Monday, December 12, 2011


జెండర్ హింసపై జనజాగృతి

జెండర్ -ఆధార హింసాకాండ కేవలం మహిళల సమస్య కాదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ హింస మానవ హుందా, హక్కులపై కేవలం దాడి మాత్రమే కాదు. అది సామాజిక సమూహాల సంక్షేమంపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది. జనాభాలో సగం మంది అమానుష వివక్షకు గురి అవుతున్నప్పుడు ఏ దేశమూ పురోగమించలేదు. మహిళలు, బాలికల హక్కులను గౌరవించి, సమాన అవకాశాలు కల్పిస్తే వారు తమ కుటుంబాల, సామాజిక సమూహాల, జాతి స్థితిగతులను సమున్నతం చేస్తారు. మౌలిక మార్పులను సాధిస్తారు. 

ప్రపంచంలోని ప్రతిదేశంలో వలే భారత్‌లోనూ మహిళలు, బాలికలు పలు రకాల హింసాకాండకు బాధితులవుతున్నారు. జెండర్ ఆధార హింసాకాండ ఒక ప్రపంచవ్యాప్త వ్యాధి. జాతి, వర్గ, సామాజిక-ఆర్థిక అంతస్థు, మత పరమైన సరిహద్దులన్నిటికీ అతీతంగా అది చోటుచేసుకొంటోంది. మహిళలు, బాలికలు తమ జీవితాల్లో ఏ విషయంలోనైనా హింసకు బాధితులవుతున్నారు. భ్రూణ హత్యలు, సరైన విద్యావకాశాలు కొరవడటం, పోషకాహార లోపం, బాల్య వివాహం, వావివరసల్లేని లైంగిక సంబంధాలు, 'పరువు' హత్యల రూపేణా ఆ హింసాకాండ సంభవిస్తుంది. వరకట్న సంబంధ హత్యలు, గృహ హింస, (భార్యపై సహా) అత్యాచారం, లైంగిక దోపిడీ, దుర్వినియోగం, మహిళల అక్రమ రవాణా, వితంతువుల వెలి, వారి సంక్షేమం పట్ల నిర్లక్ష్యం మొదలైన రూపాలలో కూడా ఆ హింసాకాండ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో జెండర్ -ఆధార హింసాకాండకు గురవుతున్నారు. కొన్ని దేశాల్లో ఈ బాధితురాళ్ళ సంఖ్య 70 శాతం దాకా ఉంటోంది. 

ఈ ఏడాది మనం మళ్ళీ 'జెండర్ హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీలత'ను పాటించాము. నవంబర్ 25న ప్రారంభమైన ఈ ప్రచారోద్యమం ఈనెల 10న 'అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం'తో ముగిసింది. అమానుష హింసాకాండ నుంచి మహిళలను, బాలికలను విముక్తి పరచాలన్న విజ్ఞప్తికి సానుభూతి మాటలతో ప్రతిస్పందించడమే కాక మరెంతో తోడ్పాటు నందించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉన్నదనేది స్పష్టం. గృహంలో మూసివేసిన తలుపుల వెనుక జరిగినా లేక భయపెట్టడానికి బహిరంగ ఎత్తుగడగా సంభవించినా; మన పొరుగు వీధిలో లేదా దూరతీరాలలో చోటుచేసుకున్నా మహిళలు, బాలికలపై హింసాకాండ మనలనందరినీ-స్త్రీలతో పాటు పురుషులనూ - ఒకే విధంగా బాధిస్తుంది, నష్టపరుస్తుంది. 

భయంకర దుష్కార్యాలకు పాల్పడిన వారిని తరచు శిక్షకు గురి చేయకుండా వదిలివేస్తున్నారు. ఈ అన్యాయాన్ని మనం వ్యతిరేకించాలి. బాధితుల పక్షాన మనం నిలబడాలి. ప్రపంచ వ్యాప్తంగా మహిళల, బాలికల దయనీయ పరిస్థితులను- ఇవి, వారిని తక్కువ స్థాయివారిగా చేస్తున్నాయి; హింసకు బాధితులను చేస్తున్నాయి- మనం తొలగించాలి. ఈ హింసను నిరోధించడంలోను, జెండర్ దృక్పథాలను మార్చడంలోను పురుషులు, బాలురను భాగస్వాములుగా చేసుకోవడానికి మనం మద్దతునివ్వాలి; ఈ విషయంలో సమాజం, ప్రభుత్వాధినేతల జవాబుదారీతనాన్ని, నిబద్ధతను పెంపొందించాలి. దీంతో పాటు ఈ హింసాకాండను నివారించే విషయంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతోన్న ప్రభావయుత కార్యక్రమాలను మరింత పటిష్టంగా, విస్తృతంగా అమలుపరచాలి. 

జెండర్ -ఆధార హింసాకాండ కేవలం మహిళల సమస్య కాదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. అందరూ అలా గుర్తించేలా చేయడం యావత్ ప్రపంచానికి ఒక పెను సవాల్. జెండర్ -ఆధార హింస మానవ హుందా, హక్కులపై కేవలం దాడి మాత్రమే కాదు. అది సామాజిక సమూహాల సంక్షేమంపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతుంది. మహిళల, బాలికల జీవితాలు దుర్వినియోగమయినప్పుడు, వ్యాపారాలు మూతపడినప్పుడు, ఆదాయాలు తగ్గిపోయినప్పుడు... ఇత్యాది సందర్భాలలో ఎదుగుతున్న బాలలు హింసను పురిగొల్పే ప్రవర్తనా రీతులను ఆంతరంగీకరించుకుంటారు. ఈ అమానుషంతో పాటు వచ్చే సామాజిక, ఆరోగ్య ఖర్చులకు అంతం అనేది ఉండదు. 

మహిళలపై భౌతిక హింస, దాని పర్యవసానాల నివారణకు అవసరమైన వైద్య, న్యాయ సేవలకు భరించే ఖర్చులను పరిగణనలోకి తీసుకోండి. లేదూ జీతంతో కూడిన పనిదినాలను నష్టంతో తగ్గిపోయే ఆదాయాలు, కోల్పోయే కుటుంబ ఉత్పాదకతా ఖర్చులను గణించండి. చాలా మంది మహిళలు 'అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ'లో పనిచేస్తుంటారు. మార్కెట్ సరుకులు విక్రయించడం లేదా గృహ సంబంధ సేవకులుగా పనిచేస్తారు. ఈ శ్రమ విలువ సాధారణంగా మన దృష్టికి రాదు. ఉదాహరణకు ఉగాండాలో 12.5 శాతం మంది మహిళలు, సన్నిహిత జీవన సహచరుని హింసాకాండ మూలంగా కీలక ఇంటి పనులు నిర్వర్తించడంలో చాలా విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. 

ఇటువంటి సంఘటనలలో దాదాపు 10 శాతం వాటి మూలంగా మహిళలు ఏటా సగటున 11 (వేతనంతో కూడిన) పనిదినాలను కోల్పోతున్నారు. మహిళలే ప్రధాన ఆర్జనాపరులుగా ఉన్న కుటుంబాలలో ఇటువంటి నష్టాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటోంది. బంగ్లాదేశ్‌లో గృహ సంబంధ హింసపై జరిగిన ఒక సర్వేలో మూడింట రెండువంతులుకు పైగా కుటుంబాలలో ఆ హింస బాధితురాళ్ల పనిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వెల్లడయింది. దీనివల్ల పలువురు మహిళలు తమ నెలసరి ఆదాయంలో సగటున ఐదు శాతాన్ని కోల్పోతున్నారు. 

ఈ నష్టం ప్రభావాలు సమాజంలోని మిగతావారిపై కూడా ఉంటాయి. హింసాకాండ సమాజం పై ఒక క్యాన్సర్‌లా ప్రభావాన్ని చూపుతుంది; సామాజిక, ఆర్థిక పురోగతికి అవాంతరాలను సృష్టించడానికి కారణమవుతుంది. భౌతికహింస మహిళల సమస్యలను మరింతగా పెంచుతుంది. పునరుత్పాదక ఆరోగ్య సమస్యలు, గర్భస్రావం, హెచ్ఐవి లాంటి లైంగిక రోగాలకు గురయ్యే ప్రమాదముంది. అలాగే ప్రసూతి మరణాలతో పాటు పిల్లలు వ్యాధిగ్రస్తులవడానికి మహిళలపై జరుగుతున్న భౌతిక హింసకు సంబంధముంది. వ్యక్తిగతంగా బాధ, వేదనలను కలిగించడమే కాక జెండర్-ఆధార హింసాకాండ జాతీయ స్థాయిలో ప్రతికూల ఆర్థిక ప్రభావాలకు కారణమవుతుంది. 

విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, సంబంధిత దేశ సంస్థలలో విశ్వాసం సన్నగిల్లి పోవడం జరుగుతుంది. ఇటువంటి నష్టాలకు ప్రపంచంలోని ఏదేశమూ, ప్రాంతమూ మినహాయింపు కాదు. 1995లో కెనడాలో జరిగిన ఒక సర్వేలో మహిళలపై హింసాకాండ వల్ల ప్రత్యక్షంగా చెల్లిస్తున్న మూల్యం 100 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బ్రిటన్‌లో 2004లో జరిపిన ఒక అధ్యయనంలో ఈ ప్రత్యక్ష, పరోక్ష నష్టాలు ఏడాదికి సగటున 2300 కోట్ల పౌండ్లు ఉంటుందని (తలసరిన 440 పౌండ్లు) అంచనా వేశారు. ఇక అమెరికాలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ నష్టమే ఏడాదికి 5.8 బిలియన్ డాలర్లకు మించుతోంది. మరో 4.1 బిలియన్ డాలర్లను ప్రత్యక్ష ఆరోగ్య, వైద్య సేవలకు వినియోగించవలసివస్తుంది. అలాగే ఉత్పాదకత కోల్పోవటం వల్ల అమెరికన్లు మరో 1.6 బిలియన్ డాలర్లు వెచ్చించవలసివస్తుంది. 

ఆర్థిక వనరులపై ఒత్తిడితో లోటు బడ్జెట్లు పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో జెండర్ -ఆధార హింసాకాండను నిరోధించడానికి జోక్యం చేసుకోవడం చాలా వ్యయభరిత వ్యవహారమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మహిళలపై దౌర్జన్య చర్యలను నివారించి, అందుకు పాల్పడిన వారిపై అభియోగాలు మోపేందుకు ముందస్తుగా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టవలసివచ్చినప్పటికీ అది దీర్ఘకాలంలో చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఇటువంటి చర్యలను పటిష్టం చేసిన 'అమెరికా సంయుక్త రాష్ట్రాల మహిళా వ్యతిరేక హింసాకాండ చట్టం' 1994లో అమలులోకి వచ్చినప్పటినుంచీ 1600 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు ఒక అంచనా. ఇలా ఆదా అయిన సొమ్ములో అత్యధిక భాగం సదరు హింసాత్మక దాడులను తప్పించుకున్న వారి ఖర్చుల నుంచి ఉద్భవించినదే. 

భారత్‌లో జెండర్-ఆధార హింసను అరికట్టడానికి భారత ప్రభుత్వమూ, చైతన్యశీల భారత పౌరసమాజమూ నవీన వ్యూహాలనెన్నిటినో అమలుపరుస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ప్రశంసనీయం. భ్రూణ హత్యలు, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకొని జరిపిస్తున్న గర్భ స్రావాలు మొదలైన హింసాత్మక కృత్యాలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సామాజిక సమూహాలను ప్రోత్సహించేందుకు పంజాబ్‌లో అమలుపరుస్తోన్న నవాన్ షెహర్ నమూనా, 'కూల్ మెన్ డోన్ట్ బై సెక్స్' అనే ప్రచారోద్యమంలో పురుషులను భాగస్వాములను చేసేందుకు ఆన్‌లైన్ పిటిషన్ మొదలైనవి ఆ వినూత్న వ్యూహాలలో కొన్ని. గృహ హింసపై అవగాహన పెంపొందించడానికి, యువజనుల, సామాజిక సమూహాలకు సదరు హింసాకాండను వ్యతిరేకించేలా సాధికారత కల్పించడానికి మీడియా ప్రశంసనీయమైన కృషిచేస్తోంది. 

గృహాలలో మూసివేసిన తలుపుల వెనుక లేదా సాయుధ ఘర్షణల్లో బహిరంగ ప్రదేశాలలో జరుగుతున్న హింసాకాండ నుంచి మహిళలు, బాలలను విముక్తం చేయడంలో మన నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ఈ 16 రోజుల ప్రచారోద్యమం ఒక అవకాశాన్ని కల్పించింది. తమ జనాభాలో సగం మంది అమానుష వివక్షకు గురి అవుతున్నప్పుడు ఏ దేశమూ పురోగమించలేదు. మహిళలు, బాలికల హక్కులను గౌరవిం చి, విద్య, ఆరోగ్యభద్రత, ఉపాధి, రాజకీయ భాగస్వామ్యంలో సమాన అవకాశాలు కల్పిస్తే వారు తమ కుటుంబాల, సామాజిక సమూహాల, జాతి స్థితిగతులను సమున్నతం చేస్తారు. మౌలిక మార్పులను సాధిస్తారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇటీవల ఇలా పే ర్కొన్నారు: 'మహిళల, బాలికల శక్తి సామర్థ్యాల వికాసానికి సమృద్ధం గా ఆర్థిక వనరులను సమకూర్చడం, అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి, రా జకీయ సుస్థిరత, ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలతోపాటు, పురుషులు కూడా మరింతగా సుసంపన్నులు కావడానికి ఒక ఖచ్చితమైన మార్గం'.
- ఎ. పీటర్ బర్లీ
్‌న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలో చార్జ్ డి ఎఫైర్స్ ఎడ్ ఇంటరిమ్
Andhra Jyothi Telugu News Paper Dated 13/12/2011

No comments:

Post a Comment