Saturday, December 31, 2011

ఈ దాడులు ఇంకెన్నాళ్లు?



మహిళలు సమాజంలో సగము, కష్టాల్లో సగము, కన్నీళ్లల్లో సగము. కానీ హక్కుల్లో మాత్రం జీరో. ఇది నేటి పురుషాధిక్య సమాజానికి అద్దం పడుతోంది. డీజీపీ దినేష్‌రెడ్డి అన్న వ్యాఖ్యలు నాగరిక సమాజానికి తలవంపు. వినయంతో ఉన్న మహిళల వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడినా మాటలు చూ స్తుంటే తన నియంతృత్వ పోకడను చెప్పకనే చెప్పినట్టుంది. తమ తప్పులను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తూ, అధికార బలంతో ఏమి మాట్లాడిన ప్రశ్నించేవారు లేరనే విధంగా వ్యవహరించారు. మహిళలపై హింస గురించి, ‘డ్రెసింగ్ వల్లే ఇదం తా జరుగుతుందే కానీ ఇందులో మగవాళ్ల తప్పేమీ లేద’ని చెప్పుకొచ్చారు. స్త్రీల డ్రెస్సింగ్ గురించి ఒక బాధ్యతాయుతమైన డీజీపీ హోదాలో ఉండి ఇలా మాట్లాడడం మంజసమేనా? ఇలాంటి దృక్పథం ఉన్నందుకు సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా మహిళలకు ఈ రోజు రక్షణ లేకుండాపోయింది. అలాంటప్పుడు ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? వాళ్ల ప్రతాపం అంతా ఎక్కడ చూపిస్తున్నారు? ఏమీ తెలియని అమాయకులపై, మహిళలు అని కూడా చూడకుండా ఇష్టము వచ్చినట్లుగా ఖాకీ కర్కశా న్ని చూపిస్తూ, లాఠీలను ఝుళిపిస్తూ ఆర్భాటాలు చేస్తారు కదా? ఉనికిలో లేని కొత్త కొత్త చట్టాలతో ప్రజలను వేధింపులకు గురిచేయడం మినహా వారి అధికారాన్ని ఎప్పుడైనా మంచికి ఉపయోగించారా? రోజు రోజుకూ పెరుగుతున్న నేరాలతో జనం గగ్గోలు పెడుతుంటే..పోలీసు వ్యవస్థ నిద్రపోతోందా? లేక నిద్రపోతున్నట్లు నటిస్తుందా? ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఖాకీ దుస్తులు? సామాన్య జనాల మీద ప్రయోగించటానికి మాత్రమే కాదు కదా? మహిళలపై పెరిగిపోతున్న దాడులు, హత్యలు, ఆకృత్యాలకు బాధ్యులైన వారిని పట్టుకోవాల్సిన కనీస బాధ్యతను మరిచిపోయింది పోలీసు వ్యవస్థ. ‘నవ్విపోదురు గాక మాకేంటి’ అన్న చందంగా ఈ రోజు పోలీసు వ్యవస్థ తయారైంది. పాశ్చాత్య సంస్కృతిని, నేర సంస్కక్షుతిని, హత్యా రాజకీయాలను ఈ ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నది.నేరాలను అరికట్టే పెద్దలను వదిలి పేదలను బలిచేస్తున్నది. చట్టాలను సక్రమంగా అమలు చేసి శాంతిభవూదతలను కాపా డకుండా.. నిర్లక్షం వహిస్తూ.. చోద్యం చూస్తున్నది. నేరస్తులపట్ల కఠినంగా వ్యవహ రించకుండా చూసీ చూడనట్లుగా ఉంటూ పరోక్షంగా సమాజాన్ని నేరమయం చేస్తున్న ది. నిజంగా ‘అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగినప్పుడే’ ఈ దేశానికి నిజమైన స్వాతం త్య్రం వచ్చినట్లు అన్నారు గాంధీజీ. అర్ధరాత్రి కాదు కదా పట్టపగలే అడుగు బయట పెట్ట లేని దౌర్భగ్య పరిస్థితి ఈ రోజు సమాజంలో నెలకొని ఉంది. దీనికి కారణం ఈ పాలకుల అలసత్వం, పోలీసుల నిర్లక్ష పూరిత వైఖరే కారణం. ఇది ఇంతేలే అని ఊరుకోవటం కాదు, ఈ సమాజం మారనంత వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. దీనికి ప్రధా నంగా పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం, మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించవలసి ఉంటుంది. 

ఈ నేరాలు- ఘోరాలు మహిళల మీద జరగడానికి ఎవరు బాధ్యులు? ఈ పాలకులా? పోలీసు వ్యవస్థా? నేర రాజకీయాలను పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులా? ఎవరు ? ఎవరు దీనికి జవాబు ఎవరు చెబుతారు. ఫ్యాషన్ షోలు, పబ్బులు, క్లబ్బులకు విచ్ఛలవిడిగా లైసెన్సులు ఇచ్చి విశృంఖలత్వాన్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తున్నది. అశ్లీలంగా చూపించే నీచ సంస్కృతిపై సరియైన నియంవూతణ లేకపోవడం ఈ సమాజపు దౌర్భాగ్యం. ఈ కుళ్ళి కంపుకొడుతున్న సిద్ధాంతాలతో శిథిలమయిన ఈ వ్యవస్థను రూపు మాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈ పాలకులు ప్రజలకే సమస్యగా మారారు. మహిళల మీద అత్యాచారాలు జరగడానికి కారణం, వారు ధరించే వస్త్రధారణే అనడం మహిళలను కించపరచడమే! ఏది ఏమైనప్పటికి డిజీపీగారు ఇప్పటికయినా మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదా యావత్తూ మహిళా లోకం తిరగబడుతుంది. ఇప్పటికైయినా డీజీపీ గారు తన మాటలను వెనక్కి తీసుకోవాలి. లేదా మహిళలు చైతన్యంతో ఒక్కటైయితే ఒక మహత్తరశక్తిగా ఎదిగి పురుషాహంకారాన్ని ఎదిరించే రోజు వస్తుంది. స్త్రీ తల్లిగా, చెల్లిగా, అక్కగా, మనిషిగా గౌరవించే నాగరి క సమాజాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. స్త్రీ ని అశ్లీలంగా చూపించే నీచ సంస్కృతిపై తిరగబడాలి. ‘స్త్రీ’ కి మనసుంది. గౌరవించండి. స్త్రీ కి మెదడుంది అలోచింప నివ్వండి’ అనే నాగరిక సమాజం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో మహిళల హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినప్పుడే మనందరం కోరు కున్న ఓ మానవీయ సమాజం వస్తుంది. ఎవరికి వారు నిబద్ధతతో ఆలోచించాలి. ఆచరించాలి. చిన్నతనం నుంచి పిల్లలు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతిపౌరు డూ బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరు తమవంతుగా మంచి సమాజం కోసం, మార్పు కోసం విలువలతో కూడిన మనుషులుగా ఎదగడానికి ఆరోగ్యకర మైన వాతావరణం కల్పించాలి. పురుషాధిక్య భావజాలంతో మాట్లాడటం మాన వీయతకే మాయని మచ్చ. సాటి మనిషిని మనిషిగా గౌరవించే విలువలతో కూడిన సమాజం కోసం అందరూ పాటు పడాలి. నేరాలు, ఘోరాలు ఆకృత్యాలు, నేర ప్రవృ త్తి రాజకీయాలు, నియంతృత్వ పోకడలులేని, మంచి సమాజం కోసం పాటు పడాలి. దీనికోసం నేటి నుంచే అడుగులు వేద్దాం. మానవీయ సమాజం కోసం కల లు కనడమే కాదు కార్యాచరణతో ముందుకుపోదాం. అమానవీయ పురుషస్వా మ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేద్దాం. 

-రంగనేని శారద
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
Namasete telangana news paper Dated 1./1/2012 

సకల జనులకు విద్య



విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమంలో ‘అందరికి విద్య’ అన్న అంశానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. 21వ శతాబ్దంలోకి ప్రవేశించిన ఒక దశాబ్ద కాలం తర్వాత కూడా ఈ లక్ష్యం అందుబాటులోకి రాలేదు. మానవజాతి అక్షరాన్ని కనుగొని వేల సంవత్సరాలు దాటుతున్నా ఇంకా అక్షర జ్ఞానం లేకపోవ డం, కళ్లున్నా కళ్లముందు రాసిఉన్న అక్షరాలని చదవలేకపోవడం ఎంత విషాదం! చదవడమే విద్య అని కాదు. విద్య, విజ్ఞానము మనిషి శ్రమ మీద ఆధారపడి, శ్రమ నుంచి వచ్చిన అనుభవ సారంలో ఉంటుంది. కాని ఆ మనిషికి అవి అందుబాటు లోకి రాకపోవడం పెద్ద విషాదం. అక్షరాలు నేర్చుకోకూడదని ఆంక్షలు పెట్టిన బ్రాహ్మణ మత ధర్మాన్ని మనం ధ్వంసం చేయా లి. భౌతిక పరిస్థితులు మారుతూ సామాజిక సంబంధాలు మారుతున్న క్రమంలో కూడా ‘అందరికి విద్య’ అనే విలువ ఆచరణలోకి రాకపోవడాన్ని విశ్లేషించుకోవాలి. 
మన దేశంలో ఉత్పత్తి శక్తుల్లో మార్పు వచ్చినా ఉత్పత్తి సంబంధాలలో(విద్య అందులో భాగం) మార్పు రాకపోవడానికి భూస్వా మ్య, వలసవాద సంబంధాలు గుణాత్మకంగా మారకపోవడమేనన్న సూత్రీకరణ ఆర్‌ఎస్ రావు చేశాడు. అభివృద్ధికి సంకేతమైన భారీ సాగునీటి ప్రాజెక్టులను ఉదహరిస్తూ, ఆర్‌ఎస్ రావు హిరాకుడ్ డ్యాం ‘అభివృద్ధి’కి ఒక పెద్ద సంకేతమైనా, దీపం కింద చీకటిలా ఆ ప్రాజెక్టు చుట్టూ జీవించే మనుషుల లో మరీ ముఖ్యంగా సామాజిక సంబంధాలలో ఎలాంటి గుణాత్మక మార్పు రాకపోవడమేకాక, కొన్ని సందర్భాలలో ఆ సంబంధాలు కొంత వెనక్కి కూడా పోయిన ఉదంతాలను చూపుతూ వచ్చారు. అందుకే పరిక్షిశమలు వచ్చినా, ప్రాజెక్టులు కట్టినా, అంతర్జాతీయ విమానాక్షిశయాలు వచ్చినా, కేంద్రీయ విశ్వ విద్యాలయాలు స్థాపించినా..వీటి చుట్టు నిరక్షరాస్యులైన ప్రజలు చాలా సంఖ్యలో ఇప్పటికీ ఉన్నారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం చుట్టు వేలాది మంది నిరక్షరాస్యులుండడం విశ్వవిద్యాలయానికి సిగ్గుచేటు అని భావించి, అప్పటి వైస్ చాన్స్‌లర్ కోట హరినారాయణ విశ్వవిద్యాలయ పరిధిలో జీవిస్తున్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులు చేయవలసిన బాధ్యత విశ్వవిద్యాలయం చేపట్టాలని కృషి చేశారు. 

దాంట్లో మా లాంటి వాళ్లు కూడా భాగస్వాములమయ్యాము. ఇదొక కళ్లు తెరిపించే ప్రయోగం. హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన హైటెక్‌సిటీకి కనుచూపు మేరలోనే ఒక తండాలో గ్రామ సర్పంచ్‌తో సహా అందరూ నిరక్షరాస్యులుంటే అందులో ఒక వెయ్యిమందిని అక్షరాస్యులుగా చేయగలిగాం. కేవలం తెలుగు డిపార్ట్‌మెంట్, సామాజికశాస్త్ర విద్యార్థులు కొంత శ్రద్ధ తీసుకున్నారు. ఈ ప్రయోగం విఫలం కావడానికి చాలా కారణాలున్నాయి. ప్రధానంగా చాలా మంది నిరక్షరాస్యులు వలస కూలీలు కావ డం. ఇందులో పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లు చాలా మంది. వీళ్లు ఉదయమే పనికి వెళ్లి, సాయంత్రం చాలా ఆలస్యంగా వచ్చి వంట చేయడం, ఇతర ఇంటి పనులుండడంతో వాళ్లను చదువుకొనడానికి ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. ఇలాంటి అనుభవాల ఆధారంగానే ఆర్‌ఎస్‌రావు ఉత్పత్తి పెంచే ప్రాజెక్టు నిర్మాణం జరిగినా, ఉత్పత్తి సంబంధాలు మారలేదని సాక్ష్యాధారాలు చూపుతూ వచ్చారు.
మన సమాజంలో ‘పుట్టకతోనే మనుషులు సమానం కాదు’ అనే మత వాదనను ‘మను ధర్మ శాస్త్రం’ ప్రతిపాదించి బోధించింది. శారీరక శ్రమ మీద ఆధారప డ్డ వాళ్లందరూ చదవడానికి అనర్హులని మనువు ప్రతిపాదించాడు. మనుషులందరిని భగవంతుడే సృష్టిస్తే కొందరిని ఎక్కువ, కొందరిని తక్కువ ఎందుకు సృష్టించాడు అనే మౌలికమైన ప్రశ్న అడిగి దీనికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు రాకపోవడం, వచ్చినా వాటిని నిర్దాక్షిణ్యంగా పాలక వర్గాలు అణచివేయడం జరిగింది. బుద్దుడు,చారువాకులు, లోకాయనులు, తర్వాత వచ్చిన భక్తి ఉద్యమం ఈ సంబంధాలను మౌలికంగా మార్చలేకపోయాయన్నది చారివూతక వాస్తవం. 

అందరికి విద్య అందకపోవడానికి కుల వ్యవస్థ బలంగా పనిచేసింది. కులము సామాజిక ఉత్పత్తిలోని అదనపు విలువను ఎక్కువ బలవూపయోగము, భౌతిక హింస ఉపయోగించకుండానే కొల్లగొట్టగలిగింది. కులము అంటే.. ‘సాంస్కృతిక హింస’నే. ఈ సామాజిక నిర్మాణాన్ని కూలగొట్టవలసిన అవసరం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక విలువల నుంచి వచ్చిన మధ్యయుగాల మొఘలుల పాలనకు కూడా కలగలేదు.అస్పృశ్యలుగా పరిగణించబడిన పంచములు అనబడే వాళ్లు ఇస్లాం మతాన్ని స్వీకరించి కొంచెం గౌరవంగా బతకగలిగారు. అయితే చాలా వరకు వాళ్లలో వృత్తిపరమైన మార్పు రాలేదు. తెలంగాణలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన చాలా మందిని ‘తోళ్ళోళ్ళు’ అని పిలుస్తారు. మహిళల విషయంలో కూడా మధ్యయుగాల రాజ్యాలు అలాగే ప్రవర్తించాయి.

ముస్లిం రాజుల ఓటమి తర్వాత, దేశంలోని భిన్న ప్రాంతాల రాజులు, రాజ్యా లు బ్రిటిష్ ఇండియా కంపెనీతో రాజీ చేసుకున్నాయి. దీంతో భూస్వామ్య పాలనకు వలసపాలన జతగూడి దోపిడీని స్థిరపరచగలిగారు. నిజానికి అన్ని రకాల దోపిడీ రాజకీయ వ్యవస్థలకు కుల వ్యవస్థ చాలా ఉపయోగపడింది. ఆ సామాజిక నిర్మాణాన్ని ఎవ్వరూ మార్చాలని ప్రయత్నించలేదు. అందుకే కింది వర్గాల సామాజిక స్థితిగతులు గుణాత్మకంగా మారకపోవడమేకాక నిరక్షరాస్యత లాంటి సమస్య ఇప్పటికి అపరిష్కక్షుతంగా మిగిలింది. భూస్వామ్యం వలసపాలన మిలాఖత్ కావ డం వలన మొత్తం భారతదేశ చరిత్రే ముందుకు సాగడం కష్టమైంది. ఇటు ఉత్పత్తిశక్తులు పెరగక, సామాజిక సంబంధాలు మారకపోవడం వలన మన దేశంలో సోషలిస్టు విప్లవానికి కానీ, పెట్టుబడిదారీ విధానం సఫలం కావడానికి కానీ కావలసిన భౌతిక పరిస్థితులు ఏర్పడలేదు. సమాజం ముందుకు పోవడానికి సుదీర్ఘమైన ప్రసవవేదనను అనుభవిస్తున్నది.
దేశ చరివూతలో భూస్వామ్య వ్యవస్థ, కొద్దిగా మారుతున్న సామాజిక శక్తులు కలిసి చేసిన పెద్ద పోరాటం 1857 మొదటి స్వాతంత్య్ర సంగ్రామం. ఈ తిరుగుబాటు వలన ఈస్ట్‌ఇండియా కంపెనీ నుంచి అధికారం బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి పోయింది. ఈ తిరుగుబాటుతో ‘బ్రిటిష్ పాలనకు భద్రత కాని, సుస్థిరత కాని లేవు’ అని అర్థం కావడంతో, తమ పాలనకు కావలసిన ఒక సామాజిక నిర్మాణం, లేదా ఒక సామాజిక మద్దతు ఇచ్చే వర్గాన్ని సృష్టించుకోవాలని మెకాలె ఇంగ్లిషు భాషలో విద్య బోధన ప్రారంభించాడు. దీంతో ‘రూపంలో భారతీయుడు సారంలో బ్రిటిష్ గా మార్చి, ఆ వర్గం ద్వారా అధికారాన్ని సుస్థిరపరుచుకోవచ్చ’ని భావించి ఆ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. మన దేశంలో ఇంగ్లిషు భాష ప్రవేశం, దాంట్లో నుంచి పుట్టుకు వచ్చిన ‘గిరీశం జాతి’ని ఇప్పుడు మన మధ్య స్పష్టంగా చూడవచ్చు. ఈ వర్గానికి లోతైన విలువలు, సమాజంపట్ల బాధ్యత, వ్యక్తిగత నిజాయితీ లోపించడంతో సామాజిక మార్పులో భాగం కావలసిన ఒక ప్రజాస్వామ్య మధ్యతరగతి లేకుండాపోయింది. దాంతో ‘అందరికి చదువు’ అనే భావన ఉద్యమ రూపం తీసుకోలేకపోయింది. 

స్వాతంత్య్ర ఉద్యమం కంటేముందే మొట్టమొదట విద్య గురించి మాట్లాడి, దాని కోసం కృషిచేసిన వాళ్లలో మహాత్మ ఫూలే, సావిత్రి బాయి ఫూలే ముందు వరుసలో ఉన్నారు. ఆ కాలంలోనే అమ్మాయిల చదువు ప్రాధాన్యాన్ని వాళ్లు గుర్తించారు. స్వాతంవూతోద్యమం ప్రారంభమైన తర్వాత 20వ శతాబ్ద ఆరంభంలో అందరికి విద్య అన్న స్పృహ కొంత కనిపించింది. అందరికి విద్య అంటే ఎలాంటి విద్య? ఒక స్వతంత్ర దేశానికి ఎలాంటి విద్యావిధానం ఉండాలి? అనే స్పష్టత లేదు. కాని అందరికి విద్య అన్న భావన 1940 వరకు కొంత ముందుకు నడిచి 1944 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ అంశం గురించి ఒక తీర్మానం చేసింది. స్వాతంత్య్రం తర్వాత ఎన్ని సంవత్సరాలలో అందరికీ విద్య సాధిస్తామన్న దాని మీద జరిగిన చర్చలో ఒక సభ్యుడు నాలుగు దశబ్దాలు పట్టవచ్చు అన్నప్పుడు, మిగతా సభ్యులంతా స్వతంత్ర సార్వభౌమదేశంలో ప్రజలు నాలుగు దశాబ్దాల కాలం చదువు కోసం వేచి ఉండడానికి సిద్ధంగా ఉండరని వాదించి, ఒక దశాబ్ద కాలంలో అందరికి విద్యను అందించాలని నిర్ణయించారు. అదే అంశం భారత రాజ్యాంగంలో చేర్చా రు. అయితేరాజ్యాంగంలో దీన్ని ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించకుండా ఆదేశిక సూత్రాలలో చేర్చడం పాలకవర్గాల నైజాన్ని తెలుపుతుంది. 

రాజ్యాంగంలో ఒక దశాబ్ద కాలంలో 6నుంచి 14 ఏళ్ల వయసులోని పిల్లలందరికి చదువు అని అంగీకరించినా, ఆరు దశాబ్దాలు దాటినా అది ఇంకా చాలా దూరంలోనే ఉంది. ప్రపంచంలోనే అత్యధిక నిరక్షరాస్యులు మన దేశంలో ఉన్నా రు. ఇంతమంది నిరక్షరాస్యులున్న దేశం ‘సూపర్ పవర్’ ఎలా అవుతుందో అహ్లువాలియా, మన్‌మోహన్‌సింగ్, చిదంబరానికే తెలియాలి. అయితే అంతర్జాతీయ ఒత్తిడి వలన, ప్రజా చైతన్యం పెరగడం వలన అంతిమంగా 2009లో పిల్లందరికీ విద్యను ప్రాథమిక హక్కుగా అంగీకరించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. చాలా మంది ఈ చట్టం ఆహ్వానించ తగ్గదని ప్రచారం చేసినా, ఈ చట్టం పిల్లలందరికీ చదువును కాని, సమాన అవకాశాలను కాని, నాణ్యమైన విద్యను కాని అందిస్తుందన్న భరోసా చట్టంలో లేదు. అంటే ఈ చట్టం కూడా చారివూతక కొనసాగింపే కాని చారివూతక మలు పు కాదు అని గ్రహించవలసి ఉంది. విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమం ఈ అంశాన్నే చర్చకు పెట్టి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అనే లక్ష్యం కోసం పనిచేస్తున్నది.

పొఫెసర్ హరగోపాల్
Andhra Jyothi news paper Dated 1/1/2012

పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట - సుజాత గొట్టిపాటి



కెనడా అయినా, ఇంగ్లండ్ అయినా, ఇండియా అయినా కరడు కట్టిన పురుషాధిక్య పోకడ ఒకేలా ఉంటుందని రాష్ట్ర డిజిపి వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. గత ఏడాది జనవరి 24న కెనడాలో మైఖేల్ సాంగ్వినెట్టి అనే పోలీసు అధికారి "బాధితులు కాకుండా ఉండాలంటే మహిళలు వేశ్యల మాదిరిగా దుస్తులు ధరించటం మానాలి'' అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపాయి. 'స్లట్‌వాక్' పేరిట వేలాది నిరసన ప్రదర్శనలు జరిగాయి. మన దేశంలో కూడా ఢిల్లీ, బెంగుళూరు వంటి చోట్ల 'బేషర్మి మోర్చా' ప్రదర్శనలు నిర్వహించారు. 

అయినప్పటికీ, ఈ పురుషాధిక్యత భావజాలం కంపుకొడుతున్న డ్రెయినేజీలా ప్రవహిస్తూనే ఉంది. డిజిపి వ్యాఖ్యలు రెండు ప్రధానమైన ఆలోచనలను లేవనెత్తుతున్నాయి. మహిళల వస్త్ర ధారణపై తీవ్ర అభ్యంతరకమైన దృష్టి కోణం ఒకటికాగా, పోలీసు యంత్రాంగం బాధ్యతలనే విస్మరిస్తున్న అంశం మరొకటి. బాధితులనే నిందితులను చేసి బోనులో నిలబెట్టిన విధంగా అత్యాచారాలకు ఆడవాళ్ళే కారణమని చెప్పటం కొత్తేమీ కాదు. కుళ్ళిన పురుషాధిక్య బుద్ధితో పలువురు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 

ఆడదాని శరీరం తమ ఆనందానికి, అనుభవానికి మాత్రమే అస్తిత్వంలో ఉందని నమ్మే వక్రదృష్టి ఇంకా ఇటువంటి చాలా మాటలే పలికిస్తుంది. అత్యాచారం అనేది ఒక ఆడదాని పట్ల ఉండే చులకన భావానికి, లోకువకు నిదర్శనం. నచ్చిన స్త్రీని అనుభవించడానికి తనకు అధికారం ఉందని మూర్ఖంగా నమ్మిన ఒక 'మృగాడు' చేసే హేయమైన పనే అత్యాచారం. 

ఆ నచ్చిన ఆడది ఒక పసిబాలిక కావచ్చు, పండు ముసలిదీ కావచ్చు. వీరు తమ ఏ వస్త్రధారణ ద్వారా రెచ్చగొట్టారని వీరిపై అత్యాచారాలు జరుగుతున్నాయి? పొట్టకూటి కోసం పొద్దస్తమానం పనిచేసుకునే కూలీలు ఏం కురచబట్టలు వేసుకున్నారని వారిని రేప్ చేస్తున్నారు? పాఠశాలల్లో, కళాశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థినులపై అత్యాచారాలు, అకృత్యాలు వారి తప్పేనా? వారి వస్త్రధారణ సరిగా లేకపోవటమేనా? 

అత్యాచారాలు జరగటానికి మగవాడిలోని జంతు ప్రవృత్తి, నాగరికత సంతరించుకోని పశుప్రవృత్తి; స్త్రీని ఒక బొమ్మగా తప్ప, ఒక సంపూర్ణమైన, స్వతంత్రమైన వ్యక్తిగా చూడలేని పురుషాధిక్య పోకడలు ప్రధాన కారణాలు కాగా, ఇందుకు బాధితులైన స్త్రీలనే నిందించటం మాటలతో వర్ణించలేని బాధ్యతా రాహిత్యం అని చెప్పకతప్పదు. ఇదే లాజిక్‌ని ఇతర పరిస్థితులకు కూడా వర్తింపచేసుకుంటే ఇక మనకు పోలీసు యంత్రాంగంతో పనే ఉండదు. బ్యాంకులు దోచుకోబడటానికి కారణం బ్యాంకుల్లో డబ్బుండటం. 

బ్యాంకుల్లో డబ్బు పెట్టటం బ్యాంకు వాళ్ల తప్పు. ఆ విధంగా బ్యాంకులో డబ్బు పెట్టుకుని బ్యాంకు వాళ్లు దొంగలని రెచ్చగొట్టారు! ఇళ్లల్లో దొంగతనాలు జరగడానికి కారణం ఇళ్ల యజమానులే. తలుపులు బలమైనవి బిగించుకోక వాళ్లే దొంగలకి అవకాశం ఇచ్చారు. వరకట్న మరణాలకు ఆహుతి అయిన భార్యలదే అసలు తప్పు. భర్తల ధనదాహాన్ని తీర్చకుండా, వాళ్లే భర్తలను, వారి తల్లిదండ్రులను రెచ్చగొట్టారు. మొగుళ్లు పెళ్లాలని కొట్టడానికి కూడా పెళ్లాలే కారణం. తమని కొట్టేలా మొగుళ్లని రెచ్చగొట్టింది పెళ్లాలే. కాబట్టి గృహహింసకి ఆడవాళ్లే కారణం. 

అత్యాచారాల నుంచి, హత్యల నుంచి, శారీరక హింస నుంచి ఆడవాళ్లు తమని రక్షించుకోవాలంటే, పలువిధాలుగా మగవాళ్లని రెచ్చకొట్టకుండా జాగ్రత్త పడాలన్న మాట. ఇంకా ఈ వ్యాఖ్యలో ఏమంటున్నారంటే, పల్లెటూళ్లలో అమ్మాయిలు కూడా సల్వార్ కమీజులు, చుడీదార్‌లు వేసుకుంటున్నారట! మరి అమ్మాయిలు ఏం వేసుకోవాలని శెలవిస్తారో. వంటి నిండుగా ఉండి, హుందాగా ఉండే సల్వార్ కమీజులు, చుడీదార్‌లు మన వక్రదృష్టికి అభ్యంతరకరంగా ఉన్నాయే! మగవాళ్లు లాగులతో, లుంగీలతో దర్జాగా తిరగొచ్చన్న మాట. 

అంతేకాదు. పోలీసు యంత్రాంగం అవసరాన్ని, ఉపయోగాన్ని, అసలు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. అదనపు కట్నం కోసం భార్యను చంపితే పోలీసులు మటుకు ఏం చేస్తారట! ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటే, అది పోలీసుల వైఫల్యమెలా అవుతుందిట!! అదనపు కట్నం కోసం, ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటే వారి అత్యాశతోనే జరుగుతాయట. పోలీసులు అందులో చేయగలిగిందేమీ లేనప్పుడు ఇక పోలీసు యంత్రాంగం ఉపయోగమేమిటి? లక్షలాది మంది సిబ్బంది, అధికారులు, కోట్లాది రూపాయల బడ్జెట్‌లు ఎందుకోసం? ప్రతి ఏటా వేలాది మంది రిక్రూట్‌మెంట్లు ఎందుకు? ప్రతి నేరానికి బాధితులే కారణం అని సరిపెట్టుకుంటే, ఇక పోలీసు వ్యవస్థ ఉపయోగం ఏముంది? 

ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేరాలపై నిఘాకు కాకుండా, రాజకీయ జోస్యాలకే పరిమితమైంది. నిఘా ద్వారా నివారణా పద్ధతుల ద్వారా, శిక్షల ద్వారా నేరాలను, హత్యలను అత్యాచారాలను అదుపు చేయనప్పుడు పోలీసు వ్యవస్థ ఉనికికి అర్థం ఏముంది? ఏ నేరం జరిగినా, అందుకు మా పూచీ లేదనే బాధ్యతా రాహిత్యం పోలీసు యంత్రాంగంలో నరనరాన జీర్ణించుకుని పోయింది. జిల్లా స్థాయిలో కాని, రాష్ట్ర స్థాయిలో కాని జరిగే సమీక్షా సమావేశాలకు పోలీసుశాఖని మినహాయించటం వల్ల జవాబుదారీతనం పూర్తిగా అదృశ్యమైపోయింది. 

మంత్రులు, కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ కమిషనర్‌లు తదితరులు పాల్గొనే ఏ సమీక్షా సమావేశంలో పోలీసులు పాల్గొనరు. ఎవరికీ జవాబుదారీ కాదు. వారి వైఫల్యాలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదు. అమెరికాలో, ఇంగ్లాండులో పోలీసులు ఆ నగర మేయర్లకు జవాబు దారీగా ఉంటారు. అసలు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ (పోలీస్ చీఫ్) నియామకమే ఎన్నిక ద్వారా జరుగుతుంది. మనదేశంలో ఏ ప్రజాప్రతినిధికీ పోలీసులు జవాబుదారీ కాదు. మరి మన పోలీసు వ్యవస్థ అమెరికా, ఇంగ్లాండ్‌ల కంటే మెరుగ్గా ఉందని మనం చెప్పగలమా? 

ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార వ్యవస్థ ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వ్యవహరించాలి. మన దేశంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎస్.సి, ఎస్.టి, బి.సి.లతో పాటు మహిళలను కూడా అణగారిన వర్గాలుగా భావించి వారిపట్ల ప్రత్యేక రక్షణలు ఏర్పాటు చేయాలి. అందుకు ముందుగా మారాల్సింది మైండ్‌సెట్. పోలీసు యంత్రాంగం తలచుకుంటే, మహిళలపై అత్యాచారాలను, వరకట్న హత్యలను, గృహ హింసను చక్కగా అదుపు చేయగలదు. ప్రజలందరి రక్షణ బాధ్యతలను భుజస్కందాలపై మోస్తున్న పోలీసు యంత్రాంగం ఆ బాధ్యతకు తగినట్లుగా, సరైన దృష్టితో, దృక్పథంతో, కఠిన కార్యాచరణతో వ్యవహరిస్తేనే పోలీసు శాఖ ఉనికికి అర్థం.

- సుజాత గొట్టిపాటి
Andhra Jyothi News Paper Dated 01/01/2012 

Thursday, December 29, 2011

టీపీపీఎస్సీతోనే పరిష్కారం




పాలకుల భావాలే పాలితుల భావాలుగా చలమణి చేయబడుతా యి. ప్రస్తుతం రాష్ర్టంలో పబ్లిక్ సర్వీస్8 కమిషన్ కూడా అలా గే వ్యవహరిస్తోంది. అరవయేండ్లుగా తెలంగాణ ప్రాంతాన్ని తమ ప్రాంతం గా భావించని సీమాంధ్ర పాలకుల కనుసన్నల్లో, మరోసారి తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ, జీవితకాలపు నిరుద్యోగాన్ని బహుమానంగా ఇవ్వడం కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తోంది. ఇప్పుడు ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్8 కమిషన్ పేరు వింటేనే నిరుద్యోగులు మండిపడుతున్నారు. అసపూందుకు గతం లో ఎన్నడూ లేని విధంగా కమిషన్ నిర్వీర్యమైపోతున్నది? తప్పుల తడక గా పరీక్షలు నిర్వహించడం వెనకాల ఉన్న కారణాలేమిటి? భాష విషయం లో చూపిస్తున్న నిర్లక్ష్యం ఉద్దేశపూరితమైనదేనా? చైర్మన్‌లు మారినా, సెక్రటరీలు మారినా పరీక్షల నిర్వహణలో మార్పెందుకు రావడం లేదు? సీమాంధ్ర ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు రావడం వెనకాల కమిషన్ ఉదాసీన వైఖరే కారణమా? ఆగమేఘాల మీద నోటిఫికేషన్‌లు వెలువరించడం వెనుకాల పాలనా పరమైన అవసరాలున్నాయా? పాలకుల ప్రయోజనాలేమైనా దాగున్నాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. 
ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం వెనక రెండు రకాల కారణాలుంటాయి. ఒకటి పాలనా పరంగా తగిన సిబ్బంది అవసరం కావడం, ఎన్నికలు సమీపించడమో, ఉద్యమాలు ఊపిరిసలుపనివ్వకపోవడమో మరో కారణం. ఈ రెండు కారణాలకంటే కిరణ్‌కుమార్‌డ్డి కార్యాచరణ వెనక మూడో కారణమొకటి కనిపిస్తున్నది. అదే అధికార పీఠాన్ని కాపాడుకోవడం. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, కనీసం మంత్రివర్గంతోనైనా చర్చించకుండానే నిర్ణయాలను తీసుకొని అమలుచేయడం వగైరా అన్నీ గద్దె కాపాడుకోవడం కోసమేననే ది సామాన్యులకు సైతం అర్థమయ్యే విషయం. అలా ఒకవైపు పాలనా రంగంలో భారీగా ఏర్పడ్డ ఖాళీలు, కిరణ్‌కు వరంలా కలిసొచ్చాయి. దాంతో ఇక క్షణాల మీద ఉద్యోగాలు భర్తీ చేయాలని కమిషన్‌కు ఆదేశాలివ్వడం, లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం అన్నీ గంటల్లోనే పూర్తయ్యాయి. ఎప్పుడో ఐదు, పదేండ్లకొకసారి వెలువడే నోటిఫికేషన్లకే తత్తరపడిపోయే కమిషన్‌కు ఈ ఉద్యోగాల వరద ప్రాణం మీదికొచ్చింది. ఇక ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక, ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచే పనిలో పడింది. దాని ఫలితమే తప్పుల తడకగా పరీక్షపవూతాల తయారీ, పేపర్ లీకేజీలు, రాష్ర్టపతి ఉత్తర్వులకు తిలోదకాలివ్వడం వంటి పనులన్ని పరంపరగా జరగడం. వీటి మీద ఎవరైనా ప్రశ్ని స్తే కమిషన్ రాజకీయ నాయకుల మాదిరిగానే దాటవేసే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్‌లలో తెలంగాణకు దక్కుతున్న ఉద్యోగాలు ఎన్ని? అని ప్రశ్నించుకుంటే, ఏ తెలంగాణ బిడ్డ గుండె అయినా రగలకమానదు. అందుకు కారణం చాపకింద నీరు లా సీమాంవూధులే మరోసారి తెలంగాణ ఉద్యోగా ల్లో తిష్టవేయడమే. తెలంగాణను ఆంధ్రాలో విలీ నం చేసేటపుడు రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిన విషయాన్ని కొన్ని వందలసార్లు గుర్తుచేసినా సీమాంధ్ర సర్కారు మాత్రం మొద్దునివూదపోతున్నది. కనీసం రాష్ర్టప తి ఉత్తర్వులనైనా పాటించకుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలంగాణ నిరుద్యోగులు ఆలోచించాలి. ఇటీవల డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాల కోసం సీమాంధ్ర అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌లతో తెలంగాణ జిల్లాల్లో అడుగుపెట్టారు. 
తెలుగు నేల మీద ఇంగ్లీషు పాలన సాగుతున్నది. తెలుగు భాషకు ప్రాచీనహోదా కల్పించి అరదశాబ్ద కాలం కూడా పూర్తికాలేదు. కానీ, కిరణ్ సర్కార్ మాత్రం భాష విషయంలో నేలవిడిచి సాము చేస్తోంది. అందుకు ఇటీవల వెలువడిన గ్రూప్1 ఫలితాలే సజీవ సాక్ష్యం. 400మంది అభ్యర్థులను మెయిన్స్‌కి ఎంపిక చేస్తే అందులో 320మంది ఇంగ్లీషు మీడియం అభ్యర్థులే ఎంపికయ్యారంటే పబ్లిక్ సర్వీస్8 కమిషన్‌కు ఆంగ్లం పట్ల ఉన్న ప్రీతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల్లో కూడా, తిరుపతి కేంద్రంలోనే ఎక్కువమంది ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 
ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన ఏ పరీక్షను చూసిన ఒక్కటి కూడా సమర్థవంతంగా నిర్వహించలేదు. 2008లో ఇచ్చిన జూనియర్ లెక్చరర్‌ల నోటిఫికేషన్‌కు ఇదే నెల మొదటి వారంలో పరీక్ష నిర్వహించింది. దాంతో అభ్యర్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సబ్జెక్ట్ విషయం ఫర్వాలేదు కానీ, 150 ప్రశ్నల జనరల్ స్టడీస్8లో 63 ప్రశ్నలు అనువాదం చెయ్యకుండానే ఇచ్చారు. ఇది ఎందుకిలా జరిగిందో ఎవ్వరికీ అంతుపట్టలేదు. కనీసం కమిషన్‌కైనా అర్థమయ్యిందా అంటే అదీ లేదు. లేదా అభ్యర్థులు ఎక్కువమం ది ఉండడం వల్ల ఇంగ్లీషు నైపుణ్యమున్న అభ్యర్థులనే ఎంపిక చేద్దామని కమిషన్‌లోని అధికారులు, చైర్మన్, సెక్రటరీలు నిర్ణయించుకున్నారా? అన్నది అర్థం కానీ విషయమే.
డిగ్రీ లెక్చరర్ పోస్టులది మరో అరిగోస. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ నోటిఫికేషన్ ఇచ్చింది సర్కార్. దీంతో పిహెచ్‌డీలు చేసి, నెట్‌లు క్వాలిఫై అయి, పరిశోధనలను సైతం పక్కన పడేసి ఉద్యోగవేటకు సిద్ధమయ్యారు. కానీ, ఏం లాభం ఎప్పటిలాగే కమిషన్ మొద్దు నిద్రతో సర్దుకోవాల్సిన వాళ్లు సర్దుకొని, అప్పనంగా సీమాంధ్ర ప్రాంతమే తన్నుకపోయిం ది. ‘ఊహించిన’ విధంగానే తెలంగాణకు మరోసారి అన్యాయమే జరిగిం ది. డీఎల్ పరీక్ష జరిగిన మరుసటి రోజే ఆంధ్రా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పేపర్ లీక్ చేసి, తన అయిదుగురు శిష్యులకు ఉద్యోగాలు వచ్చేందుకు చక్రం తిప్పాడని రాష్ర్టవ్యాప్తంగా వార్తలు గుప్పుమన్నాయి. అయినా ప్రభుత్వంగానీ, కమిషన్‌గానీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్ని సబ్జెక్టుల్లో తెలంగాణకు దక్కిన ఉద్యోగాలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒక్క అర్థశాస్త్రం సబ్జెక్టులో 26 పోస్టులు ఉంటే 23 ఆంధ్రాకు, మూడు మాత్రమే తెలంగాణకు దక్కాయి. అలాగే మరికొన్ని సబ్జెక్టుల్లో ఒక్కటి రెండు పోస్టులు మాత్రమే తెలంగాణను వరించాయి. దీని వెనుకాల సీమాంధ్ర అభ్యర్థుల ప్రతిభాపాటవాలు ఎలా ఉన్నా, కమిషన్ నిర్లక్ష్యం, ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీలో- రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు తెచ్చిపెట్టుకున్న చైర్మన్‌లు చేసిన మోసం, దగా తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ మరువలేరు. రాతపరీక్షలో టాప్‌లో ఉన్నవారిని కాదని అప్పుడున్న చైర్మన్ లంచాలకు మరి గి, అనేకమంది రాయలసీమ వారికే ఉద్యోగాలను ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల విషయంలో మళ్లీ అదే పొరపాటు కావాలనే చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ర్టపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో తెలంగాణ వారినే నియమించాలి. కానీ, కమిషన్ ఈ ఉత్తర్వులను తోసిపుచ్చి, గతవారమే పోస్టింగ్ ఆర్డర్‌లను ఇచ్చింది.
ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పరీక్షలు రాసే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఒకవైపు సుదీర్ఘ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తెలంగాణ విద్యార్థులు ఉద్యమంలో పోషించిన పాత్ర చరివూతత్మకమైంది. అటువంటి ఉద్యమ వాతావరణాన్ని విచ్ఛిన్నంచేసి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులను ఉద్యమబాట నుంచి వేరు చేయడం కోసమే కిరణ్ సర్కార్ ఉద్యోగాల భర్తీ పేరుతో కుట్రకు పాల్పడింది. ఇప్పటికే మూడుతరాలు నిర్వీర్యమైన తెలంగాణ సమాజంలో ఏ విద్యార్థికైనా భవిష్యత్తుపట్ల ఒకింత భయమే ఉం టుంది. కన్నవారి కలలు నిజం చేయడం కోసం పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. కానీ, ప్రభుత్వం వారి ఆశలను అడియాసలు చేసిం ది. వేరే ప్రాంతానికి చెందినవారు తమ ప్రాం తానికి వచ్చి పాఠాలు చెబితే ఈ పోరుబిడ్డలు ఆ పాఠాలు వింటారా? అన్నదమ్ముల్లాగా విడిపోదామని ఓపికతో ఉన్న తెలంగాణ ప్రజల సహనానికి ఎందుకీ పరీక్షలు? 
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన దశాబ్దాల అన్యా యం భూమికగా పురుడుపోసుకున్నది. ప్రభు త్వం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ అందరూ కండ్లు తెరచి చూస్తుండగనే మరోసారి తీరని అన్యాయానికి పాల్పడుతున్నది. అసలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలంటే తక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్8 కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకు దక్కితే కనీస అభివృద్ధికైనా నోచుకుంటుంది. ఇప్పుడు మార్చాల్సింది పబ్లిక్ సర్వీస్8 కమిషన్ చైర్మన్‌నో, సెక్రటరీనో కాదు, మొత్తం గా కమిషన్‌ను మార్చాలి. ఇంత ఉద్యమం జరుగుతున్నా, ఇన్నివందల మంది బలిదానాలు చేసుకున్న సమయంలో సీమాంధ్ర సర్కారు మరోసా రి తెలంగాణ ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. ఇప్పుడు తెలంగాణ విద్యార్థిలోకంతో పాటు చదువులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు డిమాండ్ చేయాల్సింది రీఎగ్జామ్‌ల కోసమో, లేకపోతే పరీక్షల రదు ్దకోసమో కాదు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడేలోపు ఉద్యోగాల వాటాలో భద్రత కోసం ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్8 కమిషన్’ను డిమాండ్ చేయాలి. ఇందుకోసం టీఎస్8 జేఏసీ, ఉద్యోగ జేఏసీతో పాటు, రాజకీయ జేఏసీలు ఉద్యమించాలి. 
-పసునూరి రవీందర్
డాక్టోరియల్ ఫెలో, సెంట్రల్ యూనివ

Namasete Telangana News Paper Dated 29/12/2011

విషకన్యలూ, ఉద్యమ వైఫల్యాలూ - కంచ ఐలయ్య



కౌటిల్యుడు 'అర్థశాస్త్ర' గ్రంథంలో పాలకులు ప్రభుత్వాలను కాపాడుకునేందుకు ఏ నీతినైనా ప్రయోగించవచ్చు అన్నాడు. శత్రువును యుద్ధంలో నేరుగానైనా చంపవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే విందుకు పిల్చి విషకన్యను ఉపయోగించైనా చంపవచ్చు అన్నాడు. కౌటిల్యుడు చనిపోయాక మూడు వందల ఏండ్లకు జీసస్ పుట్టి శత్రువు ఈ చెంపపై కొడితే ఆ చెంప కూడా చూపు అన్నాడు. ఈ వాక్యం చదివే లియో తోలొస్తాయ్, జాన్ రస్కిన్‌లు అహింసా పోరాటాల తాత్వికతను రూపొందించారు. ఈ రెండో సిద్ధాంతంతో ఈ దేశంలో ఏమీ సాధించలేము అని అంబేద్కర్‌ను అంటరానివాళ్లుగా చూసినోళ్లు, గాంధీని చంపినోళ్లు నిరూపించారు. కౌటిల్య నీతి రెండు కాళ్లతో కాదు నాలుగు కాళ్లతో నడుస్తున్న దేశం మనది. 

వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీసస్‌ను ప్రార్థించినా, కౌటిల్యుణ్ణి ప్రేమించాడు. ఆయన రాజ్యాన్ని కొల్లగొట్టి జీసస్ మీద గౌరవంతో కొంత ప్రజలకు పంచాడు కానీ కౌటిల్యునిపై ప్రేమతో ఎక్కువ ధనం కుమారుడికి ఇచ్చాడు. వై.ఎస్. ప్రార్థించిన ప్రాఫెట్ విలువలకు, తాను ప్రేమించిన సంపాదన నీతి విలువలకు పెండ్లి కుదరకనో ఏమో ఆయన ఆకాశంలోనే అంతమయ్యాడు. ఆయన స్థానాన్ని ఆక్రమించాలని కుమారుడు, తండ్రి ఇచ్చిన ధనబలంతో రంగంలోకి దూకాడు. 2009 డిసెంబర్ 9 నాటికే ప్రభుత్వాన్ని పడగొట్టి తెలుగునాట రాజ్యాధికారాన్ని తన్నుకపోయే స్థితిలో ఉన్నాడు. నేను వేరే చోట చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు (మూడు ప్రాంతాల వారు కూడా) నయా క్షత్రియులు. 

కౌటిల్యుని గురించి వారు చదివినా చదవకపోయినా ఆయన విలువలే వారికి ప్రాణం. డబ్బు, అధికారం ఎలాగైనా సంపాదించాలనే శక్తులు వారిలో చాలా ఎక్కువ. వీరినెలా హ్యాండిల్ చేయాలో బాగా అర్ధం చేసుకున్నది లివింగ్ కౌటిల్య ప్రణబ్ ముఖర్జీ. ఆయనకూ, హార్వర్డ్ విద్యావేత్త చిదంబరానికి చాలా వైరుధ్యాలు ఉన్నప్పటికీ తెలుగు వారిని (తెలుగు నీతిని) హ్యాండిల్ చేయడంలో ఐక్యత ఉన్నది. 

వారికి నేరుగా జగన్‌తో యుద్ధం చెయ్యడం అసాధ్యమని అర్థమైంది. జగన్‌ని మట్టికరిపించి ముఖ్యమంత్రిని కాకుండా చూడడానికి కేసీఆర్‌ను రంగంలోకి దింపారు. కేసీఆర్, ఆయన చుట్టూ ఉన్నశక్తులు విషకన్యల పాత్ర పోషించారు. డిసెంబర్ 9, 2009 నుంచి డిసెంబర్ 6, 2011న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం గెలిచి జగన్‌ను 17 మంది ఎంఎల్ఏల నాయకుని స్థాయికి తగ్గించడానికి రెండేళ్ళ తెలంగాణ ఉద్యమం నడిపారు. టీఆర్ఎస్‌కు, దాని చుట్టూ చేరిన శక్తులకు ఏది కావాలంటే అది ఇచ్చారు. 

కౌటిల్యుని కాలంలో కూడా విషకన్యలుగా పనిచేసే వారికి రోజుకింత విషమిచ్చి వారి శరీరాలే విషమయ్యే స్థితికి తెచ్చేవారు. వీరికి విపరీతమైన ఆస్తిపాస్తులను సమకూర్చేవారు. ఆ సూత్రమే ఇక్కడ అమలు చేశారు. ఒక జేఏసీ నేర్పాటు చేసి, దాన్ని అనుసంధాన పర్చడానికి జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇండ్ల వద్దకు కుక్కలు కూడా పోకుండా కాపాడారు. 

అదే కాంగ్రెస్ నుంచి ఎస్సీ, బీసీ నాయకులు ఎంత వీరోచిత తెలంగాణవాదులుగా ఎగిరితే అంత ఎక్కువ దాడులు చేయించారు. కేశవరావు, మధుయాష్కీ, హన్మకొండ ఎంపీ రాజయ్య, మంత్రులు సారయ్య, పొన్నాల లక్ష్మయ్యల మీద జరిగిన దాడులే అందుకు మంచి ఉదాహరణలు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక టీవీ చానల్‌లో మాట్లాడిన వాక్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఇలా అన్నాడు "we have conducted the telangana movement without any firing a single bullet' అనే పదానికి అర్థం తెలియకుండా వాడాడని ఎవరూ అనుకోలేరు. 

ప్రభుత్వం కాల్పుల్లో ఎవరినీ చంపని మాట నిజమే కానీ దాదాపు 700 మంది యువకులు- అదీ చాలా బీదవారు-ఈ రెండు సంవత్సరాల్లో 'ఆత్మహత్యలనే హత్యల్లో' చనిపోయారు కదా! వాళ్లను చ ంపి వర్ధంతులు జరిపే సంస్కృతి కౌటిల్యుని విలువల్లో భాగంగా వచ్చిందే. ఈ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతితో వేలాది కోట్ల రూపాయలు (ఎక్కువగా అగ్రకులాల వారు) వసూళ్లతో సంపాదించారు. రాజశేఖరరెడ్డి ఉండగానే ప్రభుత్వం అప్పుడప్పుడే పుట్టిన పార్టీకి బంజారాహిల్స్‌లో భూమి ఇచ్చి పార్టీ ఆఫీస్ కట్టించింది. మావోయిస్టు పార్టీ (ఒక్క న్యూడెమోక్రసీ తప్ప) లకు ఆఫీసు కాదు కదా అడ్రస్ కూడా లేదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అటు సమైక్య, ఇటు తెలంగాణ అగ్రకుల నాయకులు ప్రజలకు ఇంత అన్యాయం చేస్తే ఈ విలువల్ని ఎలా చూడాలి? 

ఒక తెలంగాణ రాజకీయ పార్టీలో పుట్టిన విషకన్యలకు ఇప్పుడు కాంట్రాక్టులు, బ్రహ్మాండమైన భవంతులు, ఆధునాతన కార్లు వచ్చాయి. పెద్దపెద్ద కంపెనీల్లో షేర్లు వచ్చాయి. డిసెంబర్ 6న కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంలోనే ఇక 2014 వరకు పాలన గ్యారంటీ వచ్చింది. డిసెంబర్ 9, 2009 ప్రకటన, దాని తర్వాత 'రాజగోపాల రాజకీయం' ఆ తర్వాత డిసెంబర్ 23 ప్రకటన, జానారెడ్డి-జానపద 'ధూంధాం' ఆయన అనుంగు తోలుబొమ్మలతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, దీని కలెక్షన్లు, డిస్ట్రిబ్యూషన్ల పర్వం జరిగి ఉండకపోతే జగన్, కేవీపీ, రోశయ్యను రోడ్డెక్కించేవారు. 

ఇప్పుడైనా తేలింది కదా, ఈ రెండేండ్లలో తెలంగాణలో ఒక కొత్త కురుక్షేత్రాన్ని నడిపారు. ఇక్కడ పోరాట యోధులెవ్వరూ చావలేదు. 700 మంది అమాయకులు 'తెలంగాణ చెండేషియాగం'లో బలివ్వబడ్డారు. వాళ్ల తల్లిదండ్రులు గోడు, గోడున ఏడుస్తున్నారు. ఈ చెండేషియాగంలోనే 'ఫామ్‌హౌస్'లు కట్టారు. అక్కడ మహావిష్ణువులా పాముల పడకపై పడుకొని తెలంగాణ ఆడపడుచులతో కాళ్లొత్తించుకునే సంస్కృతి 'ఆడికార్లు-బోడికార్లు' (వాళ్ల భాషలోనే) ఎక్కి 'రసమయి' రాజ్యమేలే స్థితి వచ్చింది. పుస్తకాలు చదువకుండా, రచనలు చేయకుండా ప్రొఫెసర్లయినా లేదా మేధావులైన వాళ్లు అతి కొద్దికాలంలో ఆక్టర్లు కూడా అయ్యారు. 

పాఠాలు చెప్పడం మానేసి రోజు రోడ్డుమీద ఉపన్యాసమిచ్చి, విద్యార్థులకు పరీక్ష రాయకున్నా సర్టిఫికెట్లు, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు ఇస్తామని ప్రతి నిత్యం ప్రామీజు చేశారు. ఇదొక మహత్తర పోరాట సినిమా తెలంగాణ విప్లవం డిసెంబర్ ఆరున అన్ని అందించిన కాంగ్రెస్ అసెంబ్లీలో గెలిచాక, పిల్లల చావులాగిపోయి ఇంతో, అంతో పాఠాలు జరుగుతుంటే 'ఇంకెంతకాలం' చదువులనే కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు. ప్రపంచ విప్లవాలన్నీ, సినిమాలతో, చీకటి భూస్వాముల షూటింగులతో, మావోయిజం చదవడం మానేసి, దొరల మంచి గురించి రాసే వ్యాసాలతో వచ్చినట్లు కొత్త సిద్ధాంత కర్తలు చెబుతున్నారు. 

ఇటువంటి సిద్ధాంతకర్తలు చుట్టూ ఉన్నాక తెలంగాణ కాదుకదా, ప్రజలకు కనీస తెలివి, ఆత్మగౌరవం ఉండనీయరు. తెలంగాణలో అగ్రకుల మేధావులు (ఎక్కువ మంది) దళిత, బహుజనుల బతుకు బాగుపడే ఏ కార్యక్రమాల్లో పాల్గొనరు. తెలంగాణమంట చాలు అదొక బంగారు గని అయినట్లు ముందుకొస్తారు. 1956 నాటి ఉద్యమంలో గానీ, 1969 ఉద్యమంలోగాని అది అంత స్పష్టంగా అర్థం కాలేదు. ఫ్యూడల్ చెన్నారెడ్డితో పాటు, వంటి మీద బంగారం అమ్మి తెలంగాణకు ఖర్చుపెట్టిన సద్మాలక్ష్మి లాంటి నాయకురాండ్రుకూడా ఆనాడు ఉద్యమంలో ఉన్నారు. ఈనాడు ఢిల్లీ అండతో, సెక్రటేరియెట్ స్నేహంతో అమాయకులను ఆత్మహత్యల్లో చంపూ, సంపాదించు అనే సిద్ధాంతమొచ్చింది. మీటింగులు పెట్టినా సంపాదన కోసమే, బతుకమ్మలాడేది ఆ బంగారం కోసమే. 

ఈ క్రమంలో నాయకులు, మేధావులు బహుపాత్రధారులయ్యారు. ఆంధ్ర వాళ్లు కావాలనే పాడినోళ్లకు పైసలిచ్చారు. ఆడినోళ్లకు కొన్ని పైసలిచ్చారు. ఇందులో కొంతమంది ఏ ట్రైనింగ్ లేకుండానే సినిమా ఆక్టర్లు కూడా అయ్యారు. చేతినిండా పైసలుంటే అన్ని రూపాల్ని పైసలే సృష్టిస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కొంత మంది మేధావులకు ఒకరోజు ఇంట్లో ఉంచి, ఒక పుస్తకం చదమన్నా, ఒక వ్యాసం రాయమన్నా జైల్లో ఉన్నంత పని అవుతాంది. రోజు రోడ్డుమీద ఒక ఉపన్యాసం, పైసలిచ్ఛైనా పదిమందిని జమచేసి, 'మనం రూపొందించిన పుష్పక విమానం'లో తెలంగాణ వస్తుందని చెప్పకపోతే రాబడిలేదే! 

ఇప్పుడు ఉద్యమం ఆగిపోయింది కనుక, చావులు తగ్గి పోయాయి. ఈ స్థితి రాబడినీ తగ్గించే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికలకు ఆంధ్రులు అంత డబ్బు ఇవ్వకపోవచ్చనే అనుమానం ఉంది. అసలే తెలంగాణ ఇచ్చేది లేదని, సోనియాగాంధీ చెప్పేరోజు కూడా దగ్గరికొచ్చింది. అయితే ఈ డ్రామా ముగిస్తే 'అక్రమ సంపాదనల' ఆరా మొదలౌతుంది. అందుకు తోడు, ఒక లోక్‌పాల్, ఒక లోకాయు క్త (మరిన్ని కోరలతో) వచ్చే అవకాశం ఉంది. ఉద్యమ ఉద్యోగస్తులకు ఇన్ని ఆస్తులెక్కడివి అని ప్రశ్నించే రోజు కూడా రావొచ్చు. అందుకే ఆస్తులన్నీ క్రమబద్ధీకరణ జరిగే వరకు ఉద్యమం ఆపొద్దనే ఒక తెలంగాణ ఎత్తుగడ కూడా ఉన్నది. ఎంత గొప్ప మేధావులు వీళ్లు! 

నా తెలంగాణలో ఎంత మంది మాదిగలున్నా 'ఇది కోటి రత్నాల వీణ' గాని 'కోటి డప్పుల జాన' ఎన్నటికీ కాకూడదని మేమంతా కోరుకోవాలట. ఈ 'ఆత్మహత్యల' విప్లవం మధ్య కొంత మంది మాదిగ విద్యార్థివీరులు కూడా 'ఫామ్ హౌస్ చుట్టూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అని నినాదాలు చేస్తుంటే అవి సోనియాగాంధీకి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమంలో తాగకున్నా, తాగిన మైకంలో (డబ్బు సంపాదన కూడా ఒక మైకమే) ఉపన్యాసాలు, ప్రకటనలు దంచే మేధావులను చూస్తే మనకు పాతకాలపు పద్యం గుర్తొస్తుంది. 

'సిగ్గు యెకింతయు లేదు
పసిపిల్లల రక్తపు పాలు తాగుటకున్''
'తెలంగాణ ఇవ్వకపోతే సోనియాను బజారుకీడుస్తా, చిదంబరం లుంగీ ఊడగొడ్త' అని నినదించిన తండ్రీకొడుకులు, లోక్‌పాల్ బిల్లు చట్టం కాగానే ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితి వచ్చే అట్లుంది. 'దొరసాని' బొమ్మకు తెలంగాణ తల్లి అని పేరు పెట్టినట్లు, 'బూతుపంచాంగానికి' తెలంగాణ భాష అని కూడా వీరు పేరు పెట్టారు. వీరి చుట్టూ తిరిగే మేధావులు 'నా తెలంగాణ బూతు నాయకులగన్న కోటి రతనాల వీణ' అని పుస్తకాలు రాసి ఫామ్‌హౌస్‌లో ప్రదానం చేస్తే వారికి గండపెండేరం తొడిగి ఆంధ్ర పెట్టుబడిదారులిచ్చిన పైసలతో కొన్న గుర్రం మీద ఎక్కించి ఫామ్ చుట్టూ తిప్పితే, తెలంగాణ వచ్చినా రాకున్నా విప్లవ మొచ్చిందని 'జై తెలంగాణ' అని నినదించవచ్చు. ఈ రెండేండ్లలో చనిపోయిన 700 అమరవీరులకు ఆత్మశాంతి కలుగుద్ది. వాళ్ల తల్లిదండ్రులకు తిండి ఉన్నదా, బట్ట ఉన్నదా అనే ఆలోచన మనకెందుకు, మనకు ఫామ్‌హౌజులు, పరుపు మంచాలు, చండేషియాగాలు ఉన్నాయి కదా! జై తెలంగాణ. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated 29/12/2011

Tuesday, December 27, 2011

ఒక యోధుడి అడుగు జాడలు (మల్లోజుల కోటేశ్వర్‌రావు)



మల్లోజుల కోటేశ్వర్‌రావును తలుచుకోవడమంటే తెలంగాణ పీడిత ప్రజల వెతల తలపోతలను గుర్తుచేసుకోవడం. ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకోవడమంటే, విప్లవోద్యమ నిర్మాణంలో అతని అడుగుజాడల్ని స్మరించుకుంటూ, అతనితో కలిసి నడిచిన అనుభవాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకోవడం. 


జగిత్యాల నుండి జంగల్ మహల్ వరకు సాగిన అతని ప్రస్థానాన్ని ప్రస్తావించుకోవడమంటే, భారత విప్లవ చరిత్రకు ప్రతీకగా నిలిచిన అతని పోరాటస్ఫూర్తిని, తుదిశ్వాస వరకు కనబరిచిన అతని అంకితభావాన్ని ఆదర్శంగా తీసుకోవడం. కళ్ళముందు మనిషిని మనిషే నిట్టనిలువుగా దోచేస్తుంటే, దౌర్జన్యంతో సమాజ మనుగడను తన కనుసన్నల్లో శాసిస్తుంటే, తెలంగాణ యావత్ సమాజం భూస్వామ్య విషపు కౌగిళ్లలో చిక్కి విలవిలలాడుతుంటే విముక్తి మార్గాన్ని అన్వేషిస్తూ, విప్లవ బాటలో సాగి పల్లెపల్లెల్లో ఎర్రమందారాల వనమై విస్తరించినవాడు కిషన్‌జీ! 

నాడు భూస్వాముల కోరలుపీకి, సబ్బండవర్ణాల ఆత్మగౌరవ జీవన విధానానికి నాంది పలికితే, నేడు ఛిద్రమవుతున్న ఆదివాసీ జీవితాల్లో వెలుగుపూలు పూయించి, వారి అటవీ సంపదలపై కన్నేసిన సామ్రాజ్యవాద, కార్పొరేట్ కంపెనీల కుట్రలను తిప్పికొట్టి, బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఉద్యమాన్ని నిర్మించినవాడు. 

18 రాష్ట్రాల్లో విప్లవోద్యమానికి బలమైన పునాదులు వేసి రెడ్ కారిడార్‌ను ఏర్పాటు చేసి, లాల్‌గఢ్‌ను తొలివిముక్తి ప్రాంతంగా ప్రకటించి, జీవితాన్ని సంపూర్ణంగా ఉద్యమానికే అంకితం చేసినవాడు. విప్లవోద్యమం నుండి విడివడిన నేను తెలంగాణ విమోచనోద్యమంలో కొనసాగుతూ, ఒక మహాయోధుని సమకాలికునిగా అతని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆయనతో కలిసి పనిచేసినకాలం నా జీవిత గమనంలో అత్యంత విలువైనదిగా భావిస్తూ ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. 

అది 1973వ సంవత్సరం. కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు, ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో కోటేశ్వరరావు బి.ఎస్.సి చదువుతున్నాడు. ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. బి.విజయ్‌కుమార్ ద్వారా కోటేశ్వర్‌రావు నాకు పరిచయమయ్యాడు. విప్లవభావజాలం కలిగిన పెండ్యాల సంతోష్‌కుమార్, కోటేశ్వర్‌రావు, చందుపట్ల కృష్ణారెడ్డి, నేను, బి.విజయ్‌కుమార్ తరచూ కలుసుకునేవాళ్ళం. మా మొట్టమొదటి కార్యాచరణ ఆగస్టు 15, 1973నాడు ఆరంభమైంది. 

ఆనాడు పోలీస్‌గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో మంత్రి జాతీయ జెండా ఎగురవేసిన పిదప డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరిట వేసిన 'బూటకపు స్వాతంత్య్రాన్ని బద్దలు కొట్టండి' అన్న కరపత్రాన్ని ప్రజల్లో పంచి, మేము నలుగురం వెళ్ళిపోగా, చందుపట్ల కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆనాడు విప్లవపార్టీల్లో ప్రజాసంఘాల నిర్మాణం పట్ల, వివిధ ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యలపై ప్రజాపోరాటాలు, లీగల్ నిర్మాణాల ఆవశ్యకత పట్ల భిన్నాభిప్రాయలు ఉండేవి. 

ప్రజల్లో పనిచేయడానికి పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం మాత్రమే అప్పుడు ఉన్నాయి. విప్లవ ప్రచారంలో విరసం ముందుభాగన ఉంటే, పౌరహక్కుల సంఘాన్ని విప్లవ భావజాల ప్రచారానికి వాడుకునేది. ఈ విధంగా విప్లవ ప్రచారం జరుగుతున్న క్రమంలో 1973వ సంవత్సరం పొడుగునా, కరీంనగర్, లక్షెట్‌పేట్, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి మొదలైన చోట్ల శ్రీశ్రీ, వరవరరావుల ఆధ్వర్యంలో పౌరహక్కుల బహిరంగ సభలు జరగడం, వాటన్నింటిలో నేను, కిషన్‌జీ, ఇతర మిత్రులం పాల్గొనేవాళ్ళం. అవి కిషన్‌జీలో, నాలో ఇతరమిత్రుల్లో బలమైన విప్లవ బీజాలు నాటాయి. 

1974 మొదటి భాగంలో ఓ.యూ.లో డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డి.ఎస్.ఓ) నుండి విడిపోయి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పి.డి.యస్.యు) ఏర్పడి అక్టోబర్ నెలలో హైద్రాబాద్‌లోని ఎస్.డి. హాల్‌లో దాని మొదటి మహాసభలు జరుపుకోవడం జరిగింది. మ్యానిఫెస్టోలో సాయుధపోరాట పంథాను విధానంగా చేర్చాలన్న డిమాండ్‌ను అంగీకరించకపోవడంతో, పిడిఎస్‌యు మితవాద పంథాను వ్యతిరేకిస్తూ కోటేశ్వర్‌రావు ఈ సభలను బహిష్కరించగా మేమంతా అనుసరించాము. 

వెనువెంటనే శ్రీశ్రీ, వరవరరావు, చెరబండరాజు, వంగపండు ప్రసాద్, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, ఎం.టి.ఖాన్, రంగనాథంల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అందులో నేను, కోటేశ్వరర్‌రావు, నల్లా ఆదిరెడ్డి, సాహు, అల్లం నారాయణ, చంద్ర ప్రభాకర్, చందుపట్ల కృష్ణారెడ్డి, నరెడ్ల శ్రీనివాస్, బి.విజయ్‌కుమార్, ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు, పోరెడ్డి వెంకట్‌రెడ్డి, తాటికొండ సుధాకర్‌రెడ్డి, గోపు లింగారెడ్డి, అల్లం వీరయ్య మొదలైన వారందరం పాల్గొన్నాం. 

ఈ సమావేశంలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్.ఎస్.యు) పేరుతో మరో విప్లవ విద్యార్థి సంఘం ఆవిర్భవించింది. ఈ పేరును శ్రీశ్రీ సూచించడం విశేషం. తరువాత కోటేశ్వరరావు, నేను, ఇతర మిత్రులు బాధ్యులుగా జిల్లాలో ఆర్.ఎస్.యు శాఖల ఏర్పాటు జరిగింది. 1975 ఫిబ్రవరిలో ఆర్ఎస్‌యు ప్రథమ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్‌లో రెండురోజులు జరిగాయి. 

కోటేశ్వర్‌రావుతో కలిసి మేమంతా పాల్గొన్నాం. 1975 మే 1 నాడు హుజురాబాద్‌లో శ్రీశ్రీ పాల్గొన్న జనసాహితీ సభలో కిషన్‌జీతో పాటు నేనూ పాల్గొన్నాను. ఈ రకంగా 1973లో పౌరహక్కుల సంఘం, విరసం, 1974లో విప్లవ విద్యార్థి సంఘాలు, 1975 జనవరి నుండి జూన్‌లో ఎమర్జెన్సీ విధించేవరకు ఆర్.ఎస్.యు.ల ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన అనేక విప్లవద్యోమాల ప్రచార సభలలో, సమావేశాలలో కోటేశ్వర్‌రావుతో మేమంతా పాల్గోవడం, చర్చించుకోవడం, కార్యాచరణను రూపొందించుకోవడం, తద్వారా జిల్లాలో విప్లవ బీజాలను నాటి, బలమైన విప్లవ భావజాల పునాదిని ఏర్పరచడం జరిగింది. 

ఈ సందర్భంలో తరచూ మేం కలుసుకోవడానికి మొదట్లో బి. విజయ్‌కుమార్ ఇల్లు, తర్వాత మా ఇల్లు షెల్టర్‌గా ఉండేవి. 1974లో కోటేశ్వర్‌రావు చొరవతో, ఆయన స్కాలర్‌షిప్ డబ్బులతో, నాలాంటి కొందరు మిత్రులు సమకూర్చిన డబ్బులతో పెట్టిన 'నిర్మలా ప్రెస్' మేము కలుసుకోవడానికి మరో సెంటర్‌గా ఉపయోగపడేది. వీటితోపాటు నాచే ప్రారంభించబడ్డ 'స్నేహ బుక్‌స్టాల్' విప్లవకారులంతా కలుసుకొని, కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి మరో కేంద్రంగా ఉపయోగపడింది. 1975లో ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు సుల్తాన్‌పూర్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నపుడు ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలో కోటేశ్వర్‌రావు ఉపన్యాసకుడిగా పాల్గొనగా, నేను కూలీగా, నల్లా ఆదిరెడ్డి దొరజీతగానిగా వీధిబాగోతం వేయడం ఎప్పటికీ మరిచిపోలేని ఓ జ్ఞాపకం. 

ఈ సభ జరుగుతున్నపుడే అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ వార్త మాకు మరునాటి ఉదయం తెలిసింది. దాంతో కరీంనగర్‌లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో 3 జిల్లాల ముఖ్యమైన విప్లవకారులకోసం నిర్వహించతలపెట్టిన రాజకీయ శిక్షణా తరగతులు వాయిదా వేయడం జరిగింది. శత్రువు బారినుండి రక్షించుకోవడానికి, ప్రజల వద్దకు వెళ్ళి పని చేయడానికి అందరం అండర్‌గ్రౌండ్ వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. 

దానితో ముఖ్యనాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్ళి, అప్పటికే ఉద్యమం బలంగా ఉన్న కొన్ని గ్రామాల్లో రహస్య స్థావరాలను ఏర్పరచుకొని, విప్లవ కార్యక్రమాలు కొనసాగిస్తూ, జిల్లాలోని పలుచోట్ల పార్టీ ఆధ్వర్యంలో భూస్వాముల ఆగడాలను అరికట్టడానికి, ప్రత్యక్ష దాడులకు దిగడానికి కార్యాచరణను రూపొందించుకోవడం జరిగింది. ఆ క్రమంలో 1976లో మద్దునూరు రాజేశ్వర్‌రావు, తపాలాపూర్ పీతాంబరరావులపై ప్రత్యక్షదాడులు జరిగాయి. ఈ దాడులలో కిషన్‌జీ వీరోచిత పాత్ర పోషించాడు. ఇవి తెలంగాణ విప్లవద్యోమంలో సాహసోపేత ఘటనలుగా చరిత్రలో నిలిచాయి. 

1978లో మొదటిసారి కోటేశ్వర్‌రావు అరెస్ట్ అయ్యాడు. విడుదల తరువాత రాడికల్ యువజన సంఘాల ఏర్పాటులో ముమ్మరంగా పాల్గొన్నాడు. 1978 ఏప్రిల్ వేసవి సెలవుల్లో 'గ్రామాలకు తరలండి' నినాదంతో విద్యార్థులకిచ్చిన కార్యాచరణ ద్వారా సుమారు 500 మంది విద్యార్థులు 150 బృందాలుగా ఏర్పాటై గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో మేము ప్రజలకు మరింత చేరువై, వారి కష్టాలు, కన్నీళ్లు మరింత దగ్గరగా గమనించగలిగాం. మంథని వద్ద శాస్త్రులపల్లిలో 500 మంది విద్యార్థులకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో కోటేశ్వర్‌రావు వాక్పటిమ, సైద్ధాంతికతను దగ్గరి నుండి గమనించగలిగాను. 

1978 సెప్టెంబర్ 9 నాడు శక్తి ప్రదర్శనకోసం జగిత్యాలలో నిర్వహించిన రైతుకూలీల సభ జనసందోహంతో నిండిపోయి 'జగిత్యాల జైత్రయాత్ర'గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సభను విజయవంతం చేయడానికి కిషన్‌జీతో పాటు మేమంతా జగిత్యాల ప్రాంతంలో పల్లెపల్లెలో తిరిగి ముమ్మర ప్రచారం చేయడం జరిగింది. 1978లో ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి నిర్భంధాన్ని పెంచినా కోటేశ్వర్‌రావు, చెక్కుచెదరని ధైర్యంతో ఉద్యమంలోకి ముందుకు సాగాడు. 

1980 జనవరిలో మంథని దగ్గర్లోని గాజులపల్లి గుట్టలో రెండు రోజులు ముఖ్యనాయకులతో జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం, ఉద్యమ విస్తరణ పట్ల అనేక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలోనే కోటేశ్వర్‌రావు జిల్లా సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. ఇదే సంవత్సరం అక్టోబర్‌లో హైద్రాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగడం, కొండపల్లి సీతారామయ్య చొరవతో కోటేశ్వర్‌రావును రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. 

అప్పటి వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మా.లె) కొండపల్లి సీతారామయ్య పేరుతో చలామణి అవుతున్న పార్టీకి 'పీపుల్స్ వార్'గా ఈ సమావేశంలో నామకరణం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు, కోటేశ్వర్‌రావులను నేను కలుసుకున్నపుడు, నన్ను కరీంనగర్ పట్టణ, రూరల్ బాధ్యతల నుండి తప్పించి నిజామాబాద్ డి.సి.ఎం.గా బోధన్ కార్మిక కేంద్రంగా పనిచేసేటట్లు నిర్ణయించారు. 

అక్టోబర్ 2న కరీంనగర్‌లో సమావేశం కావలసిన మేము వేరువేరు షెల్టర్‌లలో ఉండగా, 1వ తేదీ రాత్రే నన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం, విడుదలైన పిదప వ్యక్తిగత కారణలతో నేను పార్టీలో కొనసాగలేని స్థితిన లెటర్‌ద్వారా తెలియపరచగా, పార్టీ సహేతుకంగా భావించడంతో ఉద్యమానికి దూరంగా ఉన్నాను. 1983 వరకు రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగి, తరువాత విస్తృత ప్రాంతాల్లో బలమైన దండకారణ్య ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించి, కోటేశ్వర్‌రావు కిషన్‌జీగా భారత విప్లవోద్యమంలో తనదైన చరిత్రను లిఖించుకున్నాడు. 

- నారదాసు లక్ష్మణరావు
శాసనమండలి సభ్యులు
Andhra Jyothi News Paper Dated 27/12/2011

Saturday, December 24, 2011

ఈ జీవన విధ్వంసం అగేదెన్నడు?



స్వాతంత్య్ర భారతవని ఒకవైపు అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటే, అదే భారతావనిలో భాగమై నివసిస్తున్న ఆదిమజాతి తెగలకు స్వాతం త్య్రం వచ్చిందా? రాలేదా? అనే సందిగ్ధంలో వారు జీవన విధ్వంసాన్ని చవిచూస్తున్నారు. అభివృద్ధి అనే విషపుకోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. అమ లు కావాల్సిన రాజ్యాంగహక్కులు అమలు కాక అందాల్సిన రిజర్వేషన్లు అందక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన అభివృద్ధి నిధులు దళారులపాల వు తున్నాయి. ఆదివాసీలను అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం రాష్ట్రపతి, గవర్నర్‌లకు ప్రత్యేక హక్కులను చట్టాలను కల్పించింది. ప్రత్యేక ఆర్థికనిధిని కేటాయి స్తూ అభివృద్ధి చేయమని సూచించింది. కానీ నేడు పాలకులు చేస్తున్న దేమిటి? నల్లమల్ల అట వీ ప్రాంతంలో 236, 237 జీవోలు పెట్టి రాజీవ్‌గాంధీ పులుల అభయారణ్యం పేరుతో డీబీర్స్ కంపెనీకి వజ్రాల తవ్వకానికి ఇచ్చి చెంచులను నిర్వాసితులను చేస్తున్నారు.

adivasi_0-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఖమ్మం,కరీంనగర్,వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలలో ఓపెన్ కాస్ట్ పేరుతో ఆదివాసీ ప్రాంతాలలో జీవనాధారాలను బొందపెడుతున్నారు. కుంతాల జలవిద్యుత్ కేంద్రం పేరుతో చారివూతక సాంస్కృతిక ఆధారాలను దెబ్బతీస్తున్నారు. అలాగే 41 జోన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కవ్వాల్ అభయారణ్యం.11వందల చదరపు కి.మీ విస్తీర్ణంతో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టు వలన నేడు 40 ఆదివాసీ గ్రామాలను అడవి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారుపభుత్వం లక్ష్యం ఒక్కటే ఆదివాసీలు అడవిలో ఉన్నంత కాలం వారి ఐక్యత ముందు మనం ఏం చేయలేం. అందుకే వారిని అడవినుంచి దూరం చేస్తే అక్కడ ఉన్న ఖనిజాలను సులభంగా తవ్వుకొని కోట్ల రూపాయాలు దోచుకోవచ్చనే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ టైగర్ జోన్‌కు కేటాయించిన ప్రాంతంలోని ఆదివాసీ తెగలు ప్రధానంగా గోండ్, నాయక్‌పోడ్, కోలాం. ఈ తెగలు చారివూతక కాలం నుంచి ఈ ప్రాంతం లో ప్రకృతితో సహజీవనం చేస్తూ అడవి జంతువులతో మమేకమై జీవిస్తున్నారు. ఇప్పుడు వీరిని పులుల రక్షణకని బయటికి పంపటం ఎంతవరకు సమంజసం? పైగా ఉన్న పళంగా గ్రామాలను వదిలి గొడ్డు గోద పిల్ల పాపలతో బతుకు దెరువు కోసం తమ ఉమ్మడి సాంస్కృతిక జీవన విధానాన్ని సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కట్టుబొట్టు, పవిత్ర దైవస్థలాలు అడవితోగల మమేకాన్ని విడిచి వెళ్ళాలి. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ కన్న వినియమ వ్యవస్థ (వస్తుమార్పిడి) ఎక్కువగా ఉంటుంది. స్వార్థపూరిత దళారీ వ్యవస్థతో కూడిన మైదాన ప్రాంతంలో ఆదివాసీల జీవనం ఆగమ్యగోచరంగా మారుతుంది. వారికి ఉపాధి కరువవుతుంది.

ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తిని ఒక కుటుంబంగా పరిగణించి10 లక్షలు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బు 68 కోట్లు. 40 గ్రామాలలో నిర్వాసితులయ్యే కుటుంబాలు 1000 వరకు ఉంటాయి. ఈ కుటుంబాలలో 18 ఏళ్లు నిండిన వారిని ముగ్గురి చొప్పున లెక్కించినా 3వేల మందికి 300 కోట్ల రూపాయాలు కావాలి. మరి ప్రభుత్వం నిర్వాసితులకు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? ఈ ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేస్తుం ది అనేది స్పష్టం చేయాలి. ఈ కాకి లెక్కలన్ని ప్రభుత్వం ఆదివాసీలు అమాయకులని చెబుతుందా? లేక సమాజం గుడ్డిదని చెబుతుందా అర్థం కావఒకవేళ 10 లక్షల నష్టపరిహారం అందినా సర్వం కోల్పోతున్న ఆదివాసీలు ఎంతకాలం నాణ్యమైన జీవనాన్ని గడపగలరు.నిజంగా వారు గ్రామాలను వదిలిన తరువాత పునరావాసం, నష్టపరిహారం అందుతుందన్న గ్యారంటీ లేదు.

ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఆదివాసీలు మోసపోవటం కొత్తకాదు. ఆదిలాబాద్‌లో ఓపెన్‌కాస్ట్ కింద నిర్వాసితులను చూస్తే సోముగూడెం, ఇందా రం, కాసీపేట, మందమర్రి, పెద్దపల్లి, ముత్యంపల్లి, కోమటిబెను, దుబ్బపల్లి, పెద్ద దర్గా రం, గోండ్‌గూడెం, మామిడి గుడ, ఎర్రగుంట పల్లె, పెద్దినపల్లి, సండ్రవిపాడులలో సింగరేణి అధ్యయన బృందం (సార్క్)నివేదిక ప్రకారం 300 మీట ర్ల లోతు 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహించే గని వల్ల కనీసం 10 కిలోమీటర్ల భూగర్భ జలాలు గనిలోకి చేరుతాయి. దీనివల్ల 10 కిలోమీటర్ల పరిధిలోని సాగునీటి వనరులు విధ్వంసం అవుతాయి. 10వేల ఎకరాల వ్యవసాయ భూమి కుంటుపడుతుంది. ఇదిగాక డోర్లి-1,డోరి-2, అప్పార్, కైరిగూడలది ఇదే పరిస్థితి. ఇంత పెను ప్రమాదం జరిగినా వీరికి ఇప్పటి వరకు నష్టపరిహారం అంటే తెలియదు. వీరు సర్వం కోల్పోయి దిన దిన గండంగా గడుపుతున్నారు. అదేవిధంగా దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ కింద ఆదివాసీల భూములను తీసుకొని నష్టపరిహారం ఇస్తాం. కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమపెట్టి 400 ఎకరాలు తీసుకుని ఇప్పుడు 13 వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు.

ఇక్కడి స్థానిక పెద్దలను అడిగితే తెలిసింది ఏమిటంటే గతంలో పులులు ఉండేవి గాని ప్రస్తుతం లేవు. 30 ఏళ్ళుగా ఫారెస్టు అధికారుల నిర్లక్ష్యం, అవినీ తి అక్రమాలు కలప స్మగ్లర్ల వలన ఈ అడవి అంతరించిపోయింది. దీంతో పులు లు కూడా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లాంటి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వలసపోయాయి. కాని ఇక్కడ పులులు నివసించే సౌకర్యం లేకున్నా ఫారెస్టు అధికారులు 2 పెద్డ పులులను, 2 చిరుతపులులను, 13 వేల విష సర్పాలను కవ్వాల ప్రాంతంలో వదిలారు. ఈ విధంగా భయవూభాంతులకు గురిచేస్తే అడవులను వదిలి వెళ్ళిపోతారని ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. పైగా అటవీ అధికారులు మీరు అడవిని వదలకుంటే ఆకలితో ఉన్న పులులుమిమ్మల్ని ఆహారం దొరకక తినేస్తాయి. విషస్పరాలు చంపేస్తాయి.

అని బెదిరిస్తున్నారు. అటువంటప్పుడు పులులకు ఆహారం దొరకని ప్రదేశాన్ని టైగర్‌జోన్‌గా ఎందుకు ప్రకటించారు. అనేది అదివాసీల ప్రశ్న? కనీసం జంతువులకు ఇచ్చే విలువ ఆదివాసీలకు ఇవ్వకపోవటం వలన అంతర్యమేమిటి అని ప్రశ్నిస్తున్నా రు. ఈ టైగర్‌జోన్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేస్తోంది. 5వ షెడ్యూల్డు 6(1)వ క్లాజు ప్రకారం షెడ్యూల్డు గ్రామ హోదాను తొలిగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం తరలించే 40 గ్రామాలలో 3ఱగామాలు షెడ్యూల్డు హోదా కలిగిఉన్నాయి. 2011 పంచాయతీరాజ్ షెడ్యూల్డు ప్రాంత నిర్దేశకాల ప్రకారం 40 గ్రామాల గ్రామసభల అనుమతి తీసుకున్నాకే ఈ గ్రామాలను తరలించాల్సి వుంటుంది. అడవి హక్కుల చట్టం - 2006 సెక్ష న్(5) ప్రకారం అటవిపై జీవవైవిధ్య, వన్యవూపాణులను కాపాడుకునే హక్కు, క్యాచ్‌మెంట్ ఏరియా నీటివనరులను కాపాడుకునే, సహజ సంపద, సాంస్కృతిక ప్రదేశాలను కాపాడుకునే హక్కు సముదాయక హక్కు కల్పించింది. కాని పాలకులు వీటికి కనీస విలువ కూడా ఇవ్వటం లేదు.

ఇక్కడ పులుల సంరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను ఎందుకు తరలిస్తున్నారనేది అంతుపట్టని పరిస్థితి. నల్లమల్లలో రాజీవ్‌గాంధీ పులుల అభయారణ్యం పేరుతో వజ్రాల త్రవ్వకానికి డీబీర్స్ కంపెనీకి తాకట్టు పెట్టినట్టు ఇక్కడ ఖనిజ నిక్షేపాలు త్రవ్వకాల ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? అనే అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీలు తాము గ్రామాలను వదిలి వెళ్లేది లేదని, తమ గోడును వినమని వేడుకుంటున్నారు. అయినప్పటికీ పాలకులు స్పందించకుంటే రాంజీ గోండ్ పోరాటం, జోడేఘట్ కొమురం భీం పోరాటం, ఇంద్ర పోరాటాల లాగా కవ్వాల పోరాటం కూడా పునరావృత్తం అవుతుందనేది పాలకులు గుర్తెరగాలి.

- మైపతి అరుణ్ కుమార్‌

ఆమె దారి ఆదర్శం..!



img131-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ రాష్ట్రం వస్తే బొమ్మరిల్లులా దిద్దుకుంటం’ అని ఏర్పడబోయే కొత్త రాష్ట్రం రూపురేఖలను, స్వభావాన్ని నాడే తేల్చి చెప్పింది టి.ఎస్. సదాలక్ష్మి. ప్రత్యేక రాష్ట్రం పట్ల తన ఆకాంక్షతో పాటు, స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న ఆమె 1969 నాటి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆమె తన ఉద్యమ ఆచరణ ద్వారా గడించిన అనుభవం, పోరాట పటిమల గురించిన వివరమంతా తెలంగాణ చరివూతలో ముఖ్యభాగమే.

ఒక తల్లి తన పిల్లలకు వివరిస్తున్న తీరులో తన చివరిరోజుల్లో సైతం, ‘ఎప్పుడైనా.. తెలంగాణ రావాలంటే చెయ్యాల్సింది ఒక్కటే’ అని కరాఖండిగా చెప్పారు. ‘తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకుని, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలె మేం సపరేటవుతమని గట్టిగా నిర్ణయించుకుంటే, తప్పకుండా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగలుగుతారు. ముందయితే మీరు ఏకతాటిమీదకు రాండ్రి!’ అని సూటిగా చెప్పగలగడానికి తన సుదీర్ఘమైన రాజకీయ ఉద్యమ జీవిత నేపథ్యమనే చెప్పుకోవాలి. తెలంగాణలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలని సదాలక్ష్మి చెప్పిన ప్రకారంగా 1969 నాటి తొలి దశ ఉద్యమంలో గానీ లేదా మలిదశ ఉద్యమం నాటికి గానీ తెలంగాణలోని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది.

ఈ రకమైన ఐక్యత కోసమే కేసీఆర్ తన ఆమరణ నిరాహారదీక్ష తరువాత అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలవడం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యపోరాటాన్ని వివిధ అంచెలుగా ఉద్యమాన్ని కొనసాగించడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్ 23 ప్రకటన వెలువడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఉద్యమం సకల జనుల సమ్మె స్థాయిని అందుకున్నప్పటికీ తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలని సదాలక్ష్మి చెప్పిన ప్రకారంగా ఐక్యం కాలేకపోవడం దారుణం. ఆరు దశాబ్దాలకుపైగా తెలంగాణ ప్రజలు రాష్ట్రం కోసం దశలవారీగా పోరాటం చేస్తున్నారు. అనేక వైవిధ్యాల ప్రజాసమాజాలైన ఉత్పత్తి కులాలు, ఉత్పత్తియేతర ఆధిపత్య కులాలు, తెగలు, దళిత కులాలు, మతాలు ఈ ఉద్యమంలో భాగమయ్యాయి.

సమాజంలో అన్ని రంగాలు వైద్య, న్యాయ, విద్య, విద్యుత్తు, రక్షణ, మున్సిపల్, పారిశుద్ధ్య, అడ్మినివూస్టేషన్లలోని ఉద్యోగులు ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని చాటారు. సమాజంలో వివిధ అంతరాలు ఉన్నట్టు, వివిధ రంగాలలో అంతరాలున్నాయి. ఉదాహరణకు అధికారి నుంచి గుమాస్తా వరకు, ఆఫీసర్ల నుంచి రోడ్లు ఊడ్చే స్వీపర్ల వరకు అంతరాలు, ఆధిపత్యాలు లేకుండా జై తెలంగాణ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు అద్భుతమైన పోరాట రూపాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్న నాలుగు తరాలు ఒక కుటుంబంలో ఉండి వారసత్వంగా పోరాటాన్ని నడిపిస్తున్నారు. సకల జనుల సమ్మె స్థాయి వరకు ప్రజలు చారివూతాత్మకమైన పోరాటం చేస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీలు, నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ ప్రజావూదోహులుగా కొనసాగుతూ వస్తున్నా రు.

కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ద్రోహాలు ఒక క్రమం అయితే స్థానికంగా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు నేతలు చేసిన ద్రోహం మరొక క్రమంగా చెప్పుకోవాలి.
తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు, ఢిల్లీలో తిష్ట వేసిన కాంగ్రెస్ పార్టీలోని దోపిడీశక్తులకు తొత్తులుగా మారారు. వారి బానిసబుద్ధికి మించిన ద్రోహబుద్ధి మరొకటి లేదు. వీరు చేసే దుష్ట చేష్టల వల్లనే తెలంగాణ మోసం మీద మోసం జరుగుతున్నది. అది పెనం నుంచి పొయ్యిల పడుతున్నది. ఇవి ఒకటి తర్వాత ఒకటి బయటపడ్డాయి.

1. తెలంగాణ ప్రజల డిమాండ్ ప్రకారం రాజీనామాలు చేయకపోవడం
2. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి అధిష్ఠానాన్ని ఒప్పించే సామర్థ్యం వీరికి లేకపోవడం.
3. అవకాశం చేతికొచ్చినప్పుడు కనీసం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం అనేది ప్రజావూపతినిధులుగా వారు నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజావూపతినిధులు అనే మాటకు వీరు తెలంగాణ రాష్ట్రం విషయంలో పూర్తిగా అర్థం మారేలా వ్యవహరించారు. ఈ సందర్భంలో టి.ఎస్. సదాలక్ష్మి నాటి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షురాలిగా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆ వారం పది రోజుల్లోనే ర్యాలీలు, సత్యాక్షిగహాలు, దీక్షలు, జైల్‌భరోలు, మానవహారాలు, సత్యాక్షిగహాలతో ఆంధ్ర సర్కారును గడగడలాడించారు.

ఇది ఒక ఎత్తుఅయితే 1969 మార్చి 8,9 తేదీలలో రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన కన్వెన్షన్‌తో హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిన సంగతి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తెలుసుకున్నారు. హుటాహుటిన అర్ధరాత్రి ఫ్లెట్‌కు హైదరాబాద్‌లో దిగారు అంటేనే ఆ కన్వెన్షన్ ప్రభావం ఎంత ఉందో మన ఊహించుకోవచ్చు. ఆంధ్ర గవర్నర్‌తో జాతీయ జెండాను ఎగురవేయనీయలేని గట్స్ సదాలక్ష్మివి. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డి సదాలక్ష్మి తఢాఖాకు తట్టుకోలేక బుల్లెట్ ఫ్రూఫ్‌ను ధరించారు. ఒకానొక ఆర్థిక గడ్డు పరిస్థితుల్లో తన బంగారు నగలు, వెండి సామాను అమ్మి వచ్చిన డబ్బుల తో ఉద్యమం నడిపిందని నేటికి ఆమె శిష్యులు చెబుతారు. నాయకురాలిగా నేటికీ సదాలక్ష్మి అనుభవాలు, ఆలోచనలను తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుసరించక తప్పదు. అప్పుడే ప్రజావూపతినిధులుగా వారు రాజకీయ భవిష్యత్తును కలిగి ఉంటారు. లేదా రాజకీయ భవిష్యత్తు ఉండదని వారు సదాలక్ష్మి జయంతి సందర్భంగానైనా పునఃపరిశీలన చేసుకోవాలి.

-గోగు శ్యామల
తెలంగాణ మహిళా రచయితల మేధావుల వేదిక
నేడు టి.ఎస్. సదాలక్ష్మి జయంతి

నీటిలో నిప్పు : ముల్లైపెరియార్‌


తమిళనాడు, కేరళ మధ్య రాజుకున్న ‘ముల్లైపెరియర్‌’ చిచ్చు కలవరపెడుతున్నది. సున్నితమైన ఈ సమస్యపై రాజకీయపార్టీలు చేస్తున్న స్వార్థ విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. విశాలమైన జాతి హితాన్ని మరచి ఓట్ల వేటలో రెండు రాష్ట్రా నేతలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. అంతర్‌ రాష్ట్ర వివాదాల నెగళ్లతో చలికాచుకునే కేంద్రం వైఖరి అత్యంత ప్రమాదకరం. మున్ముందు నీటి యుద్ధాలు తప్పవన్న జోస్యాలు వాస్తవరూపం దాల్చే రోజులు ఎంతో దూరంలోలేవని నదీజలాల వివాదాలు రుజువు చేస్తున్నాయి. 

దాదాపు 116 ఏళ్ల క్రితం కేరళలోని ఇడుక్కి జిల్లా తెక్కాడి ప్రాంతంలో బ్రిటిష్‌ ప్రభుత్వం (మద్రాసు రెసిడెన్సీ) నిర్మించిన ‘ముల్లైపెరియర్‌’ డ్యాం తాజా వివాదానికి కేంద్ర బిందువు. కేరళలో ప్రవహించే పెరియార్‌ నది వృథాగా సముద్రంలో కలుస్తుంటే, దాని సమీపంలోని త మిళనాడు సరిహద్దు ప్రాంతాలు కరవు కాటకాలతో అల్లాడిపోయేవి. పెరియార్‌, దాని ఉపనది ముల్లైయార్‌ కలిసేచోట ఆనకట్టకట్టితే, దక్షిణ తమిళనాడులోని ఐదు జిల్లాలకు సాగునీరు అందించవచ్చని నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం నాటి ట్రావెన్‌కోర్‌ సంస్థానం (నేటి కేరళలో అంతర్భాగం) మహారాజాతో సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. 999 ఏళ్లు అమలులో ఉండేలా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

ఈ ప్రకారం ట్రావెన్‌కోర్‌ సంస్థానంలోని తెక్కాడి ప్రాంతంలో ముల్లైపెరియార్‌ డ్యాంను నిర్మించారు. 1887లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 1895లో పూర్తయ్యింది. ఒప్పందం ప్రకారం ఆనకట్ట నిర్మాణం బాధ్యత మద్రాసు రెసిడెన్సీదే. ఆనకట్టకోసం ట్రావెన్‌కోర్‌ సంస్థానం 8100 ఎకరాల భుమిని ఇచ్చింది. ఇందుకుగాను- ఎకరానికి ఏడాదికి రూ. 5 చొప్పున కౌలు ఇచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డ్యాం నిర్మాణంతో తమిళనాడులోని నేటి మదురై, దిండుగల్‌, తేనీ, రామనాథపురం, శివగంగ జిల్లాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య పరిష్కారమైంది. 1970లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఈ ఒప్పందాన్ని తిరగ రాసుకున్నాయి. ఈ డ్యాం ద్వారా మదురై ప్రాంతంలోని నీటి ఎద్దడికి, పెరియార్‌ నదివల్ల ట్రావెన్‌కోర్‌ సంస్థానం ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లుయింది. 

అయితే, 1979లో గుజరాత్‌లోని మార్వి డ్యాం కూలిపోయి 25 వేల మంది మరణించడం, అదేసమయంలో ముల్లైపెరియర్‌ డ్యాం బలహీనపడిందన్న వార్తలు వెలువడడంతో కేరళలో ఆందోళనలు ప్రారంభమయినాయి. దీంతో తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (సెస్‌) డ్యాం భద్రతపై అధ్యయనం చేసి రిక్టర్‌ స్కేల్‌పై 6 అంతకుమించిన తీవ్రతతో భూకంపం వస్తే డ్యాం కూలిపోతుందని వెల్లడించింది. రూర్కీ ఐఐటి, ఐఐఎస్‌సి సంస్థలు కూడా దీనిపై అధ్యయనం చేసి సెస్‌ చెప్పింది వాస్తవమేనని తేల్చాయి. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ కూడా డ్యాం భద్రతను పరిశీలించి డ్యాంలో నీటి నిల్వను 142.2 అడుగుల నుంచి 136 అడుగులకు తగ్గించాలని ఆదేశించింది. అయితే, తమిళనాడు మాత్రం తమ సేద్యపు నీటి అవసరాలు పెరిగాయని, నీటి నిల్వ ఎత్తు పెంచాలని పట్టుపట్టింది. అలా 32 ఏళ్ల క్రితం ప్రారంభమైన వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉన్నది. 

దీనికితోడు 1997లో సంభవించిన భూకంపంలో ఆనకట్టకు బీటలు వారాయి. జలాశయంలోని నీళ్ళు లీక్‌కావడం ప్రారంభమైంది. ప్రజల్లో ఆందోళనలు మరింత తీవ్రమైనాయి. డ్యాం కూలిపోవడం తథ్యమన్న భావన బలపడింది. డ్యాం కూలిపోతే కేరళకు చెందిన ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం తదితర ఐదు జిల్లాల్లోని దాదాపు 70 లక్షల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కేరళ నాయకత్వం కలవరపడింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అవిశ్వాసం పెరిగిపోయింది. బ్రిటిష్‌కాలం నాటి వందేళ్ళకు పైబడిన ఒప్పందం విశ్వసనీయతపై కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

2006లో డ్యాం నీటి మట్టం 142 అడుగుల ఎత్తువరకు పెంచుకోవచ్చుని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. 
ఈ ప్రాజెక్టు ప్రాంతం భూకంపం జోన్‌లో ఉన్నదనీ, గడచిన ఆరునెలల్లోనే అక్కడ 20 వరకు భూకంపాలు సంభవించాయనీ, భూకంపం తీవ్రత పెరిగితే డ్యాం బద్దలు కావడం ఖాయమని లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదనీ, దీన్ని నివారించడానికి డ్యాం పక్కన మరో డ్యాం నిర్మించాలని కేరళ వాదిస్తున్నది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం 2006లో కేరళ సాగు, మంచి నీటి సంరక్షణ (సవరణ) చట్టాన్ని కూడా తెచ్చింది. 

కొత్త ఆనకట్ట నిర్మాణానికి తాను సిద్ధమనీ, తమిళనాడు నిర్మించినా తమకు సమ్మతమేననీ, 999 ఏళ్ల ఒప్పందాన్ని అమలు జరుపుతామనీ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అనేకసార్లు ప్రకటించారు. అయితే తమిళనాడు వాదనలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. డ్యాం భూకంపం జోన్‌లో ఉన్నదన్న కేరళ నిర్థారణను తోసిపుచ్చింది. అదేవిధంగా అనకట్ట బలహీనంగా లేదనీ, దీనికన్నా ఎక్కువ వయసు ఉన్న డ్యాంలు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయనీ స్పష్టం చేస్తున్నది. అదీగాక, డ్యాం భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చిట్టా విప్పుతున్నది. నీటివాటా తగించాలన్న కుట్రతోనే కేరళ కొత్త నిర్మాణాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపిస్తున్నది. 

ఈ అంతర్‌ రాష్ట్ర వివాదం పరిష్కారానికి 2010లో సుప్రీంకోర్టు- మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఎస్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 2012 ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ గడువు సమీపిస్తున్న కొద్దీ రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రి చాందీ కొత్త డ్యాం నిర్మించాల్సిందేనంటూ తన కేబినెట్‌తో తీర్మానం ఆమోదింపజేశారు. కేరళ ప్రతిపాదన తమకు సమ్మతం కాదంటూ జయలలిత ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేయించారు. డ్యాంలో నీటినిల్వ మట్టం పెంచాలని తమిళనాడు ప్రజలు, కొత్త డ్యాం నిర్మించాలని మలయాళీలు వీధుల్లోకి వచ్చారు. 

వీరి సెంటిమెంట్లకు రాజకీయపార్టీలు మరింత ఆజ్యం పోసి రెండు రాష్ట్రాల ప్రజ ల మధ్య శత్రుభావనలు పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘డ్యాం 999’ సినిమా ఉద్రిక్తతలను పెంచింది. దీంతో జయలలిత ఈ సినిమాను నిషేధించారు. కేంద్ర మంత్రులు చిదంబరం, వాయలార్‌ రవిల పొంతన లేని ప్రకటనలు రెండు రాష్ట్రాల ప్రజలను మరింత దూరం చేశాయి. అయ్యప్ప భక్తులపై దాడులకు దిగేవరకు పరిస్థితులు దిగజారాయి. చివరకు తమిళనాడులోని కొన్ని పార్టీలు కేరళకు వ్యతిరేకంగా ఆర్థిక దిగ్బంధనానికి పిలుపు కూడా ఇచ్చాయి. 

ముల్లైపెరియార్‌ డ్యాం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలనే కాదు, కొన్ని మౌలిక అంశాలను తెరపైకి తెచ్చింది. వందేళ్లు పైబడిన డ్యాంల భద్రతపై సమగ్ర అధ్యయనం జరపాల్సిన అవసరాన్ని ఇది దేశ ప్రజల దృష్టికి తెచ్చింది. మనదేశంలో వందేళ్లు పైబడిన డ్యాంలు 115 వరకు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే 13 ఉన్నాయి. వీటన్నిటి భద్రతపై కేంద్రం దర్యాప్తు చేయించాలి. ముల్లైపెరియార్‌ విషయంలో రెండు రాష్ట్రాలు సుహృద్భావ పూరితంగా వ్యవహరించాల్సింది పో యి ప్రతిష్ఠకు పోవడం దురదృష్టకరం. డ్యాం భద్రతపై మలయాళీల మనో భావాలను తమిళనాడు వారు అర్థం చేసుకోవాలి.

‘డ్యాం బద్ధలైతే’ అంటూ భీతావాహదృశ్యాలతో జనాన్ని ఆందోళనలకు గురిచేయడం కేరళ నాయకులకు సరికాదు. ఏరోటి కాడ ఆ పాట పాడే సంకుచిత రాజకీయాలను జాతీయ పార్టీలు విడనాడాలి. జాతిహితాన్ని దృష్టిలో పెట్టుకొని విశాలదృక్పథంతో వ్యవహరించాలి. కేంద్రం జోక్యం చేసుకొని త్రైపాక్షిక చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. పార్టీల్లో ఏకాభిప్రాయానికి ప్రయత్నించాలి. అది సాధ్యం కాకపోతే ఎన్నికల కమిషన్‌ తరహాలో స్వతంత్ర జల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. వృత్తి నిపుణులతో జాతీయ స్థాయిలో వివాదాల పరిష్కార వేదికగా అది పనిచేయాలి. దాని తీర్పులకు అన్ని రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆల్మట్టీలు, ముల్లైపెరియర్లు పుట్టుకొస్తాయి.


- దేవేంద్ర

కోటాల రాజకీయం - సంపాదకీయం


దేశంలోని మైనారిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగుతులకు (ఓబీసీ)లకు ఉన్న 27 శాతం రిజర్వేషన్‌లో మైనారిటీలకు 4.5 శాతం సబ్ కోటాను కల్పించనున్నారు. అల్పసంఖ్యాక వర్గాలకు సబ్ కోటాను ఏర్పాటు చేయాలని మత, భాషాపరమైన మైనారిటీల జాతీయ కమిషన్ చేసిన సిఫార్సు మేరకు యూపీఏ సర్కారు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో 18 శాతంగా ఉన్న ముస్లిం, సిక్కు, క్రైస్తవ, పార్శీ, భౌద్ధ మైనారిటీలకు లబ్ధి చేకూరనుంది. 

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలోనే యూపీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓబీసీ కేంద్ర జాబితాలో గుర్తించిన అల్పసంఖ్యాక వర్గాలు, సముదాయాలన్నింటికీ ఈ సబ్ కోటా వర్తింస్తుంది. మైనారిటీ వర్గాలకు ఓబీసీ కోటాలో అంతర్భాగంగా సబ్‌కోటా కేటాయించడం వలన వెనబడిన వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఓబీసీ రిజర్వేషన్ కోటాను పెంచి, ఆ మేరకు హిందూయేతర వెనబడిన వర్గాలకు సబ్ కోటా కల్పించడం వల్ల ఎవరికీ న ష్టం ఉండదని వారు సూచిస్తున్నారు. అయితే ఇంత సున్నితమైన విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా యూపీఏ ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకోవడం వెనుక సామాజిక న్యాయం కంటె రాజకీయ ప్రయోజనమే అధికంగా ఉందన్న విమర్శలూ వస్తున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో నెగ్గితే దేశవ్యాప్తంగా ఎదురుండదనేది ఒక సాంప్రదాయక రాజకీయ నానుడి. యూపీ ఎన్నికల ఘట్టం రాజకీయపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. రాహుల్‌ను ఢిల్లీ పీఠంపై అధిష్ఠింపజేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటోంది. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కోటను బద్దలు కొట్టేందుకు అక్కడి ఓటర్లలో గణనీయమైన భాగంగా ఉండే ముస్లిం ప్రజానీకం ఓట్లను కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. 2009 ఎన్నికల్లో ముస్లింల మద్దతుతోనే యూపీలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 21 లోక్‌సభ స్థానాల్లో నెగ్గింది. 

ఈ అనుభవం నేపథ్యంలో ఆ రాష్ట్ర ముస్లిం ఓటు బ్యాంకును స్థిరపరచుకునేందుకు మైనారిటీ రిజర్వేషన్ లేదా ముస్లిం కోటాను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే యూపీఏ కేటాయించిన మైనారిటీ రిజర్వేషన్ కేవలం కంటితుడుపు మాత్రమేనని సమాజ్‌వాది పార్టీ, సిపిఎంలు విమర్శించగా, ఓబీసీ రిజర్వేషన్‌లకు గండిపెట్టి మైనారిటీలకు సబ్ కోటాను నిర్ణయంచడం మోసపూరితమైన విధానం అని బిజెపి వ్యతిరేకించింది. దేశంలోని మతపరమైన, భాషాపరమైన మైనారిటీల స్థితిగతుల అధ్యయనం కోసం జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన రంగనాథ మిశ్రా కమిషన్ 2007లో కేంద్రానికి సమర్పించిన నివేదిక ముస్లింలకు 10 శాతం, ఇతర మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్లను సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన ప్రాతిపదికన కల్పించాలని సిఫార్సు చేసింది. 

ప్రస్తుతం అమలవుతున్న 27 శాతం ఒబిసి రిజర్వేషన్లలో మైనారిటీలకు 8.4 శాతం సబ్‌కోటాను కల్పించాలని, అందులో 6 శాతం ముస్లింలకు కేటాయించాలని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మండల కమిషన్ ప్రకారం 53 శాతం ఒబిసి కోటాను, అందులో 8.4 శాతం హైందవేతర వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. అదే సమయంలో ముస్లిం ప్రజానీకం జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన సచార్ కమిటీ కూడా మైనారిటీలకు ప్రత్యేక కోటాలను ఇవ్వాలని సిఫార్సు చేసింది. 

అయితే, యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణంచిన కోటా ఆ సిఫార్సులతో పోలిస్తే మైనారిటీలకు సంతృప్తికరంగా కనిపించదు. ముస్లిం రిజర్వేషన్ విషయంలో రాష్ట్రస్థాయిలో వైఎస్ఆర్ బిసి 'ఇ' కేటగిరిని రూపొందించి ఎక్స్‌ట్రా న్యూమరరీ సీట్లను సృష్టించి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు. బిసి కోటాలో మైనారిటీలను చేర్చాలా వద్దా అన్న వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. కేంద్రం తీసుకున్న మైనారిటీ సబ్ కోటా నిర్ణయం కూడా కోర్టులో తేలవలసి ఉంది. 

రాబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో యూపీఏ సర్కారు రెండు రకాల మైనారిటీల కోటాలను రూపొందించింది. ఒక కోటా లోక్‌పాల్ బిల్లుకు సంబంధించినదైతే, మరొక కోటా ఉద్యోగాలు, ఉన్నత చదువులకు సంబంధించినది. ఈ రెండు కోటాలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ రెండు కోటాలు ఆ లోక్‌పాల్ ఉద్విగ్నతను దారి మళ్ళించాయి. లోక్‌పాల్ బిల్లు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ కాస్తా కోటాల కేటాయింపు వైపు మళ్ళింది. ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్‌సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. 

బిజెపి, వామపక్షాల నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు సైతం లోక్‌బిల్లులోని మైనారిటీ కోటా, సిబిఐపై సర్కారు అజమాయిషీ, రాష్ట్రాలలోని లోకాయుక్త విధులు తదితర అంశాలపై నిరసనలు వ్యక్తం చేశాయి. బిజెపి లోక్‌పాల్ వ్యవస్థలోని మైనారిటీ కోటాను వ్యతిరేకించింది. బలమైన లోక్‌పాల్ కింది స్థాయి బ్యూరోక్రసీని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలని, సర్కారు గుప్పిట్లో నుంచి సిబిఐని తప్పించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి, శివసేనలు లోక్‌పాల్‌ను వ్యతిరేకించాయి. జెడియూ, డిఎంకె, బిజెడి, ఏఐడిఎంకె, తెలుగుదేశం పార్టీలు రాష్ట్రాలపై లోకాయుక్తలను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించాయి. 

ఈ గందరగోళం మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాల లోపు లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి నోచుకునేట్టు కనబడడం లేదు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లున్న లోక్‌పాల్ బిల్లును బిజెపి వ్యతిరేకిస్తోంది. కాబట్టి సభలో మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చే అవకాశమే లేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ ్యంలో లోక్‌పాల్ బిల్లుకు కూడా గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పట్టిన గతే పడుతుందన్న సందేహాలు రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పౌర అణువిద్యుత్తు బిల్లు సందర్భంగా చిన్న చిన్న రాజకీయ పార్టీలను కాంగ్రెస్ సమీకరించింది. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. 

పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే ముంబాయి ఎంఎంఆర్‌డిఏ మైదానంలో మూడురోజుల పాటు నిరశన దీక్షలకు, ఆ తర్వాత జైల్ భరో కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. ఆ మైదానం అద్దె తగ్గించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించడమే కాకుండా హజారే ఒక నిరశన దీక్ష ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా రచ్చ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. పార్లమెంటుతో సహా కీలక రాజ్యాంగ వ్యవస్థలన్నీ లోక్‌పాల్ పరిధిలోకి తీసుకురావాలన్న హజారే బృందం డిమాండ్లు అప్రజాస్వామికమైనవని కొన్ని మినహాయింపులతో రాజకీయ పక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దాంతో అన్నా బృందం రాజకీయంగా ఒంటరి అయిపోయింది. 

పౌరసమాజం డిమాండ్లతో రాజకీయ పక్షాలు పూర్తిగా విభేదించకపోయినా గతంలో అనేక అంశాల్లో మద్దతునిస్తున్న పరిస్థితి ఉండే ది. పార్లమెంటు లోపల బయటా ప్రతిపక్షాలు, పౌరసమాజం ఐక్యంగా పోరాడితేనే బలమైన లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించే అవకాశముంటుంది. కోటాల వివాదం, ప్రతిపక్షాలకు పౌరసమాజ ప్రముఖులకు మధ్య ఐక్యత లోపించడం తదితర కారణాల వల్ల లోక్‌పాల్ బిల్లు అమలుకు నోచుకునే పరిస్థితులు కనబడడంలేదు. ఆమోదం కోసం పదవసారి లోక్‌సభలో ప్రవేశిస్తున్న లోక్‌పాల్ బిల్లు చట్టంగా రూపొందుతుందో లేదో వేచి చూడాలి.
Andhra Jyothi Sampadakiyam Date 24/12/2011

Thursday, December 22, 2011

P Sainath Article Sakshi Editorial Page Date 23/12/2011


మౌపమే మారణాయుధం!



agitation00-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
మీరెప్పుడైనా జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్‌కు వెళ్ళారా? హైదరాబాద్‌లో ఉండే వారు మినహా చాలా మందికి అదేమిటో తెలియకపోవచ్చు. సరిగ్గా తెలంగాణ భవన్ (టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు)కు తలవాకిలిలా ఉంటుందది. హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే బంజా రా హిల్స్ -జూబ్లీహిల్స్ మధ్యలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండే జాతీయ ఉద్యానవనమే కాసు బ్రహ్మానందడ్డి పార్క్. దాని అసలుపేరు చిరాన్ పాలెస్. చిరాన్ అంటే టర్కిష్ భాషలో అందరివాడు అని అర్థమట. బహుశా తన వారసుడు ప్రజలందరి వాడుగా ఉండాలని అనుకున్నాడో ఏమో ఏడవ నిజాం ప్రిన్స్ ఆజం జాహీ ఈ వనాన్ని తన కొడుకు ముఖరంఝాకు కానుకగా ఇచ్చారు. అందులో అంతఃపురాన్ని తలపించే అత్యాధుని క వసతి సౌకర్యాలు గల పదహారు భవంతులతో పాటు చిరాన్ పాలెస్ పేరు తో ఒక రాజసౌధాన్ని నిర్మించారు. కొద్దికాలం పాటు ప్రిన్స్ ముఖరం ఝా అక్కడే నివసించారు.

దాదాపు ఆరువందల రకాల అరుదైన వృక్షజాతులు, నూటాయాభై రకాల పక్షులున్న ఈ తెలంగాణ జాతిసంపద జాతీయ నందనవనం హోదా పొందింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కొండలన్నీ ఆంధ్రా సంపన్నవర్గాల కాలనీలుగా మారిపోయాక కొండల నడుమ ఉన్న ఈ వనం మీద వారి కన్ను పడింది. ఇంకేముంది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాన్నివాకింగ్ పార్క్‌గా మార్చివేసి వారికి కానుకగా ఇచ్చేశారు. పనిలో పనిగా చిరాన్ పాలెస్ పార్క్ పేరును 1969 తెలంగాణ ఉద్యమాన్ని పాశవికంగా అణచివేసిన కాసువూబహ్మానంద రెడ్డి పేర మార్చేశారు. ఇప్పుడు ప్రతిరోజూ తెల్లారకముందే మం త్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, కాంట్రాక్టర్లు ఇట్లా వేలాదిమంది ఆ వనంలో వచ్చి వాలుతారు. పొట్ట తగ్గించుకోవడానికో, కండ లు పెంచుకోవడానికో, రోగాలు నయం చేసుకోవడానికో అక్కడ నడుస్తారు. వ్యాయామాలు, యోగాభ్యాసాలు చేస్తారు. మొత్తం హైదరాబాద్ నగరమే ఆంధ్రా సంపన్నుల విడిది కేంద్రమైనప్పుడు ఇందులో పెద్ద విశేషమేమీ కనిపించక పోవచ్చు. కానీ అక్కడికి దోమలగూడ బస్తీ నుంచి నాగేశ్వర్ రావు అనే యువకుడు రావడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

నాగేశ్వర్ రావు అక్కడికి వాకింగ్ కోసం రావడం లేదు. అంతటి హోదా, అంతస్తు అతనికి లేవు. ఆ అవసరం కూడా అతనికి లేదు. అతనొక మెకాని క్ దగ్గర కార్లు కడుగుతాడు. పొద్దంతా కార్లు కడిగితే వాళ్ళ సేటు రెండువందల రూపాయలు ఇస్తాడు. ఆ సొమ్ముతోనే అతను బతకాలి. అలాంటి దిన కూలీ ప్రతిరోజూ ఉదయమే కేబీఆర్ పార్క్‌కు వచ్చి అక్కడికి వచ్చే వాళ్లకు తెలంగాణ వాదం వినిపిస్తాడు. రాగానే పార్క్ గేటు దగ్గర కాసేపు ప్రసంగిస్తాడు. తెలంగాణకు నీళ్ళల్లో, నిధులు, ఉద్యోగాల్లో ఎలాంటి అన్యాయం జరిగిందో మొదలు పెట్టి డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన ఆ తర్వాతి పరిణామాలను పూసగుచ్చి వివరిస్తాడు. తన కళ్ళ ముందే కాలి బూడిదైన శ్రీకాంతాచారి గుర్తొచ్చి గొల్లుమంటాడు. ఎందరు అమరులైనారో ఏకరువు పెడతాడు. మధ్యమధ్యలో గోరేటి వెంకన్నపాటలు అందుకుంటాడు.

తెలంగాణ కోసం నిరంతరం పలవరించే నాగేశ్వర్‌రావుకు నిద్ర పట్టదు. టీఆర్‌ఎస్ ఉద్యమంతో తెలంగాణ గురించి తెలుసుకున్న అతను కే సీఆర్ నిరాహార దీక్షరోజు ఎల్‌బీ నగర్‌లో శ్రీకాంతాచారితో కలిసి ఉన్నాడు. అంబేద్కర్ విగ్రహం ముందు మిత్రులతో కలిసి మాట్లాడుతుండగా ఉన్నట్టుండి శ్రీకాంతాచారి నిప్పంటించుకున్నాడు. ఆ రోజునుంచి అన్ని హైదరాబాద్‌లో జరిగే ప్రతి సభ లో పాల్గొన్నాడు. బతుకు కోసం రోజూ ఉదయం నాలుగున్నరకు అతని దిన చర్య మొదలవుతుంది. ఐదు గంటలకల్లా మంత్రి దానం నాగేందర్ ఇంటికి చేరుకుంటాడు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసం గురించి ఆ ఇంటిముందు మొరపెట్టుకుంటాడు. ఆ మోసం వల్ల జరిగిన నష్టం గురించి మొత్తుకుంటాడు. రాజీనామా చేయాలంటూ నిలదీస్తాడు, నిందిస్తాడు. నినాదాలు చేస్తాడు. అప్పటికి నాగేందర్ నిద్ర లేచివుండడని తెలంగాణ విషయంలో నిద్ర నటిస్తోన్న వాళ్లకవి వినిపించవని నాగేశ్వర్‌రావుకు తెలుసు.

అయినా అరగంట పాటు అక్కడ తన అక్కసు వెళ్లబోసుకుని మరో అరగంటలో జూబ్లీహిల్స్‌లో మంత్రి జానా రెడ్డి ఇంటికి చేరుకుంటాడు. అక్కడా అదే కథ. ఆ తరువాత పార్కుకు చేరుతాడు. ఎనిమిది గంటల దాకా అక్కడ పని పూర్తి చేసుకుని కూలీ పనికి వెళ్ళిపోతాడు. అంతా అతన్నొక పిచ్చివాడి కింద జమకడతారు. నవ్వుకుంటారు. విసుక్కుంటారు. మంత్రుల ఇళ్లముందరి పోలీసులు అదిరిస్తారు, బెదిరిస్తారు. లాఠీలు ఝుళిపిస్తారు. తరిమేస్తారు. నాగేశ్వర్‌రావు కు పిచ్చి అనుకుంటారు. ఒక్క నాగేశ్వర్ రావుకేనా?! ఇప్పుడు తెలంగాణ అంతటికీ అదే పిచ్చి! తెలంగా పిచ్చి!! ఇప్పుడు తెలంగాణ అంతా నాగేశ్వర్‌రావు లాగే కనిపిస్తోంది. అలాగే కలవరిస్తోంది.

రాజకీయ వ్యవస్థ ఇప్పుడు తన మౌనంతో ఎందరినో పిచ్చివాళ్ళను చేస్తోంది. మౌనాన్ని మించిన మారణాయుధం ఇంకొకటి ఉండదని తెలంగాణ ప్రజల విషయంలో స్పష్టంగా రుజువయ్యింది. రెండేళ్లుగా ఢిల్లీ పెద్దలు మౌన ముద్ర దాల్చడం వందలాది మందిని బలి తీసుకుంది. డిసెంబర్ తొమ్మిది తరువాత సోనియాగాంధీ మాట్లాడి వుంటే ఈ మారణహోమం జరిగేదే కాదు. ఆమె మౌనాన్ని ఎంచుకున్నారు. కనీసం ఆమె చేతిలో మరబొమ్మలా ఉన్న ఈ దేశ ప్రధాని చేత ఒక్క మాట చెప్పించినా ప్రజలకు ఆమె మనసులో ఏముందో ఆమె ఏమనుకుంటున్నారు తెలిసేది. ఆమె మౌనం అర్థం కాని ప్రధాని అడపా దడపా నోరు విప్పినా పొంతనలేని మాటలు చెపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో అప్పుడప్పుడు నోటికి గుడ్డలు కట్టుకుని ఆమె మౌనానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం తక్కువ తినలేదు. వాళ్ళుకూడా కిక్కురుమనకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ముందు గంగిద్దులైపోయారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా నోరుకూడా విప్పకుండా తలలూపి తమ విశ్వాసం చాటుకున్నారు. ఆ మౌనమే తెలంగాణలో నరమేధం సృష్టించింది. ఆత్మహత్యలు, ఆందోళనలు, లాఠీలు, రబ్బరు తూటాలు, అరెస్టులు, కోర్టు కేసులు, జైళ్ళు, సమ్మెలు, బందులు, బాధలు ఇట్లా రెండేళ్లుగా తెలంగాణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసింది ఆమె మౌనం. మౌనం ఒక సైలెంట్ కిల్లర్ అనడానికి ఇదొక మచ్చు తునక. ఆ నేరానికి స్వయంగా సోనియా గాంధీ పాటియాలా కోర్టులో కేసును కూడా ఎదుర్కొంటున్నారు. 
వాళ్ళ సంగతి అలా వదిలేద్దాం. రెండేళ్ళ పాటు మరఫిరంగుల్లా మారుమోగిన తెలంగాణ వాదులు కూడా ఉన్నట్టుండి మౌన వ్రతం తీసుకున్నట్టు గప్ చుప్ అయిపోవడం ఇప్పుడు గందరగోళానికి కారణం అవుతున్నది. ముఖ్యంగా సకల జనుల సమ్మె తరువాత చాలా మంది సైలెంట్ అయిపోవ డం అయోమయాన్ని సృష్టిస్తోంది. ఆ అయోమయం మనుషుల్ని నిజంగానే ఏమీ తోచని పిచ్చివాళ్ళను చేస్తున్నది. ఇది విరామం అన్నవాళ్లు పూర్తిస్థాయి విశ్రాంతికి అలవాటు పడ్డారా అన్న అనుమానాలు, 2014 దాకా ఈ విరా మం కొనసాగుతుందేమోనన్న భయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడకపోవడం ఇప్పుడు ఈ కలవరానికి కారణం అవుతోంది.

కేసీఆర్ మౌనం కొత్తదేమీ కాదు. ఆయన ఎంత గట్టిగా మాట్లాడగలరో అంతే మౌనంగా ఉండగలరు. యుద్ధంలో అవసరమైనప్పుడే ఆయుధాలు సంధించాలనుకునే పోరాట వ్యూహం ఆయనది. సకల జనుల సమ్మె విరమించారేమో కానీ ప్రజలు మాత్రం ఇంకా పోరాటం మాత్రం ఆపేయలేదు. ప్రజలు తమ సమస్యలను తెలంగాణతో మిళితం చేస్తున్నారు. సకల జనుల సమ్మె తరువాత కూడా ప్రతిరోజూ ఏదో ఒకచోట సదస్సులు జరుగుతూనే ఉన్నా యి. సమీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9 రోజున తెలంగాణ అంతటా ఒక్క పూట జాగారాలు జరిగాయి. అదే రోజున ఢిల్లీలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆడబిడ్డ నళిని నిరవధిక దీక్షకు కూర్చున్నారు. దాదాపు వారానికి పైగా ఆమె దీక్షచేసి తన నిరసనను తెలిపారు. మరోవైపు తెలంగాణ చెరుకు, పత్తిరైతులు రోజుకొకరి చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.

ఇప్పటికీ లక్షలాది రైతు కుటుంబాలు ప్రభుత్వ స్పందన కరువై దిక్కుతోచక ఉన్నారు. ఆదివాసులకే ఆది పురుషులైన గోండు బిడ్డలకు గడిచిన నెల రోజులుగా కంటిమీద కునుకులేదు. పులుల సంరక్షణ పేరుతో ఇప్పుడు ప్రభుత్వం ఆదిలాబాద్ గోండు గూడాలకు నిప్పుపెడుతోంది. ఎప్పుడు ఏ పాము పడగ విప్పుతుందో, ఏ చిరుత పంజా విసురుతుందో తెలియని భయంలో వాళ్ళు బిక్కు బిక్కుమంటున్నారు. ఇంకోవైపు తెలంగా ణ నిరుద్యోగుల పాలిట ఏపీపీఎస్సీ కొండ చిలువై కూర్చుంది. వీటిలో పలు సందర్భాల్లో మిగితా అన్ని పార్టీలూ మౌనంగానే ఉన్నా టీఆర్‌ఎస్ స్పందించింది. కొన్ని విషయాల్లో టీఆర్‌ఎస్ స్వయంగా ఉద్యమించింది. ముఖ్యంగా ఏ పీపీఎస్‌సీ విషయంలో టీఆర్‌ఎస్ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ విస్మరించలేరు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అలాగే అండగా ఉండాలని ప్రజలు కోరుకోవడం తప్పుకాదు. అలాగే కేసీఆర్ మాట్లాడాలని, తమకు దిశా నిర్దేశం చేయాలని అనుకోవడం కూడా అత్యాశ కానే కాదు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న ప్రతి సమస్యనూ, ఆ సమస్య లోంచి తలెత్తుతోన్న ప్రతి ఆందోళనను ఉద్యమీకరించాల్సిన అవసరం ఉంది. అందు కు కేసీఆర్ తన వ్యూహాత్మక మౌనాన్ని వీడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణకు ఆయనే సారథి. ఆయన మాట్లాడితేనే రథం కదులుతుంది.
మరోవైపు ఈ మౌనాన్ని అదను చూసుకుని తెలంగాణ చుట్టూ రాజకీయ వల విసిరే ప్రయత్నాలు అన్నిపార్టీలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ళ సుదీర్ఘ మూగనోము తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వందిమాగధ మూకతో తెలంగాణలో తిరుగుతున్నారు. అట్లాంటి సాహసం చేసే ముందు తెలుగుదేశం పార్టీ లో ఉన్న తెలంగాణ నాయకులు రెచ్చిపోయి మాట్లాడడం విన్నాం. అందులో ఏ ఒక్కరు తెలంగాణ గురించి మాట్లాడే నైతికత ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళు కేసీఆర్‌ను, కోదండరాంను గుక్కతిప్పుకోకుండా తిడుతూనే ఉన్నారు.

చంద్రబాబు మూకలో పదో తరగతి ఫెయిలయిన ఒక నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పంచన చేరి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన ఇంకొక నాయకుడు రోజూ నోరు పారేసుకుంటున్నాడు. కొంత కాలం ఎర్రరంగులో, కొద్ది రోజులు ప్రజారాజ్యం పంచ వన్నెల్లో కనిపించిన రామచిలక ఇప్పుడు బాబు భజనలో తల మునకలై కోదండ రామ్ ఖబర్దార్ అని బాబు మాటలనే బయట వల్లిస్తోంది. వాళ్ళు సవాలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ నో, కోదండ రాంనో కాదు. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని. రాజకీయ విమర్శల పేరుతో మొత్తం ప్రజలను, ఉద్యమాన్నీ అవమానిస్తున్నా అటు జేఏసీ కానీ, టీఆర్‌ఎస్ కానీ తిప్పికొట్టకపోవడం ఉద్యమానికి కచ్చితంగా నష్టదాయకమే. వాళ్ళను తిప్పికొట్టడమంటే వాళ్ళచేత ఆ మాటలు మాట్లాడిస్తోన్న చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టకుండా తిప్పిపంపడమే.

కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే చంద్రబాబును తెలంగాణలో ఒక్క అడుగు కూడా వేయనిచ్చే వాళ్ళం కాదు అంటున్నవాళ్లు ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నారు. ఆ మౌనాన్ని ఏమని అర్థం చేసుకున్నారో కానీ కోదండరాం మౌనంగా ఉన్నారు. కోదండరాం మౌనం వెనుక మర్మాన్ని సరిగ్గానే తెలుసుకున్న జేఏసీ శ్రేణులు కూడా ప్రేక్షకుల్లా మౌనంగా చేతులు ముడుచుకుని కూర్చున్నాయి. ప్రజలు కూడా చంద్రబాబు మాటలను మౌనంగా వింటున్నారు. ఆయన తిరగడం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేకపోవచ్చు. పైగా అది అతని హక్కూ అయివుండవచ్చు. ఇదే హక్కును గతంలో జగన్ కూడా వినియోగించుకోవాలనుకున్నాడు. కానీ ఆయనను తెలంగాణలో అడుగుపెట్టకుండానే పంపించారు. రేపు జగన్ కూడా చంద్రబాబు బాటలోనే ఓదార్పుకో, పరకాల ఎన్నికలకో వస్తాడు. అదీ అతని హక్కే. హక్కులు కేవలం రాజకీయ పార్టీలకు, నాయకులకే కాదు కదా ప్రజలకు కూడా ఉంటాయి. తాము నమ్ముకున్న నాయకత్వం తాము కోరుకున్నట్టు పనిచేయాలని ఆశించడం కూడా ఆ హక్కులో భాగమే. అలాంటి హక్కు ప్రజలకు ఉందని, ఉండాలని రాజకీయ పార్టీలు గుర్తించాలి.

అలా చేసినప్పుడే ఆ పార్టీల పట్ల గౌరవం ఉంటుంది. ఉద్యమాలు, ఉద్యమకారులు మౌనాన్ని వదిలి మాటలతో, చేతలతో ఆ విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. లేకపోతే ఒక్క నాగేశ్వర్ రావు మాత్రమే కాదు. ప్రజలంతా మతి చలించిపోతారు. అప్పుడు ఓట్లు వేయడానికి కూడా ఎవరూ మిగలకపోవచ్చు!
పొఫెసర్ ఘంటా చక్రపాణి


రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్:ghantapatham@gmail.com
Namasete telangana News Paper Dated 23/12/2011