Wednesday, April 17, 2013

మోడీ 'మంత్రం'లో నిజం ఎంత? - డా. వెంకటేష్ నాయక్



జాతీయ స్థాయిలో 2014 ఎన్నికలకు అనధికారికంగా ప్రచారం మొదలైనట్టుగా, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రచార హడావుడి చూస్తుంటే అనిపిస్తుంది. బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రమోట్ చేస్తుంటే, కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తోంది. ముఖ్యంగా మోడీ తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నాలు టీవీ చర్చల రూపంలో ముమ్మరం చేశారు. జాతీయ టీవీ చానెళ్లు మోడీని ఒక పాపులర్ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మోడీ తన ప్రసంగాలలో రెండు విషయాలను నొక్కి చెబుతున్నారు. ఒకటి 'గుజరాత్ అస్మిత', రెండు 'గుజరాత్ అభివృద్ధి నమూనా'. ఈ విషయాలని మోడీ తాను ఇప్పటికే దేశానికి ప్రధాని అయిపోయిన స్థాయిలో నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మోడీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని దేశానికి ఒక అభివృద్ధి మోడల్‌గా ప్రాజెక్ట్ చేస్తున్నారు. మోడీ అభివృద్ధి మంత్రంలో ఎంత నిజం ఉంది? ఒక విషయం ఎవరూ కాదనలేరు. అదేమిటంటే గుజరాత్ అభివృద్ధి నయా-ఉదారవాద, సంపన్నుల, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను నెరవేర్చే శైలిలో జరిగిందని. అది సమ్మిళిత రహిత, ప్రత్యేక సామాజిక వర్గాలకే పరిమితమైన అభివృద్ధి అని. ఈ నమూనా కారణంగా సుస్థిరత, సామాజిక న్యాయం ముఖ్యంగా దెబ్బతింటుంది.

గుజరాత్ సమ్మిళిత రహిత అభివృద్ధి నమూనా అమర్త్యసేన్ ప్రకారం అభివృద్ధి కేవలం భౌతిక విషయాలైన స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తిలపై ఆధారపడి కొలవలేము. అభివృద్ధి అనేది ప్రజల జీవితాలను, స్వేచ్ఛను పెంపొందించే విధంగా ఉండాలని ఆయన నిర్వచించారు. అంటే అభివృద్ధికి మానవాభివృద్ధి అనేది కొలమానం కావాలి. మోడీ అభివృద్ధి మొత్తం జీడీపీ, జీఎన్‌పీల ఆధారంగా రూపొందించబడినది. ఇది కార్పొరేట్ సెక్టార్‌ని ప్రమోట్ చేయడం వలన జరిగిన అభివృద్ధిగా వర్ణించవచ్చు. అది ఇటీవల కాగ్ ప్రచురించిన రిపోర్ట్‌లో కూడా బయటపడింది. కార్పొరేట్ సంస్థలకు మోడీ లాభం చేకూర్చారని కాగ్ నివేదిక పేర్కొంది. కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం భూములని తక్కువ ధరలో విక్రయించిందని పేర్కొంది. అందువల్ల కోట్లాది రూపాయలు ఖజానాకు నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఈ విధమైన కార్పొరేట్ అభివృద్ధి వలన సామాజిక న్యాయం, సుస్థిరాభివృద్ధి సాధించడం అసాధ్యమవుతుంది.

మోడీ మీద చెరగని మచ్చ 2002 మత హింసాకాండ. దాని బాధితులకి అభివృద్ధి శూన్యం. ముస్లిం మైనారిటీలకు ఈ అభివృద్ధిలో తావు లేదని ఇట్టే చెప్పేయవచ్చు. ఈ హింసాకాండలో నిర్వాసితులైన రెండు లక్షల మందిలో కేవలం 16,087 మంది ముస్లిం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలలో కనీస అవసరాలు కూడా తీరకుండానే, అక్కడ మగ్గిపోతున్నారు. ఇవి అహ్మదాబాద్‌లో ముస్లింల అడ్డాలుగా మారాయి. సామాజిక విభాగీకరణ, మతపరమైన విద్వేష వాతావరణం గుజరాత్‌లో ఇంకా కొనసాగుతూ ఉంది. ముస్లింలకి ఇతర మతస్థులకి మధ్య సామాజిక సహకారం పూర్తిగా తగ్గిపోయింది. సామాజికాభివృద్ధి, సామాజిక తృణీకారం అనేది పేదరిక నిర్మూలన, పూర్తి స్థాయి ఉద్యోగిత, సామాజిక సమగ్రతని కోరుకుంటుంది. కానీ గుజరాత్‌లో సామాజిక తృణీకారం పెరిగి బలవంతులదే రాజ్యంఅనే స్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ముస్లింల యొక్క భౌతిక, మానసిక పరాయీకరణ బాగా పెరిగిపోయింది. 2002 అల్లర్ల తర్వాత మత హింసాకాండ చోటు చేసుకోక పోనప్పటికీ ముస్లింలలో భయాన్ని పోగొట్టలేక పోయింది. ముస్లింలలో భయం పెరిగింది. వారిలో సామాజిక అభద్రతా భావం పెరిగింది. ఈ మధ్యన గుజరాత్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 141 మంది ముస్లిం కౌన్సిలర్‌లు బీజేపీ నుంచి గెలుపొందడమనేది కేవలం ముస్లిం సమాజం ముందున్న పరిమితమైన రాజకీయ ప్రత్యామ్నాయం వారిలో మెజారిటీ మతం పట్ల పెరిగిన అభద్రతా భావాన్ని చూపిస్తుంది. ముస్లింలలో సామాజిక తృణీకార భావం కూడా పెరిగింది.

అభివృద్ధి అంశంలో గుజరాత్ రాష్ట్రం చెప్పుకోదగ్గ అభివృద్ధినేమీ సాధించలేదు. బడ్జెట్‌లో ముఖ్యమైన విద్యారంగానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేటాయింపు చాలా తక్కువగా ఉంది. జీడీపీలో రాష్ట్రం బాగానే వృద్ధి సాధిస్తుండవచ్చు కానీ అది మానవాభివృద్ధి కింద మారడం లేదు. 2004-2010 సంవత్సరాల మధ్యలో రాష్ట్రంలో ఉద్యోగితా అభివృద్ధి '0' సున్నాగా (నేషనల్ సాంపిల్ సర్వే ఆర్గనైజేషన్) సర్వేలో బయటపడింది. రాష్ట్రంలో 23 శాతం మంది ప్రజలు దారిద్య్రరేకు దిగువన నివసిస్తున్నారు. ఇది హర్యానా (19.88 శాతం), తమిళనాడు (17.42 శాతం) కంటే ఎక్కువ. అలాగే రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీలేదు. స్కూళ్ళలో పిల్లల నమోదు చాలా తక్కువ. గుజరాత్ అభివృద్ధి కేవలం కార్పొరేట్ శక్తుల ప్రచారమే కాదు, ఎఫ్‌డీఐని ఆకర్షించడానికి మోడీ మంత్రం కూడా. 2003-2011 మధ్యలో ఐదుసార్లు అయన ఎఫ్‌డీఐల కోసం ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంకు సమాచారాన్ని చూస్తే 2000-2011 దశాబ్ద కాలంలో గుజరాత్ కేవలం 7.2 బిలియన్ డాలర్ల మదుపులు ఆకర్షించగా, మహారాష్ట్ర 45.8 బిలియన్ డాలర్లు, ఢిల్లీ 26 బిలియన్ డాలర్లు, కర్ణాటక 8.3, తమిళనాడు 7.3 బిలియన్ డాలర్ల మదుపులు వచ్చాయి. ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో గుజరాత్ 5వ స్థానంలో ఉంది.

ఈ విధంగా గుజరాత్ తరహా అభివృద్ధిని వివక్షాపూరిత, ఏకపక్ష అభివృద్ధిగా అభివర్ణించవచ్చు. మైనారిటీల పట్ల నిరంకుశ వైఖరికి మోడీ అభివృద్ధి నమూనా అద్దం పడుతుంది. బీజేపీ ప్రభుత్వం మైనారిటీల పట్ల బహిరంగంగా శత్రు వైఖరిని ప్రదర్శించింది. ఈ విధమైన మోడల్‌ని ఒకవేళ మోడీ ప్రధాని అయ్యాక దేశంలో అమలుచేస్తే సామాజిక-ఆర్థిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మోడీ ప్రసంగాలలో కుల సమస్య, మైనారిటీ సమస్యల మీద ఎటువంటి ప్రస్తావన కనబడదు. తను ప్రధాని అయితే కులతత్వం, మతతత్వం, నిరంకుశ పరిపాలన దేశ ప్రజలు చూడాల్సి రావచ్చు.

- డా. వెంకటేష్ నాయక్
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 18/4/2013

No comments:

Post a Comment