‘ఇవాళ నా కొడుకు లేడు. కానీ, రాష్ర్టంలో ఉన్న మాదిగ యువకుల్లో నా కొడుకు రూపం పదిలంగా కనిపిస్తున్నది. ఆయన కలగన్న వర్గీకరణను సాధించడమే నా కొడుకుకు అసలైన నివాళి’
-పొన్నాల యాదయ్య, సురేందర్ మాదిగ తండ్రి. (మాదిగ పొద్దు పుస్తకం నుంచి)
ఆరు దశాబ్దాలుగా అణగారిపోతున్న మాదిగ జాతి కోసం నేలరాలిన మండే సూర్యుడు సురేందర్ మాదిగ. పదిహేడు వసంతాల వర్గీకరణోద్యమంలో అసువులు బాసిన యువకిశోరం. రిజర్వేషన్ల వాటాలో సమన్యాయం జరగాలని చేసిన పోరాటంలో ముందుకురికిన కొదమసింహం. త్యాగాలు చేయడానికి వెనుకాడని మాదిగ జాతికి సురేందర్ మాదిగ ఒక మాదిగపొద్దు.
బ్రాహ్మణీయ మనువాద నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో ప్రతీసారి తనపై కులం చేసే అణిచివేతలను ధిక్కరిస్తూనే, ప్రతీ కులం తన కింది కులాన్ని తక్కువగా చూసే సంస్కృతి సజీవంగా ఉంది. అటువంటి సామాజిక వ్యవస్థలో ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుకోవడంలో కూడా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆటంకంగా మారింది. కిందికులాలు అభివృద్ధి చెందడానికి ఆధారంగా ఉన్న రిజర్వేషన్ ఫలాలను గుట్టుచప్పుడు కాకుండా అనుభవిస్తూ ఉండడం వల్ల దళిత కులాల్లో ని అణగారిన కులాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ అన్యాయాలను ప్రతిఘటించి రాష్ర్టంలో ఉన్న తొంభైలక్షలమంది మాదిగల అభివృద్ధి కోసం ముందుకొచ్చిందే వర్గీకరణోద్యమం.
మంద కృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ తదితరుల నాయకత్వంలో మొదలైన ఈ ఉద్యమం పదిహేడు సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం జరిపితే కేవలం నాలుగేళ్లు వర్గీకరణ ఫలాలను అందుకోగలిగారు. ఇలా అందుకోవడం కోసమే ఎంతోమంది మాదిగ యువ కులు ప్రాణత్యాగాలు కూడా చేయవలిసి వచ్చింది. ఉద్యమాల్లో పనిచేస్తూ అనారోగ్యంతో, మరో కారణంతోటో మరణించవచ్చు. కానీ లక్ష్యం కోసం ఉద్యమంలోనే అసువులు బాసిన చరిత్ర సురేందర్‌ది.
హైదరాబాద్ నగరంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన సురేందర్‌ది చిన్న నాటి నుంచి తెగించే మనస్తత్వం. తాను నమ్మిన విషయం సరైందని నమ్మితే, దాన్ని సాధించే వరకు అంకితభావం పనిచేయడం అతని సొంతం. ఈ తెగింపే మాదిగజాతి కోసం ప్రాణాలను సైతం అర్పించే త్యాగానికి సన్నద్ధం చేసింది. మంద కృష్ణ మాదిగకు అనుయాయుడుగా ఉంటూ మాదిగ యువసేనను ఏర్పాటు చేశాడు సురేందర్. ఒకరకంగా రాష్ర్ట రాజధానిలో జరిగిన దండోరా ఎమ్మార్పీఎస్ పోరాటాల్లో సురేందర్ మాదిగదే ప్రధాన పాత్ర. మాదిగల ఆర్తనాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోసుకుపోవడం కోసం తుది శ్వాసదాకా పోరాడాడు. ఉషామెహ్రా కమిషన్ నివేదికను అందించడం నుంచి సోనియా గాంధీని హైదరాబాద్‌లో అడ్డుకునే వరకు సురేందర్ చేయని పోరా టం లేదు.
తెలంగాణ ఉద్యమంలో ఎనిమిది వందల మంది తల్లులకు గర్భశోకం మిగలడానికంటే ముందే సురేందర్ మాదిగ తల్లి కాలిన పేగుదుఃఖాన్ని మోసింది. సురేందర్ తండ్రి కూడా పుట్టెడు దుఃఖాన్ని మోస్తూనే కొడుకు జీవితాన్ని ఒక పుస్తకంగా రూపొందించాడు. ఆ పుస్తకం పేరే మాదిగపొద్దు. కొడుకు లేడనే చేదు నిజాన్ని గొంతులోనే దాచుకొని తాను కూడా వర్గీకరణ ఉద్యమం కోసం నిలబడ్డాడు. రాష్ర్టవ్యాప్తంగా మరోసారి మాదిగలంతా సన్నద్ధం కావా లని ఆ పుస్తకంలో కోరిండు. సురేందర్ జీవితాన్ని తనకొచ్చిన కొద్ది చదువుతో హృద్యయంగా ఆ పుస్తకంలో పొందుపరిచాడు. అలాగే సురేందర్ త్యాగాన్నిస్మరిస్తూ రాసిన స్మృతి కవితలను కూడా ఈ మాదిగపొద్దు పుస్తకంలో పొందుపరిచాడు. అలా దళితసాహి త్య చరివూతలో ఇది ‘తొలిదళిత స్మృతి కావ్యం’గా నిలిచింది.
ఇప్పుడు మరోసారి వర్గీకరణ విషయం తెరమీదికొచ్చింది. చంద్రబాబు ప్రధానికి లేఖరాస్తమనే సరికి మాలలు మళ్ళీ అడ్డుకోవడం ఎలా? అని లక్ష ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం అవసరమైతే కొత్తపార్టీకూడా పెడతామని ప్రకటించారు. వర్గీకరణతో పాటు పిల్లల గుండెజబ్బులు, బహుజన కులాల ఐక్యత కోసం ఉమ్మడి వేదికలు వంటి అనేక కార్యక్రమాలకు దండోరా విస్తరిస్తే, మాలలు మాత్రం వర్గీకరణను అడ్డుకొని రిజర్వేషన్ ఫలాలు అడ్డంగా దండుకోవడం కోసమే ఎజెండాను రూపొందించుకున్నారు. సీమాం ధ్ర పెట్టుబడిదారులు ఐక్యమై తెలంగాణను అడ్డుకోవాలనుకుంటున్నట్టు, ఇవా ళ వివిధ పార్టీల్లో ఉన్న మాలలు కూడా ఏకమై మాదిగల పొట్టకొట్టాలని చూస్తు న్నారు.
వర్గీకరణ బిల్లును టెక్నికల్ సమస్యలను చూపించి సుప్రీంకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ, వర్గీకరణ డిమాండ్ సరైందా కాదా అనేది మాలలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకానీ ఎంతమంది సురేందర్‌లైనా చచ్చిపోనీ, మేము మాత్రం మారమంటే ఛాందస బ్రాహ్మణులకు మాలలకు తేడా ఉండ దని గుర్తించాలి. ఇక మాల మేధావుల్లోని చాలామంది వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాం అంటూనే తెర చేయాల్సిన కుట్రలన్నీ చేయడం ఏ విలువల కు, ఏ ప్రజాస్వామికతకు నిదర్శనమో ఆలోచించాలి. సురేందర్‌తో పాటు ఆనా డు గాంధీభవన్ మంటల్లో కాలిపోయిన దామోదర్ మాదిగ, మహేష్ మాదిగల త్యాగాలను కొనియాడిన మాలలు, వర్గీకరణ బిల్లుకు మాత్రం మద్దతు తెలుపలేకపోయారు. ఇలా సంకుచితంగా వ్యవహరించడాన్ని చరిత్ర ఏనాడు విస్మరించదు. కానీ, ప్రస్తుతం వర్గీకరణ కోసం ప్రధానికి లేఖ రాస్తానని అనడం వెనుక చంద్రబాబు కుటీల నీతి ఏమైనా ఉండొచ్చు. అయినా వర్గీకరణ డిమాండ్ న్యాయమైందా కాదా అని ఆలోచించకుండా వివిధ పార్టీల్లో ఉన్న మాలలు అడ్డుపడడం సమంజసమా?
తెలంగాణ ఎంతటి న్యాయమైన డిమాండో, వర్గీకరణ కూడా అంతే న్యాయమైందని తెలంగాణ మాలమహానాడుతో పాటు, సీమాంధ్ర మాలనేతలు కూడా గుర్తించాలి. సోదర దళిత జాతుల పొట్టగొడుతూ ఐక్యత అని నినదించడం కుహనా మేధావితనం.మాల మాదిగల మధ్య వైరుధ్యాలు పెంచడానికే ఈ కుట్రలు పనిచేస్తాయి. రిజర్వేషన్ల అసమపంపిణీ వల్ల ఏర్పడిన అభివృద్ధి సమస్యను పరిష్కరించకుం డా దళితుల మధ్య సయోధ్య సాధ్యం కాదు.
వర్గీకరణకు మద్దతు ప్రకటించలేని మాలలకు దళితులకు రాజ్యాధికారాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు ఎలా ఉంటుంది. అసలు మాదిగ మేధావులు మాలమాదిగల కుహనా ఐక్యతను కోరుకుంటున్నా రా, లేక ఎస్సీ,ఎస్టీ, బీసీలతో కూడిన విశాల దృక్పథంతో పనిచేయాలనుకుంటున్నారా అనేది మాలలు గ్రహించాలి. మాలలు వర్గీకరణను అడ్డుకోవడం కోసం మాత్రం దళితుల ఐక్యత అనే కుట్రపూరిత నినాదాన్ని వల్లెవేస్తున్నారు. కానీ, ఈ దేశమూలవాసులందరూ విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు, సాంస్కృతికంగా, రాజకీయంగా ముందడుగువేస్తూ రాజ్యాధికారదిశగా పోరాడాలని మాదిగ మేధావులు కోరుకుంటున్నారు. రిజర్వేషన్ల పంపిణీలో మాలమాదిగలే కాకుండా మిగిలిన దళిత కులాలన్నింటికి న్యాయం జరగాలి. అంతేతప్ప ఒక్క మాలలే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ, ఐక్యత గురించి మాట్లాడితే దొంగే దొంగ దొంగా అని అరిచినట్టు ఉంటది.
అధికారంలో ఉన్న పాలకుల వెంటబడి వర్గీకరణను సాధించుకోవాలి తప్ప, టీడీపీ ఆఫీసులో కమ్మనేతలకు శాలువాలు కప్పితే వర్గీకరణ రాదు. వర్గీకరణకు మేము అనుకూలమే అని వేదికల మీద ప్రగల్భాలు పలికే మాల మేధావులను కూడా ఈ సమయంలో నిలదీయాలి. అన్ని పార్టీలు మద్దతిచ్చిన వర్గీకరణ బిల్లు ఎందుకు పార్లమెంటు మెట్లు ఎక్కలేకపోతుందో ఎమ్మార్పీస్ నాయకత్వం ఆలోచించాలి. మాదిగజాతి బాగుపడాలంటే ఏబీసీడీ వర్గీకరణ ఒక సాధనమని గుర్తించి, సోనియాగాంధీకి సైతం ముచ్చెమటలు పట్టించి, చావును ముద్దాడాడు సురేందర్ మాదిగ. ఆ వీరుని ఆశయం, అతని తండ్రి చెప్పినట్టు వర్గీకరణ సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది.
-పసునూరి రవీందర్
(నేడు సురేందర్ మాదిగ జయంతి)
Namasete Telangana News Paper Dated : 17/08/2012
No comments:
Post a Comment