Saturday, October 1, 2011

బహాజన శాస్త్రం (స్వయంపాలనతోనే గిరిజనాభివృద్ధి) By -గుమ్మడి లక్ష్మినారాయణ Namasethe Telangana 02/10/2011

బహాజన శాస్త్రం (స్వయంపాలనతోనే గిరిజనాభివృద్ధి)

‘మట్టిలో పుట్టిన మొక్క వేళ్లు లోతుగా పాతుకుపోయి ఉన్న వనమూలికల వంటివారే ఆదివాసీల’ని గాంధీజీ వర్ణించారు. రాష్ట్ర విభజన కన్నా.. తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఆదివాసీలు స్వయంపాలన వైపే మక్కువ చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఆదివాసీలకు స్వయం పరిపాలనాధికారాలు కల్పించే దిశగా గవర్నర్ చొరవ చూపాల్సి ఉంది. రాష్ట్రంలోని 30 తెగల ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన భూమి హక్కులు, ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అవి అమలు జరగడం లేదు. తెలంగాణ ప్రాంతంలోని ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని అమలు చేయాలి.

ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పూర్వం నుంచి పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో కాకతీయులపై సమ్మక్క, సారలమ్మ పోరాటం నుంచి నైజాం రజాకార్ల కాలం లో (1920-1947 ), రాంజీగోండు (1836-1860 ), కొమురం భీం జోడేన్ ఘాట్ పోరాటం (1930-1940 ) దాకా ‘నీరు భూమి అడవి ఆదివాసీలకే చెందాల’ని పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమం రెండో స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించినా, ఆదివాసీలకు స్వయంపాలనతో కూడిన రాష్ట్రమే తక్షణావసరం. ఎందుకంటే 60 ఏళ్ల ‘స్వర్ణ’ భారతంలోనూ ఆదివాసీలు అభివృద్ధి ఫలాలు పొందలేదు. నేటికీ నాగరికతకు దూరం గా అటవీ ఏజెన్సీ గ్రామాల్లోనే దుర్భరజీవనం గడుపుతున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 17,59,554 మంది గిరిజనులున్నారు. వీరిలో ఏజెన్సీ గిరిజనులు (16 తెగలు ) 6,23,670 మంది ఉన్నారు. కనీస సౌకర్యాలు లేక కరువుకాటకాలకు తోడు పౌష్టికాహార లోపం, సీజనల్ వ్యాధులతో ప్రతిఏటా వేలాది మంది ఆదివాసులు చనిపోతున్నారు.

గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ చేపట్టిన పథకాలు దళారీల వ్యవస్థ, అవినీతి అధికారుల వల్ల ఆదివాసులకు అందడం లేదు. ఈ కారణంగానే కొన్ని తెగల భాష, సంస్కృతి, ఆచారాలు అంతరిస్తున్నాయి. ఆదివాసీలు జన్మహక్కుగా భావించే 5వ షెడ్యూల్డ్‌లో రిజర్వేషన్లు, చట్టాలు, షెడ్యూల్డ్ ప్రాంత పరిపాలన, నియంవూతణ వంటి హక్కులు క్రమంగా కోల్పోతున్నారు. తెలంగాణలోని గిరిజనులు నేటికీ తీవ్రమైన అణచివేతకు గురౌతున్నారు. ఆదివాసీలు నష్టపోయిన వనరుల్లో భూమి, అటవీ సంపద, ఉద్యోగాలు ప్రధానమైనవి. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఆదివాసులకు శాపం గా మారింది. తమ పూర్వీకుల భూములను 1940 నాటికే గోండు ఆదివాసీలు కోల్పోయినట్లుగా హైమన్ డార్ఫ్ అధ్యయనం తెలిపింది. కోనేరు రంగారావు సిఫార్సులను బట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల వలస, ప్రైవేటు మైనింగ్ కంపెనీలు పెరగడంతో 48 శాతం భూమి అన్యాక్షికాంతం అయ్యింది.

గిర్‌గ్లానీ నివేదిక ప్రకారం కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి గిరిజనేతరుల ఆధీనంలో ఉంది. నైజాం ప్రభుత్వ విధానం వల్ల గిరిజనుల భూమి అన్యాక్షికాంతం తెలంగాణలోనే అధికంగా జరిగింది. భూమి పరాయీకరణ వరంగల్ జిల్లాలో 72 శాతం, ఖమ్మంలో 53 శాతం, ఆదిలాబాద్‌లో 61 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 3 శాతం ఉన్నట్లు గిరిజన సంక్షేమ శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. ఏజెన్సీ భూముల రక్షణకు భూ బదలాయింపు నిషేధ చట్టం (1/59, 1/70) ఉన్నా అమలుకు నోచుకోలేదు.
ఇతర రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ఉన్న లంబాడాలను మన రాష్ట్రంలోని ఎస్టీల్లో కలిపారు. దీంతో 30 ఆదివాసీ గిరిజన తెగల సంక్షేమాన్ని లంబాడీలే కాజేస్తున్నారు. ఆరు శాతం రిజర్వేషన్లలో సింహభాగాన్ని లంబాడీలే అనుభవిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఎస్టీల ఉమ్మడి రిజర్వేషన్లలోనూ తెలంగాణలోని ఆదివాసీ గిరిజనులే ఎక్కువగా అన్యాయానికి గురైనారు.1986లో తెలంగాణ ప్రాంత ఉద్యోగాల పరిరక్షణకు 610 జీవో అమలుకోసం సభాసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల విద్య, ఉద్యోగ రంగానికి సంబంధించిన జీవో నెం.3 ను అమలు చేయడంలో న్యాయ స్థానాల తీర్పును సైతం విస్మరించారు. అలాగే పంచాయితీరాజ్, షెడ్యూల్డ్ పరిపాలనాధికారాలను నిర్ధేశించే ‘ఫీసా’ చట్టం (1996, 2006 )ను, గ్రామ కమిటీ తీర్మానాలను పాలకులు విస్మరిస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల్లో 275 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల్లో తొమ్మిది గ్రామాలకు చెందిన 30 వేల ఎకరాల భూమిని ఎలిఫెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇంకా దేవాదుల, కంతనపల్లి, తదితర ప్రాజెక్టులు ఆదివాసులను నిర్వాసితులుగా చేస్తూ గిరిజనేతర ప్రాంతాలకు ఉపయోగపడుతున్నాయి. దీనిని పాలకులు అభివృద్ధిగా పేర్కొంటున్నారు.

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి మూలమైన అక్షరాస్యత ఏజెన్సీ ప్రాంతాల్లో మెరుగుపడలేదు. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 60 శాతం ఉంటే.. గిరిజనుల్లో 37 శాతం మాత్రమే. ఆదివాసులకు ఆలవాలంగా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గిరిజన ప్రాంతాన్నంతా కలిపి మన్యసీమ రాష్ట్రం, లేదా గోండ్వానా, దండకారణ్య రాష్ట్రం ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. 6.6 శాతం ఉన్న గిరిజనులకు ప్రభుత్వం కేవలం 1095 కోట్లు కేటాయించింది. గిరిజన సాధికార త ప్రకటించి మరో వెయ్యి కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు విస్తరించిన బొగ్గు గనులు, సిమెంట్ ఖనిజం అడవి ఆధారిత ముడి సరుకు కొల్లగొట్టబడుతున్నది. కొత్తగూడెం, ఇల్లందు, బయ్యారం, పాల్వంచ, మణుగూర్, భద్రాచలం, సిర్పూర్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో గిరిజనులకు ఉపాధి దొరకలేదు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులు నివసించే ప్రాంతాలు-ఆంవూధవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యవూపదేశ్, ఒడిషా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక గిరిజన చట్టాలు, రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 6వ షెడ్యూల్‌లో త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, అసోం, మిజోరాం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అక్కడ ప్య్రతేక గిరిజన జిల్లాలు ఏర్పడి స్వయం పాలన కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలపై ఉందని ఐక్య రాజ్యసమితి సర్వవూపతినిధి సభ 1993లో తీర్మానించింది. అయినా పాలనా పరమైన లోపాలతో గిరిజనులు వెనుకబాటుకు, వనరుల పరాయీకరణకు బలిఅవుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో.. ఇప్పటికీ దుర్భర జీవితం అనుభవిస్తున్న ఆదివాసీ హక్కుల ఎజెండాను తెలంగాణ ఏర్పాటులో తెరమీదికి రానీయడం లేదు. దీంతో.. ఇప్పుడు రాష్టంలోని ఆదివాసులు స్వయం పాలనతో కూడిన రాష్ట్రాన్ని కోరుతున్నారు.

అందుకుగాను తెలంగాణ జేఏసీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) అనుబంధ సంఘాలు ఆదివాసీ జేఏసీలను ఏర్పాటు చేసింది. స్వయంపాలన కొరకు పోరాడుతోంది. దీనికి ఉత్తరాంధ్ర ఆదివాసీలు కూడా మద్దతు పలుకుతూ.. తమకు స్వయం పాలన డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయదలిచిన అన్ని రకాల అభివృద్ధి పథకాలను, ‘భూరియా కమిటీ’ సిఫార్స్‌లను అమలు చేయాలి. అలాగే గిరిజన ప్రాంతాలకు విశిష్ట అధికారాలతో కూడిన పాలనా ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. గిరిజనులకు ‘స్వయం సాధికారత’ కల్పించాలి.
-గుమ్మడి లక్ష్మినారాయణ

No comments:

Post a Comment