Thursday, December 22, 2011

మౌపమే మారణాయుధం!



agitation00-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
మీరెప్పుడైనా జూబ్లీహిల్స్‌లో ఉన్న కేబీఆర్ పార్క్‌కు వెళ్ళారా? హైదరాబాద్‌లో ఉండే వారు మినహా చాలా మందికి అదేమిటో తెలియకపోవచ్చు. సరిగ్గా తెలంగాణ భవన్ (టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు)కు తలవాకిలిలా ఉంటుందది. హైదరాబాద్‌లో అత్యంత సంపన్నులు ఉండే బంజా రా హిల్స్ -జూబ్లీహిల్స్ మధ్యలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండే జాతీయ ఉద్యానవనమే కాసు బ్రహ్మానందడ్డి పార్క్. దాని అసలుపేరు చిరాన్ పాలెస్. చిరాన్ అంటే టర్కిష్ భాషలో అందరివాడు అని అర్థమట. బహుశా తన వారసుడు ప్రజలందరి వాడుగా ఉండాలని అనుకున్నాడో ఏమో ఏడవ నిజాం ప్రిన్స్ ఆజం జాహీ ఈ వనాన్ని తన కొడుకు ముఖరంఝాకు కానుకగా ఇచ్చారు. అందులో అంతఃపురాన్ని తలపించే అత్యాధుని క వసతి సౌకర్యాలు గల పదహారు భవంతులతో పాటు చిరాన్ పాలెస్ పేరు తో ఒక రాజసౌధాన్ని నిర్మించారు. కొద్దికాలం పాటు ప్రిన్స్ ముఖరం ఝా అక్కడే నివసించారు.

దాదాపు ఆరువందల రకాల అరుదైన వృక్షజాతులు, నూటాయాభై రకాల పక్షులున్న ఈ తెలంగాణ జాతిసంపద జాతీయ నందనవనం హోదా పొందింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కొండలన్నీ ఆంధ్రా సంపన్నవర్గాల కాలనీలుగా మారిపోయాక కొండల నడుమ ఉన్న ఈ వనం మీద వారి కన్ను పడింది. ఇంకేముంది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాన్నివాకింగ్ పార్క్‌గా మార్చివేసి వారికి కానుకగా ఇచ్చేశారు. పనిలో పనిగా చిరాన్ పాలెస్ పార్క్ పేరును 1969 తెలంగాణ ఉద్యమాన్ని పాశవికంగా అణచివేసిన కాసువూబహ్మానంద రెడ్డి పేర మార్చేశారు. ఇప్పుడు ప్రతిరోజూ తెల్లారకముందే మం త్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, కాంట్రాక్టర్లు ఇట్లా వేలాదిమంది ఆ వనంలో వచ్చి వాలుతారు. పొట్ట తగ్గించుకోవడానికో, కండ లు పెంచుకోవడానికో, రోగాలు నయం చేసుకోవడానికో అక్కడ నడుస్తారు. వ్యాయామాలు, యోగాభ్యాసాలు చేస్తారు. మొత్తం హైదరాబాద్ నగరమే ఆంధ్రా సంపన్నుల విడిది కేంద్రమైనప్పుడు ఇందులో పెద్ద విశేషమేమీ కనిపించక పోవచ్చు. కానీ అక్కడికి దోమలగూడ బస్తీ నుంచి నాగేశ్వర్ రావు అనే యువకుడు రావడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

నాగేశ్వర్ రావు అక్కడికి వాకింగ్ కోసం రావడం లేదు. అంతటి హోదా, అంతస్తు అతనికి లేవు. ఆ అవసరం కూడా అతనికి లేదు. అతనొక మెకాని క్ దగ్గర కార్లు కడుగుతాడు. పొద్దంతా కార్లు కడిగితే వాళ్ళ సేటు రెండువందల రూపాయలు ఇస్తాడు. ఆ సొమ్ముతోనే అతను బతకాలి. అలాంటి దిన కూలీ ప్రతిరోజూ ఉదయమే కేబీఆర్ పార్క్‌కు వచ్చి అక్కడికి వచ్చే వాళ్లకు తెలంగాణ వాదం వినిపిస్తాడు. రాగానే పార్క్ గేటు దగ్గర కాసేపు ప్రసంగిస్తాడు. తెలంగాణకు నీళ్ళల్లో, నిధులు, ఉద్యోగాల్లో ఎలాంటి అన్యాయం జరిగిందో మొదలు పెట్టి డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన ఆ తర్వాతి పరిణామాలను పూసగుచ్చి వివరిస్తాడు. తన కళ్ళ ముందే కాలి బూడిదైన శ్రీకాంతాచారి గుర్తొచ్చి గొల్లుమంటాడు. ఎందరు అమరులైనారో ఏకరువు పెడతాడు. మధ్యమధ్యలో గోరేటి వెంకన్నపాటలు అందుకుంటాడు.

తెలంగాణ కోసం నిరంతరం పలవరించే నాగేశ్వర్‌రావుకు నిద్ర పట్టదు. టీఆర్‌ఎస్ ఉద్యమంతో తెలంగాణ గురించి తెలుసుకున్న అతను కే సీఆర్ నిరాహార దీక్షరోజు ఎల్‌బీ నగర్‌లో శ్రీకాంతాచారితో కలిసి ఉన్నాడు. అంబేద్కర్ విగ్రహం ముందు మిత్రులతో కలిసి మాట్లాడుతుండగా ఉన్నట్టుండి శ్రీకాంతాచారి నిప్పంటించుకున్నాడు. ఆ రోజునుంచి అన్ని హైదరాబాద్‌లో జరిగే ప్రతి సభ లో పాల్గొన్నాడు. బతుకు కోసం రోజూ ఉదయం నాలుగున్నరకు అతని దిన చర్య మొదలవుతుంది. ఐదు గంటలకల్లా మంత్రి దానం నాగేందర్ ఇంటికి చేరుకుంటాడు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన మోసం గురించి ఆ ఇంటిముందు మొరపెట్టుకుంటాడు. ఆ మోసం వల్ల జరిగిన నష్టం గురించి మొత్తుకుంటాడు. రాజీనామా చేయాలంటూ నిలదీస్తాడు, నిందిస్తాడు. నినాదాలు చేస్తాడు. అప్పటికి నాగేందర్ నిద్ర లేచివుండడని తెలంగాణ విషయంలో నిద్ర నటిస్తోన్న వాళ్లకవి వినిపించవని నాగేశ్వర్‌రావుకు తెలుసు.

అయినా అరగంట పాటు అక్కడ తన అక్కసు వెళ్లబోసుకుని మరో అరగంటలో జూబ్లీహిల్స్‌లో మంత్రి జానా రెడ్డి ఇంటికి చేరుకుంటాడు. అక్కడా అదే కథ. ఆ తరువాత పార్కుకు చేరుతాడు. ఎనిమిది గంటల దాకా అక్కడ పని పూర్తి చేసుకుని కూలీ పనికి వెళ్ళిపోతాడు. అంతా అతన్నొక పిచ్చివాడి కింద జమకడతారు. నవ్వుకుంటారు. విసుక్కుంటారు. మంత్రుల ఇళ్లముందరి పోలీసులు అదిరిస్తారు, బెదిరిస్తారు. లాఠీలు ఝుళిపిస్తారు. తరిమేస్తారు. నాగేశ్వర్‌రావు కు పిచ్చి అనుకుంటారు. ఒక్క నాగేశ్వర్ రావుకేనా?! ఇప్పుడు తెలంగాణ అంతటికీ అదే పిచ్చి! తెలంగా పిచ్చి!! ఇప్పుడు తెలంగాణ అంతా నాగేశ్వర్‌రావు లాగే కనిపిస్తోంది. అలాగే కలవరిస్తోంది.

రాజకీయ వ్యవస్థ ఇప్పుడు తన మౌనంతో ఎందరినో పిచ్చివాళ్ళను చేస్తోంది. మౌనాన్ని మించిన మారణాయుధం ఇంకొకటి ఉండదని తెలంగాణ ప్రజల విషయంలో స్పష్టంగా రుజువయ్యింది. రెండేళ్లుగా ఢిల్లీ పెద్దలు మౌన ముద్ర దాల్చడం వందలాది మందిని బలి తీసుకుంది. డిసెంబర్ తొమ్మిది తరువాత సోనియాగాంధీ మాట్లాడి వుంటే ఈ మారణహోమం జరిగేదే కాదు. ఆమె మౌనాన్ని ఎంచుకున్నారు. కనీసం ఆమె చేతిలో మరబొమ్మలా ఉన్న ఈ దేశ ప్రధాని చేత ఒక్క మాట చెప్పించినా ప్రజలకు ఆమె మనసులో ఏముందో ఆమె ఏమనుకుంటున్నారు తెలిసేది. ఆమె మౌనం అర్థం కాని ప్రధాని అడపా దడపా నోరు విప్పినా పొంతనలేని మాటలు చెపుతున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో అప్పుడప్పుడు నోటికి గుడ్డలు కట్టుకుని ఆమె మౌనానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం తక్కువ తినలేదు. వాళ్ళుకూడా కిక్కురుమనకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ముందు గంగిద్దులైపోయారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా నోరుకూడా విప్పకుండా తలలూపి తమ విశ్వాసం చాటుకున్నారు. ఆ మౌనమే తెలంగాణలో నరమేధం సృష్టించింది. ఆత్మహత్యలు, ఆందోళనలు, లాఠీలు, రబ్బరు తూటాలు, అరెస్టులు, కోర్టు కేసులు, జైళ్ళు, సమ్మెలు, బందులు, బాధలు ఇట్లా రెండేళ్లుగా తెలంగాణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసింది ఆమె మౌనం. మౌనం ఒక సైలెంట్ కిల్లర్ అనడానికి ఇదొక మచ్చు తునక. ఆ నేరానికి స్వయంగా సోనియా గాంధీ పాటియాలా కోర్టులో కేసును కూడా ఎదుర్కొంటున్నారు. 
వాళ్ళ సంగతి అలా వదిలేద్దాం. రెండేళ్ళ పాటు మరఫిరంగుల్లా మారుమోగిన తెలంగాణ వాదులు కూడా ఉన్నట్టుండి మౌన వ్రతం తీసుకున్నట్టు గప్ చుప్ అయిపోవడం ఇప్పుడు గందరగోళానికి కారణం అవుతున్నది. ముఖ్యంగా సకల జనుల సమ్మె తరువాత చాలా మంది సైలెంట్ అయిపోవ డం అయోమయాన్ని సృష్టిస్తోంది. ఆ అయోమయం మనుషుల్ని నిజంగానే ఏమీ తోచని పిచ్చివాళ్ళను చేస్తున్నది. ఇది విరామం అన్నవాళ్లు పూర్తిస్థాయి విశ్రాంతికి అలవాటు పడ్డారా అన్న అనుమానాలు, 2014 దాకా ఈ విరా మం కొనసాగుతుందేమోనన్న భయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడకపోవడం ఇప్పుడు ఈ కలవరానికి కారణం అవుతోంది.

కేసీఆర్ మౌనం కొత్తదేమీ కాదు. ఆయన ఎంత గట్టిగా మాట్లాడగలరో అంతే మౌనంగా ఉండగలరు. యుద్ధంలో అవసరమైనప్పుడే ఆయుధాలు సంధించాలనుకునే పోరాట వ్యూహం ఆయనది. సకల జనుల సమ్మె విరమించారేమో కానీ ప్రజలు మాత్రం ఇంకా పోరాటం మాత్రం ఆపేయలేదు. ప్రజలు తమ సమస్యలను తెలంగాణతో మిళితం చేస్తున్నారు. సకల జనుల సమ్మె తరువాత కూడా ప్రతిరోజూ ఏదో ఒకచోట సదస్సులు జరుగుతూనే ఉన్నా యి. సమీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9 రోజున తెలంగాణ అంతటా ఒక్క పూట జాగారాలు జరిగాయి. అదే రోజున ఢిల్లీలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆడబిడ్డ నళిని నిరవధిక దీక్షకు కూర్చున్నారు. దాదాపు వారానికి పైగా ఆమె దీక్షచేసి తన నిరసనను తెలిపారు. మరోవైపు తెలంగాణ చెరుకు, పత్తిరైతులు రోజుకొకరి చొప్పున ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.

ఇప్పటికీ లక్షలాది రైతు కుటుంబాలు ప్రభుత్వ స్పందన కరువై దిక్కుతోచక ఉన్నారు. ఆదివాసులకే ఆది పురుషులైన గోండు బిడ్డలకు గడిచిన నెల రోజులుగా కంటిమీద కునుకులేదు. పులుల సంరక్షణ పేరుతో ఇప్పుడు ప్రభుత్వం ఆదిలాబాద్ గోండు గూడాలకు నిప్పుపెడుతోంది. ఎప్పుడు ఏ పాము పడగ విప్పుతుందో, ఏ చిరుత పంజా విసురుతుందో తెలియని భయంలో వాళ్ళు బిక్కు బిక్కుమంటున్నారు. ఇంకోవైపు తెలంగా ణ నిరుద్యోగుల పాలిట ఏపీపీఎస్సీ కొండ చిలువై కూర్చుంది. వీటిలో పలు సందర్భాల్లో మిగితా అన్ని పార్టీలూ మౌనంగానే ఉన్నా టీఆర్‌ఎస్ స్పందించింది. కొన్ని విషయాల్లో టీఆర్‌ఎస్ స్వయంగా ఉద్యమించింది. ముఖ్యంగా ఏ పీపీఎస్‌సీ విషయంలో టీఆర్‌ఎస్ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ విస్మరించలేరు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అలాగే అండగా ఉండాలని ప్రజలు కోరుకోవడం తప్పుకాదు. అలాగే కేసీఆర్ మాట్లాడాలని, తమకు దిశా నిర్దేశం చేయాలని అనుకోవడం కూడా అత్యాశ కానే కాదు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న ప్రతి సమస్యనూ, ఆ సమస్య లోంచి తలెత్తుతోన్న ప్రతి ఆందోళనను ఉద్యమీకరించాల్సిన అవసరం ఉంది. అందు కు కేసీఆర్ తన వ్యూహాత్మక మౌనాన్ని వీడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణకు ఆయనే సారథి. ఆయన మాట్లాడితేనే రథం కదులుతుంది.
మరోవైపు ఈ మౌనాన్ని అదను చూసుకుని తెలంగాణ చుట్టూ రాజకీయ వల విసిరే ప్రయత్నాలు అన్నిపార్టీలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండేళ్ళ సుదీర్ఘ మూగనోము తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వందిమాగధ మూకతో తెలంగాణలో తిరుగుతున్నారు. అట్లాంటి సాహసం చేసే ముందు తెలుగుదేశం పార్టీ లో ఉన్న తెలంగాణ నాయకులు రెచ్చిపోయి మాట్లాడడం విన్నాం. అందులో ఏ ఒక్కరు తెలంగాణ గురించి మాట్లాడే నైతికత ఉన్నవాళ్ళు కాదు. కానీ వాళ్ళు కేసీఆర్‌ను, కోదండరాంను గుక్కతిప్పుకోకుండా తిడుతూనే ఉన్నారు.

చంద్రబాబు మూకలో పదో తరగతి ఫెయిలయిన ఒక నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పంచన చేరి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోసిన ఇంకొక నాయకుడు రోజూ నోరు పారేసుకుంటున్నాడు. కొంత కాలం ఎర్రరంగులో, కొద్ది రోజులు ప్రజారాజ్యం పంచ వన్నెల్లో కనిపించిన రామచిలక ఇప్పుడు బాబు భజనలో తల మునకలై కోదండ రామ్ ఖబర్దార్ అని బాబు మాటలనే బయట వల్లిస్తోంది. వాళ్ళు సవాలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ నో, కోదండ రాంనో కాదు. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని. రాజకీయ విమర్శల పేరుతో మొత్తం ప్రజలను, ఉద్యమాన్నీ అవమానిస్తున్నా అటు జేఏసీ కానీ, టీఆర్‌ఎస్ కానీ తిప్పికొట్టకపోవడం ఉద్యమానికి కచ్చితంగా నష్టదాయకమే. వాళ్ళను తిప్పికొట్టడమంటే వాళ్ళచేత ఆ మాటలు మాట్లాడిస్తోన్న చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టకుండా తిప్పిపంపడమే.

కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే చంద్రబాబును తెలంగాణలో ఒక్క అడుగు కూడా వేయనిచ్చే వాళ్ళం కాదు అంటున్నవాళ్లు ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నారు. ఆ మౌనాన్ని ఏమని అర్థం చేసుకున్నారో కానీ కోదండరాం మౌనంగా ఉన్నారు. కోదండరాం మౌనం వెనుక మర్మాన్ని సరిగ్గానే తెలుసుకున్న జేఏసీ శ్రేణులు కూడా ప్రేక్షకుల్లా మౌనంగా చేతులు ముడుచుకుని కూర్చున్నాయి. ప్రజలు కూడా చంద్రబాబు మాటలను మౌనంగా వింటున్నారు. ఆయన తిరగడం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేకపోవచ్చు. పైగా అది అతని హక్కూ అయివుండవచ్చు. ఇదే హక్కును గతంలో జగన్ కూడా వినియోగించుకోవాలనుకున్నాడు. కానీ ఆయనను తెలంగాణలో అడుగుపెట్టకుండానే పంపించారు. రేపు జగన్ కూడా చంద్రబాబు బాటలోనే ఓదార్పుకో, పరకాల ఎన్నికలకో వస్తాడు. అదీ అతని హక్కే. హక్కులు కేవలం రాజకీయ పార్టీలకు, నాయకులకే కాదు కదా ప్రజలకు కూడా ఉంటాయి. తాము నమ్ముకున్న నాయకత్వం తాము కోరుకున్నట్టు పనిచేయాలని ఆశించడం కూడా ఆ హక్కులో భాగమే. అలాంటి హక్కు ప్రజలకు ఉందని, ఉండాలని రాజకీయ పార్టీలు గుర్తించాలి.

అలా చేసినప్పుడే ఆ పార్టీల పట్ల గౌరవం ఉంటుంది. ఉద్యమాలు, ఉద్యమకారులు మౌనాన్ని వదిలి మాటలతో, చేతలతో ఆ విషయం వారికి అర్థమయ్యేలా చేయాలి. లేకపోతే ఒక్క నాగేశ్వర్ రావు మాత్రమే కాదు. ప్రజలంతా మతి చలించిపోతారు. అప్పుడు ఓట్లు వేయడానికి కూడా ఎవరూ మిగలకపోవచ్చు!
పొఫెసర్ ఘంటా చక్రపాణి


రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్:ghantapatham@gmail.com
Namasete telangana News Paper Dated 23/12/2011

No comments:

Post a Comment