Thursday, October 13, 2011

సామాజికవాదం కుట్ర కాదు - దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 15/10/2011

సామాజికవాదం కుట్ర కాదు
- దుడ్డు ప్రభాకర్

ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనుల సమ్మె తీవ్రతరమౌతోంది. సామాజిక తెలంగాణ నినాదం కూడా అంతే తీవ్రంగా ముందుకొస్తోంది. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం అనేక కుల సంఘాలు వివిధ ఉద్యమ జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణను ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా గుర్తించిన వారు సామాజిక న్యాయం డిమాండ్‌ను ఒక ప్రజాస్వామిక నినాదంగా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఈ వివాదం ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది?

వచ్చేది దొరల తెలంగాణ అయినపుడు తెలంగాణలో 90 శాతంగా ఉన్న దళితులు, బిసిలు, ఆదివాసీలు, మత మైనార్టీలకు ఒరిగేదేమీ లేదన్న వాదన చర్చనీయాంశమైంది. తెలంగాణలోని సామాజికోద్యమ నాయకులు, భౌగోళిక తెలంగాణ కోసం ఉద్యమిస్తూనే ఆ తెలంగాణలో సామాజిక న్యాయం అమలు కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనేక ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారు. అందుకు వారిని తెలంగాణ వ్యతిరేకులుగా భౌగోళిక తెలంగాణ వాదులు చిత్రీకరిస్తున్నారు.

సీమాంధ్ర రాజకీయ నాయకులకు, సామాజికోద్యమ నాయకులకు ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అయితే అందర్ని ఒకగాటన కట్టి సామాజిక తెలంగాణ అనడం వెనుక 'తెలంగాణ రాకుండా అడ్డుపడే కుట్ర దాగుంది' అనడం ఎంతవరకు సబబు? ఇప్పటిదాకా సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను ఉమ్మడిగా దోచుకొని, అణచివేసి కారంచేడు, చుండూరు, వేంపెంట లాంటి నరమేధాలకు కార కులైన సీమాంధ్ర అగ్రకుల, భూస్వామ్య, పెట్టుబడిదారీ రాజకీయ నాయకులు, వారి పంచన జేరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం గందరగోళం సృష్టిస్తున్న వాళ్ళను, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ సామాజిక తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళను ఉమ్మడిగా నిందించడం తగదు.

తెలంగాణ అగ్రవర్ణాల దొరలు ఒకప్పుడు అణగారిన కులాలను దోపిడీ, అణచివేత, అత్యాచారాలకు గురిచేసిన వారు కాదా? అందుకే రేపు ఏర్పడబోయే తెలంగాణలో సబ్బండ కులాల బతుకులకు భరోసా అడుగుతున్నారు. ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులకు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయనే విషయం స్పష్టంగా కనపడుతుంది. ఇవేమీ కానివారు వారి కూలి బతుకుల్లో, బతుకు దెరువులో మార్పులు కోరుకుంటున్నారు. సీట్లలో వాటా అడిగిన సామాజికవాదులు తెలంగాణ ద్రోహులు ఎలా అవుతారు? తెలంగాణ ప్రజల చైతన్యం గురించి, సాయుధ రైతాంగ పోరాటాల గురించి ఉపన్యాసాలిస్తూ అందరం తెలంగాణ ముద్దు బిడ్డలమేనని ఉపన్యాసాలిచ్చేవారు ఇటీవల జరిగిన కోటి బతుకమ్మల సంబరాల్లో దళిత మహిళల స్థానం ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెబుతారు?

1990 దశకంలో తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభలు తెలంగాణ కోసం ఉద్యమించాయి. ఆ ఉద్యమ నాయకత్వం సమన్యాయం పాటిస్తుందనే అచంచల విశ్వాసముండడం మూలాన అప్పుడు సామాజిక తెలంగాణపై చర్చ రాలేదు. అయితే నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రతినిధిగా ప్రాచుర్యం పొందిన 'దొర' పీడకవర్గ ప్రతినిధి. తన కుటుంబ సభ్యుల ఇష్టారాజ్యంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఉద్యమం చల్లారినపుడు తల నరుక్కుంటాను, మెడ కోసుకుంటాను, తెలంగాణ రాకపోతే ఆత్మాహుతి చేసుకుంటాను అంటూ తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ఆత్మహత్యలకు కారణమవుతున్నారు.

కెసిఆర్‌ను గాని, ఆయన కుటుంబ సభ్యుల్నిగాని, వారి అనుయాయుల్ని గాని ఏ చిన్న మాటన్నా మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానపరచినట్లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షులు గద్దర్‌పై కూడా ఎగబడి ప్రకటనలు ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. సామాజిక తెలంగాణవాదులమీద ఎంత తీవ్రమైన పదజాలంతో దాడి జరుగుతుందో, భౌగోళిక తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసే వారిపై కూడా అంతే తీవ్రంగా దాడి జరుగుతోంది.

తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడుతున్నవారిని దొరల తొత్తులుగా అభివర్ణించడం పొరపాటు. సామాజిక, భౌగోళిక తెలంగాణవాద రెండు శిబిరాల మధ్య ఇలాంటి పరస్పర నిందాపూర్వక దాడులు దురదృష్టకరం. కుల అస్తిత్వ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన రూపంలోని అస్తిత్వ పోరాటాలు రెండూ సమకాలీన గొప్ప ప్రజాస్వామిక ఉద్యమాలుగా గుర్తింపు పొందినవే. అయితే ఇవి రెండూ ఒకదానికి మరొకటి పోటీగా నిలబడడానికి అగ్రకుల భావజాలమే ప్రధాన కారణం. దానికితోడు బూర్జువా రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు, వారి ప్రయోజనార్థం కొందర్ని ఇలాంటి ఉద్యమాల్లోకి ప్రవేశపెట్టి పెంచి పోషిస్తూ ఉంటారు.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ రెండు ఉద్యమాలలోకి వారి చొరబాట్లు ఎక్కువయ్యాయి. వారు ఉద్యమాల్ని గందరగోళపరచి తమ పబ్బం గడుపుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఈ సంక్లిష్ట సందర్భంలో ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంతో ఉన్నవారు విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుంది. సమన్యాయం గురించి పలికే గొంతు ఏదైనా, పలికించే వారెవరైనా సామాజిక న్యాయం ఆకాంక్ష అట్టడుగు కులాల ప్రజల్లో ఉందని మాత్రం మరచిపోవద్దు. ఇప్పుడు నడుస్తున్న చర్చలో సామాజిక తెలంగాణ ఆకాక్షించేవారు తెలంగాణ ద్రోహులుగా వక్రీకరించబడుతుంటే, భౌగోళిక తెలంగాణ కోసం ఆరాటపడేవారు నిజమైన తెలంగాణ సాధకులుగా కీర్తించబడుతున్నారు.

తెలంగాణలోని సామాజిక అణచివేతకు, అసమానతలకు అంతిమ పరిష్కారం ప్రజాస్వామిక తెలంగాణలోనే సాధ్యమని నమ్ముతున్నారు కాబట్టి, ఈ సున్నిత వివాదం పట్ల సునిశిత పరిశీలనా దృష్టితో వ్యవహరించవలసి ఉంటుంది. భౌగోళిక తెలంగాణ కోసం పాలకవర్గాలతో అంటకాగేటపుడు లేని 'అంటు' సామాజిక తెలంగాణవాదుల్ని కలుపుకుని పోయేటపుడు ఎందుకుండాలి? ఈ వైఖరే అనేకమంది అవకాశవాదుల పుట్టుకకు కారణమవుతుందని నిజమైన తెలంగాణ ఉద్యమకారులు గ్రహించాలి.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి

1 comment: