కుల, మతాలకు అతీతంగా పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఆధిపత్య కులాలే పాలనలో ఉండే చోట రాజ్యాంగం అమలు కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తులకే ముస్లింలు, ఇతర మైనార్టీలు పట్టం కడితే వారికి ఎప్పటికీ రక్షణ దొరకదు. రాజ్యం విఫలమైన చోట ప్రజలు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం నిలబడితేనే రాజ్యాంగం అమలవుతుంది.
ప్రపంచంలోనే అత్యధిక పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకొనే మన దేశంలో కింది కులాలకే కాదు, ముస్లింలకూ విలువ లేదనీ రక్షణ లేదనీ గ్రహించటం చాలా సులువు. వలస పాలన కాలంలోనూ, వలసానంతర కాలంలోనూ పారుతున్న రక్తపుటేరులూ కోల్పోతున్న హక్కులూ గమనిస్తే ముస్లింలూ 'ప్రజాస్వామ్య బాధితు'లన్నది బోధపడుతుంది. అసోంలో ఉన్నది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వం.
కేంద్రంలో అధికారం నెరుపుతున్నది కూడా ప్రజాస్వామ్య చట్రంలో ఎన్నుకున్న ప్రభుత్వమే. అసోంలో ముస్లింల ఊచకోత విషయం మీద అబద్ధాలదే పైచేయి. ఆ అబద్ధాలను సంఘ్‌పరివార్ మాత్రమే ప్రచారం చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, కేంద్ర నిఘా సంస్థలూ, పాలక ప్రతిపక్ష పార్టీలూ మూకుమ్మడిగా కలిసి ప్రచారం చేయటమే అసోం మారణకాండ నేపథ్యంలో ఆవిష్కృతమైన భయంకరమైన దృశ్యం. అసోంలో పదేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఈ కాలంలోనే ముస్లింల మీద సుమారు మూడుసార్లు పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆస్తుల విధ్వంసం, అమాయకుల ఊచకోత, నిరాశ్రయుల ఆక్రందనలన్నీ అంతిమంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించాయి. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, లేదా ముస్లింల మీద దాడులు జరిగినా అక్కడ బిజెపి కన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లాభపడుతోంది. ముస్లింలను బుజ్జగించటం ద్వారా మస్లిం ఓట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని బిజెపి విమర్శించేది.
అల్లర్లు జరగడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించటం ద్వారా ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించటం వల్ల కాంగ్రెస్ ఇతర మతాల ప్రజల ఆమోదాన్ని పొందుతుంది. అసోంలో గత మూడు దఫాలుగా పాలక కులాల నుంచి వచ్చిన తరుణ్ గొగొయ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేవలం రెండు శాతం ఉన్న బ్రాహ్మణులు అసోంను ఇన్నేళ్ల నుంచి పాలించటం మత కలహాల - ఇతర కారణాలెన్ని వున్నా - వల్లే సాధ్యమైంది. మతతత్వాన్ని పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీని ముస్లింలు ఇంకా విశ్వసించటమే ఆ పార్టీకి బలం.
అసోంను పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అల్లర్లు జరగ్గానే శాంతి భద్రతలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సింది ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం. అలాంటి చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించటంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ పాలకవర్గ స్వభావాన్ని ప్రదర్శించాడు. అల్లర్లను అణచివేసేందుకు తగిన సైనిక బలగాల్ని పంపాల్సిందిగా కేంద్రాన్ని ఆయన అభ్యర్థించిన నాలుగు రోజులకు గానీ రక్షణ దళాలు అసోం చేరుకోలేదు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే సైన్యం రావటం ఆలస్యం అయిందనీ ఈలోగా జరగాల్సిన నష్టం భారీగానే జరిగిందని ఆయన అంగీకరించారు. తరుణ్ గొగొయ్ వాదన ప్రకారం దేశ ప్రధాని సకాలంలో స్పందించలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అసోం ఊచకోతల నుంచి ఏవో ప్రయోజనాలను ఆశించింది. అందుకే నేటికీ దాడులు కొనసాగేందుకు సహకరిస్తుంది. ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైనా శాంతిని పునరుద్ధరించే యంత్రాంగం ఉన్న దేశంలో నెల రోజులుగా యథేచ్ఛగా మారణకాండ కొనసాగుతూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యహరిస్తున్నాయి. పాలక కులాల ప్రయోజనాలే దీనికి కారణం.
ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రచార ప్రణాళికను ప్రవేశపెట్టింది. అందులో అబద్దాలకే పెద్ద పీట వేసింది. అసోంలో స్థానికులకూ బంగ్లాదేశ్ నుంచి పెద్ద సం ఖ్యలో చొరబడిన అక్రమ వలసదారులకూ మధ్య ఘర్షణ జరుగుతుంది. కాబట్టి దీన్ని మతాల మధ్య సంఘర్షణగా చూడరాదు. ఈ అబద్ధాన్ని కాంగ్రెస్ చెబితే ఎవరూ నమ్మరు. అసోంలో ఎల్‌కే అద్వానీ నోటివెంట ఈ అబద్ధాన్ని పలికించారు. మీడియా దీనికి విస్తృత ప్రచా రం కల్పించింది. కేంద్ర నిఘాసంస్థలూ దీనికి వత్తాసు పలికాయి.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రజల వల్లే సమస్య తలెత్తితే, దాని గురించి మాట్లాడే బాధ్యత ఆ దేశ పాలకుల మీద ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తన పౌరుల రక్షణ గురించి ఎలాంటి విన్నపమూ చేయలేదు. కాబట్టి ఇది అక్రమ, సక్రమ చొరబాటుదారులు/వలస వచ్చిన వారికి సంబంధించిన సమస్య కాదు. కోక్రఝార్ జిల్లా పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దు జిల్లా. బంగ్లాదేశ్‌తో ఈ జిల్లాకు ఉన్న సరిహద్దు కూడా కొండలూ గుట్టలతో నిండి ఉంటుంది. పైగా సరిహద్దు జిల్లాలో నిఘా చాలా పటిష్టంగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే అసోంలో ముస్లింల ఊచకోత గురించి ఎస్ఎంఎస్‌ల రూపంలో జరిగిన ప్రచారాన్ని పాకిస్తాన్ కుట్రగా వక్రీకరిస్తూ కేంద్రం అమాయక ముస్లిం యువకులను అరెస్ట్‌చేసి చిత్రహింసల పాల్జేస్తోంది.
వాస్తవానికి అసోంలో ఏం జరిగింది? జూలై 19న కోక్రఝార్ జిల్లాలో ఒక దళిత యువతి మీద అత్యాచారం చేసి హతమార్చారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ముస్లింలూ, దళితులూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అది హింసాత్మక రూపం తీసుకుంది. బోడోలాండ్ ఉద్యమం గిరిజనులు చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కాని, బోడోలాండ్ ఉద్యమం అగ్రకులాలది. ముఖ్యంగా బ్రాహ్మణవాదుల నాయకత్వంలో నడిచిన ఈ ఉద్యమం బిటిసి ఏర్పాటుకు దారితీసింది.
బిటిసి పరిధిలో ఉన్న బోడోల సంఖ్య కేవలం 20 శాతమే. కానీ బిటిసి పరిధిలోని ప్రజల జీవితాన్ని ఈ సాయుధ ముఠా నియంత్రిస్తుంది. బ్రాహ్మణవాదుల ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ముస్లిం వ్యతిరేకతతో నిండిపోయింది. అగ్రకుల ఆధిపత్యాన్ని అసోంలో 40 శాతం పైగా ఉన్న ముస్లింలు, 9 శాతం పైగా ఎస్సీలు కలిసి ఎదిరిస్తున్నారు. ముస్లింలు, ఎస్సీల మధ్య సామాజిక, రాజకీయ సంబంధాలు బలంగా పెనవేసుకొని ఉన్నాయి.
ఈ రాజకీయ ఐక్యత బిజెపికి పెద్ద సవాలుగా మారింది. మనువాద కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం బిటిసి అన్ని విధాల పనిచేయటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముస్లిం, ఎస్సీల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీస్తే తప్ప కాం గ్రెస్ పార్టీతో సహా సంఘ్‌పరివార్ ఆర్ధిక, మతరాజకీయ ప్రయోజనాలు నెరవేరవు. అందుకే ముందు ఎస్సీ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు. ఆ సంఘటనను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ముస్లిం, ఎస్సీల మీద సామూహిక నరమేధాన్ని ప్రారంభించారు.
అసోంలో జరుగుతున్న రాజ్య ప్రాయోజిత (స్టేట్ స్పాన్సర్డ్) దమనకాండను వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో ముస్లింలు నిరసనకు దిగితే గుర్తు తెలియని అల్లరి మూకలు హింసకు దిగారు. పోలీసులే అలాంటి హింసాత్మక కార్యక్రమానికి దిగారని ఆరోపణలు వస్తున్నాయి. ముస్లింలను బద్నాం చేసేందుకే ముంబై పోలీసులు శాంతియుతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చారని సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ ఆరోపిస్తోంది.
తెలంగాణ ఉద్యమంలోనూ మఫ్టీలో ఉన్న పోలీసులు అలాంటి సంఘటనలకు ఎన్నో మార్లు పాల్పడ్డారు. కాబట్టి వారి ఆరోపణలను కొట్టిపారేసే వీలు లేదు. దేశ వ్యాప్తంగానూ, మన రాష్ట్రంలోనూ వివిధ సంఘాలూ పౌరసమాజమూ అసోం మారణకాండ మీద స్పందించక పోవడానికి కుహానా దేశభక్తి కారణం. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, వలసవాదులు అనే భ్రమలో వుండటం ఆ కుహాన దేశభక్తికి మూలం. బంగ్లాదేశ్ నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారిలో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. అధికారికంగా వలస వచ్చిన వారిలోనూ, అక్రమంగా వలస వచ్చిన వారిలోనూ ముస్లింయేతరులు పెద్దసంఖ్యలో ఉన్నారు.
సరిగ్గా అసోంలో ముస్లింల మీద దాడులు జరుగుతున్న సందర్భంలోనే మరో వాదనను మీడియా చర్చకు పెట్టింది. పాకిస్తాన్‌లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయనీ, యువతులను అపహరించి బలవంతంగా మతమార్పిళ్లు చేసి వివాహం చేసుకుంటున్నారనే వదంతులను జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ నుంచి హిందువులు ఇండియాకు వచ్చి సిర్థపడేందుకు శాశ్వత వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారనీ, కృష్ణాష్టమి సందర్భంగా ఇండియాకు వస్తున్న హిందువులను నిర్భంధించారని ఇంగ్లీషు మీడియా చర్చలు నిర్వహించింది.
కరాచీ నుంచి వచ్చిన ఒక యువతితో టీవీలో మాట్లాడించారు. కరాచీలో ముస్లింయేతరులకు ఎలాంటి ఇబ్బందులు లేవనీ, హిందూ మహిళల మీద దౌర్జన్యాలు జరగటం లేదనీ, బలవంతపు మత మార్పిళ్లు గానీ, అపహరణలు గానీ జరగటం లేదనీ ఆ యువతి చెప్పటంతో టీవీ చర్చలో పాల్గొన్న వారందరూ తెల్లబోయారు. ఈ విధంగా జాతీయ మీడియాలోనూ ప్రాంతీయ మీడియాలోనూ ఒక్కసారిగా పాకిస్తాన్‌లో హిందువుల సమస్యను చర్చకు తీసుకురావడంలో అస్సాం హత్యాకాండను సమర్ధించుకొనే ఎత్తుగడను బ్రాహ్మణ పాలక వర్గం అనుసరిస్తుంది.
బోడోలాండ్ స్వయం ప్రతిపత్తి గురించి కూడా ఇప్పుడు చర్చ తీవ్రమైంది. బిటిసిని రద్దుచేయాలనే డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది. బోడోలు ఒకే ఒక తెగ కాదు. అనేక తెగల సమాహారం. నిజానికి బోడోలను ఒక తెగగా పరిగణించాలా లేదా అనే విషయం మీద శాస్త్రీయమైన అధ్యయనం జరగాలి. బోడోలు బ్రాహ్మణ ధర్మాన్నే ఆచరిస్తారు. ఆచార వ్యవహారాలు, ఇంటి పేర్లు చాలా వరకు కుల వ్యవస్థను పోలి ఉంటాయి. బోడో లిబరేషన్ టైగర్స్ చేసిన సాయుధ పోరాటం కేంద్ర ప్రభుత్వంతో ఒక రాజీకి దారితీసింది.
అదే బోడోలాండ్ టెర్రిటరీ కౌన్సిల్ అనే సంస్థ ఏర్పాటుకు దారితీసింది. బోడోల జన సంఖ్య బిటిసి పరిధిలో 20 శాతానికి మించి లేదు. వలస పాలన కాలం నుంచి కూడా బోడోయేతరులదే ఆధిక్యం. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం అసోం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండటం కూడా బోడోలాండ్ డిమాండ్‌కు తోడ్పడింది. బిటిసి ఏర్పాటులో ప్రభుత్వం అశాస్త్రీయ పద్ధతులు అనుసరించటం, బోడోయేతరులు అధిక సంఖ్యలో ఉన్న జిల్లాలను కూడా బిటిసి పరిధిలోకి తీసుకురావడం, అధిక సంఖ్యలో ఉన్న బోడోయేతర కులాలకూ మతాలకూ బిటిసిలో చోటులేకపోవడం, వారి రాజకీయ హక్కులన్నీ నియంత్రణకు గురికావటం దీర్ఘకాలిక సమస్యలకు మూలమైంది.
దీనికి తోడు బోడో లిబరేషన్ టైగర్స్ నుంచి ఆయుధాలు జప్తు చేయకపోవటం బోడోయేతర సమూహాలకు పెద్ద ప్రమాదంగా మారింది. అలాంటి పరిస్థితిని ఆ రాష్ట్రంలోని పాలక కులాలు పెంచి పోషిస్తున్నాయి. బిటిసి పరిధిలో ఉన్న ప్రాంతాల్లో గిరిజన సంస్కృతిని కాపాడే ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా బ్రాహ్మణ ధర్మాన్ని హిందూ మతం పేరుతో విస్తృతంగా వ్యాపించే చర్యలు చేపట్టింది. ఈ వైఖరి వల్ల మనువాద తీవ్రవాద సంస్థలు బిటిసి పరిధిలో ఉన్న గిరిజనులను ముస్లిం, ఎస్సీ వ్యతిరేకులుగా మార్చే కార్యక్రమాలు చేపట్టాయి.
ప్రభుత్వ సహకారంతో వాటి ప్రభావం విస్తరించింది. లక్షలాది మంది నిరాశ్రయులు కావడానికీ ఎంతో మంది చనిపోవడానికీ కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి బోడోలాండ్ పట్ల సానుభూతి ఉంది. రేపు తెలంగాణలోనూ బోడోలాండ్ పునరావృతం కాదనే నమ్మకమేమీ లేదు. తెలంగాణవాదులు కూడా అసోం ఊచకోతపై మౌనం వెనుక అర్థమేమిటో ముస్లింలకు సులువుగానే బోధపడుతుంది.
కుల, మతాలకు అతీతంగా పౌరులకు రక్షణ కల్పించే బాధ్యతను రాజ్యాంగం ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఆధిపత్య కులాలే పాలనలో ఉండే చోట రాజ్యాంగం అమలు కాదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తులకే ముస్లింలు, ఇతర మైనార్టీలు పట్టం కడితే వారికి ఎప్పటికీ రక్షణ దొరకదు. రాజ్యం విఫలమైన చోట ప్రజలు ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం నిలబడితేనే రాజ్యాంగం అమలవుతుంది.
- జిలుకర శ్రీనివాస్
బహుజన్ అకడమిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్
Andhra Jyothi News Paper Dated: 28/08/2012
No comments:
Post a Comment