Saturday, August 25, 2012

లక్షింపేటా..! - డా.సి.కాశీం


లక్షింపేట.. లక్షింపేట
నిన్నేమని పిలువాలి తల్లీ
కళ్ళు తెరిచినా మూసినా
దృశ్యం చెదిరిపోవటం లేదు
కలత నిద్రలోంచి- చావు వాసన వస్తుంది
కనుగుడ్లు చిమ్మిన రక్తంతో
నీ మట్టి గడ్డ కట్టింది
మునివేళ్లతో మట్టిని తాకుదామంటే
మానవ కంకాళాలు కన్పిస్తున్నాయి
నీతో సంభాషించాలంటే
కత్తుల భాషను చూసి భయమేస్తుంది
నీ గర్భంలో పాతిపెట్టుకున్న నమ్మకాన్ని
వేకువజాము కోయిల పాట సాక్షిగా నరికివేసారు
కత్తి మొనకు నిప్పులు రాలుతుంటే
మాల తల్లుల చెంపల మీద
సముద్రాలు పారుతున్నాయి
ఇక్కడ భూమి కడుపులో
కళ్లు పెట్టి చూడటమే నేరమైంది!
లక్షింపేటా..!
నేను లేగదూడ కంటిలో దుఃఖాన్ని చూసాను
చెట్టుపై వాలిన కాకి శోకాన్ని విన్నాను
అపుడే ప్రసవించిన మేకపిల్ల- అరుపు ఆగిపోయింది
తల్లికోడి రెక్కల చాటున దాగిన
కోడిపిల్లల భయాన్ని కనుగొన్నాను
వంశధార నది అలలపై
పారుతున్న రక్తాన్ని చూసి
సూర్యుడు మూర్ఛపోయాడు
బొడ్డులో దిగిన బాకుపోటు నుంచి తేరుకొనక ముందే
కనుపాపలు కత్తికి వేలాడుతున్నాయి
మరణ వాంగ్మూలం- పెదాలకు చేరకముందే
నాలుక తెగిపోయిన దృశ్యం
లక్షింపేటా..! నీ జ్ఞాపకాల సందు నుంచి
ఒక దుఃఖం పొగిలి పొగిలి నడుస్తుంది
చరిత్ర పాన్పు మీద
తగలబడుతున్న భర్త కోసం భార్య
జీవిత మాన్యాల మీద- వాలిపోయిన బిడ్డ కోసం తల్లి
గొడ్డలి కొస నుంచి
కారుతున్న అన్న రక్తంబొట్టు కోసం చెల్లి
మాంసం ముద్దలను పోల్చుకోలేక
పిచ్చివాళ్లలా తిరుగుతున్నారు
మొగలిరేకుల లక్షింపేట వనంలో
నాలుగు మొండాలు వేలాడాయి
పుట్టిన తారీఖులు లేని వాడని తల్లీ
ఈ నేల మీద ఎన్నిసార్లు- చంపబడ్డానో
చార్వాకుడి నుంచి సంగమేసు వరకు- చరిత్రే సాక్ష్యం
మూడు దశాబ్దాల క్రితం
నేను కారంచేడును
ఇప్పుడు- నెత్తుటి ముగ్గేసిన లక్షింపేటను
ఎన్నిసార్లు చంపినా
నేనొక ఫీనిక్స్‌ను

- డా.సి.కాశీం
97014 44450

No comments:

Post a Comment