ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని అమలు చెయ్యడం నూతన ప్రజాస్వామ్యాన్ని అమలు చెయ్యడం కంటే కష్టమైన పని. ఈ అంశంపై సిద్ధాంత చర్చకే అందరూ భయపడే ఒక భయానక వాతావరణం ఈ దేశంలో ఉన్నది. ఈ ప్రశ్నలు లేవనెత్తడమే నేరమనే 'హిందూ నిబిడీకృతం' అగ్రకులాల్లో పుట్టిన అందరిలో కనిపిస్తోంది. కమ్యూనిస్టులు ఇందుకు మినహాయింపు కాదు.
'దళితులు ఏం చెయ్యాలి?' (ఆంధ్రజ్యోతి, జూలై 13) అనే శీర్షికన నేను రాసిన వ్యాసంపై చాలా మంది చాలా రకాల ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటగా దళితులకు హిందూ దేవుళ్ళు అండగా లేరా? హిందూ దేవతా మూర్తులు వారిపట్ల 'నరసింహులు' ఎలా అవుతారు? ఈ దేశపు పురాణాలన్నీ వారిని గుర్తించాయి కదా! అని అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటితోపాటు దళిత మిలిషియాను ప్రతిపాదించి దళితులను బిసిల మీదికి రెచ్చగొట్టడమే కదా? దళితులకు, బిసిలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రతిహింస ద్వారా పరిష్కరిస్తామా? లేక చర్చల ద్వారా, మితృత్వం ద్వారా పరిష్కరిస్తామా? అన్న రెండో రకం ప్రశ్నలు ముందుకొచ్చాయి. మూడవ తరహా ప్రశ్నలుగా దళిత మిలిషియాలను ఎవరు తయారుచెయ్యాలి? రాజ్యమా? ప్రజలే చేసుకోవాలా? రాజ్యం తన పోలీసు యంత్రాగానికి అతీతంగా లేదా దానికి భిన్నంగా మిలిషియాను ఎలా తయారుచేస్తుంది? అనేవి చర్చకు వచ్చాయి.
మన జీవన కాలంలో (పురాణాల్లో ఏముందనే సంగతి అటుంచితే) హిందూ దేవతలంతా విగ్రహాల రూపంలో, వారి చుట్టూ ఉన్న కథలు అన్ని కులాల ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నాయి. అలాగే ముస్లింల అల్లా వారి జీవితాల్లో ప్రతి అంశంతో ముడిపడి ఉన్నాడు. క్రిష్టియన్లకు వారి దేవుడు (యెహోవా) జీసస్ వారి ప్రతినిత్యపు జీవితాలతో ముడిపడి ఉన్నాడు. హిందూ విగ్రహ దేవతల చుట్టూ ఆచరణాత్మకంగా నిర్మించిన మానవ సంబంధాలు కులాల వారీగా, కులవ్యత్యాసాలతో అల్లిక చేయబడి ఉన్నాయా లేక హిందూ మతం చుట్టూ బతుకుతున్న వారంతా, దళితులతో సహా, ఆచరణ రంగంలో సమానులు, మత రంగంలో స్వేచ్ఛా జీవులు అనే విలువలు ఉన్నాయా? అలా ఉంటే కుల దొంతర్ల హెచ్చు తగ్గులు, అంటరానితనం సమాజంలో ఉంటాయా? ఒక దేవుడు గాని, లేదా మతంగాని మనుషులకెప్పుడు అత్యవసరమవుతుంది? వారికి ఆకస్మికంగా అతిపెద్ద కష్టం దాపురించినప్పుడు.
లక్షింపేటలో దళితుల హత్యాకాండ జరుగకముందు వారిని ఎవరు రక్షించాలి? అది జరిగిన తర్వాత ఎవరు ఎవరిని ఆదుకోవాలి? ఒక కులగుంపు మీద దారుణమైన దాడి జరిగినప్పుడు వారు నమ్ముకునే దేవుడు, లేదా ఆ నమ్మకం చుట్టూ ఏర్పడ్డ మతం అతి వేగంతో పోయి బాధితుల్ని ఆదుకోవాలి కదా? ఈ దేశంలో దళితుల మీద దాడిచేసి చంపాక, బతికున్న బాధితుల్ని హిందూ పూజారి వర్గం, మత గురువులు అక్కున చేర్చుకొని ఆదుకున్న దాఖలాలు ఉన్నాయా? ఒక మతంలో ఉన్న ప్రజలకు అకస్మాత్తుగా ప్రమాదమేర్పడినప్పుడు వారు మొదట తలదాచుకోవలసిన స్థలమేది? ప్రపంచమంతటా కూడా బాధితులకు వారు భాగస్వాములైన మత సంస్థలు వారికి ఆశ్రయమిస్తాయి. ఆదరించి అన్నం పెడతాయి. మతాధిపతులు, పూజారులు వారిని అక్కున చేర్చుకుని ఆదరిస్తారు. అప్పుడే ఆ దేవుడు వారి పక్షాన ఉన్నట్లు గదా!
కుల వ్యవస్థ పదిలంగా ఉండాలనుకునేవారంతా అమానుష విలువలుగల వారే. వారు సన్యాసుల రూపంలో ఉన్నా, పూజారుల రూపంలో ఉన్నా కుల వ్యవస్థను సమర్థించేవారే. అసమానతలను, హత్యలను పోషించేవారే. అది నిత్యానంద స్వామి అయినా, పరమానందస్వామి అయినా, మహదానంద స్వామి అయినా. ఈ సమాజం ఇంత దుఃఖంతో నిండి ఉంటే వాళ్ళు అసలు పేర్లు మార్చుకొని ఆనందాలను ఎలా అనుభవిస్తున్నారు? ఈ సన్యాసుల పట్ల శూద్ర, దళిత కులాల్లో ఎంత గౌరవ రాహిత్యం ఉందో ఒక్క ఉదాహరణతో చూద్దాం.
నేను మా ఊళ్ళో ఐదవ తరగతి చదువుతున్నప్పుడు రోడ్డు మీద ఒక పిల్లాడితో తగవుపడుతున్నాను. దారినపోయే ఒక పెద్ద మనిషి ఆ పిల్లాడు చదువుగాని, పనిపాట గాని లేని 'సన్నాసి' వాడితో ఎందుకు కొట్లాట పొమ్మన్నాడు. గ్రామాల్లో 'సన్యాసి' అనే పదానికి పనిచెయ్యని వ్యక్తి అని శరీర శుభ్రత కలిగి ఉండని వ్యక్తి అనే అర్థం ఎందుకుంది? కష్టపడి పనిచేసే వ్యక్తిని, పదిమందికి సహాయపడే వ్యక్తిని 'సంసారి' అని పిలుస్తారు.
హిందూ పూజారి వర్గం, మఠాధిపతులు అన్ని కులాల ప్రజల పట్ల గౌరవం కలిగి ఉంటే వారితో కలిసిమెలిసి తిరుగుతూ అన్ని కులాల వారికి మానవ సమానత్వ విలువల్ని, కులాల వారీగా హత్యలు చేసుకునే విలువలకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యాలి కదా? ఈనాడు జరుగుతున్న చర్చ వ్యక్తి తగాదాల్లో హత్యల గురించి కాదు. ఒక కులంవారు వారి కింది కులం వారిని కులదృష్టితో హత్య చెయ్యడం గురించి. లక్షింపేట హత్యాకాండ భూమి తగువులతో మాత్రమే జరిగింది కాదు. కులపరంగా జరిగింది కూడా. అందుకే ఇదే పరిస్థితి కొనసాగితే మేమొక ప్రత్యేక దేశం కోసం పోరాడుతామంటున్నారు దళిత నాయకులు. లేదా తిరుగుదాడులకు దిగుతామంటున్నారు. అందుకు వారిని తప్పుపట్టగలరా?
ఇక్కడ హత్యకు గురయ్యేవారు దళితులే ఎందుకవుతున్నారు? దొంతర వారీ వ్యవస్థలో దళితులకు ఓబీసీలకు ఉన్న వైరుధ్యాలు ఎటువంటివి? వాటిని ఎలా పరిష్కరించాలనే సమస్య ముందుకొస్తుంది. అంటరానితనానికి, అంటగలిగే శూద్రత్వానికి మధ్య ఒక కీలకమైన వైరుధ్యముంది. కానీ అది ప్రధాన వైరుధ్యం కాదు. ప్రధాన వైరుధ్యం బ్రాహ్మణత్వానికి, శూద్ర+దళిత్వానికి మధ్య ఉంటుంది. బ్రాహ్మణత్వం కేవలం బ్రాహ్మణుల మధ్యనే ఉండదు. దాని వేళ్ళు శూద్ర కింది కులాల వరకు పాకి ఉన్నాయి. దళితుల్లో దాని వాసన ఉంది తప్ప బ్రాహ్మణిజం స్వయంగా పనిచెయ్యడం కష్టం.
ఓబీసీలు బ్రాహ్మణిజానికి బానిసలు. దళితులు ఆది నుంచి దానిపై తిరుగుబాటుదారులు. బ్రాహ్మణిజపు సిద్ధాంతం పై కులాల నుంచి కిందికి పాకుతుంది. బిసిలు దాని కండబలం మాత్రమే. బిసి మేధస్సు(అది ఉత్పత్తి రంగంలో పనిచేసినప్పటికీ)ను బ్రాహ్మణిజం గుర్తించదు. దళితులు బుద్ధిజాన్ని ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నాక బ్రాహ్మణిజం దాన్ని గుర్తించక తప్పడం లేదు. అందుకే బిసిలను ఒక సిద్ధాంత శక్తిగా మలచకులండా రాజకీయ అధికారం గురించి మాత్రమే మాట్లాడితే లక్షింపేటలు చాలానే జరుగుతాయి.
బిసి నాయకుల్లో బ్రాహ్మణిజం అనుకూల చైతన్యం దళిత వ్యతిరేక చైతన్యం అన్ని రాజకీయ పార్టీల్లో చూస్తున్నాం. ఇక్కడే మహాత్మా ఫూలేను సిద్ధాంత రీత్యా కూడా బిసిల్లో ప్రవేశపెట్టాలి. ఆయన జీవితకాలంలో అత్యధిక భాగం అతి శూద్రులు (అంటే దళితుల) కోసం పని చేశారు. ఆయన ఒక్క శూద్రుల కోసం ఎప్పుడూ పని చెయ్యలేదు. అందుకే అంబేద్కర్ ఆయన్ని గురువుగా భావించారు. ఆయన సిద్ధాంతాన్ని విస్తృతపర్చారు. బిసి మేధావి వర్గం ఇక్కడే జాగ్రత్తగా అడుగులెయ్యాలి. ఫూలే సిద్ధాంతమంటే రాజకీయ అధికారమొక్కటే కాదు సామాజిక సంస్కరణ కూడా.
ఇక చివరిది దళిత మిలిషియా సమస్య. భోపాల్ డాక్యుమెంటు ఆనాటి దిగ్విజయ్‌సింగ్ వేదికపై ఉన్నప్పుడే దాడులకు గురయ్యే అవకాశమున్న దళితవాడలో 8 నుంచి 10 వరకు యువకులకు శిక్షణ ఇచ్చి సాయుధుల్ని చేయాలని సూచించింది. దానికి ఆనాటి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కూడా. ఆత్మరక్షణ దళాలు దాడి దళాలు కావు. ఆత్మరక్షణ చట్టబద్ధ చర్య కూడా. ఐపీసీలో కూడా ఆత్మరక్షణకు తావుంది. అందుకే ఆత్మరక్షణ కోసం కొంతమందికి లైసెన్స్‌డ్ తుపాకులు, పిస్తోళ్ళు కలిగి ఉండే హక్కు ఇస్తుంది ప్రభుత్వం. ఐతే అది ధనవంతులకు మాత్రమే ఇస్తున్నారు.
ఈ విధమైన ధనవంతులు భారతదేశంలో సాధారణంగా అగ్రకులాల వారే. కానీ దాడులకు, హత్యకు గురయ్యే దళితులకు 'ఆత్మరక్షణ ఆయుధాలు' ప్రభుత్వమే ఇవ్వాలంటే ఇంత భయమెందుకు? ప్రజాస్వామ్యంలో ఆత్మరక్షణ ఒక నైతిక హక్కు. ఈ హక్కు ధనవంతులకు, గూండాలకు ఎందుకుండాలి? కుల వ్యవస్థలో అట్టడుగున ఉండి అంటరానితనానికి, అణచివేతకు, హత్యలకు గురయ్యే దళితులకు ప్రభుత్వం సాయుధ ఆత్మరక్షణ హక్కు ఎందుకివ్వకూడదు?
ఈ హక్కు దళితులకిస్తే సమాజంలో శాంతి నశిస్తుందని ప్రబోధించే సన్యాసులు, వారు చస్తేనే శాంతి ఉంటుందని కోరుకోవడమే కదా! ఏ సమాజంలోనైనా అణగారిన ప్రజలు సమానత్వం సాధించుకునే క్రమంలో కొంత ప్రతిహింస తప్పదు. పని చెయ్యకుండా వనరులను తినేవారు పని చెయ్యాలని ప్రభుత్వం శాసిస్తే హిందూ వ్యవస్థ ఆ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంది. ఈ మధ్య కొంతమంది బిసి, ఎస్‌సిలు పీఠాధిపతులు, సన్యాసులు అయ్యారు. వీరికి కూడా సంఘ సంస్కరణ లక్ష్యం లేదు. వీరిది కూడా నిత్యానంద, పరమానందల లక్ష్యమే. అగ్రకులాలకు అండగా ఉండి దళితులపై దాడులకు పరోక్షంగా సహకరించడమే.
తప్పుడు పనులు చేసి పట్టుబడితే 'నిత్యానంద' లాగా జైలుకో, విదేశాలకో పోవడమే. ఒక కుటుంబాన్ని బాగు చెయ్యాలనుకున్నా, ఒక మతాన్ని బాగు చెయ్యాలనుకున్నా ప్రజాస్వామిక విలువల్ని కేంద్రంగా పెట్టుకొని సంస్కరించాల్సిన రోజులివి. హిందూ దేవతలు హత్యల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నిస్తే 'దుష్టులను శిక్షించడం శిష్టుల' కర్తవ్యం కనుక దేవతలు లోకకళ్యాణం కోసం హింస చేశారనే హిందూ మేధావి వర్గం లక్షింపేటలో దుష్టులెవరో, శిష్టులెవరో చెప్పాలి కదా! నా దృష్టిలో అక్కడి అగ్రకులాలవారు దుష్టులు, అక్కడి దళితులు శిష్టులు. ఇక్కడ దుష్టులు శిష్టులను చంపారు. వారి సిద్ధాంతాలనే ఇక్కడ రాజ్యం అమలుచేస్తే ఆయుధాలు ఎవరి చేతి లో ఉంచాలి? ఎవరి చేతుల నుంచి ఆయుధాలు తీసెయ్యాలి? హిం దూ వ్యవస్థ హింసా సిద్ధాంతాన్ని దోపిడీదారులకు అనుకూలంగా నిర్వచించింది. కనుకనే హింసాయుత కులవ్యవస్థను కాపాడింది.
ఈ ప్రక్రియను దళితులుగాని, ఇతర కింది కులాల వాళ్ళు ఎంతకాలం భరించాలి? కుల వ్యవస్థలోని హింస ఎంత ఘోరమైందో దాన్ని అనుభవించేవారికే తెలుసు. ఈ దేశంలో కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఈ హింసను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ దేశంలో విప్లవమొస్తే మావో చెప్పినట్లు విప్లవంలో రైతులు భూస్వాముల ఇండ్లను ఆక్రమించుకొని వాళ్ళ పరుపులపై రైతు కూలీలను బొర్లించడం సాధ్యమే కాని దళితుల చేత హిందూ గుడులను ఆక్రమింపజేసి వారిచే గుడి వ్యవస్థ నడిచేట్లు చూడడం అసాధ్యమైన పని. మావోయిస్టులు కూడా హిందూ పూజారి వర్గాన్ని, పీఠాధిపతులను చూడగానే శపిస్తారని భయపడిపోవలసిందే! ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని అమలు చెయ్యడం నూతన ప్రజాస్వామ్యాన్ని అమలు చెయ్యడం కంటే కష్టమైన పని. ఈ అంశంపై సిద్ధాంత చర్చకే అందరూ భయపడే ఒక భయానక వాతావరణం ఈ దేశంలో ఉన్నది. ఈ ప్రశ్నలు లేవనెత్తడమే నేరమనే 'హిందూ నిబిడీకృతం' అగ్రకులాల్లో పుట్టిన అందరిలో కనిపిస్తోంది. కమ్యూనిస్టు నాయకులు ఇందుకు మినహాయింపు కాదు.
జార్ఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు హింసను ప్రతిఘటించేందుకు ఆదివాసులలో 'సాయుధ' సల్వాజుడుంను ఏర్పాటు చేస్తే ఈ దేశంలో హిందూత్వవాదులంతా ఆ ఆదివాసీ మిలిషియాను సమర్థించారు. అటువంటి దళిత సల్వాజుడుం శ్రీకాకుళంలో తయారు చేస్తే పీఠాధిపతులకు, మఠాధిపతులకు ఎందుకు భయం? కులహింస ఈ దేశంలో మర్రి ఊడల్లా సమాజమంతా పాకింది. ఆ ఊడ ల్ని పీకేదెట్లా? మత హింసను, కుల హింసను కూలంకషంగా చర్చింలేని దేశం ఏం దేశం? ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఏం పార్టీలు? ఈ దేశ సిద్ధాంత రంగాన్ని చదువురాని సన్యాసుల కొదిలేసి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ఏం మార్పును తెస్తాయి?
ఇప్పుడు దేశం నిండా కులహింస దొంతర్లవారీగా నిండి ఉంది. దీన్ని సన్యాసులంతా సాంప్రదాయమంటున్నారు. మరి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? అగ్రకుల హింస, దళిత ప్రతిహింసపై సిద్ధాంత చర్చల్లోకి రారేమి? ఈ దేశంలో కుల హింసను అంతమొందించాలంటే మావో చెప్పినట్లు 'వంద ఆలోచనలు సంఘర్షిస్తే సరిపోదు. వేల ఆలోచనలు సంఘర్షించాలి'. ఈ సమస్యకు పరిష్కారం సన్యాసంలో లేదు. అది సంసారత్వంలో ఉంది. అదీ దళిత సంసారత్వంలో ఉంది.
- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated : 17/08/2012
No comments:
Post a Comment