గత పదకొండేళ్లుగా ఇప్పటికే వెనుకబడి ఉందని మనమే చెబుతున్న ప్రాంతాన్ని బందు బందెరలో బంధించి, పిల్లల చదువుల్ని, తల్లిదండ్రుల నిత్యపు పని ప్రక్రియని, స్కూళ్ళలో, యూనివర్సిటీల్లో పరీక్షలను బందుపెట్టి ఆధునిక అభివృద్ధిలో ఆ ప్రాంతాన్ని నిలబెట్టేదెట్లా?... ఇంకా బందు పిలుపుల క్యాలెండర్ పూర్తి కాలేదు. ఇక్కడి పాలకూర గాదు బీద ప్రజలు ఎండి, ఎండి చచ్చేవరకూ పోరాడుతూనే ఉండాలి. తమ ఏసీ కార్ల నుంచి మన ఎడ్యుకేటెడ్ ఫ్యూడల్స్ పిలుపునిస్తూనే ఉంటారు. మనం ఇక్కడి నుంచి, ఈ గడ్డమీది నుంచి ప్రపంచ చరిత్రనే తిరుగరాస్తామని నమ్ముకుంటూ చావాల్సిందే.
మార్చి నెల 22న తెల్లారంగనే నాకో ఫోనొచ్చింది. 'ఐలయ్య సారా మాట్లాడేది' అన్నది ఆవలి గొంతు. అవునన్నాను నేను. 'సార్ నేను పాలమూరు నుంచి మాట్లాడుతున్నా నిన్న బందు చెయ్యబట్టి హైదరాబాదుపొయ్యే పాలకూర పోక అంత పాడైపోయింది సారు. పొద్దుగాల్నే తీసుకపోవచ్చని అనుకున్నం నోట్ల మన్ను బడ్డది సారు. నువ్వు రాలువలు గదా గిట్లా బందులొద్దని జెర రాయి సారు' అన్నదావలి గొంతు. 'రేపు బందుంటదని ప్రకటించిండ్రు గదా గట్లెందుకు కోసిండ్రు' అన్న నేను. గంత పొద్దుగాల ఆపుతారనుకోలేదు సారు. పిల్లకు పెద్దరోగమొచ్చింది దవఖాండ్ల డబ్బుగట్టాలె. ఇయ్యాల ఇయ్యకపోతే పిల్లను పంపిత్తమని డాక్టర్ సార్ అనబట్టిండు. 'ఏం చెయ్యాలె సారు' అన్నదావలి గొంతు.
ఇప్పుడు తెలంగాణ జీవితం బందెర దొడ్లో బడ్డ బర్ల జీవితంలా ఉన్నది. ఆకలవుతుందని కంచె దూకితే కాళ్ళిరగ్గొట్టి బందెర దొడ్లో పెట్టినట్టున్నది. బర్లు మనమే దొడ్డి మనదే. కానీ కాళ్ళిరిగింది కూడా మన బర్లయే. గత మూడున్నరేళ్ళు ఎన్ని బందులో చెప్పలేం. ఏ రోజు ఏ సంఘం బందు పిలుపిస్తదో చెప్పలేం. తెలంగాణను బాగు చెయ్యడానికి ఎన్ని పార్టీలు, ఎన్ని జేఏసీలు పుట్టాయో చెప్పలేం. మంత్రుల ఇళ్లల్లో కొన్ని పుడితే మాంత్రికుల ఇళ్ళల్లో కొన్ని జేఏసీలు పుట్టాయి. బందుల్లో బడుల సంగతటుంచుదాం, మధ్యతరగతి కొలువుల సంగతటుంచుదాం, ధనవంతుల శాపింగుల సంగతటుంచుదాం. అడ్డా కూలీల సంగతి, ఆటో రిక్షాల సంగతి, కాళ్ళతో రిక్షా తొక్కి కడుపు నింపుకునేటోళ్ళ సంగతి, ఆకు కూరలుఎండిపొయ్యి ఆగమైన బతుకుల సంగతి, చివరికి బజారు బాగా నడుస్తుంటే అడుక్కుతినే అమాయకుల సంగతి ఏంటి అని తెలంగాణ పోరాట యోధులకు ఎన్నడూ తట్టకపోతే ఎలా?
ఇంతకు ముందు వ్యాసం ('రాజకీయ పార్టీలు-ఉద్యమ ఉద్యోగులు', ఆంధ్రజ్యోతి, మార్చి 20)లో చర్చించినట్లు బందు పిలుపునిచ్చేది ఒక సంఘమైతే దాన్ని జెండా పట్టుకొని అమలుచేసేది రాజకీయ పార్టీలు. ఒక ప్రాంతంపై మరో ప్రాంతం అణచివేత అభియోగాలు చేస్తూ మాటిమాటికీ దోపిడీకో, అవమానానికో గురైన ప్రాంత బతుకు ప్రక్రియను బం దుపెడితే నష్టం ఎవరికి? దోపిడీ చేసే ప్రాంతానికా? దోపిడీకి గురయ్యే ప్రాంతానికా? గత పదకొండేళ్లుగా ఇప్పటికే వెనుకబడి ఉందని మనమే చెబుతున్న ప్రాంతాన్ని బందు బందెరలో బంధించి, పిల్లల చదువుల్ని, తల్లిదండ్రుల నిత్యపు పని ప్రక్రియని, స్కూళ్ళలో, యూనివర్సిటీల్లో పరీక్షలను బందుపెట్టి ఆధునిక అభివృద్ధిలో ఆ ప్రాంతాన్ని నిలబెట్టేదెట్లా?
దాదాపు పదమూడేళ్ల కింద ఒక రోజు కాకతీయ యూనివర్సిటీ సిటీ రీడర్ ఒకాయన ఫోనుచేసి 'ఐలన్నా! ఇక తెలంగాణ విముక్తి పోరాటం మొదలైంది. విముక్తి పార్టీ పుడుతుంది' అని చెప్పాడు. 1999 ఎన్నికల తరువాత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి రాక కేసీఆర్ బయటికొచ్చాక కొద్ది రోజుల సంఘటన అది. కాకతీయ నుంచి ఆ రీడర్ (ఇద్దరిదీ ఒకే కులం) ఉస్మానియా నుంచి మరో రీడర్ రోజూ కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్న రోజులవి. ఈ ఇద్దరూ ఆనాటి పౌరహక్కుల పోరాటాల్లో ఒక పాత్ర పోషిస్తున్నారు. ఒకరిది వరంగల్ జిల్లా అయితే మరొకరిది ఆదిలాబాద్. వీళ్ళిద్దరికీ ఒక మాజీ వైస్ చాన్సలర్‌ను జోడించారు కూడా. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. ఈ ప్రాంతంలో ఎదుగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కే ప్రయత్నమేదో జరుగుతుందని. ఆనాటికి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెడ్డి, వెలమల పట్టు తగ్గింది.
ఆదిలాబాద్‌లో పీతాంబర్‌రావు (వెలమ ఫ్యూడల్) హత్యతో మొదలైన నక్సల్‌బరీ పోరాటం తరువాత క్రమంగా కరీంనగర్‌కు పాకింది. వరంగల్ జిల్లాలో రెడ్డి భూస్వాములు కొంత అతలాకుతలమై, ముఖ్యంగా బీసీలు జనరల్ సీట్లలో గెలిచారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా బ్రాహ్మణ, రెడ్డి, వెలమ కులాలు కొంత బలహీన పడ్డాయి. ఈ తరుణంలో చంద్రశేఖరరావును టీడీపీ పక్కకు పెట్టింది. వెలమల ఆగ్రహం ఆకాశానికంటింది. రెడ్లు అప్పటికే మంటతో ఉన్నారు. తెలంగాణలో అక్కడో, ఇక్కడో ఉన్న కమ్మలు వారికంటికి స్పష్టంగానే కనబడుతున్నారు. ఈ దశలో ఈ యూనివర్సిటీ విద్యావంతులు కొత్త వెలమ పార్టీని ప్రారంభించడానికి నడుం కట్టారు. హాలు రెంటు కట్టడానికి డబ్బులు లేని దశలో కొండా లక్ష్మణ్ బాపూజీ 'జలదృశ్యం' వారికి ఉద్యమ సంపాదన బాటలు వేసింది. ఈ క్రమంలోనే కొండా లక్ష్మణ్ కొంప మునిగింది. ఉస్మానియా, కాకతీయవర్సిటీల నుంచి కొందరు టీచర్లు తెలంగాణ పార్టీ కార్యకర్తలుగా మారారు.
2001 పంచాయతీ ఎన్నికల్లో ఈ విద్యావంతులే పార్టీ పనులు నడిపారు. ఉస్మానియా, కాకతీయలోని బీసీ, ఎస్సీ ఉపాధ్యాయుల్లో కూడా తెలంగాణ రాగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికార మొస్తుంది అని బలంగా నమ్మే గుంపులూ తయారయ్యాయి. ఈ కులాల సంఖ్య ఎక్కువ కనుక తెలంగాణ రాగానే వారందరికీ బంగారుబతుకు ఉంటుందని నమ్మేవారి సంఖ్య పెరుగుతూ పోయింది. రిజర్వేషన్ - కుల ఉద్యమాలను పక్కకు పెట్టి తమ శ్రమనంతా ఈ ప్రాంతీయ ఉద్యమం చుట్టూ ధారపోయడం మొదలెట్టారు. తెలంగాణ సాయుధ పోరాటాలనూ, సిరిసిల్ల పోరాటాలనూ తమకనుకూలంగా మల్చుకొని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి చోట్ల ఫ్యూడల్ శక్తులు ఆర్థిక, రాజకీయ దాదాలుగా మారుతున్నారని గమనించడం ఆనాడు సాధ్యం కాలేదు. ఈ ఫ్యూడల్ శక్తులే పౌరహక్కుల వేదిక ద్వారా తమ మధ్యవర్తులను తయారు చేసుకుంటున్నాయనే విషయం ఆనాడు గ్రహించడం అంతకన్నా సాధ్యం కాలేదు. కానీ 2001 పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు దక్కిన రెండే రెండు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులను ఒకటి వెలమ (కరీంనగర్) ఒకటి రెడ్డి (నిజామాబాద్) కులాల మధ్య పంచుకున్నారు. కరీంనగర్ జడ్పీ అధ్యక్షుడు కాకతీయ విద్యావంతుని దగ్గరి బంధువే. ఈ ప్రాంతంలో ఎదుగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కడం అక్కడినుంచే ప్రారంభమైంది.
రెడ్డి విద్యావంతుల రాజీ ప్రయత్నంతో 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు కుదిరింది. ఈ దశలోనే తెలంగాణ రెడ్డిని రాష్ట్ర హోం మంత్రిగా నియమించే అంగీకారం కుదిరింది. గ్రామస్థాయిలో అంతో ఇంతో కింది కులాలకు అండగా ఉంటున్న నక్సలైట్లను చంపేసి అగ్రకుల తెలంగాణ పార్టీని రాజకీయ రంగంలోకి బలంగా తెచ్చే ప్రయత్నం, ప్రతినిత్యం స్కూల్ టీచర్లను సమీకరించి మీటింగులు పెట్టి కింది కులాలకు ఏకైక ఆస్తిగా మారుతున్న విద్యారంగాన్ని క్రమంగా చంపే ప్రక్రియను 'విద్యావంతులు' ప్రారంభించారు. ఆ హోం మంత్రి నేతృత్వంలో నక్సలైట్లతో చర్చలు, వారిని ఎన్ సర్కిల్ చేసి చంపడం ఈ క్రమంలోనే జరిగాయి. అంతకుముందు విప్లవం వస్తే అన్నీ పరిష్కారమౌతాయన్న మూకలే తెలంగాణ రాష్ట్ర సాధనతో అన్నీ పరిష్కారమౌతాయని చెప్పడం మొదలెట్టారు. రాజశేఖర రెడ్డి విజయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఈ వర్గాలకు పదవులు, పైసల పంపిణీలో వాటా దొరికాయి.
ఈ కాలంలోనే తెలంగాణ రెడ్డి, వెలమల ఆస్తులు కూడా ఘననీయంగా పెరిగాయి. అన్ని రంగాల్లో తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కడం మొదలైంది. రాజశేఖర రెడ్డి రెండో దఫా ఎన్నికల తరువాత కూడా బతికి ఉంటే జాతీయ కాంగ్రెస్‌కు ఈ దఫా 'తెలంగాణ ఉద్యమాన్ని' నడిపే అవసరముండేది కాదు. ఆయన వీరందరి అవసరాలను తీర్చడం ముడుపుల పెంపకం ద్వారా చేసేవారు. ఎప్పుడైతే జాతీయ కాంగ్రెస్‌కు ఇడుపులపాయ నుంచి ప్రమాదం వచ్చిందో కేంద్ర కాంగ్రెస్ తెలంగాణలోని ముడుపులపాయను ముందుపెట్టి అన్ని రకాల అండదండలతో మనమందరం చూసిన 'ఉద్యమ డ్రామా' నడిపింది. గత మూడున్న రేళ్ళలో తెలంగాణలోని కింది కులాలు సర్వం కోల్పోయాయి. పాత హోంమంత్రి ఇంట్లోనే జేఏసీ రూపొందింది. రాష్ట్ర పాత, కొత్త హోం మినిస్టర్లు రాజకీయ జేఏసీకి అన్ని హంగులు సమకూర్చితే, జేఏసీ యుద్ధవీరులు వారిపై ఈగ వాలకుండా చూసారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల్ని, ఎంపీలనూ, ఎమ్మెల్యేలను కొట్టించారు. స్వయంగా తిట్టారు. చివరికి కర్రువాతలు కూడా పెట్టారు. అంతకంటే ప్రమాదకరం బందుల మీద బందులు జరిపి తెలంగాణ బీద ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేశారు. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలను సర్వనాశనం చేశారు.
తెలంగాణ ఫ్యూడల్స్ అవసరాన్ని బట్టి దోపిడీ రూపాల్ని మార్చారు. 1969, తెలంగాణ ఉద్యమంలో, 2009 'తెలంగాణ ఉద్యమం'లో వారే నాయకులై విచిత్రమైన ఉద్యమాన్ని నడిపారు. అంతకు ముందు కమ్యూనిస్టు విప్లవమే అన్నిటికీ పరిష్కారమన్న అగ్రకుల మేధావులు, వారి తాబేదార్లు ఈ 'ఫ్యూడల్స్ నడిపే ఉద్యమమే' అన్నింటికీ పరిష్కారమని అన్ని రకాల మీడియాల ద్వారా ప్రచారానికి పూనుకున్నారు. కింది కులాల వాళ్ళు విప్లవ ఉద్యమాల్లో దిగి చచ్చారు, టార్చర్ అనుభవించారు, ఆస్తులు కోల్పోయారు, మళ్ళీ తెలంగాణ బందుల్లో, పోలీసు దెబ్బల్లో, జైలు జీవితాల్లో ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలంగాణ యువత (ముఖ్యంగా కింది కులాల వాళ్ళు) రెడ్డి, వెలమలు ఏది చెప్పినా నమ్ముతున్నారు. పార్టీల్లో జెండాలు వాళ్లే మోస్తున్నారు, జేఏసీల్లో దండాలు వాళ్లే పెడుతున్నారు. ఈ చైతన్యమే ఇక్కడి ఫ్యూడల్స్‌కి కావలసింది.
తెలంగాణ సాయుధ పోరాటాన్ని రెడ్లే నడిపారని చెప్పేటోళ్ళు రెడ్డి హాస్టల్, రెడ్డి కాలేజీలు ఎట్లా పెట్టారు? కమ్యూనిస్టు హాస్టల్, కమ్యూనిస్టు కాలేజీలు పెట్టి శ్రామిక, కార్మిక వర్గ పిల్లల్ని ఎందుకు చదివించలేదు? ఇప్పుడు తెలంగాణ వెలమలు ఎన్ని కాలేజీలు నడుపుతున్నారు? వారు తెలంగాణ ప్రజలకు ఎటువంటి విద్య చెబుతున్నారు? నిజాం వ్యతిరేక పోరాటం అందరం చెయ్యాలని చెబుతూనే ఇక్కడి కోమట్లు వైశ్య హాస్టళ్ళు, వైశ్య కాలేజీలు నడిపారు. పోరాటాల్లో చచ్చింది కింది కులాల వాళ్ళు? బ్రాహ్మణులు కూడా తమ కాలేజీలు తామే నడుపుతున్నారు. విద్య దగ్గరికి వచ్చే వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు వద్దు. ఉద్యమాల్లో మాత్రం మీరే ముందుండి పోరాడాలి అంటారు. ఈ ఉద్యమ నాటకాల్ని ఇంకా అర్థం చేసుకోకపోతే ఈ ప్రాంతం సర్వనాశనం కాక ఏమౌతుంది?
ఇక్కడి అగ్రకులాలు మాకు భౌగోళిక తెలంగాణ కావాలి అంటే అర్థమేంది? ఇక్కడి ప్రజలు కాదు వాళ్ళకు ఇక్కడి భూమి కావాలి అని అర్థం? ఈ ప్రజలు ఆకలితో చచ్చినా మంచిదే, ఆత్మహత్యలతో చచ్చినా మంచిదే, పోలీసు కాల్పుల్లో చచ్చినా మంచిదే. వాళ్ళకు తెలంగాణలోని మొత్తం భూమి దక్కే వరకూ వీళ్ళు పోరాడాల్సిందే. ఇదో విచిత్ర సిద్ధాంతం. అయినా తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు వాళ్ళనే నమ్ముతారు. దొరలకు కాళ్ళ ముళ్ళు ఇరుగనివ్వని ప్రజలు గదా వీళ్ళు? మాకు చదువు 'అచ్చికి' రాదు అని అడవుల పొంటి బతికిన వాళ్ళు కదా! ఒకనాడు ఎర్రజెండా చూడగానే శివం తూలిన ప్రజలు, ఇప్పుడు గులాబి జెండా చూడగానే శివం తూలుతున్నారు. ఇక్కడి విప్లవ పోరాటాలు సాధించిన ఫలితాలు ఇవి. ఒకనాడు చదువులన్నీ బూర్జువా చదువులని బడుల్లోకి పోరగాండ్లను పోనీయకపోతే ఇప్పుడు 'చదువులన్నీ ఆంధ్ర' చదువులనే నినాదం తెలంగాణ అంతా నిండుకొని ఉన్నది. ఒక రెడ్డో, ఒక వెలమో బందుకు పిలుపిస్తే చాలు మనమంతా ఉరుకాల్సిందే. మన పిల్లలు రోడ్ల మీద ఉండకపోతే తెలంగాణ ఎట్లొస్తది? టీచర్లది అదే నినాదం, వార్డెన్‌లది అదే నినాదం, డాక్టర్లది అదే నినాదం, ఇంజనీర్లది అదే నినాదం. తెలంగాణ రాదని వీళ్ళందరికీ తెలుసు. అయినా అదే నినాదం. అన్ని రంగాల్లో నాయకులు వాళ్ళు, కార్యకర్తలు వీళ్ళు. అన్నింటికీ మూలమైన చదువుకోసం పోరాడుదామంటే ఎవరూ కదిలే పరిస్థితి లేదు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని విచిత్ర చైతన్యం తెలంగాణలో ఉన్నది.
2000 నాటికి కాస్త స్కూళ్ళు, కాలేజీలు నడుస్తున్నాయి. కింది కులాల నుంచి కూడా చదువుకున్న శక్తులు ఎదుగుతున్నాయి. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో రిజర్వేషన్ శక్తులు ఎదుగనారంభించాయి. వీళ్ళ ఇళ్లల్లో పుస్తకాలు కనిపించడం మొదలైంది. ఒక కింది కుల మేధావి వర్గం ఎదుగనారంభించింది. 2001లో తెలంగాణ పార్టీ పుట్టడంతో మళ్ళీ స్థితి మొదటికొచ్చింది. జై తెలంగాణ అనగానే అన్నీ మూతబడ్డాయి. బూర్జువా చదువులొద్దని నక్సలైట్ ఉద్యమంలోకి పోయి చావంగ బతికినోళ్ళు మళ్ళీ దొరల గడీల్లోనో ఎర్రజెండాకు బదులు గులాబీ జెండా పట్టుడు మొదలైంది. ఒకనాడు వీళ్ళే చంపాలనుకున్న దొరలు ఇప్పుడు తెలంగాణను రక్షించి, అభివృద్ధి చెయ్యగలిగే ప్రజాస్వామిక వాదులెట్లయ్యారు? ఇందులో ప్రధాన పాత్ర పోషించింది అగ్రకుల పౌరహక్కుల పాయ. ఈ పాయ పౌరహక్కుల సిద్ధాంతాన్ని ఎటంటే అటు తిప్పింది. ప్రైవేటు రంగం ప్రమాదమన్నది. ప్రభుత్వ రంగాన్ని తెలంగాణలో మూతేసే ఉద్యమాలు నడిపింది.
ఈ పాయ ప్రభుత్వరంగ టీచర్లను రోజూ రోడ్డుమీదికి సమీకరించి అక్కడ పాఠాలు ఆపేసి ప్రయివేటు రంగాన్ని తిట్టింది. తిట్టేవారి పిల్లలు, వినేవారి పిల్లలు ప్రయివేటు రంగంలో స్కూళ్ళల్లో చదువులు! ఈ సిద్ధాంతాన్ని ఎక్స్‌పరిమెంట్ చెయ్యడానికే తెలంగాణ భూమిక అయింది. 2013 నాటికి కింది కులాల నుంచే మళ్ళీ చాలా మంది చచ్చారు. విద్యార్థులు (అందులో బీసీ, ఎస్టీ, ఎస్టీలు) చాలా కాలం జైళ్ళలో ఉన్నారు. ఎంతోమంది దెబ్బలు తిన్నారు. తెలంగాణలో ప్రభుత్వరంగం కూడా కుప్పకూలింది. ప్రయివేటు రంగం బాగానే ఉంది. ఇంకా కొంతకాలం - అంటే దొరల కుటుంబాల్లోని అందరూ ఎన్నికల్లో గెలిచే వరకూ పోరాటం సాగాలట. రాజకీయ పార్టీలే స్వయంగా పిలుపునిస్తే సమస్యలొస్తాయని ఉద్యమ ఉద్యోగులతో ఇప్పిస్తున్నారు. ఇంకా బందు పిలుపుల క్యాలెండర్ పూర్తి కాలేదు. ఇక్కడి పాలకూర గాదు బీద ప్రజలు ఎండి, ఎండి చచ్చేవరకూ పోరాడుతూనే ఉండాలి. తమ ఏసీ కార్ల నుంచి మన ఎడ్యుకేటెడ్ ఫ్యూడల్స్ పిలుపునిస్తూనే ఉంటారు. మనం ఇక్కడి నుంచి, ఈ గడ్డమీది నుంచి ప్రపంచ చరిత్రనే తిరుగరాస్తామని నమ్ముకుంటూ చావాల్సిందే.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Andhra Jyothi Telugu News Paper Dated: 12/4/2013
No comments:
Post a Comment