ఫిలాసఫీలో పీహెచ్‌డీ చేసిన ఏకైక పొలిటీషియన్‌గా ప్రకటనలకే పరిమతం కాక మీరు ఏ ఫిలసాఫికల్ క్లారిటీతో టీర్ఎస్‌లోకి పోదామనుకుంటున్నారో కాస్త వివరంగా చెప్పండి... మీరు పోవాలనుకునేది ఒక పార్టీలోకి కాదు, ఒక గడీలోకి. అక్కడ ఢిల్లీలో ఉన్నట్లు ఎన్‌లైటెడ్ కుటుంబం లేదు ఇంగ్లీషులో మాట్లాడడానికి, చర్చించడానికి. అక్కడ పూనకంలో ఉన్న ఫ్యూడలిజమున్నది. అక్కడ మహాత్మాగాంధీని కూడా చెప్పింది చెయ్యకపోతే 'దంచుడే'. జర సోంచాయించి జంపుచెయ్యి.
కాంగ్రెస్ నాయకులు డా. కె. కేశవరావు గారికి,
మీ మీద ఉన్న గౌరవంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. మీరు యువ, డైనమిక్ విద్యా మంత్రిగా ఉన్న రోజుల్లో నేను ఉస్మానియాలో రీసెర్చి స్కాలర్‌గా ఉన్నాను. ఒక రోజు నేను లైబ్రరీలో చదువుకుంటున్నాను (జర్నల్స్ సెక్షన్‌లో). మీరు ఆర్భాటం లేకుండా లైబ్రరీకి వచ్చారు. విద్యామంత్రి వచ్చారని కంగారై లైబ్రరీ సిబ్బంది అంతా మీ దగ్గరికి పరుగెత్తుకొచ్చారు. ఐ జ్చిఠ్ఛి ఛిౌఝ్ఛ ్టౌ ట్ఛ్చఛీ టౌఝ్ఛ ఛౌౌజుట అని కొద్దిసేపు లైబ్రరీలో గడిపారు. బహుశా మీరప్పుడు పీహెచ్‌డీ కూడా చేస్తున్నారేమో! ఆనాడు నన్ను బాగా ప్రభావితుడిని చేసింది రాష్ట్ర విద్యా మంత్రి లైబ్రరీకొచ్చి పుస్తకాలు చదవడం. ఆ ఆదర్శం ఈనాడు ఈ తెలంగాణకు ఎంత అవసరమో!
మళ్ళీ పీసీసీ అధ్యక్షులయ్యాక ఒక పేరున్న డాక్టర్ మిత్రునితో కలిశాను. అంతకంటే ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలోని గూడూరులో మీ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న, నా పేరుతో ఉన్న (కంచ ఐలయ్య) మా బంధువు పదిసార్లు బతిమాలితే అతనికేమైనా చెయ్యండని మీకు ఫోన్‌లో చెప్పాను. నామీద ప్రేమకొద్దో ఏమో అతనికి పీసీసీ సభ్యత్వమిచ్చారు. కానీ కొద్ది రోజులకే నర్సంపేట రెడ్డి భూస్వాములు మేముండగా నువ్వు పీసీసీ సభ్యుడివి అవుతావా అని గొడ్డళ్లతో నరికి చంపారు. అతని హత్య తరువాత నేను ఫోను చేస్తే, 'నువ్వు చెప్పావని చేశానని' ఏడ్చారు కూడా. అతని భార్యకు చదువు రాదు, కుటుంబం బీదదే అని నేను చెబితే పార్టీ తరపున పది లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చారు. ఆనాటి వరంగల్ జిల్లా కలెక్టర్ దమయంతిని నేను కోరగా వాళ్ళ ఊరికి వెళ్లి పరిస్థితి చూసి ఆ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించింది.
ఈ ఘటన ఏం చెబుతుంది? తెలంగాణ దొరలు ఇంకా ఒక గొల్ల కురుమోడు పీసీసీ మెంబర్‌గా కూడా ఎదగడాన్ని సహించే స్థితిలో లేరు. ఇది తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న వరంగల్ జిల్లా సంగతి. ఇక నల్లగొండ విషయం చూద్దాం. 2004 ఎన్నికలప్పుడు ఒక బీసీ యువకుడు నాకో ఎమ్మెల్యే సీటు ఇప్పించమని జర జైపాల్‌రెడ్డి గారికి చెప్పమని నావెంట పడ్డాడు. చివరికి ఒక రోజు జైపాల్‌రెడ్డి గారికి ఫోన్ చేశాను. నా పేరు చెప్పగానే ఆయన పి.ఎ. చాలా అత్యుత్సాహంగా నన్ను ఇంగ్లీషులో పలకరించాడు. నేను ఫోను చేసిన పని ఆయనకు ఇంగ్లీషులో చెప్పాను. ఆయన వెంటనే '"Dr. Ilaiah your people still in our people's control only. You need a kanshiram to change that situation.. till then in Nalgonda no BC will get a seat"' అని ఆయన స్టైల్‌లో చెప్పాడు. ఈ స్థితి కూడా ఏం చెబుతుంది? తెలంగాణ సాయుధ పోరాట ఆయువు పట్టయిన నల్లగొండలో ఫ్యూడలిజం ఇంకా బలంగానే ఉన్నది. నల్లగొండలో రెడ్ల ఆధిపత్యం మీకు తెలియనిది కాదు.
ఈ స్థితిలో ఉత్తర తెలంగాణ భూస్వాముల నేతృత్వంలో ఒక పార్టీ పుట్టింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక అంశంగా అన్ని రకాల సమీకరణలు చేసుకుంటున్నది. చిన్న రాష్ట్రంలో బతుకు బాగుపడుద్దని పెద్ద కలలు కనే అన్ని కులాల యువతకు, రాజకీయ నాయకులకు అది గాలం వేసింది. కానీ వాస్తవం చూడండి. అరకొర గెలుస్తున్న ఎన్నికల్లో, పొత్తులు జిత్తులు చేసే దశలోనే ఆ పార్టీ చిన్న రాష్ట్రాన్ని పరిపాలించే పెద్ద కుటుంబ పార్టీగా మారింది. గత పదేళ్ళలో ఆ కుటుంబం, దానిచుట్టూ చేరిన తెలంగాణ పోరాట యోధులు త్యాగాలు చేశారా? యాగాలు చేశారా చూడండి! పుచ్చలపల్లి సుందరయ్య కుటుంబంలా భూములు, భవంతులు పంచిపెట్టారా, ఇతరులను దంచి ధనం కూడబెట్టారా చూడండి. ఫిలాసఫీలో పీహెచ్‌డీ చేసిన మీకు ఉద్యమ పార్టీ అంటే ఏంటో కొత్తగా నిర్వచించి చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర తెలంగాణ విప్లవ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ముప్పాల లక్ష్మణ్‌రావునే చూడండి. ఆయనది ఒం టరి త్యాగమే, కుటుంబ త్యాగం కాదు, కుల త్యాగం కాదు. కానీ ఈ తెలంగాణ ఆక్రమణ త్యాగంలోకి కుటుంబం, కులం ఏకధాటిన దిగాయి.
మీ ఇంటికి రోజూ వస్తున్న జానారెడ్డి హోం మంత్రిగా ఉన్నప్పుడే చర్చలకు పిలిచి తెలంగాణ యువకుల్ని తడిగుడ్డతో మెడగోసి చం పారు. ఆయన ఇంట్లోనే రాజకీయ జేఏసీ పుట్టింది. ఆయన కూడా తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని నేనేనని స్పష్టంగానే చెప్పారు. మీరెంతో రాజకీయ అనుభవం గలవారు. కుటుంబ పెత్తనాన్ని దేశం మీద రుద్దిన నెహ్రూ కుటుంబాన్ని చూశారు. రాష్ట్రం మీద రుద్దిన ఎన్.టి. రామారావు కుటుంబాన్ని చూశారు. ఇప్పుడు చిన్న రాష్ట్రం ఏర్పడక ముందే దాన్ని తరాలు పరిపాలించేందుకు పెద్ద కుటుంబాన్ని రంగంలోకి దించిన కేసీఆర్‌ను చూస్తున్నారు. నెహ్రూ ఇందిరాగాంధీని చాలా ఆలస్యంగా అయిష్టంగా అధికారంలోకి, ఎన్నికల రంగంలోకి తెచ్చారు. ఇందిరాగాంధీ దుందుడుకు సంజయ్ గాంధీని, ఎన్నికల రంగంలో దింపడంగానీ, అధికార పీఠం మీద కూర్చుండ పెట్టడం గానీ చెయ్యలేదు. మనం పరాయి పాలనగా దూషిస్తున్న ఎన్.టి.ఆర్.ను చూడండి. మొదటి ఎన్నికల్లో కుటుంబ సభ్యులెవరినీ ఎన్నికల రంగంలోకి రానివ్వలేదు. రెండో ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావును మాత్రం పోటీ చెయ్యనిచ్చారు, మం త్రిని చేశారు. చంద్రబాబు నాయుడు వచ్చిన క్రమం తెలిసిందే. తన చేతిలో అధికారముండగా ఒక్క కొడుకునుగానీ, బిడ్డను గానీ ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టనివ్వలేదు - అది ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలిస్తూ! మనం కోరుకునే చిన్న రాష్ట్రం రాక ముందే మీరు మం తనాలు జరిపే కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంత మంది పోటీ చెయ్యబోతున్నారో లెక్క చూడండి.
రాష్ట్రం సాధిస్తామనగానే సరిపోదు. దాన్ని ఏ విలువలతో, ఎవరు పరిపాలిస్తారు, అందులో మున్ముందు మనుషులుంటారా? భూమి మాత్రమే ఉంటుందా చూడాలి. మన మేకల్ని పక్క ప్రాంతం కుక్కలు కరుస్తున్నాయని, వాటిని మన ప్రాంతపు తోడేళ్ళ ముందు పెడతామా? ఏ ప్రాంతానికైనా విలువలు అక్కడి పాలకులను బట్టే గదా మారేది? తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీలు మేకల్లాంటి వారనేది మనకర్థమౌతూనే ఉంది. వాళ్ళ బతుకులు బాగుపడాలని ఎవరు పిలుపిచ్చినా ఉరుకుతున్నారు. ఆయుధాలు పట్టమంటే పట్టారు, రాళ్ళు పట్టమంటే పట్టారు. ఇప్పుడదే భూస్వాములు పార్టీ పెట్టి ఓటెయ్యమంటే వేస్తున్నారు. అయినా వారికి దక్కిందేమిటి, ముందు దక్కేదేమిటి?
మీరు తెలంగాణ కోసం కాంగ్రెస్‌లో పదవిని త్యాగం చేసి, టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి. మీరు కూడా అదొక్కటే ఉద్యమ పార్టీ అని మీడియా ముందు చెబుతున్నారు. మీ అందరి సహకారంతో ఈసారి టీఆర్ఎస్ వంద అసెంబ్లీ సీట్లు, పదిహేను పార్లమెంటు సీట్లు గెలిస్తే మిగతా మూడు పార్టీలకు దేనికీ వంద సీట్లు రావు గనుక సమైక్యాంధ్ర ముఖ్యమంత్రే కావచ్చని కేసీఆర్ అనుకోవచ్చు. పదిహేను ఎంపీ సీట్లతో కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం సంపాదించవచ్చు అని కూడా కంప్యూటర్ లెక్కలే చెబుతాయి. తెలంగాణ సామాజిక న్యాయం సంగతి గానీ, విద్యా వ్యవస్థను మార్చే సంగతి గానీ, ఇక్కడి ఫ్యూడల్ విలువల్ని, ఆధిపత్యాన్ని వీళ్ళే ఎలా అంతమొందిస్తారు అని మనకు తెలియదు.
తెలంగాణ రాగానే అన్ని సమస్యలకు పరిష్కారాలుంటాయని మీరంతా చెబుతున్నారు. ఇక్కడి వర్గ వ్యత్యాసాలను మార్చడానికి, కుల వ్యత్యాసాలను, అంటరానితనాన్ని, అణచివేతను కనీసం తగ్గించడానికైనా మీరు చేరబోయే టీఆర్ఎస్‌కు ఒక కార్యక్రమం ఉందా? తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి టీఆర్ఎస్ కార్యక్రమం ఏమిటని మీరు ఎప్పుడైనా అడిగారా? పోనీ, మీకు ఒక పార్టీ లేకపోయినా ప్రణాళిక అయినా ఉందా? అది పేపరు మీద ఉందా! మీరు రోజూ మీడియా ముందు, ఏ త్యాగానికైనా సిద్ధమని ఛాతి చరుస్తూ చెప్పగా నేను చూశాను. మీరు గంపనెత్తుకుని తిరిగే జేఏసీ ఉద్యోగులు చెప్పారు. మీ మాటలు నమ్మి కొంతమంది ప్రాణత్యాగమే చేశారు. కానీ ఇదే కాలంలో, ఈ ఉద్యమాన్ని నడిపే తెలంగాణ భూస్వాముల ఆస్తులు పెరిగాయా, తరిగాయా? మీరే ఒక తెలంగాణ విలువల కమిషన్ వేసి రిపోర్టు ఇవ్వమనండి.
ఇప్పుడు మీరంతా ఒక్కటై మాకే ఓటెయ్యండి తెలంగాణ వస్తుందంటే తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, (కొంతమంది మైనార్టీలు) నమ్మి ఓటెయ్యవచ్చు. కానీ మీరు నమ్మి ప్రజల ముందు పెట్టే పార్టీ, దాన్ని నడిపే కుటుంబం ఈ ప్రాంతాన్ని ఏం చేస్తుందో అంచనా వేశారా! గూడూరు కంచ ఐలయ్యకు రక్షణ కవచాలు లేకముందు ఒక పదవి ఇవ్వండని అడిగి నేను తప్పు చేశాను, ఇచ్చి మీరు తప్పు చేశారు. అలాగే ఈ భూస్వాముల నుంచే విభిన్న కులాలకూ, మైనారిటీలకు రక్షణ లేనప్పుడు మీరు తెలంగాణ తెచ్చినా నష్టమే కానీ లాభం లేదు. ఇన్ని విప్లవ పోరాటాల తరువాత భూస్వాములు చెబితే వినే ప్రజలు తమను తాము రక్షించుకోలేరు. కనుక తెలంగాణ పేరుతో ఇప్పుడు పెనంమీద ఉన్న ప్రజల్ని పొయ్యిలో పడెయ్యవద్దు.
ఇక్కడి భూస్వామ్య కులాలు రహస్యంగా కుల సమావేశాలు వేసుకొని పోరాటంలో భూ ఆక్రమణ, పదవుల ఆక్రమణ ఎలా చెయ్యాలో ప్లాను గీశారు. మీరు పుట్టి, పెరిగిన కులం వారితోనైనా కూర్చొని ఎప్పుడైనా చర్చించారా? వాళ్ళు ముందు కులాలను సమీకరించుకొని, ప్రాంత సమీకరణకు పూనుకుంటున్నారు. మీరు కుల సిద్ధాంతాన్ని నమ్మనంటున్నారు. హేతువాదిగా మొదలైన నెహ్రూ తన కుటుంబాన్ని కుల రహితంగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ కుటుంబంలో కులం లేదని మనం గ్రహిస్తున్నాం. మీరు బలపర్చే తెలంగాణ పార్టీ నాయకుడి ఇంట్లో కులాతీత చైతన్యం ఏమైనా ఉందా? ఇక్కడ జరిగిన రెండు విప్లవ పోరాటాలు, ప్రజాస్వామిక సంస్థలు వారిని ఇంకా ఎక్కువ కులవాదుల్ని చేశాయి. ఈ ప్రాంతంలోని రెండు ఫ్యూడల్ కులాలు కింది కులస్థుల్ని ఎట్లా అణిచివెయ్యాలో ఆర్గనైజ్‌డ్‌గా ఆలోచిస్తున్నాయి. ఈ స్థితిలో దోపిడీకి గురైన కులాల వాళ్ళు, కుల ప్రాతిపదికన హక్కులడిగితే తెలంగాణ వచ్చే వరకూ హక్కులొద్దంటున్నారు. కనీసం స్పెషల్ కంపోనెంట్ ప్లాన్లు పెట్టి బతుకు బాగుచెయ్యండని ఇతర పార్టీలను అడగొచ్చు గానీ, ఈ తెలంగాణ పార్టీని అదీ అడుగలేని పరిస్థితి. తెలంగాణ వచ్చే వరకైనా ఇక్కడి బడుగు జీవులు బతికేదెట్ల?
అన్ని పోరాటాల్లో ప్రజలను త్యాగం చెయ్యమంటే ఎట్లా? ఇంత తెలంగాణ పోరాటంలో ఒక్క సుందరయ్య కూడా పుట్టలేదే. కాంట్రాక్టులు, కలెక్షన్‌లు ప్రజాస్వామిక విలువలు ఎట్లవుతాయి?ఓట్లను బాయ్‌కాట్ చేయించే మావోయిస్టులు కూడా ఈసారి తెలంగాణ పార్టీకి ఓటు వేయించవచ్చు. తెలంగాణ ఐడెంటిటీకి టీఆర్ఎస్ దిష్టిబొమ్మ అంటున్నారు మీరు. మీరు జీవితాంతం పనిచేసిన కాంగ్రెస్‌లో తెలంగాణ ఐడెంటిటీకి, ఆత్మగౌరవానికి బయట ఉన్నట్లే అంటున్నారు? అంటే రేపు టీఆర్ఎస్ వంద సీట్లు గెలువకపోతే 'ప్రజల్ని తెలంగాణ ద్రోహులని' బాంబులేయిస్తారా?
నా కుటుంబ సభ్యులు ఎవరైనా పార్టీలో కనబడ్డా నన్ను రాళ్ళతో కొట్టండి అని కేసీఆర్ ఒకనాడు విద్యార్థులకు చెప్పాడు. కానీ ఇప్పుడు పార్టీ నిండా కుటుంబం, కుటుంబం నిండా పార్టీ ఉన్నాయి. అయినా ఆయనను ఎవరూ రాళ్ళతో కొట్టలేదు. కానీ మిమ్మల్ని, మధుయాష్కీని ఆయన అనుచరులు ట్యాంక్ బండ్ మీద తుక్కు, తుక్కుగా కొట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన కారు బద్దలైంది. ఇది ప్రజలమీద వారి పట్టుకు నాంది. వీర తెలంగాణ యోధుడు మధుయాష్కీని కొట్టారు. ఇక ముందు దెబ్బలు పడకుండా ఉండాలంటే ఆ పార్టీలో చేరడమే పరిష్కారమని మీరు భావించవచ్చు. మీరు టీఆర్ఎస్‌లోకి పోయేది త్యాగం చెయ్యడానికని ప్రజల్ని ఎలా నమ్మమంటారు? టీడీపీలో ఎంపీగా గెలిచి పార్లమెంటులో కాంగ్రెస్‌కు ఓటు వేసి అక్కడే పార్టీ మారిన మంద జగన్నాధం కూడా త్యాగం చెయ్యడానికే టీఆర్ఎస్‌లో చేరుతున్నాడని మీరు నమ్ముతున్నారు! ఈయన అంబేద్కర్ ఆశయాలను ఎంత గొప్పగా నెరవేరుస్తున్నాడో!
ఫిలాసఫీలో పీహెచ్‌డీ చేసిన ఏకైక పొలిటీషియన్‌గా ప్రకటనలకే పరిమతం కాక మీరు ఏ ఫిలసాఫికల్ క్లారిటీతో టీర్ఎస్‌లోకి పోదామనుకుంటున్నారో కాస్త వివరంగా చెప్పండి. నేననుకునేదేమంటే అయ్యా వచ్చి పిలిసిండు, కొడుకు పిలిసి పని చెప్తడు, బిడ్డ పిలిచి బియ్యమేరమంటది. మీరు పోవాలనుకునేది ఒక పార్టీలోకి కాదు, ఒక గడీలోకి. అక్కడ ఢిల్లీలో ఉన్నట్లు ఎన్‌లైటెడ్ కుటుంబం లేదు ఇంగ్లీషులో మాట్లాడడానికి, చర్చించడానికి. అక్కడ పూనకంలో ఉన్న ఫ్యూడలిజమున్నది. అక్కడ మహాత్మాగాంధీని కూడా చెప్పింది చెయ్యకపోతే 'దంచుడే'. జర సోంచాయించి జంపుచెయ్యి. నమస్తే.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Andhra Jyothi Telugu News Paper Dated: 23/4/2013
No comments:
Post a Comment