Sunday, October 2, 2011

హమ్‌నే దుష్మన్ కొ పహ్‌చాన్ లియే హై By -వరవరరావు Namasethe Telangana 03/10/2011


10/2/2011 11:06:26 PM
హమ్‌నే దుష్మన్ కొ పహ్‌చాన్ లియే హై
సకల జనుల సమ్మె శత్రువును పోల్చుకునే దిశగా సాగుతున్నది. శత్రువు కూడ సకల జనుల సమ్మె వెనుక సమీకరింపబడుతున్న ప్రజల్ని పోల్చుకుంటున్నాడు. నవంబర్ 29, 2009న క్యాంపస్‌లలో, ముఖ్యంగా ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థులు పోల్చుకున్న శత్రు వు పొంచి ఉండి, ఉద్యమం పోరాటరూపం ఎంచుకున్నప్పుడల్లా విరుచుకపడుతున్నాడు. శత్రువు యూనిఫామ్ రూపంలో కనిపిస్తాడు. ఇనుపబూట్లు, బాష్పవాయుగోళాలు, ఇనుపకంచెలు, లాఠీలు, మూడువందల మంది న్యాయవాదుల ఊరేగింపుకు ఏడువందల ఖాకీ మూకల పహరాగా కనిపిస్తాడు. పదమూడేళ్ల మాణికేశ్వరనగర్ బాలుణ్ని పదిమంది చిప్పటోపీలు లాఠీలతో బాదడంగా కనిపిస్తాడు.

రామన్నగూడెంలో నలుగురు అమ్మాయిల్ని నలుదిశల్నుంచి చుట్టుముట్టి నినాదాల హోరు ముఖ్యమంత్రి చెవి సోకకుండా తోసుకపోవడంగా కనిపిస్తాడు. చీమలవలె అసెంబ్లీగేట్లు ఎగబాకుతున్న విద్యార్థులను వేయిపడగల పాములవలె కబళించే విషసర్పంవలె కనిపిస్తాడు. బొగ్గుగనుల్లో చెదురుమదురుగా ఉన్న సింగరేణి కార్మికులను కూడగట్టడానికి వెళ్లిన పిట్టల రవీందర్‌ను ‘పిట్టపిల్ల’ అనే భ్రమతో దాడిచేసే మాఫియావలె కనిపిస్తాడు. నిజాం కాలేజీ హాస్టల్‌లో దూరి బాత్‌రూంలో స్నానాలు చేస్తున్న, గదుల్లో చదువుకుంటున్న విద్యార్థుల్ని చితకబాదడంగా కనిపిస్తాడు. యాకూబ్‌డ్డిని ఎన్‌కౌంటర్ చేయడమొక్కటే తక్కువయిన డీఎస్పీ వెంకటనర్సయ్య వలె కనిపిస్తాడు. స్వామిగౌడ్ మర్మావయవాలను నలిపేసి హతం చేయడానికి కుట్రచేసే స్టీఫెన్ రవీంద్ర వలె కనిపిస్తాడు. అతడు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావ్‌కు చిద్విలాసంగా బేడీలు వేయగలడు.

అత డు అకున్ సబర్వాల్ వలె నిజాం కాలేజీ విద్యార్థులను కొట్టిన బలంతో సచివాలయం లో దూరి డ్రైవర్లను అరెస్టు చేయగలడు. టీఎన్జీవోలను అరెస్టుచేయగలడు.కాని ‘ఆ ముగ్గురు డ్రైవర్లను విడుదల చేసేదాకా మేమూ ఇక్కడినుంచి కదలమ’ని ఒక్కటైన సచివాలయ ఉద్యోగుల చిగురిస్తున్న సంఘీభావాన్ని మాత్రం అధికారబలంతో కన్నుగానలేడు. వీళ్లంతా ఎవరు? ఎవరిదన్ను చూసుకొని ఇంత విస్తృతమైన ప్రజాఉద్యమం మీద ఉక్కుపాదం మోపగలుగుతున్నారు? ఇది ఖాకీల బలమేనా?
ఆ ప్రశ్నకు జవాబు ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణను అగ్నిగుండంగా మార్చడానికైనా సిద్ధమైన కిరణ్‌కుమార్‌డ్డిని అడగాలి. ల్యాంకోహిల్స్‌ను, ‘లిబ్బి’ మూటలను కాపాడడానికి తెలంగాణ బతుకుపోరు బతుకమ్మ సంస్కృతిని వెక్కిరిస్తున్న లగడపాటిని అడగాలి.

వీళ్ల మౌనదేవత సోనియాగాంధీని అడగాలి. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో చిక్కుకొని కూడ గ్రీన్‌హంట్ ఆపరేషన్‌లో భాగంగా తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచివేస్తున్నందుకే పదవుల్లో కొనసాగుతున్న మన్‌మోహన్, చిదంబరంలను అడగాలి.

కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు 2009 నవంబర్ నుంచి కూడ నిరాహారదీక్షలను, పాదయావూతలను, ధూంధాంలను, లక్షలాది ప్రజల బహిరంగసభలను, వైవిధ్యంతో కూడిన సృజనాత్మక శాంతియుత పోరాటరూపాలను హింసాత్మకంగా మార్చడానికి చేయవలసినన్ని హింసాత్మక ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవస్థీకృత విధ్వంసాన్ని,హింసను అమలుచేస్తున్నాయి. సాంస్కృతిక దాడులు చేస్తున్నాయి. ఆర్థిక దిగ్బంధాలను, నిర్బంధాలను కల్పిస్తున్నాయి. వీటన్నింటి కీ తెలంగాణ అధికార కాంగ్రెస్ పచ్చి పదవీలాలసతను, ప్రతిపక్ష టిడిపి నాయకత్వ కపటరాజనీతిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి.
2009 నవంబర్‌లో విద్యార్థులు వెలిగించిన కాగడాను కొడిగట్టకుండా చమురుపోసి కాపాడుతూ ఉంటే ఇవ్వాళ ఉద్యోగులు అందుకున్నారు.

ముఖ్యంగా సెప్టెంబర్ 13 నుంచి తెలంగాణ ఉద్యోగుల సమ్మె, సింగరేణి కార్మికుల సమ్మె, క్రమంగా ఆర్‌టిసి కార్మికుల సమ్మెగా విస్తరించి సంఘటిత, అసంఘటిత కార్మికరంగాలన్నీ ఇవ్వాళ సమ్మెకు దిగాయి. రెండువారాలు గడిచి ప్రభుత్వం ఎన్ని విభజించి పాలించే ఎత్తుగడలు వేసినా, ఎంత నిర్బంధం అమలుచేసినా, ఎన్ని తాయిలాలు చూపినా, ఎంత బెదిరించినా, ‘ఎస్మా’లకు కూడా వెరవకుం డా ఉద్యోగులు, కార్మికులు రెట్టింపు పోరాటశక్తితో ముందుకు వస్తున్నారు.

న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ఉన్న బలమెటువంటిదంటే.. సెప్టెంబర్ 28న సచివాలయంలోకి మంత్రులను తీసుకపోతున్న ప్రభుత్వ వాహనాల డ్రైవర్లను సమ్మెలో ఉన్న సచివాలయ ఉద్యోగులు నివారించి ‘మంవూతులకైతే సిగ్గులేదేమో కానీ మీరు డ్రైవర్లుగా టీఎన్జీవోలు గదా, మీరు సమ్మెలోకి రండి’ అని ఆహ్వానించారు. వాళ్లు స్వచ్ఛందంగా వచ్చారు. డ్రైవర్లు కదా అనే చిన్న చూపుతో వాళ్లను అకున్ సబర్వాల్ అరెస్టు చేశాడు. వాళ్లను విడుదల చేయించుకోవడానికి సమ్మెలో ఉన్న సచివాలయ తెలంగాణ ఉద్యోగులు అడ్డగించి అరెస్టయ్యారు. నిన్నటిదాకా సచివాలయం ఉద్యోగాలకు వెళ్తున్న తెలంగాణేతర ఉద్యోగులు, బహుశా వనస్థలిపురంనుంచి పోలీసుభవూదతతో వస్తున్న ఉద్యోగులు తమ కళ్లముందరి ఈ అన్యాయాన్ని చూసి రెండుగంటలలో వాళ్లను విడుదల చేయాలనే డిమాండుతో వాళ్లూ సమ్మెకు దిగారు. న్యాయమైన డిమాండు, ప్రజాస్వామికమైన డిమాండు పోరాడేవాళ్ల సంఖ్యాబలాన్ని, నైతికబలాన్ని పెంచుతుంది. అణచివేసే శత్రువును ఏకాకిని చేస్తుంది.

వెంకటనర్సయ్యలు, అకున్‌సబర్వాల్, స్టీఫెన్వ్రీంవూద, ప్రవీణ్‌కుమార్, రామాంజనేయులు, అరవిందరావు, దినేశ్‌డ్డిలు (వీళ్లందరూ నిర్విచక్షగా మనం పిలుచుకునే సీమాంవూధవాళ్లేం కాదు. వీళ్లలో తెలంగాణ వాళ్లూ ఉన్నారు. దినేశ్‌డ్డి డిజిపి అయి రాజమండ్రి కేంద్రం గా ఒరిస్సా ఛత్తీస్‌గఢ్ అడవులను మానవరహిత విమానాలతో గాలించి మావోయిస్టులను ఏరిపారేస్తామంటే ఏ రాజకీయపార్టీ, మానవుడూ మాట్లాడలేదు. ఈ దినేశ్‌డ్డే 1984లో రాజమంవూడిలో మహిళా కార్యకర్తలను కూడా అరెస్టుచేసి రైతుకూలీసంఘం సభలు భగ్నం చేశాడు.) నలభైనాలుగేళ్లుగా తెలంగాణ మీద, భూమికోసం పోరాడిన దళితులు, వ్యవసాయకూలీలు,సింగరేణి కార్మికులు మీద, గోదావరిలోయ ఆదివాసుల మీద,యూనివర్సిటీల్లో విప్లవ, దళిత, బడుగువర్గాల విద్యార్థుల మీద, పాతబస్తీలో ముస్లిం యువకుల మీద దాడు లు చేసి, చిత్రహింసలు చేసి, ఎన్‌కౌంటర్లు చేస్తుంటే మనమంతా వాళ్లు నక్సలైట్లు కావచ్చుననుకున్నాం. మిలిటెంట్లు కావచ్చుననుకున్నాం. టెర్రరిస్టులు కావచ్చుననుకున్నాం.

మనం చట్టాన్ని గౌరవించే, చట్టప్రకారం నడుచుకునే బుద్ధిమంతులమైన పౌరులంగదా! మన తెరు రారనుకున్నాం.వచ్చినా వాళ్లగురించి మాట్లాడేవాళ్ల గురించి వస్తారు! గానీ మనగురించి రారనుకున్నాం. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చాల చట్టబద్ధంగా అడిగాం. శాంతియుతంగా పోరాడుతున్నాం. సహాయనిరాకర ణే అన్నాం తప్ప శాసనోల్లంఘన కూడ అనలేదు. విముక్తికోసం సాయుధపోరాటం చెప్పే విప్లవపార్టీలు కూడ తెలంగాణకోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని ప్రజాస్వామిక పోరాటాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాయి. దూరంగా చూసేవాళ్లు అపోహపడుతున్నట్లుగా మావోయిస్టుపార్టీ పిడుక్కూ బియ్యానికీ ఒకేమంత్రం చెప్పడంలేదు. పిడుక్కూ బియ్యానికీ ప్రభు త్వం ఒకే జవాబు చెప్తున్నది. అణచివేత. మంత్రిని అరెస్టుచేసి, ఎమ్మెల్యేలకు బేడీలు వేసి, ఎన్జీవోసంఘం నాయకుణ్ని ‘బిలో ది బెల్ట్’ చిత్రహింసలు పెట్టి లగడపాటిని మాత్రం ఆయనకు పెట్రోల్‌ఖర్చు కూడ కాకుండా క్రేన్ ద్వారా ఆయన కార్లోనే ఆయన ఇంట్లో దిగబెట్టి ప్రభుత్వం తాను ఏ పక్షమో చెప్పుకున్నది.

కనుక మనం శత్రువును ప్రభుత్వంగా పోల్చుకుంటున్నాం.అయితే ఇవ్వాలిటి ప్రభుత్వం1969-72ల నాటి ప్రభుత్వం కాదు. ఆనాడు బ్రహ్మానందడ్డి చేసిన కుట్రలూ కుహకాలన్నీ ఇవ్వాళ కిరణ్‌కుమార్‌డ్డి చేస్తున్నాడు. కానీ ఆనాడు అవి కేవలం భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తుల కోసం. ఇవ్వాళ వాటి విశ్వరూపమైన కార్పొరేట్ కంపెనీల కోసం. ఖాకీల వెనుక ప్రభుత్వాన్ని పోల్చుకున్నట్లే, ఇవ్వాళ మన శత్రువును కార్పొరేట్ సంస్థల్లో పోల్చుకోవాల్సి ఉన్నది. మనం పోల్చుకోలేకపోతున్నామేమోనన్న దే లగడపాటి ఆక్రోశం. మనమింకా పోల్చుకోలేదేమోననే నిమ్మకు నీత్తినట్లున్నారు కావూరి, రాయపాటిలు.ల్యాంకోహిల్స్ దగ్గరో, ఎంఆర్ ప్రాపర్టీస్ దగ్గరో అరుణోదయ విమల చేసే ప్రతిఘటన చాలదు. వనస్థలిపురంలో కోస్తా బస్ యజమానులు చవిచూసిన ఆగ్రహం చాలదు. జెసి దివాకర్‌డ్డి, టిజి వెంక మాట్లాడేది అందమైన రాయలసీమ తెలుగుభాష కాదు, కార్పోరేటు బస్సుల భాష.

ప్రైవేట్ పరిక్షిశమల భాష.సీమాంవూధభాష లేదా ఆంధ్రతెలంగాణ భాషల సంఘర్షణ కాదిది. ఇది పెట్టుబడి, శ్రమల సంఘర్షణ భాష. మనమంతా ఒక్కసారి సింగరేణి బొగ్గు బావుల మీదికి పోతే సంఘర్షణ అర్థమవుతుంది. తమ రక్తాన్ని స్వేదంగా మార్చి నల్ల వవూజాలను విద్యుత్తుగా మార్చి అభివృ ద్ధి వెలుగుకింద నీడవలె (విద్యు త్తు ఉత్పత్తి చేసేవాళ్లకు విద్యుత్తుకోత కడుపుకోత) పోరాడుతున్న కార్మికులను చూస్తే అర్థమవుతుంది. బొగ్గుబావుల గుండెల నుంచి ఓపెన్‌కాస్ట్‌ల దోపిడీని ఎదుర్కొంటున్న ఆ శ్మశానంలోని ప్రళయరువూదుల భాష అర్థమవుతుంది. పోరాడి సాధించుకున్న భూములు సెజ్‌లలో, రియల్ ఎస్టేట్‌లలో పోగొట్టుకొని దూపకోసం గోదావరిని పోలవరం దగ్గర అడ్డుకుంటున్న ఆదివాసులనడిగితే తెలుస్తుంది.

కొమురంభీం నుంచి, ఇంద్ర నుంచి ఎందుకొరకు పోరాడుతున్నారు వాళ్లు. తమ ఊళ్లో తమ రాజ్యం కోసం. ఇవ్వాళ భద్రాచలంలో, ఏటూరునాగారంలో, ఆదిలాబాదులో అడవంతా గ్రీన్‌హం ట్ ఆపరేషన్ నిర్వాసిత ఆదివాసులు. వాళ్ల గోడు పట్టించుకుంటే మనభాష ఎంత సుసంపన్నమవుతుంది. వాళ్ల పోరాటాన్ని స్వీకరిస్తే మన పోరాటానికి ఎన్ని ఏనుగుల బలం వస్తుం ది. నల్లమలలో నెత్తురు పారించినపుడు నక్సలైట్ల బెడద పోయిందనుకున్నవాళ్లు, మావోయిస్టుల ఎత్తుగడల గురించి ఎద్దేవా చేసినవాళ్లు, చెంచుజాతిని నిర్మూలించే డీబీర్ కంపెనీల వజ్రాల వేట గురించి, గాలి, జగన్‌ల బళ్లారి నుంచి బయ్యారం దాకా గనుల దోపిడీ గురించి ఇవ్వాళ మాట్లాడి ఏం ప్రయోజనం? సర్కారీ ‘సారా’ మీద పాట రాస్తూ గద్దర్ ‘మమ్మేలే రాజ్యానికి మారుపేరువే నీవు’ అన్నాడు. ఇవ్వాళ మనను ై‘వెన్ అండ్ మైన్ ’ పరిపాలిస్తున్నాయి.

ఇవ్వాలిటి రాజ్యం ప్రాణం ఏడు సమువూదాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొర్ర లో ఉన్నది. ఇక్కడ చిలుకపలుకుల, ఉక్కుగోళ్ల ఎన్నికల పార్టీలను నిలదీద్దాం. అక్కడి నుంచి ఆడించేవాని చేతిలోని కీలుబొమ్మలా? మన ఓటుకు పుట్టిన బిడ్డలా? తేల్చుకొమ్మందాం. మళ్లా ఒకసారి చెప్దాం. రాజీనామాల డ్రామాలు కాదు, సకలజనుల సమ్మె ప్రభుత్వాలకు, అధికారాలకు, పెట్టుబడికి ముకుతాడు వేసే సమ్మె కాబోతున్నది. సర్వజనుల సమ్మె కాబోతున్నది. రాజీనామాలు చేసి, అధికార ఆవాసాలు వదిలేసి, గన్‌మన్‌లను అప్పగించి (తెలంగాణ పోలీసు ఉద్యోగులు కూడ వెంటనే బెంగాల్‌లో పోలీసుల, ఉద్యోగుల వలె సమ్మెలో దిగేరోజు రాబోతున్నది) జనంలోకి రమ్మందాం. ఇప్పుడు జనం ప్రభంజనం అయ్యారు. ఈ ప్రభ కొత్తకొండ వీరన్న ప్రభ. దీనిని నమ్ముకున్న వాళ్లందరినీ కాపాడుతుంది. ఇది నియంతృత్వాన్ని ప్రశ్నించే ప్రజాస్వామ్య ప్రభంజనం.

ఇపుడేమిటి రాయల వాచకాల వలె రాయల తెలంగాణ ముచ్చట్లు? మనమిప్పుడు హైదరాబాదు గుండెకాయ అయిన తెలంగాణ గురించి మాట్లాడుదాం. కేంద్రం నేల మీదికి దిగి రావాలి. ఢిల్లీ పల్లెదారి పట్టాలి. రాష్ర్టం సాధించుకునే దాకా ఇంక సకలజనుల సమ్మెయే. ఇందులో ‘కల’ ఉన్నదనుకుంటే ఇది నిజం కావాలనుకుంటే ఇక సబ్బండరాశి సమ్మె
-వరవరరావు

No comments:

Post a Comment