తరతరాలుగా ఆదివాసులవి అవే బాధలు
తరతరాలుగా దట్టమైన అడవులు, కొండలతో మమేకమై జీవనం గడిపే ఆదివాసీలు తమదైన సాంఘిక వ్యవస్థలు రూపొందించుకొని జన జీవన స్రవంతికి దూరంగా దుర్భరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. నేటికీ వారు విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోలేదు. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 8.44 కోట్లమంది ఆదివాసీలున్నారు. వీరిలో 92 శాతం మంది గిరిజనులు అటవీ ప్రాంతంలో వేటపై, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆదివాసీ తెగల అభివృద్ధి, రక్షణ కోసం రాజ్యాంగంలోని 10వ భాగం- 5, 6 షెడ్యూళ్లలో పొందుపర్చారు. కానీ ఆ చట్టాలను అమలుచేసి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడవలసిన పాలక వర్గాలు వారి పట్ల వివక్ష చూపుతున్నారు.
ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా పాటించాలని 1982లో తీర్మానించింది. 1994-2004, 2004-2014 కాలాన్ని ఆదివాసీ దశాబ్దంగా ప్రకటించింది. అయినా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించలేదు. దీన్నిబట్టి ఆదివాసీల అభివృద్ధిపట్ల పాలక వర్గాల వైఖరి ఏవిధంగా ఉందో స్పష్టమవుతున్నది. పాలకులు అక్రమ ప్రాజెక్టులు, అక్రమ గనుల తవ్వకాలతో ఆదివాసీలను నిరాక్షిశయులను చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
రాజ్యాంగంలో పేర్కొన్న చట్టాలు, హక్కులు, నిబంధనల ప్రకారం ఆదివాసీలను అభివృద్ధి చేయాల్సిన పాలకులు కోట్లాది రూపాయల సంపాదనే ధ్యేయంగా దేశ సంపదను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్నారు. ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మనదేశంలో ప్రతివ్యక్తికి జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించింది రాజ్యాంగం. దీన్ని హరించే అధికారం ఏవ్యక్తికి, ఏ ప్రభుత్వానికి లేదు. సమాజ రక్షణ పేరుతో వ్యక్తుల ప్రాణాలను హరించటం రాజ్యాంగ విరుద్ధం. కానీ నేడు పాలకులు ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసీలపై యుద్ధం ప్రకటించి మారణహోమానికి పాల్పడుతున్నారు.
తమ సంస్కృతి సాంప్రదాయంలోభాగమైన విత్తనాల పండుగ సమావేశంలో పాల్గొన్న ఆదివాసులపై పగపట్టిన కోబ్రా పారా మిలటరీ, సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు దాడిచేసి హతమార్చాయి. ఈ సంఘటన జలియన్ వాలాబాగ్‌ను తలపిస్తున్నది. అంతేకాక ఇప్పుడు నారాయణపూర్, బస్తర్ ప్రాంతాలలో 750 చదరపు కి.మీ. ప్రాంతాన్ని సైనిక శిక్షణ కేంద్రంగా ఏర్పాటుచేసి మావోయిస్టుల ఏరివేతకు అత్యాధునిక హెలికాప్టర్లను దింపుతున్నారు. ప్రభుత్వ చర్యలు చూస్తుంటే ఇది ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో భాగమని స్పష్టమవుతున్నది. అలాగే ఇటీవల కాలంలో జరిపిన సర్వేలో తేలిందేమంటే దండకారణ్యంలో పోలీసులు భారీఎత్తున లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రవూపదేశ్‌లో 2007 ఆగస్టు 20న వాకపల్లిలో 22 మంది గ్రేహౌండ్స్ పోలీసులు తమపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆదివాసీ మహిళలు ప్రభు త్వానికి తమ గోడు విన్నవించుకున్నా వారికి న్యాయం దక్కలేదు. అలాగే అబూజ్‌మాడ్, నియంగిరి, ఒడిషాలో పారామిలటరీ బలగాల అత్యాచారాలు, పశ్చిమబెంగాల్‌లో బుద్ధదేవ్ భట్టాచార్య పాలనలో నందిగ్రాం, సింగూరులలో ఆదివాసీ మహిళలపై పోలీసుల అత్యాచారాల పరంపర నేటికీ కొనసాగుతూనే వుంది. అదేగాక అభివృద్ధికి నోచుకోక జారవ తెగకు చెందిన ఆదివాసీలు అండమాన్‌లో అంతరించే దశకు చేరుకోవటమే గాక, వారు బయటి సమాజం వినోదం కోసం నగ్నంగా నాట్యం చేసే దౌర్భాగ్యపు స్థితి నెలకొన్నది.
అభివృద్ధి పేరుతో పోలవరం ప్రాజెక్టు వల్ల 300 గ్రామాలు, జోద్‌ఘాట్ ప్రాజెక్టు పేరుతో 100 గ్రామాలు, పోస్కో పేరుతో 100 గ్రామాలు, బాక్సైట్ తవ్వకాల పేరుతో 500 గ్రామాలు, ఉత్తర తెలంగాణలో ఓపెన్‌కాస్టుల పేరుతో, అభయారణ్యం పేరుతో ఆదివాసీల జీవన విధానాన్ని పాలకులు ధ్వంసం చేస్తున్నారు. ఒక పక్క ఆదివాసీ ప్రాంతాల్లో తినడానికి తిండి లేక, తాగేందుకు నీరులేక, కట్టుకోవటానికి బట్టలులేక అనేక బాధలు అనుభవిస్తున్నారు. సరైన పౌష్టికాహారం అందక, కలుషిత నీటిని తాగి విషజ్వరాల బారిన పడుతున్నారు. కనీస వైద్య సాయం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ మధ్య కాలం లో అబూజ్‌మాడ్ కొండల్లో ఆదివాసీల జీవన విధానాన్ని చిత్రీకరించటానికి వెళ్ళిన తరుణ్ సెహ్రావత్ ఈ విషయాన్ని తమ ఆత్మతర్పణతో బయట సమాజానికి చాటి చెప్పాడు. దీన్ని బట్టి బయటి సమాజంలో వ్యక్తి వారంపాటు కూడా అడవిలో జీవనం కొనసాగించలేక పోయాడంటే ఆరు దశాబ్దాల స్వతంత్ర పాలనలో అభివృద్ధి తెలియని సెహ్రావత్ లాంటి ఆదివాసీలు ఎంతమంది మృత్యువాత పడ్డారో, ఏవిధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారో స్పష్టమవుతున్నది.
ఇప్పుడు ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానమైంది భూమి సమస్య. మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి 7లక్షల 50వేల ఎకరాల ఆదివాసీల భూములు గిరిజనేతరుల కబంధ హస్తాలలో ఉన్నాయని స్వయాన ప్రభుత్వం నియమించిన డి.వి.ఎల్.యన్.మూర్తి, కోనేరు రంగారావు కమిటీలే తెలియజేశాయి. ఆదివాసీలు తమ భూముల్లోనే కూలీలుగా మారిన పరిస్థితి నెలకొన్నది. ఆదివాసీలకు పోడు భూములిచ్చి ఉమ్మడి సాంప్రదాయక హక్కులు అడవిపై కల్పించే అటవీ హక్కుల చట్టం- 2006 నేడు గిరిజనేతరులకు చుట్టంగా మారింది. గిరిజనేతరులు బడా రాజకీయ నాయకులు ఏజెన్సీలో వేలాది ఎకరాలను బినామి పేర్లతో పొందారు. కానీ అసలైన ఆదివాసీలు మాత్రం అటవీ అధికారుల ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్నారు. 1998 షెడ్యూల్డు ప్రాంతా ల విస్తరణ చట్టం (పిసా) గ్రామసభలకు పూర్తి అధికారం కల్పించింది. దాన్ని తుంగలో తొక్కారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 1989(అత్యాచారాల నిరోధక చట్టం) కూడా అమలయ్యే పరిస్థితి లేదు. పాపం ఆ చట్టం ఉన్న సంగ తి కూడా ఆదివాసీ తెగలకు తెలియదు.
దేశంలో ఆదివాసీ తెగలు అనేక బాధలు అనుభవిస్తున్నాయనేది నగ్నసత్యం. ఇప్పటికైన పాలకులు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధిపై అధ్యయ న కమిటీ వేయాలి. యుద్ధ వూపాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలి. ఆదివాసీల హక్కులను హరిస్తున్న ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలి. బహుళజాతి కంపెనీలకు ఇచ్చిన ఖనిజ లీజులను రద్దు చేయాలి. ఆదివాసులకు 5, 6 షెడ్యూల్‌లో పేర్కొన్న స్యయంపాలన అధికారం కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడాలి.
-మైపతి అరుణ్‌కుమార్
ఆదివాసీ విద్యార్థి సంఘం (తుడుందెబ్బ
Namasete Telangna News Paper Dated : 09/08/2012
No comments:
Post a Comment