Friday, October 14, 2011

దారితప్పుతున్న అన్నాలు By - డొక్కా మాణిక్య వరప్రసాద్ Andhra Jyothi 15/10/2011


దారితప్పుతున్న అన్నాలు

రాజకీయ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తెగనాడి మతపరమైన మెజారిటీ రాజకీయాల దిశగా దేశాన్ని నడిపించే మహాకుట్ర అన్నాల ఉద్యమంలో దాగివుంది. అన్నా హజారే, బాబా రాందేవ్, మోడీ, అద్వానీ చెలిమికి అదే ప్రాతిపదిక.

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం కంటే అన్నా హజారేను గాంధీజీ సరసన నిలబెట్టాలనే తాపత్రయం అన్నా బృందంలో ఎక్కువగా వుంది. దేశ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించే నాటికే గాంధీజీ దక్షిణాఫ్రికాలో పలు పోరాటాలు నడిపారు. యువకుడుగా ఉన్నప్పుడే జాతిపితకు సత్యాగ్రహం గురించిన అవగాహన ఏర్పడింది. కానీ గాంధీ చిత్రపటం నేపథ్యంలో అవినీతి వ్యతిరేక జన లోక్‌పాల్ చట్టం కోసం దీక్ష చేసిన అన్నా వయో వృద్ధుడైనప్పటికీ గతంలో ఆయన ఏ దురన్యాయాలకు వ్యతిరేకంగా ఏమిచేశాడు అన్న ప్రశ్నకు 'అన్నా'ల వద్ద సమాధానం లేదు.

గాంధీజీ దృష్టిలో సామాజిక మార్పు శాసనాలతో వచ్చేది కానేకాదు. ఆయనది నైతిక మార్గం. శాసనమార్గం కాదు. జాతి వివక్షతో తనపై దాడికి పాల్పడిన సందర్భాల్లో కూడ ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడానికి నిరాకరించారు. అహింసాయుత సత్యాగ్రహ పద్ధతిలో శత్రువులో మానసిక పరివర్తన తేవడం ఆయన సన్మార్గంగా భావించారు. కానీ అన్నా హజారేది అందుకు భిన్నమైన మార్గం.

అది శాసనాల ద్వారా అవినీతి నిర్మూలన మార్గం. గాంధీజీకి నైతికమార్పు అప్రాముఖ్యం. గాంధీ మరణ శిక్షను వ్యతిరేకించాడు. అవినీతిపరులకు ఉరిశిక్ష విధించాలనేది అన్నాల డిమాండ్. ఎంత తేడా! అయినా అన్నా హజారేను గాంధీ సమానుడిగా, ఈనాటి గాంధీగా చూపే ప్రయత్నాల్లో అన్నాలు వున్నారు. వారి ఉద్యమాన్ని రెండో స్వాతంత్య్ర పోరాటంగా భ్రమింపజేస్తున్నారు. పౌర సమాజం అనే భావనను అన్నాలు బలంగా తెరపైకి తెచ్చారు. రెండున్నర దశాబ్దాల క్రితమే 'పౌరసమాజం-రాజ్యం' అనే రెండుగా దేశాన్ని చూడడం మొదలైంది. వాటి పరిధి, పరస్పర ప్రభావాల చర్చ జరిగింది, ముగిసింది. పౌర సమాజం గురించి విశేష సైద్ధాంతిక కృషి జరిపిన నీరా చందోక్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో ఇక పౌర సమాజంలో మన యాత్ర ముగిసినట్టేనా? అని సందేహించారు.

పౌర సమాజం గురించిన ఈ చర్చ గురించి అన్నాలకు ఏ మాత్రం తెలుసోగానీ పౌర సమాజం పార్లమెంటు కంటే ఉన్నతమైనదనే ప్రచారాన్ని వారు ప్రారంభించారు. సమాజ జీవితపు రాజకీయ వ్యక్తీకరణగా చట్టసభలు వచ్చాయి. అలా సమాజం నుంచి రాజకీయాలు విడిపోయాయి. మిగిలిన డొల్లను పౌరసమాజం అనవచ్చు. అది రాజకీయరహితమైనది.

ప్రస్తు త రాజకీయాల్లో విలువల సంక్షోభానికి పౌర సమాజంలో రాజకీయాల పట్ల వుండే ఏహ్య భావం, నిష్క్రియాపరత్వం ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీల్లో నిరంతరం వుండే స్వార్థపర మనుషులు మెసలేది పౌర సమాజం అని జర్మన్ తత్వవేత్త హేగెల్ భావించాడు. స్వలాభాపేక్షతో సంచరించే రాజకీయరహిత మానవుల సముదాయమైన పౌర సమాజాన్ని రద్దుచేసే దిశగా పని చేయాలని కారల్ మార్క్స్ భావించాడు.

పౌర సమాజం అన్నిటికంటే పవిత్రమైనదనే భావాన్ని నెలకొల్పడం అనేది చరిత్ర తెలియని వాళ్ళకు ఉత్తేజకరంగా వుండవచ్చేమో కానీ చరిత్ర చదువుకున్న వాళ్ళకు కాదు. 'ఐ హేట్ పాలిటిక్స్' అనే వాళ్ళు అన్నాలుగానూ, నీతివాక్య ప్రబోధకులుగానూ నిష్క్రియాపరులుగానూ దర్శనమివ్వవచ్చు గానీ, వాళ్ళ వల్ల అంతిమంగా దేశానికి జరిగేది గుండు సున్న (సామాన్యులకిచ్చే సంక్షేమ పథకాలను ఆడిపోసుకునేది కూడా వీళ్ళే).

ఈ అన్నాల పౌర సమాజంలో ఆమ్ ఆద్మీకి స్థానం లేదు. సామాన్యుల పోరాటాలు వీరికి పట్టవు. రైతులు, కూలీలు, కర్షకులు, కార్మికులు చేసే ఏ ఉద్యమం కూడా 'పౌర సమాజం' చేసే ఉద్యమంగా భావించబడదు. అన్నాలు ఈ ఉద్యమంలో మమేకం అవడం అటుంచి కనీసం సానుభూతి కూడా ఏనాడూ ప్రకటించిన పాపాన పోలేదు. వీళ్ళకి గత ఉద్యమ చరిత్ర శూన్యం.

దారుణ మారణకాండకు సంఘ్‌పరివార్ శక్తులు తెగబడిన సందర్భాల్లో ఈ అన్నాలు, వారి పౌర సమాజం ఎక్కడుంది? అని అరుంధతీరాయ్ వేసిన ప్రశ్నకు జవాబు లేదు. ఏనాడూ ఏ సామాజిక దురన్యాయాన్ని గురించి కూడా కాసింత గొంతెత్తకుండానే వృద్ధుడైపోయిన అన్నా హజారే దశాబ్దాల కుంభకర్ణ నిద్ర అనంతరం మేల్కొన్న భారత 'రిప్‌వాన్ వింకిల్' అని చెప్పొచ్చు.

కేజ్రీవాల్‌తో సహా పలువురు ముఖ్యులకు సంఘ్ పరివార్ శక్తులతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు వున్నాయన్నది బహిరంగ రహస్యమే. అన్నా ఉద్యమిస్తే ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందని ఆ సంస్థ బాధ్యులు గత మార్చిలోనే రాసిన లేఖను దిగ్విజయ్ సింగ్ గురువారం బయటపెట్టాడు. అన్నా, ఆరెస్సెస్ మధ్య సంబంధం ఇక ఎంత మాత్రం రహస్యం కానేకాదు. మతంపేరిట మూడువేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీని అన్నా పొగిడారు.

దానిపై తీవ్ర విమర్శలు రాగా నాలిక కరుచుకున్నారు. సంఘ్‌పరివార్‌తో అన్నాల సంబంధం బహిర్గతమైతేనే ఇరువురికీ లబ్ధి చేకూరుతుంది. కాబట్టి అన్నాలు ప్రత్యక్ష రాజకీయాలకు దిగజారి రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే ధ్యేయమని ప్రచారం చేస్తూ మతతత్వ వాదులను గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. అద్వానీ అవినీతి వ్యతిరేక రథయాత్రకు అనుగుణంగానే అన్నాలు పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నాను నిలబెట్టే దిశగా సంఘ్ పరివార్ కృషి చేస్తుందని వచ్చిన వార్తల్లో నిజం లేకపోలేదు.

రాజ్యాంగ సంస్థలపై ప్రజలలో అవిశ్వాసం రేకెత్తించడం అన్నాలు చేస్తున్న మరో పని. ఇటీవల కేజ్రీవాల్ ఒక ఇంగ్లీష్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక అడుగు ముందుకేసి పార్లమెంటు కంటే అన్నానే గొప్పవాడు అని వ్యాఖ్యానించాడు.

పార్లమెంటు కంటే పౌరుడే గొప్ప అని రాజ్యాంగం చెప్పింది కాబట్టి తానన్నది సరైనదేనని సమర్థించుకోజూచాడు. కానీ రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం పార్లమెంటు కంటే పౌరుడు గొప్ప అనేది ఆయన చెప్పలేక పోయాడు. ఇప్పటివరకూ 'పౌరుడు వర్సెస్ పార్లమెంటు' అనే చర్చ రాజ్యాంగ ప్రవచనంలోకి రాలేదు. హెచ్.ఎమ్.సీర్వాయ్, గ్రాన్‌విల్లీ ఆస్టిన్ లాంటి రాజ్యాంగ కోవిదులు రాసిన గ్రంథరాజాల్లో గానీ, వి.ఆర్.కృష్ణయ్యర్, కోకా సుబ్బారావు, భగవతి, చంద్రచూడ్, హెచ్.ఆర్.ఖన్నా లాంటి ఉద్దండులైన న్యాయమూర్తుల తీర్పుల్లో గాని కన్పించని చర్చను కేజ్రీవాల్ లేవనెత్తారు. పౌరులకు పార్లమెంటుకు మధ్య లేనిపోని అగాధం సృష్టించి, ఒక తప్పుడు చర్చను రేకెత్తించి రాజ్యాంగాన్ని, రాజ్యంగ సంస్థలను బలహీనపరిచే దురుద్దేశపూరిత ప్రయత్నంలో అన్నాలు నిమగ్నమయ్యారు.

రాజ్యాంగం ప్రకారం పౌరులకు విశేష ప్రాధాన్యం ఉంది. పౌరసత్వ ప్రాతిపదికనే ఓటు హక్కుతో పలు హక్కులు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అలాంటి పౌరుల రాజకీయ వ్యక్తీకరణగా ఏర్పరచబడిన పార్లమెంటును కించపరచడం అంబేద్కర్ విరచిత రాజ్యాంగానికి ఎసరు పెట్టే ప్రయత్నం తప్ప మరోటి కాదు. సంఘ్ పరివార్ శక్తులు అధికారంలో ఉన్న కాలంలో రాజ్యాంగాన్ని తిరిగిరాయాలనే విఫలయత్నం చేయడాన్ని ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే శక్తుల నుంచి రాజ్యాంగ సంస్థలకు వస్తున్న ముప్పు గురించి ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం వుంది.

దేశంలో అవినీతి బాగా వేళ్ళూనిందనటంలో సందేహం లేదు. ప్రపంచీకరణతో పాటు ఈ అవినీతి మన దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ కొత్తపుంతలు తొక్కుతున్నది. దాన్ని కట్టడి చేయాల్సిందే, శిక్షించాల్సిందే. అందుకోసం చట్టపరమైన మార్గాలను అన్వేషించాల్సిందే. ప్రపంచీకరణ పేరిట లబ్ధి పొందిన వర్గాల 'పౌర సమాజం' అవినీతిని అంతమొందించ లేదనడంలో అతిశయోక్తి లేదు.

తిలాపాపం తలాపిడికెడు అన్న చందంగా ఇప్పటివరకూ దేశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అధికారంలో వున్న ప్రతిపార్టీ ఈ అవినీతి వట వృక్ష ఛాయలో సేద తీరినదే. కానీ అన్నాలు పాపమంతా కేవలం ప్రస్తుత పాలకులదే అన్నట్టు చిత్రీకరించి గాలి జనార్ధన రెడ్డి లాంటి వారిని తయారుచేసిన సంఘ్‌పరివార్‌కు లబ్ధి చేకూర్చే ప్రయత్నంలో వున్నారు. మసీదులు కూలగొట్టే, మత కల్లోలాలు సృష్టించే, ప్రజాస్వామ్య రాజకీయాలను ద్వేషించే, 'ఆమ్ ఆద్మీ'ని ఈసడించుకునే, స్త్రీలను అణగదొక్కే, దళితులను వివక్షకు గురిచేసే ఈ శక్తుల గురించి ప్రజలు బాగా అవగాహన చేసుకోవాల్సి వుంది.

అన్నా ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత మోతాదుకు మించినదని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. వాటిని సైతం పక్కన బెట్టి నేరుగా అన్నాలతో చర్చలు జరిపి పలు డిమాండ్లు అంగీకరించినా వారు సంతృప్తి చెందకపోవడానికి కారణం సంఘ్ పరివార్‌కు లాభం చేకూర్చాలన్నదే. లేకపోతే అన్నాలు అమ్మకానికో (డిజిన్వెస్ట్‌మెంట్) మంత్రిని కేబినెట్‌లో వుంచుకొని బాల్కో లాంటి లాభసాటి ప్రభుత్వ సంస్థలను చౌకగా అమ్మి సొమ్ముచేసుకున్న వారిని పల్లెత్తు మాట ఎందుకనరు? ఒక పక్క పార్లమెంటును ప్రశ్నిస్తూ మరో పక్క మోడీని ఎలా సమర్థిస్తారు?

ప్రస్తుత రాజకీయ పార్టీలలో గిరిజన, దళిత, బలహీన వర్గాలకు, మైనారిటీలకు మహిళలకు లబ్ధిచేకూర్చే పలు పథకాలతో సామాన్యుల ఆదరణ చూరగొన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిసలైన సెక్యులరిస్టు పార్టీ. అలాంటి పార్టీని దెబ్బ తీసిన పక్షంలో లబ్ధి పొందేవి అన్నాల వర్గ స్వభావం కలిగిన వర్గాలే, వారి పార్టీలే, సెక్యులరిజాన్ని, ఆమ్ ఆద్మీని దెబ్బతీసే సంఘ్ పరివార్ శక్తులే.

అంబేద్కర్ అన్నట్టు 'మెజారిటీలు రెండురకాలు: (అ) మతపరమైన మెజారిటీ; (ఆ) రాజకీయ పరమైన మెజారిటీ. రెండవదాన్ని మార్చవచ్చు. కానీ మతపరమైన మెజారిటీ అలా కాదు. అది పుట్టుకతో ఏర్పడేది. రాజకీయ పార్టీల్లో ఎవరికైనా ప్రవేశం ఉంటుంది. కానీ మతపరమైన మెజారిటీ విషయంలో తలుపులు మూసి వుంటాయి. దాని రాజకీయాలు దానిలో పుట్టిన వాళ్ళే నిర్ణయిస్తారు'. రాజకీయ మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని తెగనాడి మతపరమైన మెజారిటీ రాజకీయాల దిశగా దేశాన్ని నడిపించే మహాకుట్ర అన్నాల ఉద్యమంలో దాగివుంది. అన్నా హజారే, బాబా రాందేవ్, మోడీ, అద్వానీ చెలిమికి అదే ప్రాతిపదిక.
- డొక్కా మాణిక్య వరప్రసాద్
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు 

No comments:

Post a Comment