Monday, October 17, 2011

కొలిమంటుకున్నది - రామా చంద్రమౌళి Andhra Jyothi 18/10/2011


కొలిమంటుకున్నది

- రామా చంద్రమౌళి

వర్తమాన సంక్షుభిత తెలంగాణ ప్రజాజీవిత బీభత్స దృశ్యాన్ని అందరూ ఒక చోద్యం చూస్తున్నట్టు చూస్తూ చేష్టలుడిగి ఒట్టి సాక్షులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. అసమర్థ ప్రభుత్వం, బాధ్యతలు విస్మరించిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కమిటీల కచేరీలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పాలకులు, రోబో పాత్రల్లో జీవిస్తున్న వేలమంది పోలీసులు, ఒట్టి అరుపులతో తమను తామే మోసం చేసుకుంటున్న మే«ధావులు, రేటింగ్‌లతో, 'ఎక్స్‌క్లూజివ్'లతో పులకించిపోతున్న మీడియా... అసలేం జరుగుతోందిక్కడ? ఎందుకింత ఉదాసీనత?

ఒకవైపు నెలరోజులకుపైగా సకల తెలంగాణ జనం శాంతియోధులై... పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, వృత్తికూలీలు, ఉద్యోగులు... అందరూ ఏకైక గాఢ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గర్జిస్తూంటే... ప్రతి దినం వందలకోట్ల రూపాయల నష్టం వాటిల్లుతూ, సంచితంగా ఉత్పత్తి రంగంలో కోట్లాదికోట్ల నష్టం పేరుకుపోతూంటే, విద్యార్థుల అమూల్య జీవితాలు మసిబారిపోతుంటే, సకల వృత్తులూ స్తంభించి జీవితం స్తంభించిపోయి కకావికలౌతూంటే.. ఎందుకీ మొద్దునిద్ర..?

ఎందుకీ అచేతన నిష్క్రియత్వం..? అధ్యయనాలేమైనాయి..? పరిశీలనలేమైనాయి..? గూఢచర్య, నిఘా నివేదకలేమైనాయి? అవేవీ 'అసలు సత్యాన్ని' ప్రస్ఫుటపర్చడంలేదా? మొన్న నారాయణగూడలో ఒక ఊరేగింపు జరిగింది. పెంటకుప్పలపై చెత్తకాగితాలను, ఖాళీసీసాలను, అట్టపెట్టెల తుక్కును ప్లాస్టిక్ గోతాల్లో ఏరుకునే వందకుపైగా శుద్ధమానవులు... 'జై తెలంగాణ', 'మాకు మా తెలంగాణ కావాలె' అనే నినాదాలతో బిగించిన పిడికిళ్ళ దండు..; దానికి ఓ వంద గజాల వెనుక డాక్టర్స్ ర్యాలీ... 'వుయ్ వాంట్ తెలంగాణా'. ఏమర్థమౌతోంది..? ఇంటగ్రేషన్..

లోయ ర్ లిమిట్ జీరో టు అప్పర్ లిమిట్ ఇన్‌ఫినిటీ... అది నిమ్న ప్రజల గుం డె లోలోతుల్నుండి, అత్యున్నత విద్యావంత ప్రజావర్గాల దాకా విస్తరించి... తెలంగాణ నాలుగున్నరకోట్ల ప్రజల గుండె గుండెలో రగులుతున్న నిప్పువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంక్ష యింక ఏరకంగా వ్యక్తీకరించబడాలె? ఎంతసేపూ పాలకులకు... రాజ్యాధికారం, ప్రభు త్వ ఏర్పాటు సమీకరణాలు, శాసన సభ్యుల లోక్‌సభ సభ్యుల కప్పలతక్కెడ గెంతుల లెక్కలు, నటనలు, కుట్రలు, తాత్సారాలు, మోసాలు, మభ్యపెట్టడాలు, బ్లాక్‌మెయిలింగ్‌లు తప్పితే ప్రజల ఆకాంక్ష, ప్రజల యోగక్షేమాల స్పృహ, ప్రజల ఆలోచన, ప్రజల అభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామిక సంస్కారం, నైతికత... ఇవేమీ అవసరం లేదా? ఇక చాలు, ఇప్పటికే భవిష్యత్తులో రాష్ట్రం కోలుకోలేని విధంగా చాలా ఆర్థికంగా ధ్వంసం జరిగిపోయింది. ఇక దోబుచులాటలు, దొంగాటలు, నాటకాలు, నీతిబోధలు ఆపి... క్రింది అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాలి.

(1) పార్టీలు ఏవైనా... తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ అ«ధిష్ఠానం తెలంగాణ ప్రజలే... వాళ్ళందరూ అనివార్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలమాటనే వినాలి. ప్రస్తుతం ప్రజల ఆకాంక్ష 'ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు'... అందువల్ల ప్రజాప్రతినిధులందరూ తక్షణం వాళ్ళ వాళ్ళ పార్టీ అధిష్ఠానాలను ధిక్కరించి ప్రజా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలి.పార్టీలకతీతంగా శాసనసభ్యులు, తెలంగాణ మంత్రులు గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరిస్తున్నట్టుగా ఒక లేఖనివ్వాలి. అప్పుడు అనివార్యమై ఈ ప్రభుత్వం కూలిపోయే సంక్షోభమేర్పడి.. 'మేం మీ దగ్గరికి రావడం కాదు... మీరే మా దగ్గరికి వస్తారు' అనే స్థితి ఏర్పడుతుంది.

(2) ఎప్పుడైనా ప్రజానిరసన స్వరూపం... 'ఉద్యమం... తిరుగుబాటు... యుద్ధం' క్రమంలో వృద్ధి చెందుతుంది... ఇప్పుడున్న ఉద్యమస్థితి యిక సహనాన్ని దాటి 'తిరుగుబాటు' అనే సంక్లిష్ట స్థితిలోకి రూపాంతరం చెందబోతోంది.. ఇది గగనమెత్తు తీవ్రరూపం దాల్చకముందే 'తాత్సార' సిద్ధాంతాన్ని కేంద్ర ప్రభుత్వ పాలకులు సత్వరం విడిచిపెట్టి వెన్వెంటనే 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు'ను ప్రకటించాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ, సామాజిక సమస్యగా కాకుండా ఒక 'ఆత్మగౌరవ' పరితపనగా గుర్తించాలి.

(3) భారతదేశానికి మున్ముందు 'ప్రధాని' కావాలని ఆపేక్షించే రాహుల్ గాంధీ నెలరోజులనుండి జరుగుతున్న 'తెలంగాణ' ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం ఆయన రాజకీయ అజ్ఞానాన్ని, అపరిపక్వతను ఉదాసీనతను చాటి చెబుతున్నాయి. తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించడంలో రాహుల్ చురుకైన పాత్ర వహించకపోవడం అతనికి రాజకీయంగా చాలా నష్టాన్ని కష్టాన్నీ కలుగజేస్తుంది. అది రాహుల్ సత్వరం గ్రహించి ఒక యువ నాయకునిగా తెలంగాణ పరిష్కారంలో చురుగ్గా పాల్గొనాలి.

(4) సకల పౌరజీవితం స్తంభించిన వర్తమానంలో ఉన్నతస్థాయి జ్ఞానవేత్తలు ఒక సమూహంగా ఏర్పడి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పార్టీల ఉన్నత అధినేతలను వాస్తవ నివేదికలతో కలిసి చర్చించి వాళ్ళు విస్మరిస్తున్న నైతిక బాధ్యతల గురించి గుర్తుచేయాలి. పరిష్కారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలి.

(5) మీడియా వద్ద తాము ప్రసారం చేసిన అసలైన వాస్తవ ఉద్యమ సమాచారం ఉంది. ఎంతసేపూ తమ రేటింగ్‌లూ, ఎక్స్‌క్లూజివ్ ప్రసారాలు, చర్చలు వదిలిపెట్టి జనహితం కోసం ఒక బాధ్యతాయుతమైన కార్యసాధక ధ్యాస బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పార్టీ అధిష్ఠానాలతో ఎందుకు రాయబారం చేయకూడదు.

(6) తెలంగాణ, ఆంధ్ర పెద్దలు, మేధావులు... ఇరుప్రాంతాల కీలక వ్యక్తులను ఒకచోట... పబ్లిగ్గా కూర్చోబెట్టి ఒక సర్వజన ఆమోదయోగ్య పరిష్కార సాధన దిశగా ఎందుకు ప్రయత్నం చేయరు? రాజకీయ జీవులు, ప్రజాప్రతినిధులు రెండు మూడు నాల్కలతో అనైతికంగా ప్రవర్తించడాన్ని మానవీయకోణంలో ఎందుకు ప్రశ్నించకూడదు?

(7) ఒక సార్వభౌమ ప్రభుత్వం అధికారికంగా 'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు'ను ప్రకటించి, మాటతప్పి తోకముడుచుకోవడం, ప్రపంచ సభ్య దేశాల దృష్టిలో ఎలా ఉంటుంది? 'మాటకు కట్టుబడి ఉండాలి' అన్న నైతికధర్మ స్పృహ దేశ ప్రభుత్వాలకు అవసరం లేదా? దాదాపు అరవైఏండ్ల నిరంతర సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ ప్రజలు నినదిస్తున్న 'ప్రత్యేక రాష్ట్ర కాంక్ష' ఇప్పుడు ఇక పెట్రోల్ బావి తగులబడ్తున్నట్టు, వేసవిలో అడవి అంటుకున్నట్టు, ఆకాశమే అగ్నివర్షమై కురుస్తున్నట్టు ప్రళయభీకరమై మనందరి ముందు ప్రత్యక్షమై నిలబడి ఉంది. దీన్ని నిలువరించడం ఎవరితరమూ కాదు. కుట్రలు, కుతంత్రాలు, కుటిల కుత్సితాలు ఈ మహోగ్ర ఉద్యమాన్ని చల్లార్చలేవు. కాస్త ముందూ వెనుక ప్రజల విజయం తథ్యం.

- రామా చంద్రమౌళి
(వాస్తకర్త ప్రొఫెసర్, కవి, రచయిత)

No comments:

Post a Comment