ఇంట్నట్ వికీపెడియాలో ఒకసారి కిషన్‌జీ అని టైప్ చేసి వెతకండి. అది నేరుగా మిమ్మల్ని మల్లోజుల కోటేశ్వర్‌రావు అనే పే జీకి తీసుకెళ్తుంది! ఆ పేజీ ఆరంభంలో ‘మీరు కిషన్‌జీ అని అడిగినందుకు మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాం. మీకు ‘హిందూ దైవం కిషన్ జీ’ కోసం వెతుకుతున్నట్టయితే కృష్ణ అని టైపే చేయండి’ అని మీకొక చిన్న నోట్ కనిపిస్తుంది. ఉత్తరాది హిందువులకు ద్వాపర యుగకర్త శ్రీ కృష్ణుడు కిషన్‌జీ గా ఆరాధ్య దైవం. ధర్మ సంరక్షణ కోసం ఆయన అవతరించినట్టు ప్రజలు నమ్ముతుంటారు. ధర్మం చెరబడ్డ ప్రతిసారీ నేనే ఏదో ఒక రూపంలో అవతరిస్తానని శ్రీ కృష్ణుడే గీతోపదేశంలో చెపుతాడు. దాన్ని భారతీయులు చాలా మందే నమ్ముతుంటారు. ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల స్మృతిలో ‘కిషన్‌జీ’ ఆన్న నామవాచకానికి అర్థమే మారి పోయింది. ఔను! కిషన్‌జీ ఆంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తుకు రావడం లేదు. తన జీవిత కాలమంతా వెచ్చించి భారతదేశ విప్లవోద్యమాన్ని మలచిన మల్లోజుల కోటేశ్వర్‌రావు ప్రజల మనోఫలకాల మీద మెదులుతున్నాడు. వికీపీడియాలో ఆయన కోసం పేజీని ప్రారంభించిన నాలుగు రోజుల్లో ఇరవై వేలకు పైన జనం ఆయన గురించి చదివారు. తన పిల్లలు ఎక్కడ ఉన్నా వారిని చల్లగా చూడాలని మల్లోజుల మధురమ్మ గడిచిన నాలుగు దశాబ్దాలుగా లెక్కలేనన్ని సార్లు ఆ దేవుడికే మొక్కుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ దేవుణ్ణే స్థాన భ్రంశం చేసిన కిషన్ జీ ఈ దేశంలోని పీడిత వర్గాలకు ఆరాధ్య దైవంగా మారి పోవడం ఆమె ఊహకు అందని విషయం. ఒక్క ఆమెకే కాదు, అతనితో చిన్నప్పుడు పెద్దపల్లిలో కలిసి చదువుకున్న వాళ్ళల్లో ఏ ఒక్క రూ వాళ్ళ ’కోటి’ కిషన్‌జీగా ఈ దేశ చరివూతలో చిరకాలం నిలిచిపోతాడని ఊహించి ఉండరు.
గడిచిన వారం రోజుల్లో చాలా మందికి అతని జీవితం, జీవితంలో ఆయన పెంచుకున్న ఆదర్శాలు, నమ్ముకున్న సిద్ధాంతం, ఆచరణలో అతని నిబద్ధత అంతిమంగా అతను నిర్మించిన మహోద్యమం కొత్తగా పరిచయం అయ్యాయి. కరీంనగర్ పాత మిత్రులు ఆయనతో ఉన్న పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని కథలు కథలుగా చెప్పి మురిసిపోతున్నారు. మనుషులు మరణించినా..వారిని చూసి మురిసిపోయే సందర్భాలు చాలా అరుదు. మనల్ని బతికించే ఏదో ఒక ఆశ వాళ్ళు వదిలి వెళ్ళినప్పుడే అది సాధ్యమౌతుంది. అటువంటి అచంచలమైన విశ్వాసాన్ని కోటేశ్వర్‌రావు ఇప్పుడు మన దేశంలోని కొట్లాదిమందికి కలిగించాడు.
ముఖ్యంగా తెలంగాణ అంతటా ఉన్న అతని సన్నిహితుల్లో ఇప్పుడు ఆ ఆశ ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తోంది. ఆ ధైర్యమే అతని అంతిమ యాత్రను ఒక వైవిధ్యభరిత జన సమాహారంగా మార్చివేసింది. కోటేశ్వర్‌రావు నాయకత్వం వహిస్తోన్న పార్టీతో విభేదించి విడిపోయిన వాళ్ళు, ఆ పార్టీ పద్ధతులను విమర్శించే వాళ్ళు మొదలు ఆయనతో అసలు పరిచయం లేని వాళ్ళు, ఆయనను పొట్టన పెట్టుకున్న పాలక వర్గాలకు చెందిన వాళ్ళు అనేకమంది ఆయనకు మనస్పూర్తిగా నివాళులు అర్పించారు. ఈ అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా అతనితో ఏర్పడ్డ బంధం తెలంగాణ. అతని ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ అతని తొలి పాఠశాల.
తొలి తెలంగాణ ఉద్యమం(1969)ఒక్క కోటేశ్వర్‌రావు కే కాదు, ఆయన తరానికి చెందిన వేలాదిమంది యువకులకు ఎన్నో పాఠాలు నేర్పింది. అప్పటికే వందలాదిమంది యువకులను అప్పటి ప్రభుత్వం కాల్చి చంపింది. పోలీసుల నిర్బంధం, అరెస్టులు, జైళ్ళు, తుపాకీ తూటాలతో బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోన్న దశ అది. ఆ ఉద్యమంలో అరెస్టయ్యి, బయటికి వచ్చిన కోటేశ్వర్‌రావు 1971 లో పెద్దపల్లి వదిలి డిగ్రీ చదవడం కోసం కరీంనగర్ వచ్చారు. అతనికి సంతోష్‌కుమార్, ఎన్.శ్రీనివాస్, నారదాసు లక్ష్మణరావు వంటి మిత్రుల సాహచర్యం దొరికింది. అప్పటికి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాలలో మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉండేవి. అదేకాలంలో జమ్మికుంటలో అక్కడి సోషలిస్టు ఆదర్శాలున్న సంపన్న రైతులు కొందరు ఆదర్శ కాలేజీ పేరుతో ఒక ప్రైవేటు డిగ్రీ కాలేజీని ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ పై ఆశలు విఫలమై అక్కడికి చేరుకున్న కొత్త తరానికి ఆ కాలేజీలు ప్రధాన అధ్యయన కేంద్రాలుగా మారిపోయాయి. జమ్మికుంట ఆదర్శ కాలేజీలో నల్లా సుధాకర్‌రెడ్డి, నల్లా ఆదిడ్డి, ఆవునూరి సమ్మయ్య, శనిగరం వెంక (సాహూ), మడిపల్లి తిరుపతి, చంద్రప్రభాకర్ వంటి యువకులు క్రియాశీలంగా ఉండేవాళ్ళు.
అప్పటికి ఇంకా శ్రీకాకుళ పోరాట పవనాలు కరీంనగర్ దాకా చేరలేదు. వరంగల్‌లో కాళోజీనారాయణరావు, వరవరరావులు ఆ ప్రయత్నం చేస్తోన్న కాలమది. తొలుత తిరుగుబాటు కవులుగా, ఆ తరువాత విప్లవ రచయితల సంఘంగా అక్కడ కార్యక్షికమాలు మొదలవుతున్న దశలో ఆ బీజాలను కరీంనగర్ మాగాణాల్లోకి తీసుకొచ్చింది భాగ్యనగర్ విజయకుమార్. కరీంనగర్‌లో అందరూ విజ్జన్న అని పిలుచుకునే ఆయనకు అప్పటికే వరంగల్‌తో పరిచయం, వరవరరావుతో సాన్నిహిత్యం ఉంది. ప్రత్యేక తెలంగాణ పోరాట అనుభవమూ ఉంది. అంతకుమించి శ్రీకాకుళ ఉద్యమ ప్రభావం అతని ఆలోచనను అప్పటికే పూర్తిగా ఆవరించి ఉన్నాయి. విజ్జన్న విద్యుల్లత పేరుతో అప్పటికే ఒక పత్రిక ప్రారంభించారు. కరీంనగర్‌ను తన కార్యక్షేవూతంగా పెట్టుకున్న విజ్జన్న పంచాది నిర్మల స్ఫూర్తితో నిర్మల ప్రెస్ పేరుతో ఒక ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. విజయకుమార్‌కు మిత్రులు గోపు లింగాడ్డి, ముంజంపల్లి వెంకటడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. వారితో పాటు తాడిగిరి పోతరాజు, అంపశయ్య నవీన్, తిరుపతయ్య వంటి మేధావులు తోడయ్యారు. వరవరరావు మార్గదర్శకత్వం మిత్రుల సమష్టి ఆలోచనల పర్యవసానమే కరీంనగర్‌లో ప్రారంభమైన ఉద్యమసాహితి, యువసాహితి. వీటి ప్రభావంతో జమ్మికుంట కాలేజీ విద్యార్థులు 1972 -73 నాటికి జనసాహితి ప్రారంభించారు. 1970 -74 మధ్యకాలంలో ఈ సంస్థలు నిర్వహించిన సదస్సులు, సమాలోచనలు మొత్తం కరీంనగర్ యువతరం స్వభావాన్ని సానబెట్టాయి. కేవలం ఒక్క తెలంగాణ మాత్రమే కాదు యావత్ భారత దేశం అందులో ప్రధానంగా శ్రామిక వర్గం విముక్తి కావాలన్న స్ఫృహ ఈ సమాలోచనలు కలిగించాయి.
ఈ కార్యక్షికమాలు క్రమక్షికమంగా ప్రత్యేక తెలంగాణ గాయాలను మాన్పివేయడమే కాకుండా ఆతరం యువకుల్లో అభ్యుదయ, ప్రగతిశీల ఆలోచనలకు బీజాలు వేశాయి. వీళ్ళ సదస్సులకు శ్రీ శ్రీ, చెరబండరాజు, వరవరరావు మొదలు అనేకమంది కవులు రచయితలు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి లాంటి వైద్య విద్యార్థులు, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకులు కొందరు హాజరై పాఠాలు బోధించేవారు. 1975 మే నెల 11 న హుజూరాబాద్‌లో ఆవునూరి సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన జనసాహితి సదస్సుకు హాజరైన శ్రీ శ్రీ , చెరబండ రాజు కరీంనగర్‌లో కత్తులయి మెరుస్తోన్న నవతరాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఆ ఉత్సాహంతో ఆయన హుజూరాబాద్ అంతా ఆ యువకులతో కలిసి పాదయావూతలో కలిసి నడిచారు.అప్పటికి ఆ యువ సందోహంలో కోటేశ్వర్ రావుతోపాటు, సాహూ, నల్లా ఆదిడ్డిలాంటి యువకులున్నారని, వాళ్ళే అతను కలలు గంటున్న నూతన సమాజ నిర్మాతలు కాబోతున్నారని బహుశా శ్రీశ్రీ కి తెలియదు. అప్పుడు మొదలైన కోటేశ్వర్‌రావు ప్రస్థానం అక్కడినుంచి గ్రామాలకు తరలి, దళిత, పీడిత కులాలకు అండగా నిలబడి తొలుత పాలేర్ల పోరాటమై.. వెట్టి విముక్తికి, గౌరవవూపదమైన కూలీ రేట్ల డిమాండుతో దొరల అహంకారాన్ని అణచివేసే పోరాటాలకు అంకురార్పణవేసింది. జగిత్యాలలో ‘జైత్ర యాత్ర’ అయ్యి దున్నేవాడికే భూమి కావాలన్న ఆకాంక్షను పేద రైతుకూలీలకు కలిగించింది. ఈ పోరాటం మైదాన ప్రాంతాలకూ విస్తరించింది. అదే దారి గుండా గోదావరి దాటి బస్తర్ చీకటి లోకంలో ఉన్న ఆదివాసులకు ‘దివిటీ’ అయి వెలుగు నింపింది. ఆ వెలుగే.. అక్కడినుంచి బీహార్, జార్ఖండ్, బెంగాల్‌తో సహా భారత దేశమంతటా విస్తరిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
కిషన్‌జీ నిర్మించిన మహోద్యమం తెలిసిన వారికి, ఆయన భారతీయ సమాజాన్ని సామాజికీకరించిన తీరు గమనించిన వారికి, ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని మానవీకరించిన ప్రయత్నాన్ని పరిశీలించిన వారికి అయన ఆంటే ఎన లేని గౌరవం. కొన్ని సందర్భాల్లో మావోయిస్టు పార్టీ మీద సునిశిత విమర్శలు చేసిన దళిత బహుజన మేధావులు డాక్టర్ గోపీనాథ్, బీఎస్ రాములు వంటి వాళ్ళు కోటేశ్వర్‌రావు ను కులమత జాఢ్యాలకు అందని ఒక మహానీయుడని, అంతకు మించిన మానవతావాది అని కీర్తించారు. నిజమే ప్రత్యేక తెలంగాణతో మొదలైన కిషన్ జీ పోరాటం సామాజిక తెలంగాణ కోసం ఆయన నాయకత్వంలో సాగిన ప్రయత్నం, కులాలు తెగలు జాతుల విముక్తి దిశగా ఆయన సాగించిన ప్రస్థానం వారినే కాదు ఎవ్వరినైనా అబ్బుర పరుస్తాయి. ఆయన తెలంగాణ తొలిపొద్దు.
కొన్నిసార్లు మన చరిత్ర మనకే అద్భుతమనిపిస్తుంటుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మనకు అలాంటి చారివూతిక అనుభవాల్ని మిగిల్చింది. సరిగ్గా కోటేశ్వర్‌రావు చదునుచేసిన దారిలో నడిచి వచ్చిన మాలాంటి వాళ్లకు దారిపొడుగునా ఆ జ్ఞాపకాలు గర్వాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా ఎప్పుడూ దీర్ఘాలోచనల్లో ఉండే మా విజయకుమార్ సారు తన జీవితంలో ఏం కోల్పోయాడో ఇప్పుడు అర్థమయ్యింది. ఆయన 1985లో ప్రారంభించిన ‘జీవగడ’్డ దిన పత్రిక నుంచే జర్నలిస్టులుగా మా జీవితం మొదలయ్యింది. మల్లోజుల కోటేశ్వర్‌రావులాంటి అనేక మందికి ఎలా నడవాలో నేర్పిన విజ్జన్నే మాకు జర్నలిజంలో ఎలా రాయాలో నేర్పించారు. రాడికల్ విద్యార్థి సంఘం తొలి నాయకుల్లో డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్ ఒకరు. మొదటి తరంలో దివిటీలై కదిలిన వాళ్ళే లేకపోతె ఇవాళ తెలంగాణలో ఈ చైతన్యం లేదు, ఇంతటి ఉద్యమ స్ఫూర్తి లేదు. అదొక సామాజిక విప్లవం. ఆ విప్లవంలో కోటేశ్వర్‌రావు చివరంటా నిలబడిన సేనాని. ఇవాళ తెలంగాణలో మాట్లాడుతున్న తొలితరం మేధావులు, నాయకులు, రచయితలూ, కవులు, గాయకులూ ఎవరైనా సరే ఆ వెలుగు ప్రసరించకుండా వికసించలేదు. ఆయన తెలంగాణను విముక్తి చేయడానికి, సామాజీకరించడానికి, ప్రజాస్వామ్యీకరించడానికి వివిధ దశల్లో ఆయన, ఆయన నిర్మించిన ఉద్యమం అనేక ప్రయత్నాలు చేసింది. అవి అద్భుత ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు సామాజిక తెలంగాణ ఆంటే ప్రత్యేక తెలంగాణను సాధించుకుని ఇంకా మిగిలి పోయిన ఆ ఎజెండాను పూర్తి చేయడమే తప్ప ఇంకొకటి కాదు.
రచయిత: సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈమెయిల్: ghantapatham@gmail.co
No comments:
Post a Comment