Tuesday, August 28, 2012

వికలాంగులు అభివృద్ధికి కృషి చేయాలి---పూల నాగరాజు



సమాజంలో అందరి కన్నా పేదవారు ఎవరైనా ఉన్నారంటే వారు వికలాంగులే. పాలక ప్రభుత్వాలు వారి అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ నాయకులు వికలాంగుల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా అవి ఎవరికి అందుతున్నాయి, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు సాకారం అవుతున్నాయన్నది మాత్రం ప్రశ్నార్థకమే... చాలా సంవత్సరాలుగా వివక్షతకు, అన్యాయాలకు, ఆత్మన్యూనతా భావాలకు లోనై అనేక మంది వికలాంగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. మహిళా వికలాంగులు అత్యాచారాలకు, హత్యలకు గురౌతున్నారు.

వికలాంగులు ఈ సమాజంలో మనుషులు కారా...? వారికి ఈ సమాజంలో స్థానం లేదా..? అంటే లేదనే సమాధనం చెబుతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఒక వేళ స్థానం ఉంటే వికలాంగులను ఈ ప్రభుత్వాలు గుర్తించగలిగితే ఇప్పటికీ వికలాంగులు రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎంత మంది ఉన్నారో అధికారిక లెక్కలు చెప్పలేకపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా వికలాంగులు విద్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. పాలకులు వికలాంగులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి సంక్షేమానికి కృషిచేయడం లేదు.

వికలాంగులు చాలా సంవత్సరాలుగా కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రభుత్వ శాఖలో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండగా అది అమలు జరగడం లేదు. విద్యార్హతను బట్టి ఉద్యోగం, విద్యలేని వికలాంగులకు ప్రభుత్వం తరపున ఉపాధి చూపించి ధైర్యంతో జీవనం కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. వికలాంగుల న్యాయమైన డిమాండ్లు ముఖ్యంగా ఫించన్ రూ.2 వేలకు పెంచడంతో పాటు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. వికలాంగుల శాఖకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించి, ఐఏఎస్ కేడర్ అధికారిని కమిషనర్‌గా నియమించాలి.

వికలాంగులకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్లు 3 శాతం నుంచి 10 శాతం వరకు పెంచి పగడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ రెండెకరాల భూమి, గృహ వసతి, విద్యుత్, బియ్యం, రేషన్‌కార్డు అదితరాలు అందించాలి. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా వికలాంగులకు 150 రోజులు ఖచ్చితంగా పని కల్పించాలి. మహిళా సంఘాల మాదిరిగా వికలాంగులకు పావలా వడ్డీ రుణాలు అందజేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు వికలాంగులందరికీ అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
రా- పూల నాగజు

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్

Andhra Jyothi News Paper Dated : 28/08/2012

No comments:

Post a Comment