Saturday, April 6, 2013

వికలాంగులపై వివక్ష! ---బిల్ల మహేందర్, బి. రాములు, డాక్టర్ లక్కిడ్డి సత్యం



వికలాంగులు సమాజంలో,కుటుంబంలో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలతోపాటు భవిష్యత్‌లో అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారికి అవకాశాలు రాజ్యాంగబద్ధంగా కల్పించాలనే సూచనలను పాలకులు పట్టించుకోవడంలేదు. దీంతో వికలాంగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైం ది. రాష్ట్రంలో వికలాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వీరి సమస్యలపై పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నది. వీరికి 500 రూపాయల పింఛను ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. కానీ వీరికి కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలపై ఏ మాత్రం శ్రద్ధ చూపడంలేదు. 

వికలాంగుల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వికలాంగులకు 2000 పెన్షన్ నుంచి వైకల్య శాతాన్ని బట్టి 500 నుంచి 700 వరకు పెంచుతూ ప్రకటన చేసింది. కానీ అమలు విషయంలో 600,700 పెన్షన్ అటకెక్కింది. అర్హులైన 500 పెన్షన్‌దారులకు కూడా సదరన్ క్యాంపుల పేరుతో అనర్హత వేటు వేసి, లక్షలాదిమంది వికలాంగుల పెన్షన్లను రద్దు చేసింది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వికలాంగులకు ఇస్తున్న 500 రూపాయలు ఏ మూలకు సరిపోవడం లేదు. 

వికలాంగులు అందరితో సమానంగా జీవించడానికి, వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 చెబుతున్నది. దీనికనుగుణంగా ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ 500 నుంచి 1500 పెంచితే వారికి భరోసా లభిస్తుంది. అలాగే వివిధ ప్రభుత్వశాఖల్లో అనేక వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను అర్హులైన వికలాంగులతో భర్తీ చేయాలి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వికలాంగుల హాస్టళ్లు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇప్పటికి చాలా హాస్టళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో హాస్టళ్లలో ఉంటున్న వికలాంగులు అనారోగ్యం పాలవుతున్నా రు. ముఖ్యంగా బాలికల హాస్టళ్లు మరి అధ్వాన్నంగా ఉన్నాయి. వీరికి సరైన రక్షణ లేకపోవడంతో విద్యార్థినిలు రోజూ భయంతో గడుపుతున్నారు. అధికారులు వారికి తగిన రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలి. 

మహిళలపై అత్యాచారాలు, అవమానాలు జరుగుతున్న రోజులివి. ఇక వికలాంగ మహిళల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. మహిళా వికలాంగులపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్టవేయడానికి కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉన్నది.దీంతోపాటు సాధారణ మహిళలకు ఇచ్చే ప్రసూతి ఖర్చులకన్నా వికలాంగుల మహిళ ప్రసూతి ఖర్చులు పెంచాలి. అదేవిధంగా వికలాంగుల మహిళలకు రిజర్వేషన్లలో ప్రథమ ప్రాధాన్యం కల్పించినట్లయితే వారి అభివృద్ధికి కృషి చేసినవారవుతారు. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి వారి అభివృద్ధికి పాటుపడాలి. జీవో 1095 ప్రకారం ప్రభుత్వ భూమి పంపిణీ చేస్తే, ప్రభుత్వ భూమి మిగిలిఉంటే వికలాంగులకే ఇవ్వాలని చెబుతున్నది. అర్హులైన వికలాంగులకు అసైన్డ్ భూమి ఇవ్వాలని గతంలో మంత్రి సునితా లకా్ష్మడ్డి ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కానీ రాష్ట్రప్రభుత్వం దాన్ని మరిచిపోయింది. అలాగే బడ్జెట్‌లో వికలాంగుకులకు కేటాయించిన నిధుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిం ది.వికలాంగుల సంక్షేమం కోసం పెద్దఎత్తున కార్యక్షికమాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నది ప్రభుత్వం. కానీవారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమవుతుంది. 

రాష్ట్ర ప్రభుత్వం అంధులు, బధిరులు, అంగవికలురులతో కుష్టువ్యాధి క్షిగస్తులు, మరుగుజ్జులు, మానసిక వైకల్యం ఉన్న తదితరులను వికలాంగుల కేటగిరిలో చేర్చింది.దీంతో వికలాంగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికిచ్చే మూడు శాతం రిజర్వేషన్లు సరిపోవడం లేదు. జనాభా ప్రాతిపదికన వీరి రిజర్వేషన్లు మూడు శాతంనుంచి ఏడు శాతానికి పెంచాలి. అప్పుడే వికలాంగులు లబ్ధిపొందే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు అర్హులైన వికలాంగుడికి ప్రభుత్వం ఉచిత గృహవసతి, విద్యుత్, రవాణా సౌకర్యాలు కల్పించాలి. వీటితోపాటు ప్రభుత్వ పూచికత్తుతో వికలాంగులకు ఒక లక్షరూపాయల నుంచి పది లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పించాలి. ఎన్నో అవమానాలు, అవహేళన మధ్య వికలాంగులు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మిగతా వారితో ఉద్యోగాల్లో పోటీపడుతున్నారు. అయితే కొంతమంది లేని వైకల్యాలను సృష్టించి నకిలీ ధృవీకరణ పత్రాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉద్యోగాలు సంపాదిస్తూ, నిరుద్యోగ వికలాంగుల పొట్టుకొడుతున్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్ల అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలు సంపాదించలేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. కాబట్టి ఈ నకిలీ వికలాంగుల ధృవీకరణ పత్రాల వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి.అర్హులైన వారందరికి న్యాయం జరిగేలా చూడాలి. 

ఆయా వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు వారి సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగానే ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. వారికి రావలసిన నిధులపై ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కానీ అన్ని వర్గాల్లో ఉండే వికలాంగుల వెతల గురించి మాట్లాడే వారు లేకపోవడం దురదుష్టకరం.దీనికి కారణం చట్టసభల్లో వికలాంగులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం. చట్టసభల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే వారి సమస్యపై చట్టసభల్లో గొంతెత్తే అవకాశం లభిస్తుంది. ప్రభు త్వం చట్టసభల్లో వికలాంగుకులకు ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి. వికలాంగుల సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామికవాదులు మద్దతు తెలపాలి. వారి సంక్షేమం పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి.వారి జీవన భద్రతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలి.

-బిల్ల మహేందర్, బి. రాములు, డాక్టర్ లక్కిడ్డి సత్యం
(వికలాంగుల హక్కుల పోరాట సమితి

Namasete Telangana Telugu News Paper Dated : 7/4/2013

No comments:

Post a Comment