Saturday, April 20, 2013

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం పూర్వాపరాలు By దిగుపాటి రాజగోపాల్‌


  Sat, 20 Apr 2013, IST  

రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, తెగలు, సామాజిక, ఆర్థిక అసమానతలు అంతకంతకు ఎక్కువవ్వడమే కాక ఈ వర్గాలలో మా వాటా మాకివ్వండని నినదించే పరిస్థితి వచ్చింది. దానికి కొన్ని సంఘాలు, సంస్థలు, ఈ వర్గాలకు చెందిన అధికారులు, విశ్రాంత అధికారులు మహా ఉద్యమంగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఈ దశకంలో మంచి పరిణామం. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సబ్‌ప్లాన్‌ అమలుకు నోడల్‌ ఏజెన్సీలకు చట్టబద్ధత కల్పించాలని ఐక్య పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితిలో సబ్‌ప్లాన్‌ చట్టం చేసింది. తరతరాలుగా అభివృద్ధిలో వెనుకబడిన ఈ వర్గాల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ ప్రణాళికల అమలుకు నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పరుచుకోవడానికి, ఆశించిన ఫలితాలు ఓ మేరకు సాధించుకోవడానికి ఈ చట్టం ఉపయోగపడగలదు. సబ్‌ప్లాన్‌ చట్టం దేశంలో మొదటగా కాంగ్రెస్‌ పార్టీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. సబ్‌ప్లాన్‌ నిధులను దళిత, గిరిజన అభివృద్ధికి ఖర్చు చేసేందుకు నోడల్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌ కేటాయింపులలో జనాభా ప్రాతిపదికన వచ్చే నిధులను నోడల్‌ ఏజెన్సీలకు కేటాయించి ఖర్చు చేయాలని వివిధ సంఘాలు, వామపక్షాలు చేపట్టిన ఉద్యమాలు, నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ, శాసనసభలో చర్చ ఫలితంగా 2007 నవంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 177 విడుదల చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 22.8 శాతం బడ్జెట్‌ కేటాయింపులు చూపిస్తూ ఖర్చు చేయకుండా భారీగా కోత విధించింది. ఖర్చు చేసిన నిధులు సైతం దళిత, గిరిజనులకు ప్రయోజనం లేని రంగాలకు కేటాయించింది. అన్ని శాఖలలో ఇదే పరిస్థితి ఉంది.
దేశ, రాష్ట్ర జనాభాలో దళిత గిరిజనుల జనాభా శాతం కంటే కాకుండా అదనంగా కేంద్ర, రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లలో నిధులు కేటాయించి వారి ప్రయోజనాలకే ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1980లో ఎస్సీలకు స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాను (ప్రస్తుతం ఎస్సీ సబ్‌ప్లాన్‌) గిరిజనులకు ట్రైబల్‌ సబ్‌ప్లానును రూపొందించింది. అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, జాతీయ ప్రణాళికా సంఘం మెంబరు సెక్రటరీగా ఉన్న నేటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు లేఖలు రాసి 40 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్నను అమలు చేయకుండా ప్రభుత్వ పాలకులే వివక్ష చూపి అన్యాయం చేస్తున్నవి. దళిత గిరిజన నిధులను దోచి అగ్రకుల ధనిక వర్గాల ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నాయి.
మన రాష్ట్రంలో గత 19 సంవత్సరాలలో రూ.17,970 కోట్లు కోత విధించారు. రూ.5,000 కోట్లు దారి మళ్లించారు. మొత్తం 21,604 కోట్లను దళితులకు ఖర్చు చేయలేదు. గత ఏడేళ్ళ కాంగ్రెస్‌ పాలనలో రూ.13,601 కోట్లు, అంతకుముందు 9 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పాలనలో రూ.4,047 కోట్లు కోత విధించారు. ఈ నిధులను తిరిగి కేటాయించలేదు. అంటే గత 19 సంవత్సరాల కాలంలో కోత విధించిన రూ.28 వేల కోట్లు దశలవారీగా తిరిగి కేటాయించవలసి ఉండగా 2013 బడ్జెట్‌లో ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే దళితులకు ఉన్న చట్టాల అమలు తీరు ఏవిధంగా ఉన్నదో మనకందరికీ తెలిసిందే. కానీ సబ్‌ప్లాన్‌ చట్టం అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేయడానికి బలమైన ఐక్య ప్రాతిపదిక ఏర్పడిందనేది వాస్తవం.
దేశంలోని షెడ్యూల్‌ కులాల్లో సుమారు 51 శాతం మంది వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. ఇతర కులాలకు చెందిన వారిలో 19 శాతం వ్యవసాయ కార్మిక కుటుంబాలుగా ఉన్నారు. దళితులలో అక్షరాస్యత 2001 జనాభా లెక్కల ప్రకారం 54.69 శాతం ఉన్నారు. డిగ్రీ చదువులలో దళితుల సంఖ్య 8.37 శాతం ఉండగా ఇతర కులాలలో 91.63 శాతం ఉన్నారు. గిరిజనులు 8.2 శాతం జనాభా ఉన్నారు. వారి నిష్పత్తి ప్రకారం హక్కులు అవకాశాలు, నిధులు, సంక్షేమ పథకాలు గిరిజనులకు లభించుట లేదు. ప్రత్యేక కాంపోనెంట్‌ ప్రణాళిక ప్రకారం దళితుల సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ జనాభాలో వారి దమాషాకు అనుగుణంగా ఉండాలి. అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉల్లంఘించింది. వారికి కేటాయించిన గ్రాంట్లను ఇతర అవసరాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని మంత్రిత్వశాఖలు, విభాగాలు మళ్లించకుండా అడ్డుకట్టవేసే శాసనం లేకపోవడం వలన నిధులకు ఇతర శాఖలు మళ్లిస్తున్నారు. నిధులను మళ్లించకుండా సమగ్రమైన చట్టం చేయవలసిన అవసరం ఉన్నది.
దళిత, గిరిజన సెక్షన్ల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించేవారు ఇప్పటికే పట్టిపీడిస్తున్న రెండు అంశాలను పరిశీలన చేయవలసి ఉన్నది. దళిత గిరిజనులలో ప్రధానంగా సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు పైబడినా దళిత గిరిజనులు సామాజిక, ఆర్థిక పీడనలకు గురవుతూనే ఉన్నారు. సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్య, వైద్యం, తిండి, బట్ట, ఇల్లు వంటి కనీస అవసరాలకు నోచుకోని స్థితిలో దళితులు ఉన్నారు. అంబేద్కర్‌ ఆశించిన హోదా దళితులకు దక్కాలంటే సామాజిక, ఆర్థిక అంశాల కీలక పాత్రను పరిగణనలోకి తీసుకోవాలి. దళిత కుటుంబాలకు సామాజిక అసమానతలు పోవాలంటే ఆర్థికశక్తి కల్పించినట్లయితే అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధ్యపడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి చెందిన, ఇతరులు ఆక్రమించుకున్న లక్షలాది ఎకరాల భూములు ఉన్నది. ఈ భూములను దళిత, గిరిజన కుటుంబాలకు పంచినట్లయితే సామాజిక ఆర్థిక హోదా పెరిగి సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. దళితుల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించే ప్రభుత్వాలు, పాలకులు, సంస్థలు ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టిపెట్టి అమలుచేస్తే ఒక మేరకైన ఈ వర్గాలను ముందు పీఠిలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది.

-దిగుపాటి రాజగోపా


Prajashakti Telugu News Paper Dated : 20/4/2012

No comments:

Post a Comment