Sunday, August 19, 2012

వాకపల్లి బాధితులకు న్యాయం దక్కేనా? --గుమ్మడి లక్ష్మీనారాయణvakapalli
భారత రాజ్యాంగం ప్రకారం మతం, కులం,లింగం ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. 1979 లో వియన్నాలో జరిగిన ‘సీడా’ సమావేశపు ఒప్పందంలో మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా పాటుపడతామని మనదేశం కూడా సంతకం చేసింది. ఆఒప్పందాన్ని 1993లో ధృవీకరించింది. అయినా సరే స్త్రీలపై జరిగే దాడులలో, క్రైం రేటింగ్‌లో ఆంధ్రవూపదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. హర్యానాలో ఆదివాసీ మహిళ భారత లాన్ టెన్నిస్ క్రీడాకారిణి రుచిక-మాజీ డీజీపీ రాథోడ్ వ్యవహారం అందరికీ తెలిసిందే.అలాగే ఆంధ్రవూపదేశ్‌లోని విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలోని వాకపల్లి, భల్లూగూడ, తమిళనాడులోని వాచతి, ఒరిస్సాలోని కాందహాల్ వరుస సంఘటనల స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను తేటతెల్లం చేస్తున్నాయి.్త ఈ దుర్ఘటనల అనంతరం నిమ్న వర్గాలు, దళిత, ఆదివాసీ ప్రజలపై జరిగిన అత్యాచారాలు, పాలకుల తీరును చెప్పకనే చెబుతున్నాయి. దేశంలో రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులు ఎలా వమ్ము అవుతున్నాయో బోధపడుతుంది.

ప్రతిభాపాటిల్ (మాజీ రాష్ట్రపతి), యూపీఏ చైర్మన్ సోనియాగాంధీ, లోకసభ స్పీకర్ మీరాకుమార్, లోకసభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, రాష్ట్ర హోంమంత్రి, సబితా ఇంద్రాడ్డి వంటి మహిళల పాలనలో అణగారిన, నిమ్నవర్గాల, ఆదివాసీ మహిళలకు జరుగుతున్న న్యాయం శూన్యమే కావడం విషాదం. 2007లో జరిగిన వాకపల్లి మహిళల అత్యాచార కేసు ఐదేళ్ళ విచారణ అనంతరం పాడేరు కోర్టు 2012 ఏప్రిల్‌లో 21 మంది పోలీసుల్లో 13 మందిని శిక్షించింది. ఐదేళ్ళకైనా ఊరట లభించినా బాధిత 11 మంది మహిళల్లో ఇద్దరు వంతాల సీతమ్మ, పాంగి బార్సోలు చనిపోయారు.

పొద్దస్తమానం కష్టపడితేనే ఆదివాసుల జీవితం గడిచే రోజులు ఇంకా మారలేదు. ఆదివాసులు నాగరిక సమాజానికి దూరమైనా వారి జీవన సంస్కృతిలో భాగంగా నీతి, నిజాయితీ వారి సొంతం. ఇప్పుడు తమ జాతిని, ఉనికిని రక్షించుకోలేని సంక్షోభంలో చిక్కుకున్నారు. గిరిజన సమాజం తమ జాతి ఆచార, కట్టుబాట్లకు పరిమితమైనప్పటికీ ప్రత్యేకించి ఆదివాసీ మహిళలు ఆత్మగౌరవంతోనే బతుకుతారు.అయితే.. ప్రభుత్వం, పోలీసు బలగాలు మావోయిస్టు అణచివేత పేరుతో.. ఆదివాసీలను,ముఖ్యంగా గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుని దమనకాండ చేస్తున్నారు. అణచివేతలో భాగంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాకపల్లిలో 11 మంది మహిళలను పోలీసులు అత్యాచారానికి గురిచేశారు. 

2007 ఆగస్టు 20న మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ దళాలు గిరిజన మహిళలపై సామూహిక అత్యాచారం చేశారు. వాకపల్లి విశాఖ జిల్లా, జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయితీ పరిధిలో ఉన్నది. ఇక్కడ కోంధ్ తెగ గిరిజనులు నివసిస్తారు. వాకపల్లి జి.మాడుగుల ఏజెన్సీ గ్రామాలలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఆగస్టు 20 వ తేదీ తెల్లవారుజామున వాకపల్లి గ్రామంలోకి గ్రేహౌండ్స్ దళాలు చొరబడ్డాయి. మానవ మృగాలయిన పోలీసులు ఇళ్ళలో దొరికిన వాళ్ళను ఇళ్ళలోనే, పసుపుతోటల్లో దొరికిన వాళ్ళను తోటల్లోనే అత్యాచారానికి బలిచేశారు. ఎక్కడ దొరికిన మహిళలను అక్కడే తీవ్రంగా హింసించి , అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల రాక్షసత్వానికి 11 మంది మహిళలు బలిఅయ్యారు. కులాచారం ప్రకారం బాలింతరాలు కాపురాలకు దూరంగా ఊరి బయట ఉంచుతారు. అలాంటి వారిని కూడా పోలీసులు వదలకుండా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇలా రక్షకభటులుగా పిలువబడుతున్న వారే ప్రజల పాలిట భక్షకులుగా మారారు. తమపై పోలీసులు అత్యాచారం చేశారని బాధితులే స్వయంగా చెప్పుకున్నా నిందితులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కూడా పేక్షకపాత్ర వహించింది. ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం -1989 ఉన్నదన్న సంగతిని ప్రభుత్వం చూడ నిరాకరించింది. పోలీసులకే వంతపాడుతూ వాకపల్లి గిరిజనులపై అత్యాచారం జరుగలేదనే చెప్పుకొచ్చింది. కనీసం వైద్య పరీక్షలకు కూడా తాత్సారం చేసి పోలీసులను రక్షించింది. 60వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుపుకొని నాలుగురోజులైనా గడవక ముందే జరిగిన వాకపల్లి ఘటన యావత్ భారత జాతికి సిగ్గుచేటు. ఆరోజు డ్యూటిలో వెళ్ళిన పోలీసుపూవరు? లైంగిక బలాత్కారానికి పాల్పడినదెవరో కూడా పోలీసు అధికారులు గుర్తించలేదు. చట్టం దృష్టిలో అందరూ సమానమని అన్నప్పుడు, వారిని అరెస్టు చేయకపోవడం అప్రజాస్వామికం. ఆదివాసులు మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉంటే వారిని అదుపులోకి తీసుకుని విచారించాలి. కాని అమాయక మహిళలపై అత్యాచారానికి పాల్పడటం అమానుష, చట్ట వ్యతిరేక చర్య. దీన్నిబట్టి రాష్ట్రంలో మహిళా సాధికారిత ఏ పాటిదో అంచనా వేయవచ్చు.


బాధిత మహిళలు స్థానిక సబ్ కలెక్టర్ (పాడేరు)కు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఐపీపీ 372(2) సెక్షన్ 3(2) కింద పోలీసులపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 సెక్షన్ 3(బి)కింద 21మంది గుర్తు తెలియని పోలీసులపై కేసు నమోదు అయింది. కాని 24 గంటలు గడిచిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించడం సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. దీంతో 2007 ఆగస్టు 24న మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంవూతిని కలిసి బాధితులు తమకు న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. నివేదిక వచ్చి న తర్వాత చర్యలు తీసుకుంటామని హామీఇచ్చి వెనుకకు పంపారు. 

2007 ఆగస్టు 25న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సుభాషణ్‌డ్డిని కూడా కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఉన్నతస్థాయి దర్యాప్తు జరుపుటకు ప్రభుత్వం అప్పటి గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి వై.నాగిడ్డిని నియమించింది. ఆయన 2007 అక్టోబర్ 26 న వాకపల్లి సందర్శించి, తగిన ఆధారాలతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీన్ని పట్టించుకున్న పాపానపోలేదు. గ్రే హౌం డ్స్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అనేక ప్రజాసంఘాలు,గిరిజన సంఘాలు కేసును సీబీఐ చేత విచారణ చేయాలని డిమాండ్ చేశాయి. బాధిత మహిళల తరఫున సీనియర్ న్యాయవాది రామచంవూదరావు హైకోర్టులో కేసు వాదించారు. కాని ప్రభుత్వం విచారణను సీఐడీ, ఎస్పీ శివానందడ్డికి అప్పగించింది. విచారణ పూర్తికాకుండానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బాధిత మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం బహిరంగంగా అత్యాచారం జరిగిందని ఒప్పుకోవడమే.

కోంధు గిరిజన మహిళలు కనీసం వాకపల్లి, నుర్మతి గ్రామ సరిహద్దులను దాటని పరిస్థితుల్లో, పట్నం వెళ్ళి సిగ్గు చంపుకొని తమపై జరిగిన అత్యాచారాన్ని చెప్పుకున్నారు. 2008లో వాకపల్లి సందర్శించిన (విరసం) మహిళా రచయివూతులకు తమగోడును వెళ్ళబుచ్చారు. బాధితులకు అండగా విరసం సభ్యులు కుల-వర్ణ-మత -జాతి అంతరాలను అధిగమించి న్యాయం కోసం పోరాడారు.

ఐదు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మహిళలు అనేక పోరాటాలు చేసి లైంగిక బలాత్కారాల నేర శిక్షాస్మృతిని, భారత సాక్ష్యాధారాల చట్టాన్ని సవరింప చేశారు. నూతన లైంగిక నేరశిక్షాస్మృతి చట్టాన్ని వాకపల్లి బాధిత మహిళలకు అమలు చేయలేదు. చట్టం ముసుగులో చేస్తున్న నేరాలను కట్టడి చేయడంలో పాలకులు పోలీసులకు వంతపాడుతున్నారు. తప్పు చేసిన వారు తమను తాము రక్షించుకుంటున్న తరుణంలో సమన్యాయానికి స్థానమెక్కడ? ఈ ఏప్రిల్‌లో 13 మంది పోలీసులకు కోర్టు నామమావూతపు శిక్షి విధించింది. బాధితులకు, వారి కుటుంబాలకు, వారు పడ్డ వేదనకు ఏ న్యాయం దక్కలేదు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేకూర్చాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వంపై, న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత ఉంటుంది. 

-గుమ్మడి లక్ష్మీనారాయణ 
ఆదివాసీ రచయితల సంఘం ప్రధానకార్యద
Namasete Telangana News Paper Dated : 20/08/2012 

No comments:

Post a Comment