దళిత పద వాడకం ఇటీవలి కాలంలో అధికమైంది. ఈ పదాన్ని మన రాష్ట్రంలో 'మాల' 'మాదిగ' పదాలకు మారుగా వాడుతున్నారు. ఈ పదం 1970 తర్వాత ప్రచారంలోకి వచ్చింది. ఇది మహారాష్ట్రలో పుట్టింది. అక్కడ దళిత పాంథర్స్ అనే పేరుతో ఒక ఉద్యమం కొనసాగింది. పూనాలో ఉన్న గోఖలే పరిశోధనా సంస్థలో ఈ 'దళిత' పదాన్ని రూపొందింది. దీనికి మాతృక అమెరికాలో కొనసాగిన బ్లాక్‌పాంథర్స్ మూవ్‌మెంట్. పాంథర్ అంటే చిరుత పులి, బ్లాక్ పాంథర్ అంటే నల్లచిరుత పులి. నల్లవారు తమ ఉద్యమానికి అర్థవంతమైన పేరు పెట్టుకున్నారు.
కాని మహారాష్ట్రులు తమ ఉద్యమానికి పెట్టుకొన్న పేరు దళిత పాంథర్స్. దళిత పాంథర్స్ అంటే చీల్చబడిన, చిమ్మబడిన, చంపబడిన చిరుతపులులని అర్థం. దళిత పదాన్ని పాంథర్ అనే పదంతో జోడించి మహారాష్ట్రులు ఘోరమైన తప్పు చేశారు. అన్‌టచ్‌బుల్ పాంథర్స్ అని పేరు పెట్టుకున్నా శ్లేషార్థంతో అర్థవంతంగా ఉండేది. పోనీ ఆ ఉద్యమం ఫలించిందా అంటే అదీ లేదు. ఫలరహితమైన చెట్టువలే అది ఎండిపోయింది. కాని వారు ప్రయోగించిన ఈ 'దళిత' పదం మాత్రం భారతదేశ వ్యాప్తమై ఎస్సీల్ని అవమానిస్తోంది.
అసలీ దళిత పదానికి ఉన్న అర్థమేమిటో పరిశీలిద్దాం. దళనము, దళితము అనుపదాలు సంస్కృత పదాలు. దళేదళనం అనే ధాతువు నుంచి ఈ పదం పుట్టింది. దళనమంటే భేదించుటకు సాధనమైంది, భేదించుట అని అర్థం. దళితమంటే ఖండింపబడినది. ఛేదింపబడినది. అర్థీకృతము. సగముగా చేయబడినది. విక్షిప్తము. ఇటునటు చిమ్మబడినది అని శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఈ రెండు పదాలకు ఉన్న అర్థాల్ని వివరించింది. అందుకు ఉదాహరణగా ఈ శ్లోకాన్ని ఇచ్చింది. 'దళిత ఫలాల పుంజే వృషభం పరిభవతి హాలికే కుపితే / నిభృత నిబాలిత వదనౌ హలిక వధూ దేవరౌ హసత:' తాలుధాన్యపు రాశిని ఇటునటు చిమ్ముతున్న ఎద్దుని కోపముతో కొడుతున్న రైతుని చూచి అతని భార్యా, ఆమె మరిది ఇద్దరూ నవ్వుతున్నారని శ్లోకార్థం. తాలుధాన్యపు రాశిని చిమ్ముతున్న ఎద్దును కొట్టడం దేనికని వారి భావన. ఇక్కడ దళనమంటే చిమ్మడమని అర్ధం. వివరాలకు (ఆర్యా సప్తశతి, 302. శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, 3వ సంపుటం, పుట 706.)
మరొక ఉదాహరణం. మహాకవి నంది తిమ్మన విరచిత పారిజాతాపహరణం అను ప్రబంధం యొక్క పీఠికలోని ఇరువది ఎనిమిదవ పద్యంలో కూడా దళిత పద ప్రయోగమున్నది. దాన్ని కూడా చూద్దాం. 'సామర్ష దళిత పరభట/ సామజ హయకూల ముద్రుజ క్షతజ ధునీ / కాముకి తాఖిల జలధికి / నాముష్యాయణ సుధీగృహాంగణ నిధికన్' పై పద్యంలోని దళిత పరభట సామజ హయములంటే చంపబడిన పరరాజుల యొక్క భటులూ, ఏనుగులు, గుర్రాలని అర్థం. ఇక్కడ దళితమంటే చంపబడినదని అర్థం. ఇంకొక ఉదాహరణాన్ని పరిశీలిద్దాం. 'దేశదాస్య దళన దీక్షానిబద్ధోగ్ర/కంకణంబు మెరయ కత్తి బట్టి/కటిక రాత్రి బందిఖానా నుడాయించి/ బోసుబాబు దాటిపోవు వేళ' ఈ పద్యంలో ఉన్న దళనము అనే పదానికి అర్థం రూపుమాపడమని.
వివరాలకు (మహాకవి జాషువా విరచిత నేతాజి. పుట6) దళితులంటే హిందువుల నుంచి వేరుచేయబడిన వారని కొందరు మాలమాదిగ విద్యావేత్తలంటున్నారు. వారి భావన పూర్తిగా తప్పు. విభజన అంటే వేరుచేయడం. విభజితమంటే వేరుచేయబడినది. విభజిత సమాజమంటే వేరుచేయబడిన సమాజమని. కాని దళనమంటే వేరుచేయడమనే అర్థం రాదు. అనగా విభజన అనే అర్థం రాదు. దళనమంటే ఒక వస్తువును భౌతికంగా రూపుమాపడం, చీల్చడం, చిమ్మడం, చంపడం అనే అర్థాలు వస్తాయిగాని డివైడ్ అనే అర్థం రానే రాదు. దళితుడంటే శారీరకంగా చీల్చబడినవాడు లేక చంపబడిన వాడు అని అర్థం. పాండవులు విరటుని కొలువులో ఉన్నప్పుడు భీముడు తన భార్య ద్రౌపదిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన సుధేష్ణ సోదరుని శరీరాన్ని రెండు ముక్కలు చేశాడు.
అనగా అతనిని దళిత శరీరుణ్ణి చేసాడని అర్థం. దళిత పదంతో కలసిన ఏ పదమైనా చంపబడిన, చీల్చబడిన అనే అర్థాలే వస్తాయి. ఉదాహరణకు దళిత కవి అంటే చంపబడిన కవి అని అర్థం. అలానే దళిత మంత్రి, దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ, దళితోద్యోగి, దళిత విద్యార్థి మొదలైన పదాలకు కూడా పై అర్థమే వర్తిస్తుంది. దళిత సాహిత్యమంటే రూపుమాపబడిన సాహిత్యమని. కొందరు దళిత మహాసభ, దళిత బహుజనులంటున్నారు. దళిత మహాసభ అంటే బ్రద్దలు చేయబడిన లేక రూపుమాపబడిన మహాసభ అని అర్థం. దళిత బహుజనులంటే చంపబడిన బహుజనులని అర్థం. ఇటీవల టిటిడి పాలక మండలి కూడా ఎస్సీ కాలనీల్లోకి వెంకటేశ్వరుణ్ణి తీసుకొనిపోయే ఒక కార్యక్రమానికి దళిత గోవిందమని పేరు పెట్టారు. దళిత గోవిందమంటే చంపబడిన గోవిందమనీ, చిమ్మబడిన గోవిందమనీ, చీల్చబడిన గోవిందమని అర్థం. టిటిడి వారు ఈ విషయాన్ని గమనించకపోవటం ఆశ్చర్యకరం.
బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో ఐ యామ్ ప్రౌడ్ టు బి ఏ మహర్ అని అన్నాడు. అనగా నేను మహర్‌గా ఉన్నందుకు గర్విస్తున్నాను. 1938లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎస్సీలకు హరిజన పదాన్ని చట్టబద్ధం చేయడానికి ఒక బిల్లును ప్రవేశపెట్టగా, అంబేద్కర్ దానికి నిరసనగా తన అనుయాయులతో సభ నుంచి వాకౌట్ చేశారు. దేశ ప్రజలందరినీ హరిజనులంటే మాకు అభ్యంతరం లేదని అంతకు ముందు మాట్లాడిన గైక్వాడ్ అన్నారు. ఈ పై విషయాన్ని తరచి చూడగా ఎస్సీలకు కొత్త పదాలు అవసరం లేదని అంబేద్కర్ భావన.
ఎస్సీలు ఆదిమాంధ్ర, ఆది ద్రావిడ, ఆది కర్నాట, ఆది మళయాళ, నాగ ఇత్యాది చారిత్రక పదాలు కలిగిన వారు. వీరిని మూల నివాసులని కూడా అంటారు. ఆంధ్రుల్లో నాగ, యక్ష జాతులు బౌద్ధం పట్ల ప్రత్యేక ఆదరాన్ని ప్రదర్శించారని చరిత్ర చెబుతుంది. అమరావతి శాసనాలు గథిక, చర్మకార మొదలైన కర్మ కారుల దాన ధర్మాలను గురించి ముచ్చటిస్తున్నాయి. విధికుడనే చర్మకారుడు ధాన్య కటక స్తూపాన్ని కుటుంబ సమేతంగా దర్శించి చేసిన దానం వల్ల బౌద్ధం ప్రజలలో కలిగించిన సర్వసమభావాన్నే కాక, నాడు సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు బౌద్ధం పట్ల ప్రదర్శించిన అభిమానం వ్యక్తమౌతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 15న నాగ జాతి గొప్పతనాన్ని ప్రశంసించారు.
ఇప్పటికైనా మాలమాదిగలు కళ్లు తెరవాలి. ఈ దళిత పద వ్యవహారానికి స్వస్తి చెప్పాలి. ఆదిమాంధ్ర పదాన్ని లేక మాలమాదిగ పదాల్ని వాడుకలోకి తీసుకొని రావాలి. ఈ దళిత పద వాడకాన్ని సుప్రీంకోర్టు మార్చి 17, 2008న నిషేధించింది. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే చిక్కులు వస్తాయి. దళితుడంటే చంపబడినవాడని అర్థం.
- ఎం.ఎన్. ఆచార్య
అంబేద్కర్ ఫెలోషిప్ గ్రహీత
Andhra Jyothi News Paper Dated : 05/08/2012
Andhra Jyothi News Paper Dated : 05/08/2012
No comments:
Post a Comment