడిని ప్రభుత్వం ఏం చేయాలనుకున్నదనేది ప్రజలకు తెలిసొస్తుందనుకున్నా. పార్లమెంట్‌పై దాడికేసులో అరెస్టై ఉరిశిక్ష అనుభవించిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను గుర్తు తెచ్చుకున్నా. ఖుదీరాంబోస్ ధీరత్వాన్ని మనసులో నింపుకున్నా. నేను ఓ ఎజెండాగా మారాలనుకున్నా. 

నా ఎజెండాను నాకు పరిచయమున్నవాళ్లు, నాపై ప్రేమ చూపించేవాళ్లు, బుద్ధిజీవులు... అందరూ ముందుకు తీసుకెళ్తారనుకున్నా. నన్ను చూసి అమ్మ ఏడ్చింది. నా సహచరి అపర్ణ, నా కొడుకు అలోక్‌చంద్ర మరాండీ మాత్రం కంటనీరు పెట్టలేదు. యాదృచ్ఛికమే అయినా... ‘సర్ఫరోజ్‌కి తమన్నా అబ్ హమారే దిల్ మే హై!’ అంటూ జైల్లో ఉండగా భగత్‌సింగ్ పాడిన పాట గుర్తొచ్చింది. ఆ ప్రేరణతో ‘ఓ సుబహ్ కభీతో ఆయేగీ (ఆ ఉదయం ఎప్పటికైనా వస్తుంది)’ అనే పాటను రాసి సహచరులు ముగ్గురితో కలిపి పాడాను. అది నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 

బాధ్యతగల సహచరి...
నేను జైలుకు వెళ్లిన తరువాత నా బాధ్యతలన్నింటినీ తలకెత్తుకుంది అపర్ణ. ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఇలా... అన్నింట్లోనూ. ఆమె స్కూల్లో, కాలేజీలో ఏం చదవలేదు. కానీ... బుద్ధిజీవులు, సామాజిక కార్యకర్తలు, సంఘాల దగ్గరకు వెళ్లింది. అందరినీ కూడగట్టింది. దేశవ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తింది. అపర్ణస్థానంలో మరే అమ్మాయి ఉన్నా అది సాధ్యం కాకపోవునేమో అనిపించింది. ఎప్పుడైనా నేను డీలాపడిపోయినా అపర్ణ మానసికంగా బలంగా ఉంది. అందరి మద్దతుతో ఆమె చేసిన పోరాటం ఫలించింది. నా తరపు వకీలు రాంచీ హైకోర్టు అడ్వకేట్ ఎస్.కె.మురారీ పైసా తీసుకోకుండా వాదించాడు. ఎలాగైనా నా కేసు గెలిపించాలనుకున్నాడు. నా ఉరిశిక్ష రద్దయ్యింది. అపర్ణ, మురారీ ఇద్దరూ గెలిచారు.

కానీ పోలీసుల వేధింపులు ఆగలేదు. మార్చి 28న విడుదల కావాల్సి ఉన్నా వారం రోజులపాటు ఆలస్యం చేశారు. ఉరిశిక్షయితే రద్దయింది కానీ... నామీద సిసియాక్ట్ (జార్ఖండ్‌లో ఓ ప్రత్యేక చట్టం) కేసు పెట్టారు. నేను ఇలా బయటికి వచ్చానో లేదు... రాంచీ రైల్వేస్టేషన్‌లో ఉన్న నా భార్య, కొడుకులను అరెస్టు చేసి ధుంకా జైల్లో పెట్టారు. నాలాగే అపర్ణపైనా తప్పుడు కేసులు బనాయించారు. సంతోషిణి పేరుతో ధుంకా జిల్లాలో అపర్ణ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నదని వాళ్ల ఆరోపణ. ధుంకా జిల్లా మా ఊరికి చాలా దూరం. అపర్ణకానీ నేను కానీ ధుంకా జిల్లాకు ఏనాడూ వెళ్లింది కూడా లేదు. అయినా ఆమెను జైల్లో పెట్టడానికి కారణం... నాకోసం దేశవ్యాప్తంగా ఉద్యమించడం, ప్రజాసంఘాలను కూడగట్టడమే.
2007 నుంచి ఏదో ఒకరకంగా నన్ను నా కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నది ప్రభుత్వం. నా కుటుంబాన్ని కలవకుండా చేస్తున్నది. అయినా నేను ఆందోళనను వదిలిపె లేదు. అపర్ణ, అలోక్‌చంవూదలను విడిపించేదాకా పోరాటం కొనసాగిస్తాను. అపర్ణలాగా, నాలాగా... నక్సల్స్‌కు మద్దతిస్తున్నారని చెప్పి... జైల్లలో పెట్టిన అనేకమంది ఆదివాసీ గిరిజన యువతీయువకుల కోసం నా ఉద్యమం కొనసాగుతుంది. తప్పుడు కేసుపెట్టి ప్రభుత్వం జైల్లో పెట్టడానికి ముందు నేను చేసిన కార్యక్షికమాలన్నీ కొనసాగిస్తాను. జార్ఖండ్ కావచ్చు... దేశంలో ఎక్కడైనా కావచ్చు.. ప్రజా ఉద్యమాలున్న చోటల్లా నేనుంటా!

తెలంగాణ అలా కాకూడదు
జార్ఖండ్‌ను సాధించాం... 2000లో రాష్ట్రం ఏర్పడింది. అనుకున్నట్టుగానే ఆదివాసీ ముఖ్యమంత్రి కూడా వచ్చాడు. కానీ ఆయన శారీరకంగా ఆదివాసీ కావచ్చు.. మానసికంగా రాజ్యం చెప్పినట్టే వింటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయో అవే పాటిస్తున్నాడు. మళ్లీ ఉన్నత వర్గాలకే మేలు చేస్తున్నాడు. పోరాటాలు చేసేవాళ్లను ఇలా మావోయిస్టులకు మద్దతిస్తున్నారంటూ జైల్లో పెడుతున్నాడు. కానీ తెలంగాణ అలా కాకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మళ్లీ పెట్టుబడిదారుల చేతికి పోగూడదు. పోరాటాలు చేయాలి. సాధించాలి. అయితే ఏ గుత్తాధిపత్యం నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నామో... తెలంగాణ వచ్చిన తరువాత అధికారం ఆ గుత్తాధిపతుల చేతుల్లోకి పోకుండా చూసుకోవాలి. నిజమైన ప్రజలకు అధికారం రావాలి. అలాంటి తెలంగాణ కోసం పోరాటం చేయాలి. నన్ను బాగా కదిలించిన సంఘటన తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం. ఆత్మహత్య చేసుకోవడం వల్ల ప్రాణం పోతుందే తప్ప ఏమీ సాధించలేం. నిలబడి పోరాడాలి. గెలుచుకోవాలి.


ఉద్యమం నెలబాలుడు... 
అభిమన్యుడికి... మరాండీ కొడుకు అలోక్‌చంవూదకు దగ్గరిపోలిక ఉంది. అభిమన్యుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు యుద్ధపాఠాలు వింటే... అలోక్ తల్లిగర్భంలో ఉన్నప్పుడే తండ్రిని అరెస్టు చేశారు. అప్పటినుంచే రాజ్యం తీరును గమనిస్తున్నాడు. పెద్దవాడయ్యాక తండ్రి ములాఖాత్ కోసం జైలుకు వెళ్లినప్పుడు అనుమతివ్వని పోలీసులతో గొడవపడ్డాడు. తన తండ్రి చేయి పట్టుకుని నడవకుండా, తండ్రి గుండెలపై ఆడకుండా చేసిన పోలీసులను తనకు తెలిసిన సంతాలీ భాషలో తిట్టుకున్నాడు. తండ్రి విడుదల కోసం తల్లి దేశమంతా తిరుగుతుంటే... అమ్మ ఎక్కిన ప్రతివేదికనీ ఎక్కాడు. ఆ వేదికలపై తండ్రి సిల్‌సిలాను కొనసాగించాడు. పోరాటం ఫలించి తండ్రి విడుదలయ్యేలోపు తల్లితో కలిసి తనూ జైలుకెళ్లాడు. ఓరోజు జైల్లో ఉండే... తండ్రితో వీడియో కాన్ఫన్స్‌లో మాట్లాడుతూ... ‘పప్పా నువు బయటికి ఎప్పుడొస్తావు? అక్కడి వాళ్లు నిన్ను వదిలిపెట్టడం లేదా? అయితే వాళ్లందరినీ కొట్టి నువు బయటికి రా పప్పా!’ అంటూ ఆవేశంగా మాట్లాడాడు. అంతేకాదు... ‘పప్పా నాకు జైల్లో పాలు, బ్రెడ్డు దొరుకుతున్నాయి. చదువుకుంటున్నాను..!’ అంటూ నిజానికి బయటి వ్యవస్థలో కంటే జైలే నయం అన్నట్టుగా చెప్పాడు తండ్రికి. కొన్నేళ్లపాటు తండ్రి... మళ్లీ తల్లితో కలిసి తను జైల్లో... ఇలా పెరిగిన కొడుకు భవిష్యత్‌లో ఏం ఆలోచిస్తాడు? ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు?

                                                                                                                           ఇంటర్వ్యూ: కట్ట కవిత
 ఫొటోలు: కంది కపిల్ ప్రసాద్


Namasete Telangana Telugu News Paper Dated : 14/4/2013

No comments:

Post a Comment