Tuesday, August 28, 2012

దళితులకు దారేది? - సుజాత సూరేపల్లి



ఒక్క అట్రాసిటీ కేసు బుక్ చేయించడానికి పెద్ద ఎత్తున పైరవీలు, ఉద్యమాలు చేసే పరిస్థితి దాపురించింది. ఇక దౌర్జన్యపరుడికి శిక్ష పడేదెప్పుడు? సిద్ధాంత రాద్ధాంతాలతో సమయం గడిపే మేధావి వర్గం లక్షింపేటలు జరిగినప్పుడు మాత్రం స్పందిస్తాయి. కానీ జరగబోయే లక్షింపేటలు ఎలా ఆపేది? రైట్, లెఫ్ట్ అని విడగొట్టబడి ఉన్న దళితులని ఐక్యం చేసేదెవరు? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకెప్పటికీ శాశ్వత నిద్రే. 

లక్షింపేట, నిద్రించి ఉన్న దళితులను లేపిందో, నిద్రలో నడుస్తున్న దళిత ఆక్రందనలను బయట ప్రపంచానికి తెలిపిందో, రాబోయే లక్షింపేటలెన్నో ఎన్నెన్నో అని ఒక హెచ్చరికనిచ్చిందో కానీ ఎక్కడ చూసినా ఏదో ఒక రూపేణా దళిత పదం 'వినిపిస్తూనే' ఉంది. అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది కూడా. మొన్నటికి మొన్న అంబేద్కర్ కార్టూన్‌పై దుమారం సుదీర్ఘ చర్చలకు తావునిచ్చింది. ఇంకోవైపు ఎప్పటికీ తరగని దళితులపై అత్యాచారాలు, పుంఖాను పుంఖాలుగా దళిత సాహిత్యం వెలువడుతూనే ఉంది. 

దళిత ఉద్యమాలున్నాయని ఒకరంటే, లేవని మరికొందరు, ఒకవేళ ఉంటే కేవలం క్రైం రికార్డులు తయారు చేసి, సంవత్సరానికి ఎన్ని హత్యలు, అత్యాచారాలు, లూటీలు అని లెక్కలు వేసి, బాధితులను చూపించి, పబ్లిక్‌గా వారిని ఏడిపించి, డ్రమ్ముల కొద్దీ కన్నీళ్లు కార్పించి, రకరకాలుగా ఫోటోలు చిత్రించి, ముక్కలు ముక్కలైన అంగాంగాలు ప్రదర్శించి కార్యక్రమాలు నడిపించడం, చెట్లను చూపించి కాయలమ్ముకుంటూ ఉండేవాళ్ళు కోకొల్లలు. 

మరికొందరు ఉద్యమాలు ఉవ్వెత్తున తరంగాల్లా లేచి పడుతున్నాయని అంటారు. వాటి రంగు రుచి వాసన ఎట్లా ఉంటుందో తెలుసుకోవడంలో ఇంకా మెథడాలజీలను కనుక్కొనేది మిగిలే ఉంది. మామూలు పరిశీలనా పద్ధతులు, పరిశోధనా అనుభవాలు ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి పనికిరావని చాలా వరకూ అర్థమైంది 

. అసలు దళిత అనే పేరు ఉండాలా వద్దా అని ఒక పెద్ద చర్చ. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎవరికీ స్వాతంత్య్రం, సమానత్వం అనే ప్రశ్నలు ప్రతి ఏటా వేసుకుంటూనే ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం అని పొట్టచేతబట్టుకొని పశువుల కంటే హీనంగా అంగట్లో అమ్ముకొనే సరుకుగా తయారయిన దళిత ఒకవైపు, ఏసిీ రూముల్లో దళితులపై చర్చోపచర్చలు మరొక వైపు. ఒక విధంగా దళిత పేరు లేకుంటే ఇవ్వాళ ప్రభుత్వాలకు మనుగడ లేదు, స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు రావు, అంబేద్కర్ బొమ్మలకు గిరాకీ ఎన్నడూ తగ్గదు. 

మూడు రంగుల కండువాలు, తెల్లటి ఖద్దరు చొక్కాలు, నుదిటి మీద ఎర్రని కుంకుమ బొట్లు, తళ తళ మెరిసే బ్రాస్లేట్లు, చైన్లు.. అంబేద్కర్ సంఘాలు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కమిటీలు.. మస్తీ మజాక్. యాభై ఆరు కులాలు, నూటొక్క సంఘాలు. ఈ మధ్య కాలంలో ఒక దళిత నాయకుడితో పెద్ద ఎత్తున దళితులతో ధర్నా చేయిద్దాం అంటే, ఇంకెక్కడి దళితులు మేడం, ఒక టీచర్స్ బాటిల్, ఏసిీ కార్, రెండు పూటల బిర్యానీ పెడితే గాని వచ్చే పరిస్థితిలో లేరు అన్నారు. 

దళితులకి సంబంధించిన ఏ అంశం తీసుకున్నా సమస్యే. గ్రామాలలో భూమిని నమ్ముకున్న దళితుల బతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా పేద రైతులు, భూమిని నమ్ముకుని, భూమి లేకున్నా దానిపై ఆధారపడ్డ రైతుల వెతలు తలచుకుంటే రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అని అనుమానం వస్తుంది. వాన్‌పిక్, కాకినాడ, రింగ్ రోడ్డు, ప్రాజెక్టులు, సెజ్‌లు ఇందు లేడు అని సందేహము వలదు, ఎక్కడ అభివృద్ధి పదం తీసినా ఒక దళితుడో, ఆదివాసీనో మొట్టమొదటగా బలి ఇవ్వబడును. 

ఎవడు అభివృద్ధి చెందుతున్నాడు అని లెక్కలు తీస్తే దోచుకునే వాడే ముందు ఉంటాడు. ఇదివరకు ఒక్కడు రోడ్ల మీద పనికిపోయి సంపాదిస్తే ఇపుడు మొత్తం కుటుంబం రోడ్ల మీదనే. భూమి విషయానికొస్తే, అసైన్డ్ ల్యాండ్ అనే చట్టం ప్రకారం దళితులకు ఇచ్చిన భూమి ఎప్పటికైనా ప్రభుత్వానిదే. ఒకడు సాయుధ పోరాటం అంటాడు. 

అంటే ఏమిటో అర్థం చేసుకునే లోపలే, ఆ సమస్య మాట్లాడిన వాళ్ళంతా విప్లవకారులైపోయి, హిట్ లిస్టులో ఉండి, పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగుతుండాలి. మరొకడు రాజ్యాధికారం అంటాడు. అందునా మాదిగలకే లేకపోతే మాలలకే ఓటు అని కూత పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. మరొకడు ఎంతొస్తే అంత చాలు, ప్రభుత్వ అండదండలతో ఉద్యమం నడపవలెను అంటాడు. అసలు ఉద్యమాలు ప్రభుత్వాలు నడపడం అనేది కొత్త కాన్సెప్ట్. 

కరీంనగర్/ఆదిలాబాద్ జిల్లాలో నా అనుభవంలో చూసినవి మచ్చుకి నాలుగు సంఘటనలు మీ ముందుచుతున్నాను. (1) గట్టు భూత్కూర్ గ్రామం. దాదాపు రెండు వందల మాదిగల ఇళ్లు. ఏ ఇల్లు చూసినా కూలిపోయి, పర్రెలు వాసి ఉన్నాయి. ఎవరి మొహం చూసినా పుట్టెడు దుఃఖం, కడుపు తరుక్కుపోతుంది. (2) గొల్లపల్లి, పెద్దపల్లి మండలం. గత ముప్పై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి, అందరూ మాదిగలే ఆ ఊర్లో. ఉన్నట్టుండి భూములకి ధరలు పెరిగాయి. 

ఒక రెడ్డి దొర ప్రత్యక్షమై దొంగ పత్రాలు సృష్టించాడు. (3) ఆదిలాబాద్, మంచిర్యాల, శ్రీరాంపూర్ గ్రామం. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వైబ్రేషన్‌తో ఇల్లు కూలి 9 ఏళ్ల పాప గత నెల జూలైలో చనిపోయింది. కంటి తుడుపుగా నాలుగు సంఘాల పర్యటన, నాలుగు ఫోటోలు, వార్తలు. సింగరేణి యాజమాన్యాన్ని అడిగిన దిక్కులేదు. (4) కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు కానున్న దళితులూ కోకొల్లలు. ఎకరం కంటే తక్కువ భూమి ఉంటే దళితులకి పరిహారం లేదు, వస్తుందో రాదో తెలియదు. 

అటు చదువులేక, ప్రపంచ జ్ఞానం తెలియక, నాలుగు ముక్కలు చదువుకున్నోడు ఊరు బాగోగులు పట్టించుకోక అనాథలయ్యారు ఇవ్వాళ గ్రామాలలో ఉన్న దళితులు. అక్కడో ఇక్కడో ఒక్కడు ఒకవేళ పట్టించుకుంటే వాడు బతికి బట్ట కట్టడు. మాలలు, మాదిగలు ఇతర అన్ని చిన్న కులాల పరిస్థితి ఇంతే. అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు మాకొద్దు అని ప్రజలు మూకుమ్మడిగా చెబుతున్నారు. పెద్ద దళిత నాయకులు స్పందించరు. వారే కనుక ఖబడ్దార్! 

అని ఒక్క పిలుపునిస్తే దళితుల మీద ఇన్ని రకాల దోపిడీ జరుగుతుందా? కొత్తగా పంచే భూముల లెక్క తరువాత, కనీసం ఉన్న భూములు కాపాడుకోకపోతే ఈ ఉద్యమాలెందుకు? అటు తెలంగాణ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, అందరూ ఆలోచించాల్సింది ఈ రోజు గ్రామాలలో దిక్కుతోచక బలైపోతున్న దళిత జీవితాలని. 

రకరకాల పేర్లతో వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న నాయకులు, అధికారులను హెచ్చరించలేని పరిస్థితిలో ఇవ్వాళ ఉద్యమాలు (ఉంటే) ఉన్నాయని మనం అనుకోవాలా? ఒక్క అట్రాసిటీ కేసు బుక్ చేయించడానికి పెద్ద ఎత్తున పైరవీలు, ఉద్యమాలు చేసే పరిస్థితి దాపురించింది. ఇక దౌర్జన్యపరుడికి శిక్ష పడేదెప్పుడు? సిద్ధాంత రాద్ధాంతాలతో సమయం గడిపే మేధావి వర్గం లక్షింపేటలు జరిగినప్పుడు మాత్రం స్పందిస్తాయి. కానీ జరగబోయే లక్షింపేటలు ఎలా ఆపేది? రైట్, లెఫ్ట్ అని విడగొట్టబడి ఉన్న దళితులని ఐక్యం చేసేదెవరు? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకెప్పటికీ శాశ్వత నిద్రే. 

దళితుల ఆత్మగౌరవం, సమానత్వం, హోదా గ్రామాలలో నిలబడాలంటే వారికి భూములు తప్పనిసరి. వారికి చదువులు తప్పనిసరి. మౌలిక సదుపాయాలు కలిగిన విద్యా వ్యవస్థ అవసరం. ముఖ్యంగా అసైన్డ్ భూములను కాపాడుకోకపోతే ఎంతో మంది దళితులు రోడ్లపాలవుతారు. ఇప్పుడున్న భూములను పట్టా చేసుకోలేకపోతే, మిగిలి ఉన్న భూములను పేద దళితులకి పంచకపోతే ఎన్ని ప్రభుత్వ పథకాలున్నా సున్నానే. జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకపోతే జరిగేది పూడ్చలేని విధ్వంసం. 

ప్రతి గ్రామంలో దళాలుగా తయారయి మాల మాదిగ భేదాలు లేకుండా కలిసిపోయే సందర్భం, కష్టమే కావొచ్చు కాని అసాధ్యం మాత్రం కాదు. ఈ పేద దళిత కులాలతోటి కలిసి పోరాటం చేయకపోతే, ఇంక ముందుకు అడుగు వేసేది మాత్రం లేదు. ఎన్నికలప్పుడు వర్గీకరణలు, ఉద్యోగాలు అని ఓటు రాజకీయాలు కాకుండా దళితుల అభివృద్ధికి కృషిచేస్తూ ముందుకుపోకపోతే మరొక స్వత్రంత పోరాటం తప్పనిసరి అవుతుంది. 

నిజాయితీగా ఉన్న సంస్థలు లేవని కాదు కానీ ఒకటో రెండో ఉండడం వల్ల జరిగే నష్టాన్ని ఆపలేకపోతున్నాయి. పరిస్థితి ఈ విధంగా కొనసాగితే న్యాయం జరిగేది ఎన్నడు? ఎవరు బాధ్యత వహిస్తారు?
- సుజాత సూరేపల్లి 

Andhra Jyothi News Paper Dated : 29/08/2012

No comments:

Post a Comment