రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకోవాలనుకుంటూ, మరుగున పడిన ఎస్సీ వర్గీకరణకు మద్దతుతో మాదిగ సామాజిక వర్గ ఓట్లు సాధించుకోవాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నది. దానిలో భాగంగా అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ, వారి వారి వర్గాలకు సంక్షేమ పథకాలు రూపొందిస్తూ ఆ పార్టీ అధినేత ప్రకటనలు చేస్తున్నారు. గత ఉపఎన్నికలలో మాలలు వై.ఎ స్.ఆర్.సి.పి లేదా కాంగ్రెస్‌కు ఓట్లువేశారని, కావున మాలలు ఆ పార్టీల వైపు ఉన్నారని, కనీసం వర్గీకరణ మద్దతుతో మాదిగల ఓట్లు తెలుగుదేశం పార్టీ వైపు మలుచుకోవాలని చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో ఎస్సీల ఓటింగ్ సరళి పూర్తి భిన్నంగా ఉండబోతోంది.
రాష్ట్రంలో 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో కోస్తాంధ్రలో 175, తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, ఆంధ్రాలో వై.ఎస్.ఆర్.సి.పి, కాంగ్రెస్, టిడిపి పార్టీలు ప్రధానంగా పోటీ పడనున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలలో 90.88 శాతంగా ఉన్న మాల మాదిగ కులాల ఓట్లు రాబట్టేందుకు అన్ని పార్టీలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
వాస్తవానికి ఎస్సీల అంశం జాతీయాంశం. ఏ ఒక్క రాష్ట్రానికో, కొన్ని కులాలకో కాక దేశ వ్యాప్తంగా 1208 అంటరాని కులాలు షెడ్యూల్డ్ కులంగా ఏర్పడిన అంశం. కేంద్రంలో సామాజిక న్యాయ సాధికారత, ఆర్టికల్ 338 జాతీయ ఎస్సీ కమిషన్, కేంద్ర గణాంకాల శాఖలు వెల్లడించిన వాస్తవాలను తెలుసుకోకుండా కులాల అసమానతల పేరుతో వర్గీకరణ చేస్తామనడం అవివేకమే అవుతుంది. కులాల అసమానతల సమస్య మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ ఉంది. మహారాష్ట్రలో మహర్, మాతాంగ్; పంజాబ్‌లో చవార్, భంగీస్; బీహార్‌లో దళిత్ మహా దళిత్ పేర్లతో రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య ఆయా పార్టీలు అలజడులు సృష్టిస్తూనే ఉన్నాయి.
తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సిపిలకు మాదిగల ఓట్లు పడే అవకాశం మెండుగా ఉండబోతోంది. అదే ఆంధ్రాలో ఎస్సీలలో మాలలు వైఎస్ఆర్‌సిపి, కాంగ్రెస్, టిడిపి వైపు ఓటు వేసే ఆలోచనలో ఉండేవారు. కాని టిడిపి పార్టీ మరోసారి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మాలలు తమ అభిప్రాయాలను మార్చుకోబోతున్నారు. రాష్ట్రంలోని మాదిగ ఓటర్ల విషయానికి వస్తే గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్రంలోనేగాక మాదిగ కులానికి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చి తాత్కాలికంగా వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణకు ఉంది. ఈయనే వచ్చే డిసెంబరులో సొంత పార్టీ పెడతానని ప్రకటించి పూర్తి సన్నాహాలు చేస్తున్నారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలకు రాష్ట్ర పాలనలో ప్రాధాన్యం ఇస్తూ, మూడు సార్లు ఉప ముఖ్యమంత్రి పదవులను ఇచ్చింది. టిడిపి హయాంలో ఎస్సీ వర్గీకరణ చేసినా అదే ఎంతో కాలం నిలువలేకపోయింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పక్కనపెట్టి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటున్న మందకృష్ణను కాదని, మూడు సార్లు ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీ వైపు మాదిగల ఓట్లు వేయించగల సత్తా పార్టీలోని కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులుకు ఉందా లేదా అని బేరీజు వేసుకుంటే బాగుండేది. ఆంధ్ర ప్రాంతంలో మాలలు అధికంగా ఉంటారు.
ఆ ప్రాంతంలో మొత్తం మాలల ఓట్లు టిడిపికి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంది. చంద్రబాబు ఇలాంటి మౌలిక అంశాలను పరిశీలించాలి. తెలంగాణ ప్రాంతంలోని మాదిగలు మందకృష్ణకు కొంత శాతం, కాంగ్రెస్‌కు కొంత శాతం, టిఆర్ఎస్‌కు కొంత శాతం, వైఎస్ఆర్‌సిపి, బిజెపికి కొంత శాతం ఓట్లు వేయగా మిగిలిన మాదిగలు టిడిపికి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇలా ఐదు భాగాలుగా మాదిగల ఓట్లు చీలగా, మాల సామాజిక వర్గం మాత్రం ప్రాంతాలకతీతంగా టిడిపికి తప్ప మరేపార్టీకైనా ఓటు వేస్తారు. అంటే మాదిగల ఓట్లు ఐదు భాగాలుగా చీలిపోయి 5వ వంతు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ విధంగా టిడిపికి ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో ఎస్సీలలోని మాల మాదిగ ఓట్లు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది కావున తెలుగుదేశం పార్టీ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలి. రాష్ట్రంలో వర్గీకరణ ద్వారా 59 కులాలకు అన్యాయం జరుగుతుంది. గతంలో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ ఆధారంగా 2000 నుంచి 2004 వరకు ఎబిసిడిలుగా వర్గీకరణ గురించి ఎ గ్రూపుకు 1 శాతం, బి గ్రూపుకు 7 శాతం, సి గ్రూపుకు 6 శాతం, డి గ్రూపుకు 1 శాతంగా వర్గీకరించారు.
(ఎ,బి,సి,డి) కేటగిరీలకు కలిపి 15 శాతం రిజర్వేషన్లున్నాయి. దీని ద్వారా మొత్తం రెల్లి (12), మాదిగ (18), మాల (25), ఆది-ఆంధ్ర (4) 59 కులాలు లబ్ధి పొందుతున్నాయి. వర్గీకరణ జరిగితే రెల్లి(11), మాదిగ(11), మాల(19), ఆది-ఆంధ్ర(3) కులాలకు తగ్గుతాయి. దీని ద్వారా రిజర్వేషన్ల శాతం 59 కులాలకు కాకుండా 44 కులాలకు కుదించినట్లవుతుంది. ఎస్సీల వర్గీకరణ విషయం సమసిపోవాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పి.ఎల్. పునియా ఇచ్చిన తాజా సూచనలు అమలుపరచాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకోవాలంటే ఎస్సీ వర్గీకరణ కాకుండా ఉపకులాలకతీతంగా మొత్తం యావత్ ఎస్సీలకు ప్రయోజనం కలిగే సంక్షేమ పథకాలను రూపొందించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రద్ధచూపాలి.
- బత్తుల రాంప్రసాద్
అధ్యక్షుడు, మాల సంక్షేమ సంఘం
Andhra Jyothi News Paper Dated : 14/08/2012
No comments:
Post a Comment