కావ్వాల్ అడవిలో పులుల అభయారణ్యంగా నోటిఫై చేయటానికి కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించే బాధ్యత అటవీశాఖ ఒక్కటే చేయటానికి వీలులేదు. ముఖ్యుల కమిటీ నొకదాన్ని ఏర్పాటు చేయాలి. అందులో జీవావరణ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆదివాసి పెద్దలు, గిరిజన సంక్షేమశాఖ, అటవీశాఖ సభ్యులుగా ఉండాలి. మానవులు - వన్యప్రాణులు కలసి సహజీవనం చేయటంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్ళు, సమస్యలన్నిటినీ అధ్యయనం చేయాలి. అక్కడ నివసిస్తున్న ప్రజలతో చర్చించాలి. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ఆ ప్రాంతాన్ని ముఖ్యమైన వన్యప్రాణి ఆవాసంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
తొలకరి సమయంలో 'ఆకడి' పండుగను గోండు, పర్థాన్, తోటి, కొలాం తెగలకు చెందిన మేము పవిత్రంగా జరుపుకుంటాము. అదే విధంగా నాయకపోడులు సుక్కల పండుగ, పొలాల పండుగ జరుపుకుంటారు. ఆకడి పండుగ రోజు ప్రత్యేకంగా పులి బొమ్మను తయారుచేసి, భూతల్లిని పశు సంపదను, మా ప్రజలను చల్లగా చూడమని కాపాడమని ప్రార్థిస్తాము. ఆకలై తినాలనుకుంటే ఒక్క పశువును మాత్రమే తిను తల్లీ, అన్ని పశువులను గాయపరచవద్దు అని మొక్కుకుంటాము. ప్రత్యేకంగా పులికొరకు జరుపుకునే పండగ 'ఆకడి'. ఎన్నో ఏళ్ళుగా మా పశుసంపద, మేము, పులులు, జంతువులు కలసి మెలసి అడవిలో సహజీవనం చేస్తూ వస్తున్నాము.
సార్వేన్ సగ(సగ అంటే సమూహం-ఈ సమూహంలో రకరకాల ఇంటి పేర్లు ఉంటాయి)కు చెందిన ఆదివాసుల ఇంటి దేవత పులి. మా గోండులకు జన్మనిచ్చిన జంగుబాయి వాహనం పులి. పులి మాకు ఎప్పుడైనా అడవిలో కన్పిస్తే 'నీ దారిని నీవు వెళ్ళు తల్లి'- 'మా దారిని మేము పోతాం' అని మొక్కుకుంటే 'పులి' అడవిలోకి వెళ్లిపోతుంది. మా తెగల ఆవిర్భావానికి పులి ఒక సాంస్కృతిక గుర్తు. మా సమూహాల జ్ఞాపకాలతో మా పెద్దలు చెప్పే మాచరిత్రలో 'పులి' మా జీవితాల్లో మా భూతల్లిపై జీవించే ఒక ముఖ్యమైన ప్రాణి. 'పులి'ని మేము 'తోదో' అంటాము. 'తోదో' అంటే 'తాత' అని అర్థం. మా జీవితాల్లో ఒక భాగమైన మా పులి తాత నుంచి మమ్మల్ని పులుల అభయారణ్యం పేరుతో తరిమేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
మా నివాస ప్రాంతాలలో ఉన్న జీవరాశులను, జీవించి ఉన్న ప్రతిదానినీ కాపాడే బాధ్యత మాకు తరతరాలుగా సంక్రమించిన వారసత్వ బాధ్యత. మా భూమిపై ఉన్న అడవి మీద అధికారాలు ఇవ్వకుండా నిజాం కాలం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు లాక్కోవటమే కాకుండా మమ్మల్ని అక్కడ నివసించే జీవులుగా గుర్తించడం లేదు. దశాబ్దాలుగా అణచివేతకు గురిచేస్తూ వస్తున్నారు. భూమి, అడవి, నీటిపై మాకే అధికారం కావాలని నాడు నిజాం ప్రభుత్వంపై మా వీరుడు కొమరం భీమ్ పోరాడారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మా ఆదివాసులైన గోండు, కొల్లాం, నాయకపోడు, తోటి, పర్థాన్‌లు నేటికీ తమ హక్కుల కొరకు పోరాటం చేస్తూనే ఉన్నారు.
మా ప్రాంతంలో సగానికి పైగా అటవీశాఖ అధీనం కిందే మేము జీవించాల్సి వస్తున్నది. అటవీ ఫలసాయం సేకరించుకుందామన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఇల్లు కట్టుకుందామన్నా, అటవీశాఖ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి జీవితాన్ని భయం భయంగా వెళ్ళదీసుకొస్తున్నాము. మా పోరాటాల ఫలితంగా నిజాం ప్రభుత్వం ద్వారా పొందిన సివా-యె-జమాబంది భూములు, అన్యాయంగా లాక్కొన్న కొల్లాం, నాయకపోడు భూములుపై మాకు ఇంతవరకు ఎలాంటి హక్కులు ఇవ్వనే లేదు. మా ప్రాంతాల్లో మాకు హక్కులు లేకుండా చేసి గనుల తవ్వకాలు, సిమెంట్ పరిశ్రమలు, పేపరు పరిశ్రమలు ఎన్నింటినో స్థాపించి మమ్మల్ని మా పవిత్రమైన స్థలాల నుంచి విస్థాపనకు గురిచేస్తూనే ఉన్నారు.
ఎన్నో ఏళ్ళుగా ఓపెనుకాస్టు మైనింగ్‌లు, ఒకే రకమైన తోటల పెంపకాలు, అనేక రకాలైన పథకాలతో జీవ వైవిధ్యం, వన్యప్రాణులు, పులులు కనుమరుగైపోయాయి. మా గోండు, కొల్లాం, నాయకపోడు, తోటీ తెగలకు చెందిన అనేక గ్రామాలను, ప్రజలను మరోసారి ఆ అడవినుంచి తరిమివేయాలని, 892 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కవ్వాల్ అభయారణ్యంగా నోటిఫై చేసే ప్రయత్నాలు ప్రభుత్వం ప్రారంభించింది. మాకు ఇచ్చిన రాజ్యాంగ రక్షణలు, అడవిపై, భూమిపై, మా సంప్రదాయ వ్యవస్థలపై మాకుండే హక్కులను, అధికారాలను కాలరాసి, వాటిని ఉల్లంఘించి అభయారణ్యం ఏర్పాటు చేయటాన్ని మేము ఖండిస్తున్నాము. అది చెల్లదని తెలియజేస్తున్నాము. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పీసా చట్టం -1996, అటవీహక్కులచట్టం-2006, అటవీహక్కుల గుర్తింపు చట్టానికి అనుగుణంగా ఈ మధ్య తీసుకువచ్చిన 'ముఖ్యమైన వన్యప్రాణి ఆవాసాలు'గా గుర్తించడానికి అమలుచేయాల్సిన గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘి స్తూ మమ్మల్ని నిర్వాసితులను చేయాలని అటవీశాఖ ప్రయత్నిస్తోంది.
షెడ్యూల్ తెగలు, ఇతర సంప్రదాయక అటవీ నివాసులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2002 (2/2007) ఉపోద్ఘాతంలో ప్రభుత్వం ఈ చట్టం ఎందుకు తెచ్చిందో ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. అటవీ జీవావరణ వ్యవస్థల మనుగడలోను, వాటి సుస్థిరతతోను భాగస్వాములుగా ఉంటూ వచ్చిన షెడ్యూల్ తెగలు (అంటే మేము), ఇతర సంప్రదాయక అటవీవాసుల పారంపర్య భూము లపైన (అంటే మా నివాసస్థలాల, మా భూ తల్లి) ఆవాసం పైన సమగ్ర హక్కులను గుర్తించడంలో వలసపాలన కాలంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ చారిత్రక అన్యాయం జరిగింది.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారితో సహా అటవీప్రాంత షెడ్యూలు తెగలు, ఇతర సంప్రదాయక అటవీ నివాసులు దీర్ఘకాలంగా చవిచూస్తున్న భూమి హక్కులకు సంబంధించిన అభద్రతను పోగొట్టి వారికి హక్కులు దఖలు పరచవలసి ఉంది. ఇది భారత ప్రభుత్వం ఆదివాసులకు ఇచ్చిన హామీ. మరి కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలోని 892 చ.కి.మీ.లోపల జీవిస్తున్న ఆదివాసులకు ఈ చట్టం వర్తించదా? ఈ ప్రాంతంలో అటవీహక్కులు దఖలు పరిచారా లేదా? అదే విధంగా పీసా చట్టం-1996 ఆదివాసుల సంప్రదాయక పాలనా వ్యవస్థలను శక్తిమంతమైన అధికారం కల్గిన గ్రామ సభ వ్యవస్థలని గుర్తించింది. గ్రామ సభ అనుమతి లేనిదే ఏ పని ఇతరులు చేపట్టకూడదని తెలియజేసింది. మరి అది కూడా పులుల అభయారణ్యం ముందు పనికిరాదా? పీసా ఏం చెబుతున్నది? సెక్షన్ 4 ప్రకారం మా పరిపాలన సరిహద్దును మాకు మేము ప్రకటించుకునే అధికారాన్ని ఇచ్చింది.
అంటే గ్రామం అనేది మేము నివశించే నివాస స్థలం లేదా నివాసస్థలాల సముదాయం లేదా శివారు ప్రాంతం లేదా శివారు ప్రాంతాల సముదాయం. ఇది మా సంప్రదాయ, ఆచార వ్యవహార పద్ధతుల్లో నడిచే వ్యవస్థను గ్రామం అంటారని పేర్కొంది. ప్రజాస్వామ్య బద్ధంగా మా కు మేము పాలించుకునే విధానాల ఆధారంగా ఇది నిర్వచించబడింది. అలాగే మా ప్రాంతాల్లో ఉండే వనరుల యాజమాన్య నిర్వహణ పద్ధతులు, మా ఆచార వ్యవహారాల న్యాయపద్ధతులు, సాంస్కృతిక గుర్తింపును ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు రక్షించే సమర్థతకలిగే గ్రామ సభ అని ఈ చట్టం చెబుతుంది. 'మా ఊరిలో మా రాజ్యం' అనే మా నినాదం -మా వనరులపై అధికారాన్ని, వాటిని రక్షించి భవిష్యత్ తరాలకు అప్పగించే బాధ్యతను మా మీద పెట్టింది. అటవీ హక్కుల గుర్తిం పు చట్టాన్ని అటవీశాఖ ఏవిధంగా ఉల్లంఘిస్తున్నదో తెలియజేస్తాను.
ప్రధానంగా మేముండే ప్రాంతాల్లో హక్కుల గుర్తింపు, దఖలుపరిచే పద్ధతులు ఏ విధంగా ఉండాలో అటవీహక్కుల చట్టం చెబుతుంది. ప్రధానంగా అటవీహక్కుల చట్టం సెక్షన్ 2(ఎ) 'సాముదాయిక అటవీ వనరులు' అంటే గ్రామ సంప్రదాయక సరిహద్దుల్లో భాగంగా ఉన్న సంప్రదాయక ఉమ్మడి అటవీ, రిజర్వు అడవులు, రక్షిత అడవులతో పాటు ఆయా సమూహాలకు అనాదిగా అందుబాటులో ఉంటూ వస్తున్న అభయారణ్యాలు, జాతీయ పార్కులు. అలాగే సెక్షన్ 2(బి) 'ముఖ్యమైన వన్యప్రాణి ఆవాసాలు' అంటే శాస్త్రీయమైన దృష్టితోను, ప్రత్యేకమైన లక్ష్యంతోను ఏర్పాటుచేసిన జాతీయ పార్కులు, అభయారణ్యాలు వంటివి. వన్యప్రాణి రక్షణ నిమిత్తం అటువంటి ప్రాంతాలుగా ఉల్లంఘింపరానిదిగా ప్రత్యేకంగా గుర్తించదలుచుకుంటే, ఒక నిపుణుల కమిటీ బహిరంగ సంప్రదింపుల క్రమం తర్వాత కేంద్ర ప్రభుత్వ అటవీపర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ మేరకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ నిపుణుల కమిటీలో సెక్షన్ 4లోని ఉప విభాగాలు 1, 2లో పేర్కొన్న విధానపరమైన ప్రక్రియలను కూడా నెరవేర్చవలసివుంటుంది.
ఇప్పుడు కవ్వాల్ అభయారణ్యంగా నోటిఫై చేసే ముందు అటవీహక్కుల చట్టంలో పేర్కొన్న అన్ని హక్కులు దఖలుపర్చాల్సి వుంటుంది. అటవీహక్కుల గుర్తింపు చట్టం సెక్షన్ 4(1), 4(2)లో అటవీహక్కుల గుర్తింపు, పునరుద్ధరణ దఖలుపరిచే అంశాలున్నాయి. అవి చట్టంలో సెక్షన్ 3లో వివరించిన అన్ని అటవీ హక్కుల (వ్యక్తిగత, ఉమ్మడి హక్కులు), అలాగే కొల్లాం, తోటి ఆదిమ తెగలకు సంబంధించిన నివాసహక్కులు దఖలుపరచాలి. అటవీహక్కులచట్టం 4(2)లో ప్రకారం జాతీయహక్కులు, అభయారణ్యాల వంటి కీలకమైన వన్యప్రాణి నివాసప్రాంతాలకు సంబంధించి ఈ చట్టం గుర్తించిన అటవీహక్కుల్లో కొన్ని మార్పులు చేయవచ్చును.
కానీ హక్కుదారుల హక్కులు దెబ్బతినకూడదు లేదా వన్యప్రాణి పరిరక్షణ నిమిత్తం కొన్ని నిషిద్ధ ప్రాంతాలను గుర్తించే ప్రయత్నాలు వారి హక్కులను ఏ విధంగాను ప్రభావితం చేయకూడదు. ఐతే సెక్షన్6లో పేర్కొన్న అన్ని హక్కులను గుర్తించడం, దఖలుపరచడమనే ప్రక్రియ పరిశీలనలో ఉన్న అన్ని అంశాల్లో పూర్తయిన పక్షంలోను, సహజీవనం వంటి అర్థవంతమైన అవకాశాలు అందుబాటులో లేవని నిర్థారణకు వచ్చిననప్పుడు మొదలైన నిబంధనలు అన్నీ సంతృప్తికరంగా నెరవేరిన పక్షంలో ఈ విషయంలో మినహాయింపులు ఉంటాయి.
వన్యప్రాణి రక్షణ చట్టం క్రింద ముఖ్యమైన వన్యప్రాణి ఆవాసాలు లేదా ముఖ్యమైన పులుల ఆవాసాలుగా ఒక ప్రాంతాన్ని నోటిఫై చేయాలంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టానికి అనుగుణంగా ఉండాలనే గైడ్‌లెన్స్‌ను కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రూపొందించింది. అందులో రెండింటిని తప్పనిసరిగా అమలుచేయాలి.
కవ్వాల్ ప్రాంతాన్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేయటానికి కావాల్సిన ప్రాంతాన్ని గుర్తించే బాధ్యత అటవీశాఖ ఒక్కటే చేయటానికి వీలులేదు. ఒక ముఖ్యుల కమిటీ (ఎక్స్‌పర్ట్ కమిటీ)ని ఏర్పాటుచేయాలి. అందులో జీవావరణ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, ఆదివాసి పెద్దలు, గిరిజన సంక్షేమశాఖ, అటవీశాఖ ఇలా అందరిని కలిపి కమిటీ ఏర్పాటు చేయాలి. మానవులు - వన్యప్రాణులు కలసి సహజీవనం చేయటంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్ళు, సమస్యలు, లాభాలు - ఇవన్నిటిని అధ్యయనం చేయాలి. అక్కడ నివసిస్తున్న ప్రజలతో చర్చించాలి. అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఆ నివేదిక ఆధారంగానే ఆ ప్రాంతాన్ని ముఖ్యమైన వన్యప్రాణి ఆవాసంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న ఆదివాసుల హక్కుల గుర్తింపు ప్రక్రియ అటవీ హక్కుల చట్టం ప్రకారం పూర్తి కావాలి. ఆ వ్యక్తిగత, సామూహిక హక్కులు పూర్తిగా ఆదివాసులకు దఖలు చేయాలి.
ఈ ప్రక్రియలన్నీ బుట్టదాఖలుచేసి కవ్వాల్ ప్రాంతంలోని 42 గ్రామాలను అభయారణ్యంగా గుర్తించే అధికారం అటవీశాఖకు లేదు. అప్రజాస్వామిక పద్ధతులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంతవరకు ప్రజల వ్యక్తిగత, కమ్యూనిటీ హక్కులు గుర్తించనే లేదు. గ్రామసభలు నిర్వహించనేలేదు. ఎక్స్‌పర్ట్ కమిటీ వేయనేలేదు. ఇంత వివరంగా అటవీహక్కుల చట్టం నిర్దేశించిన వాటిని అమలు చేయకుండా మా ఊళ్ళలో నుంచి మమ్మల్ని తరిమివేయడానికి, భయబ్రాంతులను చేయడానికి పాములు, ఇతర జంతువులను వదిలే స్థితికి రావటం ఈ సభ్యసమాజానికే సిగ్గుచేటు.
ముందు ఆదివాసులకు పులులతో సహజీవనం ఎందుకు సాధ్యం కాదో చెప్పాలి. మా హక్కులను, చట్టాలను ఉల్లంఘించి మమ్మల్ని బలవంతంగా తొలగించే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. పులులను వేటాడే దొంగలను తరిమి కొడదాము. పులులను, అడవిని రక్షించే ఆదివాసులకు అండగా నిలవాలని కోరుతున్నాము. మా జంగుబాయి నివసించే పవిత్ర స్థలం నుంచి మేము దూరమవటానికి సిద్ధంగా లేము.
- సిడాం శంభు
ఆదివాసి ఐక్యపోరాట కమిటీ, ఆదిలాబాద్, ఆంధ్ర జ్యోతి తెలుగు న్యూస్ పేపర్ తేది 13 / 12 /2011
No comments:
Post a Comment