Tuesday, August 28, 2012

సబ్ ప్లాన్ సంక్షేమం---సంపాదకీయం



ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల చట్టబద్ధతకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడం హర్షించవలసిన పరిణామం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఈ నెల 25న సమర్పించిన సిఫార్సులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిధుల దారి మళ్ళింపునకు వ్యతిరేకంగా దళితులు, ఆదివాసులు, వివిధ ప్రజాస్వామిక వాదులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు ఉద్యమించడం వల్ల ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి దృష్టి సారించింది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల, తెగల సర్వతోముఖాభివృద్ధి కోసం ఉద్దేశించిన ఉప ప్రణాళికల నిధుల దారి మళ్ళింపును అరికట్టడానికి ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చే యాలని ఉప సంఘం సూచించడం ఆహ్వానించదగినది. ఎస్సీల కోసం 1,200 కోట్ల రూపాయలు, ఎస్టీల కోసం 800 కోట్ల రూపాయల బడ్జెట్ ప్యాకేజీలను సబ్‌ప్లాన్ కింద కేటాయించాలని కూడా ఉప సంఘం సూచించింది. 


రాజ్యాంగ నిర్దేశానికి అనుగుణంగా 1979లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రూపొందించిన ఎస్సీఎస్టీల ఉప ప్రణాళికలను రాష్ట్రాలు కూడా అనుసరించాయి. ఉప ప్రణాళికల కోసం బడ్జెట్లలో నిధుల కేటాయింపులు జరుగుతున్నప్పటికీ అవి సవ్యంగా ఖర్చు కాకుండా మురిగిపోవడ ం, ఇతర శాఖలకు, ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరలించడం వంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. దళితుల కోసం ఉద్దేశించిన నిధులను కామన్ వెల్త్ క్రీడల కోసం ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంటులో అంగీకరించారు. రాష్ట్రంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు, ట్యాంక్‌బండ్ అభివృద్ధికి, భూగర్భ డ్రైనేజీ పనులకు, 

పులివెందుల అభివృద్ధికి ఈ ఉప ప్రణాళికల నిధులను పాలకులు బుద్ధిపూర్వకంగానే దారి మళ్లించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక పింఛన్లు, ఇందిరమ్మ గృహాల ఖర్చును, గ్రామీణ ఉపాధి హామీ చెల్లింపులను కూడా రాష్ట్ర సర్కారు ఉప ప్రణాళిక ఖాతాలో చేర్చడం అన్యాయం. అదే సమయంలో ఆ నిధుల వ్యయ నియంత్రణ కోసం నియమించిన నోడల్ సంస్థలను పాలకులు నిర్వీర్యం చేశారు. జనాభా దామాషా ప్రకారం నిధులను ప్రణాళిక బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేయాలన్న రాజ్యాంగ విధిని రాష్ట్ర ప్రభుత్వాలు సుదీర్ఘకాలంగా నిర్లక్ష ్యం చేశాయి. పర్యవసానంగా అధికారిక లెక్కల ప్రకారం గత ఇరవై ఏళ్లలో ఎస్సీ ఉపప్రణాళిక నిధులు పదహారు వేల కోట్ల రూపాయలు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మూడువేల కోట్ల రూపాయలకు పైగా దారి మళ్ళాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పదివేల కోట్ల రూపాయలు దారిమళ్ళినట్లు అంచనా. 

రాష్ట్రంలో ఎస్సీఎస్టీల సంక్షేమం కుదేలయిందని, వారి అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు ఏటేటా హరించుకుపోతున్నాయని, కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం ఖర్చుచేయకుండా మురగబెడుతున్నారని నాలుగేళ్ళ క్రితం పార్లమెంటు స్థాయీ సంఘం తీవ్రంగా విమర్శించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను రాబట్టడంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, త మిళనాడు ప్రభుత్వాలు పోటీపడుతుండగా అధికారికంగా కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మురగబెడుతోంది. ప్రతి ఏటా ఎస్సీల నిధులు 15 వందల కోట్ల రూపాయలు, ఎస్టీల నిధులు 5 వందల కోట్ల రూపాయలు మిగిలిపోతున్నాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించారు. 

ఇలా మురిగిపోయిన, దారి మళ్ళిన కోట్లాది రూపాయలు ఇన్నేళ్లుగా ఎస్సీఎస్టీల వ్యక్తిగత, సాముదాయక అభివృద్ధి కోసం ఖర్చు చేయకపోవడం వల్ల వారి జీవితాలు ఇప్పటికీ దుర్భరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసంఖ్యకు అనుగుణంగా షెడ్యూల్డ్ కులాలకు 16.2 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6.6 శాతం నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని, వారికి కేటాయించిన నిధులలో సగం వారి వ్యక్తిగత లబ్ధికి, నలభై శాతం వారి సాముదాయక అవసరాల కోసం ఖర్చు చేయాలని ఉప సంఘం సూచించింది. 

ఉప ప్రణాళికల అమలును పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా అత్యున్నత కమిటీ ఏర్పడుతుంది. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీతో సహా జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలలో పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా వివిధ స్థాయిలో నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలని ఉప సంఘం సిఫార్సు చేసింది. అయితే రాజకీయ పరిపాలనా వ్యవస్థకు బడుగు బలహీన వర్గాల దృక్పథం ఉంటేనే నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపులను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. 

ఒక ప్రణాళిక లేదా సంక్షేమ కార్యక్రమాన్ని రూపొందించడం కంటే దాని ఫలాలు లక్షిత ప్రజల్లో చివరి వరకు చేరడం చాలా ముఖ్యం. స్వాతంత్య్రం అనంతరం రూపొందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, దళిత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో రూపొందించిన మహత్తర సంకల్పాల్లో మెజారిటీ భాగం ఇప్పటిదాకా కాగితాలకే పరిమితమైపోయింది. సంక్షేమ కేటాయింపులు లక్షిత ప్రజానీకానికి చేరకుండా ఆవిరి కావడం వల్ల దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు పేదరికం, వెట్టిచాకిరీ ఊబిలో కూరుకుపోయి ఉన్నారని ఎనిమిదేళ్ళ క్రితం జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక వెల్లడించింది. దళిత, ఆదివాసీ ప్రజల రాజ్యాంగ విహిత హక్కులు, సంకల్పాల అమలుకోసం పౌరసమాజం, దళిత, ఆదివాసీ సంస్థలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఉపప్రణాళికలకు చట్టబద్ధత కల్పించడం కాదు, ప్రభుత్వాలకు ఆ చట్టాల్ని అమలు చేసే నిబద్ధత ఉండాలి.

Andhra Jyothi News Paper Dated : 29/08/2012

No comments:

Post a Comment