Saturday, October 1, 2011

ఇంత ఉద్యమం గతంలో లేదు - ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్ Andhra Jyothi 02/10/2011


ఇంత ఉద్యమం గతంలో లేదు

- ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

నలభై మూడేళ్ళ క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన నేతల్లో సంగంరెడ్డి సత్యన్నారాయణ ఒకరు. ఆనాటి ఉద్యమ సభల్లో- "రావోయి రావోయి చెన్నారెడ్డి.. రావేమి వెర్రి చెన్నారెడ్డి, తెలంగాణ సోదరా.. తెల్సుకో నీ బతుకు'' అని ఆయన పాడిన పాటలు పెద్ద హిట్. పంచాయితీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన సత్యన్నారాయణ ఎన్టీఆర్ కేబినెట్‌లో రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఈ మధ్య వరకూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో, గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన మార్పుల గురించి సత్యన్నారాయణతో ముఖాముఖి..

మీరు 1950ల తర్వాత జరిగిన ఉద్యమాలను చాలా దగ్గరగా చూశారు కదా.. అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడాలు ఉన్నాయి?
స్వాతంత్య్రం ముందు తెలంగాణ ప్రాంతమంతా నిజాం పరిపాలనలో ఉండేది. ఆయన పాలనలో ప్రజలందరూ బానిసలే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిజాం పాలన పోయింది. పేరుకు ప్రజాస్వామ్యం వచ్చింది. తెల్లదొరలు పోయి నల్లదొరల పాలన వచ్చింది. తెలంగాణాలో మెజారిటీ ప్రజలైన దళిత, బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయం తెలియదు.

అధికారపు రుచి తెలియదు. అధికారంతో సాధికారత కూడా వస్తుందని తెలియదు. తెలంగాణలో వెలమలు, రెడ్లు అగ్రవర్ణాల వారు. వెనకబడిన తరగతుల వారు అమాయకులు కావటంతో అగ్రవర్ణాల వారు అధికారంలోకి వచ్చారు. అయితే వారు కూడా ఆంధ్రప్రాంతంలో ఉన్న అగ్రవర్ణాల వారికి సలామ్ చేసేవారు. 1958 నాటికే తెలంగాణ ప్రజలకు ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే అభివృద్ధి చెందగలమని గ్రహించారు. ఆంధ్రనాయకులు చేస్తున్న రాజకీయాలను అర్థం చేసుకున్నారు.

ఆ సమయంలో సంజీవరెడ్డి మీద నేను రాసిన- 'సంజీవరెడ్డి మామ.. అయ్యో రామరామ' అనే పాట పెద్ద హిట్. ఏ సభకు వెళ్లినా అడిగి మళ్లీ మళ్లీ పాడించుకొనేవారు. ఈ పరిస్థితి బాగా ముదిరి 1969నాటికి ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎన్‌జీఓలు. ఇది పట్టణాల్లో బాగా పాకింది. ఆ సమయంలో మేమందరం పోరాడాం.

కాని తెలంగాణ ప్రజలను చెన్నారెడ్డి వంటి నాయకులు నమ్మించి మోసం చేశారు. కాని ప్రజల్లో మాత్రం ప్రత్యేక తెలంగాణ భావన బలంగా నాటుకుపోయింది. ఇక ప్రస్తుత ఉద్యమం విషయానికి వస్తే- ఇది అన్ని వర్గాల్లోకి బాగా పాకింది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు. విద్యార్థులు, ఇతర వృత్తుల వారు, కులసంఘాల వారు కూడా పాల్గొనటం మొదలుపెట్టారు. నా ఉద్దేశంలో ఈ సారి ఉద్యమాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఇంత బలమైన ఉద్యమం గతంలో జరగలేదు.

మీ ఉద్దేశంలో ఆ నాటి ఉద్యమాలు చల్లారిపోవటానికి కారణాలేమిటి? అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవా?
ఇప్పుడు ఉన్నంత చైతన్యం ఆ సమయంలో అంటే 1969లో లేదు. ఆ సమయంలో ఉద్యమాలు పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు పల్లెపల్లెకు పాకాయి. జెండాలు, అజెండాలు ఉన్నా లేకపోయినా- తెలంగాణ కావాలనే భావన బలంగా ఉంది. ఉదాహరణకు వరంగల్ ప్రాంతంలో ఉన్న ముచెర్ల మా ఊరు. ఆ గ్రామ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నారు. కాని మీకు ఆ గ్రామంలో ఒక్క పార్టీ జెండా కూడా కనిపించదు. అంటే పార్టీ రహితంగా, నేతల ప్రమేయం లేకుండా ఉద్యమం పాదుకుపోయింది.

దీనికి ఒక ప్రధానమైన కారణం సాహిత్యం. ఇప్పుడు అనేక మంది కవులు, కళాకారులు గళాలెత్తి పాడుతున్నారు. రచయితలు తమ రచనల ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. గతంలో ఇంత మంది కవులు, రచయితలు, కళాకారులు లేరు. దీనితో పాటు హైదరాబాద్ ప్రాధాన్యాన్ని కూడా తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే- గత ఉద్యమాలలో పాల్గొన్న ప్రజలకు హైదరాబాద్‌కు ఉన్న 'అధికార శక్తి' తెలియదు. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొంటున్నవారికి హైదరాబాద్ ఎంత అవసరమో తెలుసు. వీటన్నింటితో పాటుగా ఈ సారి ఉద్యమంలో కులసంఘాలు చురుకుగా పాల్గొంటున్నాయి.

బొగ్గుకార్మికులు, ప్రభుత్వ సిబ్బంది, కులసంఘాలు, విద్యార్థులు- అందరూ కలిసి ఒక లక్ష్యం కోసం ఉద్యమం చేయటం ఇప్పటి దాకా జరగలేదు. గతంలో జరిగిన ఉద్యమాలలో కొన్ని వర్గాలు పాల్గొన్నాయి. కొన్ని పాల్గొనలేదు. అందువల్ల ఆ ఉద్యమాలు త్వరగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

గతంలో జరిగిన ఉద్యమాలలో యువకులు ఆత్మహత్యలు చేసుకోలేదు. ప్రస్తుత ఉద్యమంలో జరుగుతున్నాయి. వీటిని దేనికి సంకేతంగా భావించాలి?
ఉద్యమం ఎంత కాలం జరుగుతుంది? తెలంగాణ వస్తుందా?రాదా? అనే విషయానికి సంబంధించి ప్రజల్లో ఇంకా అనేక అనుమానాలు ఉన్నాయి. నాయకులు ప్రజలకు సమాచారాన్ని స్వేచ్ఛగా అందించకపోవటం వల్ల ఉద్యమాలు జరిగే సమయంలో అనేక అపోహలు, అనుమానాలు ఏర్పడతాయి. వీటి వల్ల మన పరిస్థితిలో మార్పు రాదేమోననే భయం ఏర్పడుతుంది.

సున్నితమనస్కులు, ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేని వారు ఆత్మహత్యలు చేసుకుంటారు. విద్యార్థుల విషయంలో ఇదే జరిగింది. గతంలో ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో కాల్పులు జరిపేవారు. వాటిలో ప్రజలు మరణించేవారు. కాని ప్రస్తుత ఉద్యమంలో- తెలంగాణ ఎటువంటి పరిస్థితుల్లోనైనా వస్తుంది.. మీరు భయపడకండి అని భరోసా లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఊ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులపై మీ విశ్లేషణ ఏమిటి?
తెలంగాణా ఇవ్వటం తప్ప మరో మార్గం లేదు. కాని తెలంగాణా రాకుండా అడ్డుపడటానికి అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి ఉద్యమం పల్లెపల్లెకు పాకింది కాబట్టి తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. కాని మాట్లాడదాం.. చర్చిద్దాం.. అన్నప్పుడల్లా తెలంగాణ ఇక రాదేమోనని కొందరు భయపడటం సహజం. కాని ప్రజల ఆకాంక్షలను ఎవరూ అణిచివేయలేరనే నమ్మకం నాకు ఉంది.

- ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్.ప్రసాద్

No comments:

Post a Comment