Monday, October 31, 2011

(హజారే నిరశన )అసంపూర్ణ ఉద్యమం By ఉణుదుర్తి సుధాకర్ Andhra Jyothi 1/11/2011


అసంపూర్ణ ఉద్యమం

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అన్నా హజారే నిరశన దీక్ష పాక్షిక విజయంగా ముగిసిందని ఇప్పుడందరూ అంగీకరిస్తున్నారు. ఈ ఊహించని విజయం వెనక ఉన్న శక్తులేమిటి? ఈ ఉద్యమం, రాబోయే కాలంలో రానున్న ఏయే మార్పుల్ని సూచిస్తోంది? హజారే ఉద్యమంలో నాలుగు ప్రధానాంశాలు స్పష్టంగా కన్పిస్తాయి. మొదటిది- ఇదొక స్వయం ప్రజ్వలితమైన స్పాంటేనియస్ ఉద్యమం. అతి తక్కువ కాలంలోనే ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. నిప్పుకణం కోసం ఎదురుచూసిన ఎండుటాకుల కుప్ప మాదిరిగా దేశం యావత్తూ ఒక్కసారి భగ్గుమంది. రాంలీలా మైదానం ఒక యాత్రా స్థలంగా మారింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే ఉత్సాహం వెల్లివిరిసింది.

అన్ని వర్గాలూ, వయో సమూహాలూ, ఆడా మగా, చిన్నా చితకా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందరి ముఖాల్లోనూ ఒక ఆశాకిరణం తాండవించింది. అయితే ఈ ఉద్యమం ప్రధానంగా -ఆర్థిక సంస్కరణల తరవాత ఉద్భవించిన కొత్త మధ్య తరగతి నడిపించిన మొదటి ఆందోళన. అందుకే కొత్తగా సచేతన మవుతూన్న ఈ సామాజిక వర్గాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడం అవసరం. భారతదేశపు స్వాతంత్రోద్యమంతో సహా చరిత్రలోని అన్ని ఉద్యమాలకూ, విప్లవాలకూ పునాది ఏర్పరిచింది మధ్యతరగతి ప్రతినిధులే. వామపక్షీయులు, పెట్టీ బూర్జువా అనే తిట్టు మాటని ఎంత తరచుగా ప్రయోగించినప్పటికీ ఇది వాస్తవం.

గతంలోనూ, ఇప్పుడూ కూడా ఇందుకు రెండే కారణాలు కనిపిస్తున్నాయి. అవి-దోపిడీనీ, అన్యాయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగల వెసులుబాటు ముందుగా మధ్యతరగతి వారికి ఏర్పడడమూ, ప్రజల పక్షాన నిలబడాలని వాళ్ళు నిర్ణయించుకోవడమూను. ఇప్పటి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కూడా ఇదే వర్తిస్తుంది. భారతదేశపు మధ్యతరగతి వర్గీయుల సంఖ్య పది కోట్లా, పాతికకోట్లా అనే చర్చను పక్కన పెడితే ఆర్థిక సంస్కరణల తరువాత ఈ వర్గం గణనీయంగా పెరిగిపోయిందనీ, ఈ వర్గంలో కేవలం అగ్రవర్ణాలే కాక, ఇతర కులాల ప్రాతినిధ్యం (అట్టడుగు కులాల నుంచి మధ్యతరగతిలోకి అడుగుపెట్టిన వారితో సహా) గుణాత్మకంగా మారిపోయిందనీ చెప్పుకోవాలి. ఒక అంచనా ప్రకారం వర్తమాన భారతదేశపు మధ్యతరగతి జనాభా మొత్తం అమెరికా జనాభాకు అతిచేరువలో ఉన్నది. సంఖ్యా పరంగా అందుకే అది ఇటు దేశీయ పరిశ్రమలకూ, వాణిజ్యానికే కాక, అటు బహుళ జాతి సంస్థలకూ కూడా అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

సంస్కరణలకు పూర్వం మన మధ్యతరగతిలోని ప్రధాన సభ్యులు భూములు కోల్పోయిన బ్రాహ్మణులు, భూమిని ఇంకా అంటిపెట్టుకొని ఉన్న అగ్రకుల సమూహాలు, శూద్రులు. వీళ్ళలో అధిక శాతం విద్యావంతులు, తద్వారా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు వగైరా. భూమి బలం ఉన్న వాళ్ళల్లో కొంతమంది కొత్తగా ఏర్పడుతూన్న వ్యాపారాల వైపు మొగ్గితే మరికొంత మంది (ముఖ్యంగా ప్రాంతీయ) రాజకీయాల్లోకి మళ్ళారు. ఈ గతకాలపు మధ్యతరగతి నుంచే కమ్యూనిస్టు ఉద్యమం మొదలు జెపి ఉద్యమం దాకా అన్ని రకాల నాయకత్వ శ్రేణులూ పుట్టుకొచ్చాయి. ఆనాటి మధ్యతరగతిని స్థూలంగా (చర్చకోసం) సర్కారీ మధ్యతరగతి అని భావిస్తే, నేటి మధ్యతరగతిని కార్పొరేట్ మధ్యతరగతిగా ఊహించవచ్చు. ముఖ్యమైన అంశం ఏమిటంటే గతకాలపు మధ్యతరగతితో పోలిస్తే, నేటి మధ్యతరగతిలో వివిధ కులాల ప్రాతినిధ్యం, ప్రమేయం పెరిగాయనే చెప్పుకోవాలి. మరి ఈ కలగూరగంపలోని ఏ సారూప్యత వీరినందరినీ అన్నా హజారే ఉద్యమం వైపు నడిపించింది?

ఏ ఉద్యమంలోనైనా ప్రజల్ని కూడగట్టు కోవడానికి ఒక తీవ్ర మైన అసంతృప్తి, ఒక ఉమ్మడి శత్రువు ఉండి తీరాలి. అందీఅందని ఆర్థికాభివృద్ధి, అవినీతి మూలంగానే ఆర్థిక ప్రగతి అందకుండా పోతోందనే అసంతృప్తి, ఆవేదన ఒక వైపు, ఇందుకు సంస్థాగత రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయ నాయకులే ప్రధాన శత్రువులుగా అడ్డుపడుతున్నారనే ఆలోచన మరో వైపు అన్నా ఉద్యమపు చోదక శక్తులు. రాజకీయవ్యవస్థపై ప్రకటితమైన తీవ్ర అసంతృప్తి చివరికి రాజ్యాంగం తమకు హమీ ఇచ్చిన వెసులు బాట్లకు ముప్పు కలిగిస్తుందేమోనని ఒక దశలో దళితులు, బహుజనులు, మైనారిటీ వర్గాల వారు కలవరం చెందారు. అటువంటిదేమీ లేదని సర్దిచెప్పడానికి అన్నా హజారే ఉద్యమం విరమించే నాటికి ఒక దళిత బాలికనీ, ఒక ముస్లిం బాలికనీ స్టేజి మీదకి తీసుకురావాల్సిన అవసరాన్ని నిర్వాహకులు గుర్తించారు. ఏ ఉద్యమానికైనా కనీస అవసరాలైన అసంతృప్తి, ఉమ్మడి శత్రువు అన్నా ఉద్యమంలో కూడా ఉన్నాయి గాని, మూడో మూల స్తంభం అయిన 'మరో ప్రపంచం' లేదు.

ఉన్నా అది అసంపూర్ణంగానే ఉండిపోయింది. అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ఉద్యమాలన్నిటినిలోనూ కనిపించే అసంపూర్ణతే ఇది ('సంపూర్ణ విప్లవం' అని నినదించిన జేపీ ఉద్యమంలో కూడా ఈ అస్పష్టత అనివార్యం అయింది). అన్నా ఉద్యమానికి 'మరో ప్రపంచం'గాని ప్రత్యామ్నాయాన్ని చేరుకొనే మార్గనిర్దేశనం గానీ లేనప్పటికీ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ రాబోయే మంచి రోజుల పట్ల తమ తమ అభిప్రాయాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఉహాజనిత ప్రత్యామ్నాయంలోని ప్రధాన అంశాలు: అవినీతి లేని భారతదేశం, అందరికీ అందుబాటులో అభివృద్ధి, చట్టబద్ధమైన పాలన, సంక్షే మరాజ్యం... ఈ విధంగా విస్తరించుకుంటూ పోవచ్చు. అటు హిందూరాజ్యాన్ని , ఇటు సామ్యవాదాన్ని దూరంగా ఉంచి, రాజకీయాలకు అతీతమైన (అంతకన్నా ముఖ్యంగా రాజకీయాలకు వ్యతిరేకమైన) ఉద్యమంగా దీని తొలిదశను నడిపించడంలో అన్నా ఉద్యమపు నిర్వాహకులు (నాయకులు అనలేం) సఫలీకృతులయ్యారు. భారతదేశపు నిర్దిష్ట కఠిన వాస్తవాలైన కుల వైరుధ్యాల్ని, ప్రాంతీయ అసమానతల్నీ, మత పరమైన విభజనల్ని, రాజకీయ శక్తుల్నీ ఈ ఉద్యమం తాత్కాలికంగానైనా ఎలా అధిగమించగలిగింది? ఇది ఎంతకాలం సాధ్యం?

అన్నా ఉద్యమం ఏ ఒక్కరాజకీయ పార్టీనో, సమూహాన్నో తన లక్ష్యంగా చేసుకోకుండా 1947 తరవాత మొట్ట మొదటిసారిగా మొత్తం వ్యవస్థాగత రాజకీయ సంస్థలన్నింటినీ వాటితో బాటు పార్లమెంట్‌నీ రక్షాత్మక వ్యూహంలోకి నెట్టివేసింది. రాజ్యాంగపు ఔన్నత్యాన్ని, పార్లమెంటు ఆధిపత్యాన్నీ, వీటితో బాటు తమ ఉనికినీ సమష్టిగా పునరుద్ఘాటించుకోవలసిన స్థితికి రాజకీయ పక్షాలన్నీ చేరుకున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడైనా ప్రజలకే జవాబుదారులనే గుర్తింపు సర్వత్రా బలపడింది. ఇది అన్నా ఉద్యమం సాధించిన ప్రధాన విజయం. ముందు ముందు ఏం జరగబోతోంది? నిజంగా అవినీతి అంతరిస్తుందా? ఈ ప్రశ్నలకి జవాబు వెతుక్కోవడానికి ముందు అవినీతి ఒక జాతీయ జాడ్యం లేదా వ్యసనం కాదు, లంచగొండితనం చేతి దురద కాదు అని గ్రహించాలి. పరిమితమైన అవకాశాల నుంచి, అభద్రత నుంచి దురాశ నుంచి మొదలైన అవినీతి ఇందిరాగాంధి కాలంలో వ్యవస్థీకృతమయింది.

లైసెన్సులు, పర్మిట్లు, 'సోషలిస్టు' మోడల్‌లో అక్రమ సంపాదనకు రాజమార్గాలయ్యాయి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక పాత మోడల్ పోయి దాని స్థానంలో సరికొత్త అవినీతి అవకాశాలు, మార్గాలు ఏర్పడ్డాయి. అంతకన్నా ముఖ్యంగా అవినీతి స్థాయి అనూహ్యంగా పెరిగిపోయింది. సుమారు ఏభై ఏళ్ళ స్వాతంత్య్రం తరవాత కీలక రంగాల్లో తన అసమర్థతను పెంచుకొంటూ పోయిన పాలకులు (ఏ పార్టీ వారైనా), చేతులెత్తేశారు. విద్య, ఆరోగ్యం, మౌలికసదుపాయాలు అదే క్రమంలో ప్రైవేటురంగం చేతుల్లోకి మారాయి. చివరికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఈ అభివృద్ధి మేడిపండు మాత్రమే అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసివస్తోంది. అయితే ఈ మేడిపండు సృష్టి వెనుక కొత్త మధ్యతరగతి విడుద లచేసిన మార్కెట్ శక్తులు దాగి ఉన్నాయి.

కొత్త మధ్యతరగతి సృష్టించిన మార్కెట్లకూ వాణిజ్య అవకాశాలకూ డిమాండ్ చేస్తున్న వస్తువులకూ సర్వీసులకూ సరిగ్గా అమరిపోయే విధంగా కొత్త అవినీతి బాటలు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటుతో పెరుగుతున్న భారతదేశపు మొబైల్ ఫోనుల కనెక్టివిటీకీ 2జీ స్కామ్‌కి దగ్గర చుట్టరికం ఉన్నది. అలాగే మౌలిక సదుపాయాలు, విద్యా ఆరోగ్య వ్యాపారాలు కూడా అభివృద్ధి కన్నా వేగవంతంగా అవినీతిమార్కెట్ శక్తులకు అనుగుణంగా స్పందించింది. నేటి తరం రాజకీయ నాయకులు ముందుగా అక్రమ సంపాదనకూ పకడ్బందీ అయిన చట్రాన్ని నిర్మించుకొని తర్వాతే దాని చుట్టూ అభివృద్ధి పథకాలను రూపొందిస్తున్నారు. కొత్త అవినీతికి ఉన్న మరో లక్షణం భూదాహం. ఏదో ఒక అభిృద్ధిపథకం, పరిశ్రమ పేరుతో వందలాది ఎకరాలను స్వంతం చేసుకొనే ప్రయత్నంలో అంతా నిమగ్నమై ఉన్నారు. ఐటి అయినా, ఇన్ ఫ్రాస్ట్రక్చరైనా, ప్రైవేటు కళాశాలలైనా అందరిదీ అదే దారి. ప్రభుత్వం తన పాత్రని కుదించుకుంటూ పోతూ ఉంటే ఈ కొత్త అభివృద్ధి శక్తులు మరింత విజృంభిస్తున్నాయి. వాటిని ఎవరైనా అడ్డుకుంటే అభివృద్ధి వ్యతిరేకులుగా వాళ్ళని చిత్రీకరించడం జరుగుతున్నది.

అభివృద్ధికీ అవినీతికీ మధ్య ఏర్పడిన ప్రగాఢమైన సంబంధాన్ని విడగొట్టి ఆ జంటను వేరుచెయ్యాలని అన్నా ఉద్యమం ప్రయత్నించింది. కనీసం ఆ దిశలో మొదటి అడుగు వేసింది. ఇది ఆ ఉద్యమం సాధించిన రెండో ఘన విజయం. అసలు ఏ రకమైన అభివృద్ధిఅయినా అట్టడుగు వర్గాల నుంచే మొదలవ్వాలనే సాధారణ సూత్రాన్ని మరచిపోయిన పాలకులు ఇప్పుడు అందరూ అభివృద్ధిక్రమంలో భాగస్వాములవ్వాలని ఉద్ఘాటిస్తున్నారు. ఇవాళ అభివృద్ధి ఎవరి కోసం అనే మౌలికప్రశ్న రేఖామాత్రంగానైనా చాలా మందికి స్ఫురిస్తున్నది. ఒక వేళ ఈ ప్రశ్నకి జవాబు చెప్పుకోగలిగి, అభివృద్ధిమోడల్‌ని సంస్కరించుకోగలిగితే అది నిజమైన ఆర్థిక సంస్కరణ అవుతుంది. అయినప్పటికీ ఆ మోడల్ నయినా అవినీతి కౌగిలి నుంచి విడదీయడం ఎలా? అనే ప్రశ్న మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ రెండో ప్రశ్నకు జవాబు ఒక్కటే. అది ప్రజాస్వామ్య విలువల్ని, సంస్థల్నీ బలోపేతం చెయ్యడం.

ఈ విషయం అందరికన్నా బాగా పాలకులకీ తెలుసు గనుక అవకాశం దొరకగానే అన్నా బృందంతో మొదలుపెట్టి, స్వచ్ఛంద సంస్థలపైనా సమాచార హక్కు పైనా, పత్రికా స్వేచ్ఛ పైనా ఎదురుదాడులు మొదలుపెట్టారు. మున్ముందు ఇవి ఇంకా ఉధృతం కాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ ఎదురుదాడులు ఆగే అవకాశం లేదు. అన్నా మొదలు పెట్టిన ఉద్యమం కొనసాగడమే ఇందుకు పరిష్కారం. చివరగా ఒక మాట. అవినీతి వ్యతిరేక ఆందోళన ద్వారా మొదటిసారిగా బరిలో దిగిన కొత్త మధ్య తరగతి రాజకీయాలకు అతీతంగా ఉండిపోతుందని భావించడం సరికాదు. వాళ్ళల్లో కొంత మంది స్వచ్ఛంద సంస్థలకూ, ప్రజాస్వామ్య వాదులకూ అలాగే ఆధ్యాత్మిక సంస్థలకూ ప్రాంతీయ రాజకీయాల చట్రంలో ఎక్కడో ఒకచోట మరికొంత మంది ఇమిడిపోవచ్చు. అయితే ఎవరి నిర్ణయాలకు వారిని వదిలివేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. కొత్తగా ఏర్పడుతున్న ఈ సమూహాన్ని తమకు అనుగుణంగా మలచుకొనేందుకు వివిధ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి.

ప్రస్తుతానికి కాంగ్రెస్ తన శక్తుల్నీ, సమయాన్నీ ఎదురుదాడులకే పరిమితం చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోకీ బిజెపికీ ఈ కొత్త మధ్యతరగతిని తనవైపు తిప్పుకోగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. అఖండ భారత్, బాబాల ఆధ్యాత్మికత, చరిత్ర పట్ల అసమగ్ర, ఆశాస్త్రీయ అవగాహన, అన్నిటి కన్నా ముఖ్యంగా తీవ్ర అసంతృప్తి బిజెపికి మంచి సాధనాలు. గుజరాత్‌ను ఒక ఆదర్శ వంతమైన అభివృద్ధి మోడల్‌గా ప్రచారం చెయ్యడం , నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా సూచించే ప్రయత్నం, ఇవేవీ కూడా యాదృచ్ఛికం కాదు. రాబోయే పరిణామాలకు ముందస్తు హెచ్చరికలు. ఆరెస్సెస్, ఎబివిపిల మార్గాన కాకుండా మధ్యతరగతిని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకునేందుకు మొట్ట మొదటి సారిగా బిజెపికి ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. అద్వానీ రథయాత్ర వెనక ఉన్న అసలైన ఆశయం బహుశా ఇదే.
- ఉణుదుర్తి సుధాకర్ 

No comments:

Post a Comment