Sunday, August 19, 2012

అంబేద్కర్ కు దివిటీ కావాలా? - కె. శ్రీనివాస్


1956లో కనుమూసిన అంబేద్కర్ 1980లకు వచ్చేసరికి మరింతగా ప్రాసంగికం అయ్యారు. 1990ల్లో భారత రాజకీయాలను, సామాజిక సంచలనాలను నిర్దేశించారు. దళితులకే కాదు, సమస్త బహుజనులకూ ఆత్మగౌరవానికీ, అస్తిత్వ పోరాటానికీ ప్రేరణాత్మకమైన సంకేతంగా మిగిలారు. భారతదేశ చరిత్రను, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త వనరుగా అంబేద్కర్ అవతరించారు. 1990 దశకం చివరలో అంబేద్కర్ రచనలు విస్తృత ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాక, స్థిరపడిపోయిన ఆలోచనలు అనేకం కల్లోలానికి గురి అయ్యాయి.

భారతదేశంలో వ్యక్తిఆరాధన చావలేదు. ఇంకా ఈ దేశంలో విగ్రహారాధన రాజ్యమేలుతోంది. మతంలోనూ విగ్రహారాధనే, రాజకీయాల్లోనూ విగ్రహారాధనే. మహానాయకులు, మహానాయకారాధన మన రాజకీయాల్లో ఒక కఠోర వాస్తవం. అటువంటి ఆరాధన ఆరాధకులను హీనపరుస్తుంది, దేశానికి చేటు చేస్తుంది. విమర్శను నేను స్వాగతిస్తాను, ఎందుకంటే, మనం నెత్తినపెట్టుకుని పూజించడానికి ముందు ఆ మనిషి నిజంగా గొప్పవాడో కాదో నిర్ధారించుకొమ్మని ఆ విమర్శ మనల్ని హెచ్చరిస్తుంది. కానీ అటువంటి విమర్శ సులభం కాదు. పత్రికలు చేతిలో ఉన్న ఈ రోజుల్లో గొప్పవ్యక్తులను తయారుచేయడం తేలిక. (రనడే, గాంధీ, జిన్నా- వ్యాసంలో బాబాసాహెబ్ అంబేద్కర్, 1943)

గాంధీ తరువాత అతి గొప్ప భారతీయుడెవరు? అన్న హాస్యాస్పదమైన ప్రశ్నతో కొన్ని మీడియాసంస్థలు, సర్వేసంస్థలు కలసి నిర్వహించిన వివాదాస్పదమైన అధ్యయనంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రస్థానంలో నిలిచారట. నిర్వాహకులు ఏ ఫలితం వస్తుందని ఊహించారో, లేదా ఆశించారో, వచ్చిన ఫలితం వారికి ఆశ్చర్యం కలిగించిందో లేదా ఆనందం కలిగించిందో తెలియదు. చిన్నా పెద్దా పత్రికలూ ఛానెళ్లూ మాత్రం ఇదో పెద్ద విశేషం అయినట్టు నానా హంగామా చేస్తున్నాయి. నెహ్రూను జాతి మరచిపోయిందనీ, పటేల్ గ్లామర్ పెరిగిపోయిందనీ, ఇందిరాగాంధీ చెల్లుబాటు తగ్గిపోయిందని, లతామంగేష్కర్ శకం ముగిసిపోయిందనీ రకరకాల నిర్ధారణలు చేస్తున్నాయి.

ఈ సర్వే తతంగం అంబేద్కర్‌కు ఏమంత గౌరవప్రదమైంది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే, మౌలికంగా అధ్యయనమే అశాస్త్రీయంగానూ, అసంబద్ధంగానూ జరిగింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, సెల్‌ఫోన్ తరానికి చెందిన వారు అత్యధికంగా ఈ సర్వేలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమానమైన శాంపిల్ తీసుకోవడం కానీ, విడిగా నిర్వహించిన మార్కెట్ సర్వేలో అన్ని ప్రజావర్గాలను కలుపుకోవడంగానీ, 28 మంది జూరీలో సామాజిక సమతుల్యత కానీ లేవు. స్వచ్ఛందంగా మిస్‌డ్ కాల్ ద్వారా అభిప్రాయాలు చెప్పిన వారు కొన్ని రాష్ట్రాలనుంచి అధికంగా ఉన్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఫోన్ అభిప్రాయాలు రావడం వల్లనే అంబేద్కర్‌కు అధికంగా ఓట్లు వచ్చాయని, రెండో స్థానంలో గుజరాత్ ఉండడం వల్ల సర్దార్ పటేల్ మూడో స్థానంలో నిలిచారని భావించే ప్రమాదం ఉన్నది. పటేల్ సంగతీ, కలామ్ సంగతీ ఏమో కానీ, ఆ మార్గంలో అగ్రస్థానాన్ని పొందవలసిన అగత్యం అంబేద్కర్‌కు మాత్రం లేదు.

గాంధీ తరువాత- అని షరతు పెట్టడమే అశాస్త్రీయం. గాంధీని మాత్రం ఎందుకు పోటీలో నిలబెట్టకూడదు? గాంధీని నిలబెట్టి ఉంటే, ఆయనకు అంబేద్కర్ నుంచి చాలా గట్టిపోటీయే వచ్చి ఉండేది. అంబేద్కరే కాదు, భగత్‌సింగ్ నుంచి, సుభాష్ బోస్‌నుంచి, సావర్కర్ నుంచి కూడా పోటీ వచ్చేది. ఉద్వేగరహితమైన నాయకత్వం ఇచ్చినందువల్లనే గాంధీ జాతీయోద్యమానికి అధినాయకుడు అయి ఉండవచ్చును కానీ, ఆ లక్షణమే ఆయనతో భారతీయులకు, ముఖ్యంగా ఇప్పటి తరాల వారికి మానసిక సంబంధం లేకుండా చేసింది. గాంధీ మితపోరాటవాదం కానీ, ఆధ్యాత్మికత కానీ, అస్పృశ్యతను నిర్మూలించాలంటూనే వర్ణధర్మాన్ని సమర్థించడం కానీ- ఆయన సమకాలంలో కంటె అధికంగా నేడు విమర్శకు గురి అవుతున్నాయి. ఆయనను ఇప్పటికీ ప్రాసంగికం చేస్తున్న కొన్ని అనుకూల అంశాలున్నాయి కానీ, వాటి పరిధి ప్రస్తుతానికి తక్కువే.

అంబేద్కర్ గాంధీని సమకాలంలో ఎదుర్కొనడమే కాకుండా, మరణానంతరం కూడా సజీవ రాజకీయ, సామాజిక శక్తిగా ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. గాంధీ మరణించిన తరువాత, ఆయన అనుయాయులు ఆయన ఆదర్శాలను కూడా గంగలో వదిలేసి గాంధారి సంతానంగా పరిణమించారు. నెహ్రూ నవభారత నిర్మాత అని పొగిడినవారే, ఆయన మాటల్లోనైనా చెప్పిన సమానత్వాన్ని, సంక్షేమాన్ని, ప్రభుత్వ నాయకత్వంలోని మిశ్రమార్థిక విధానాన్ని విసర్జించారు. హిందూత్వ వాదులు తలకెత్తుకోవడం వల్ల పటేల్ ఒక చిహ్నంగా మిగలగలిగారు, అనుయాయులను పెంచుకోగలిగారు. కానీ, అంబేద్కర్ అలా కాదు.

1956లో కనుమూసిన అంబేద్కర్ 1980లకు వచ్చేసరికి మరింతగా ప్రాసంగికం అయ్యారు. 1990ల్లో భారత రాజకీయాలను, సామాజిక సంచలనాలను నిర్దేశించారు. దళితులకే కాదు, సమస్త బహుజనులకూ ఆత్మగౌరవానికీ, అస్తిత్వ పోరాటానికీ ప్రేరణాత్మకమైన సంకేతంగా మిగిలారు. భారతదేశ చరిత్రను, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త వనరుగా అంబేద్కర్ అవతరించారు. 1990 దశకం చివరలో అంబేద్కర్ రచనలు విస్తృత ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చాక, స్థిరపడిపోయిన ఆలోచనలు అనేకం కల్లోలానికి గురి అయ్యాయి.

పైన ఉటంకించిన వ్యాసంలోనే అంబేద్కర్ మరో మాట చెబుతారు. 'ప్రముఖమైన లేదా విశిష్టమైన వ్యక్తికీ, గొప్ప వ్యక్తికీ తేడా ఉంది. ఒక సామాజిక ప్రయోజనపు అంతస్సూత్రాలతో ప్రభావితమై కార్యాచరణలోకి దిగినవాడే గొప్పవ్యక్తి. అతను సమాజం కోసం కొరడా పట్టుకోవాలి, చీపురూ పట్టుకోవాలి'. ఆ నిర్వచనం అంబేద్కర్‌కు సరిపోయినట్టుగా, ప్రస్తుత అధ్యయనంలో గొప్పవ్యక్తుల కోవలో అంబేద్కర్ తరువాత నిలిచిన వారెవరికీ సరిపోదు.

స్వతంత్ర భారతదేశాన్ని ప్రభావితం చేసిన గొప్పవ్యక్తుల కోవలో సచిన్ తెండూల్కర్ ఎట్లా ఉంటారో, ఈ సర్వేకు ఆ పేరును ప్రతిపాదించినవారు మాత్రమే కాదు, రామచంద్రగుహ వంటి నవీన చారిత్రకులు కూడా వివరణ ఇవ్వాలి. మదర్ థెరిసా సంఘసేవికగా మహనీయురాలే కావచ్చును కానీ, ఆమె సేవలో దేశాన్ని ముందుకు నడిపిన అంశం ఏమున్నది? దక్షిణభారతదేశానికి చెందిన వ్యక్తులు ఒక్క అబ్దుల్ కలామ్ తప్ప మరెవరూ లేకపోవడం, అంబేద్కర్, కలామ్, థెరిసా తప్ప అందరూ అగ్రవర్ణాల వారే ఉండడం - ఫేస్‌బుక్ తరం సామాజిక అవగాహనను, పక్షపాతాలను సూచిస్తాయి. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కానీ, రామ్‌మనోహర్ లోహియా కానీ ఆ జాబితాకు ఎక్కకపోవడం దేన్ని సూచిస్తుంది?

భారతదేశం భౌగోళికంగా పెద్ద దేశమే కాదు, అనేక మతాలు, భాషలు, కులాలు, సంస్కృతులు కలగలసిన దేశం. వైవిధ్యభరితమే కాదు, వైరుధ్యభరితం కూడా నవభారతం. ఆ సంక్లిష్టత, ఏకైక జాతిగా రూపొందడానికి పరిమితిగా ఉండడమే కాదు, అస్తిత్వాల విచ్ఛిత్తికి కూడా కారణమయింది. ఈ బాహుళ్యం మధ్య ఏకైక నేతలు, ఏకైక స్ఫూర్తులు ఈ దేశానికి ఉండడం సాధ్యమా? భారతదేశాన్ని వలసపాలననుంచి స్వతంత్రంలోకి, దుర్మార్గమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నుంచి సామాజిక ప్రజాస్వామ్యంలోకి నడిపించడానికి ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న శక్తులు, వ్యక్తులు అసంఖ్యాకులు.

అటువంటి వారందరూ సమకాలంలోని వారే కానక్కరలేదు. అంబేద్కర్ లాగానే, గౌతమబుద్ధుడు, మహాత్మా ఫూలే తమ జీవితకాలంలో కంటె అనంతరమే ప్రభావశాలురుగా సమాజాన్ని నడిపిస్తున్నారు. ప్రతి సామాజిక వర్గమూ, సాంస్కృతిక సమూహమూ తమ తమ చరిత్రల నుంచి ప్రేరణలను, ప్రతీకలను అన్వేషించుకుంటున్న కాలం ఇది. విశేషమేమిటంటే- ఇటువంటి అన్వేషణకు ప్రధాన కారకుడు, చోదకుడు బాబా సాహెబ్ అంబేద్కర్. ఆయనను గుర్తించడమంటే, ఆయన కంటె ముందూ తరువాతా అదే మార్గంలో నడచినవారందరినీ గుర్తించడం.

అలాగే, సమాజ గమనం బహుముఖమైనది. కేవలం సామాజికమో, ఆర్థికమో, సాంస్క­ృతికమో సమాజపు నడకను పూర్తిగా నిర్వచించలేదు. పాతను బద్దలు చేసి, నూతన సమాజాన్ని ఆవిష్కరించడానికి, నూతన మానవుడిని తీర్చిదిద్దడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. వాటి ప్రభావాలు, ఫలితాలు స్థానికంగానో, పరిమితంగానో ఉండవచ్చు. కానీ, వాటిలో సార్వజనీనమైన విలువలు ఉంటాయి.

సంస్కర్తలు, విప్లవకారులు, దార్శనికులు, శాస్త్రవేత్తలు, రచయితలు- ఆ లోకాన్ని మెరుగుపరచడానికి తమ వంతు పని చేస్తూ వస్తున్నారు. వారి వారి మధ్య సమకాలంలో వైరుధ్యాలు, ఘర్షణలు ఉండవచ్చును, కానీ స్థూల దృష్టిలో చూసినప్పుడు బహుముఖీనమైన విస్తృత మానవ కార్యాచరణగానే వారి కృషిని చూడాలి. ఒకరో ఇద్దరో అనితరసాధ్యమైన దోహదాలు చేస్తారు. వారికి పెద్ద పీట వేయవలసిందే. కానీ, అనేక చేతులు కలసి మాత్రమే చరిత్ర నడుస్తుందన్న అవగాహన అంతిమసత్యమని అర్థం చేసుకోవాలి.
- కె. శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated : 19/08/2012

No comments:

Post a Comment