Saturday, December 3, 2011

విప్లవోద్యమ ధృవతార ‘కోటన్న’By-కాలువ మల్లయ్య


‘రాజు మరణించె నొకతార రాలిపోయె/కవియు మరణించె నొకతార నింగికెక్కె
రాజు జీవించు రాతి శాసనములందు/సుకవి జీవించు ప్రజల నాలుకలయందు’
అన్నాడు మహాకవి జాషువా.ఈ మాటలు ప్రజల కోసం తమ సర్వస్వాన్ని అర్పించే ఉద్యమకారులకూ వర్తిస్తాయి. మల్లోజుల కోటేశ్వర్‌రావు ఉరఫ్ కిషన్‌జీ, ప్రహ్లాద్ తన జీవితాన్నంతా పీడిత ప్రజల ఉన్న తి కోసం వెచ్చించాడు. రాజ్యం క్రూరత్వానికి బలైనా, కోట్లాదిమంది ప్రజల నాలుకలపై బతికే ఉన్నాడు. 1970,80లలో తెలంగాణలోనూ, అటు తర్వాత పశ్చిమబెంగాల్, ఒరి స్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ, దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో విస్తరించిన భూపోరాటాలలో కిషన్‌జీ పాత్ర ఎంతో ఉంది. నక్సల్‌బరీ స్ఫూర్తితో దేశమంతటా విప్లవోద్యమాన్ని నిర్మించిన ఉద్యమ ధృవతార కోటేశ్వర్‌రావును మేము కోటి, కోటన్న అని పిలిచేవాళ్లం. 1971 నుంచి 74 వరకు నేను కరీంనగర్‌లో బీఎస్సీ చదివాను. కోటన్న నాకు క్లాస్‌మేట్. నాకు రూంమేట్.అప్పటికి అతనికి ఏ రాజకీయాలు లేవు. మేం గ్రామాల గురించి ఎన్నో మాట్లాడుకునేవాళ్లం. అతడు పైకి అమాయకుడిలా కనిపించినా ఆవేశం ఉన్న ఆలోచనాపరుడు. అన్యాయాల పట్ల ఆగ్రహం వ్యక్తంచేశేవాడు. పేదలపట్ల అతనికి ప్రగాఢమైన సానుభూతి ఉండేది. మేమిద్దరం సాయంత్రం జిల్లా గ్రంథాలయానికి వెళ్లేవాళ్లం. పత్రికలు, ముఖ్యంగా నవలలు చదివే వాళ్లం. సాహిత్యం గురించి చర్చించుకునేవాళ్లం. నేను అంత కు ముందే రాసిన ‘విధివూవాత’ అనే నవల చూశాడు. కోటి దాన్ని తీసుకొని జీవగడ్డ విజయ్‌కుమార్ దగ్గరికి తీసుకెళ్లాడు. దాన్ని ప్రచురించాలని లేదా సినిమా తీయాలని అనేవాడు. నేనప్పుడు రాస్తున్న కవితల ను, కథలను చదివి సంతోషించేవాడు. 1973లోనో 74లోనో శ్రీశ్రీ, వరవరరావు, చెరబండరాజు, ఎంటి.ఖాన్ కరీంనగర్‌కు వచ్చారు. నేను, కోటన్న మరో ఇద్దరు మివూతులం కలిసి శ్రీశ్రీ దగ్గరికి వెళ్లాం. నేను ఓ నోట్‌బుక్‌లో రాసుకున్న రచనలను శ్రీశ్రీకి చూపాడు కోటన్న. శ్రీశ్రీ మా ఇద్దరి మీద చెయ్యేసి ‘ఇంకా బాగా రాయాలి’ అని ప్రోత్సహించాడు. మా అనందానికంతులేదు. సాహిత్యమంటే విపరీత ప్రేమున్నా, ఏదో చెయ్యాలన్న తపన ఉన్నవాడు కోటన్న.

1973 ఏప్రిల్‌లో మా రెండవ సంవత్సర పరీక్షలయిపోయాయి. సెలవుల కు నేను మా ఊరికి, కోటన్న పెద్దపల్లి వెళ్లిపోయాడు. జూన్‌లో కరీంనగర్‌కు తిరిగివచ్చాం. ఈసారి కోటన్న వట్టిగా రాలేదు. పుస్తకాలు పట్టుకొని వచ్చాడు. అదంతా విప్లవ సాహిత్యమే... శ్రీకాకుళ పోరాటం సందర్భంగా వచ్చిన కవితలు, నక్సల్‌బరీ పోరాటాన్ని సమర్థిస్తూ వచ్చిన సాహిత్యం, కమ్యూనిస్టు పార్టీ ప్రణాళి క, మరికొన్ని పుస్తకాలు అందులో ఉన్నాయి. వాటిని గదిలో పడేసి చదవమన్నాడు. రాస్తే ఇలా రాయాలన్నాడు. సాయుధపోరాటాన్ని సమర్థిస్తూ మాట్లాడాడు. ఆ పుస్తకాలను, అతని మాటలను విన్న మా రూమ్మేట్లు మరో ఇద్దరు..వీటిని చదివితే పోలీసులు పట్టుకుంటారు అన్నారు. నేను మాత్రం ఆ పుస్తకాలన్నీ చదివాను. 

అప్పుడే తెలంగాణలో భూపోరాట ఉద్యమాలు ఉధృతమవుతున్న సమయం. విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. అవి చదివితే ఈ వ్యవస్థపై ఆగ్రహం కలిగిన మాట నిజమే. ఏదన్నా చేయాలన్న ఆవేశమూ వచ్చిన మాట నిజమే. కానీ ఉద్యమంలోకి వెళితే నా తల్లిదంవూడుల సంగతేం కావాలి? నన్ను కష్టపడి చదివిస్తున్న వాళ్లేం కావాలి? అన్న ప్రశ్నలు నన్ను వేధించేవి. కోటన్న అప్పట్నుంచే కరపవూతాలు పంచడం, సభలకు పోవడం చేసేవాడు. ఒకటి రెండుసార్లు పోలీసులు పట్టుకున్నారు కూడా. నన్ను తనతో రమ్మంటే నేను పిరికివాణ్ని ...ఆ నిర్బంధాలను తట్టుకోలేను అనే వాణ్ని. నాకు సిద్ధాంతాలతో అభ్యంతరం లేదు. సమసమాజాన్ని కోరుకుంటాను. కానీ హింసంటే నాకు నచ్చదు అనేవాణ్ని. విప్లవకారులు చేస్తున్నది ప్రతిహింస మాత్రమే అనేవాడు. సామాజిక మార్పు కోసం భవిష్యత్తులో రచయితగా నా పని నేను చేస్తాను, కానీ ఉద్యమంలోకి రాలేను అనేవాణ్ని. తాను మాత్రం పూర్తిగా అందులో మునిగిపోయాడు. ఫైనలియర్ చదువు అంతం త మాత్రంగానే సాగింది. 

చదువును నిర్లక్ష్యం చేస్తున్నావంటే శాస్త్రీయ విద్యావిధానం కావాలనేవాడు. కార్యకర్తగా తిరుగుతూనే బీఎస్సీ చదువు అయిపోయిందనిపించుకున్నాడు. మేం రూంమేట్లుగా ఉన్నప్పుడు మా ఊరు నుంచి మా అవ్వ, నాయన అప్పుడప్పుడు చూడటానికి వచ్చేవారు. వచ్చేటప్పుడు వండిన మాంసం తెచ్చేవారు. అది చూసి కోటన్న అన్న ఆంజనేయులు, మరొకతను మేం బ్రాహ్మణులం.. గదిలోకి మాంసం తెచ్చుడేంది అని కోపానికొచ్చారు. కోటన్న మాత్రం మనం తిననంత మాత్రాన ఎవరూ తినకూడదనుందా.. ఎవరిష్టం వాళ్లది అని వాళ్లను మందలించాడు. వ్యక్తిగత స్వేచ్ఛకెప్పుడూ విలువిచ్చేవాడు కోటన్న. బీఎస్సీ చదువయిపోయింది. భారమైన హృదయాలతో విడిపో యాం. ఆ తర్వాత నాగపూర్‌లో ఎమ్మెస్సీకి అపె్లై చేసి వచ్చేటప్పుడు పెద్దపల్లిలో దిగాను. కోటి ఇంటికెళ్లాను. అదే మొదటిసారి, ఇప్పటి వరకు చివరిసారి కూడా వాళ్లింటికెళ్లడం. కోటన్న మా అవ్వలో వాళ్లమ్మను చూసుకుంటే నేను వాళ్లమ్మలో మా అవ్వను చూసుకున్నాను. విస్తట్లో ప్రేమగా వడ్డించింది వాళ్లమ్మ. అటు తర్వాత నేను వరంగల్‌లో బి.ఎడ్‌లో జాయిన్‌అయ్యాను. కోటన్న హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బిలో జాయినయ్యాడు. అప్పటికే (1974-75) ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు. 1975లో వరంగల్‌లో మా రూంకు వచ్చాడు. ఉద్యమ అనుభవాలు చెప్పాడు. తన చదువు సాగడం కష్టమన్నాడు. నువ్వు ఇలా చేస్తే నిన్నేంతో ప్రేమించే మీ అమ్మ సంగతేం కావాలన్నాను. మా ఒక్క అమ్మ కోసం కోట్లాది మంది అమ్మలను వదులుకొమ్మంటావా అన్నాడు. నాకు కండ్ల వెంట నీళ్లు వచ్చాయి. భోజనం చేసి వెళ్లిపోయాడు. అదే అతన్ని చివరిసారి చూడ టం. ఆ తర్వాత ఎమ్జన్సీ వచ్చింది. కోటన్న అజ్ఞాతవాసం వెళ్లాడని తెలిసింది. నేను ఉద్యోగంలో అందరిలా సంసార సాగరంలో పడి కొటుకుంటున్నా.. కోటన్న జ్ఞాపకాల్లోంచి పోలేదు. మొదట్లో నేను చేసిన రచనల్లో అతని ప్రభావముంది.

అటు తర్వాత అతని గురించి పత్రికల్లో కచదవడం, టీవీ వార్తల్లో చూడటం తప్ప ఇంకేం తెలియలేదు. జగిత్యాల జైత్రయావూతలో కోటన్న పాత్ర గూర్చి వార్తల్లో చదువుతున్నప్పుడు ఒళ్లు పులకరించేది. అతని సభలకు వేలాది మంది తరలివస్తున్నారని తెలుసుకొని, చదివి ఆశ్చర్యపోయాను. ఆయన దోపిడీదారుల గుండెల్లో బల్లెంగా మారాడని పత్రికల్లో చదివాను. డ్బై, ఎనభైలలో తెలంగాణలో, ఆంధ్రవూపదేశ్‌లో విప్లవోద్యమం అంత బలంగా వేళ్లూనుకోవడానికి కోటన్న పాత్ర ఎక్కువుందని చదివి, మా కోటన్న ఇంత ఎదిగాడా అని ఆశ్చర్యపోయాను. తెలంగాణ ఫ్యూడల్ దొరలు అతనికి కోట్ల రూపా యల ఆశ చూపారని, దాన్ని తృణవూపాయంగా కోటన్న తిప్పికొట్టాడని చదివి అతని నిజాయితీకి జోహార్లు అర్పించాను. తెలంగాణలో కూలీరేట్ల పెంపుకోసం కోటన్న పాత్ర ఎంతో ఉంది. అతడు పేదల పాలిటి బంధువుగా, దోపిడీదారులకు సింహస్వప్నంగా మారిన క్రమం స్ఫూర్తిదాయకం. అప్పుడు జరిగిన ఆకలి దాడుల్లోనూ అతని పాత్ర ఉందన్న వార్తలు వచ్చేవి. అతనిపై లక్షల రూపాయల రివార్డును ప్రకటించడం చూసి ఎంతో వేదన కలిగింది. కోటన్న ఏం చేశాడని అతన్ని చంప చూస్తున్నారని బాధ కలిగేది. పేదల పాలిట పోరాడటం తప్పా? సమసమాజం కోరుకోవడం తప్పా? అని నాలో నేను మదనపడేవాడిని. పోలీసు కాల్పుల్లోంచి తృటిలో తప్పించుకున్నాడని అనేకసార్లు చదివాను. అప్పు డు తప్పించుకున్నందుకు సంతోషించాలో, తన జీవితాన్ని ప్రతిక్షణం ప్రమాదంలో ఉంచినందుకు బాధపడాలో అర్థమయ్యేది కాదుయకమంగా పార్టీలో ఉన్నతోన్నత స్థానంలో ఎదగడం అతని కృషి ఫలితమే. పార్టీలో రెండవ, మూడవ స్థానంలో ఉన్నాడని వార్తలు చదివాను. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మా కోటన్న అంత గొప్ప స్థితికి ఎదగడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత దండకారణ్య విప్లవోద్యమ నిర్మాతగా ఎదగడం గూర్చి వార్తలు చదివాను. తూర్పు భారతంలో ఉద్యమాన్ని నిర్మించడంలో అతని పాత్ర ప్రముఖమని చదివి ఆశ్చర్యపోయాను. పార్టీ పొలిట్‌బ్యూరో స్థాయికి ఎదగడం గొప్ప విషయమే. అది తెలంగాణ గర్వించదగ్గ విషయం. 

ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడు వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణలో పుట్టిన వాడు దేశరాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం ఎలా సాధ్యమైంది. పాలక వర్గ పార్టీల్లో లాగా వారసత్వంగానో, ఒకరి దయా దాక్షిణ్యాలమీదనో వచ్చిన స్థానం కాదది. దేశంలోని ప్రజల స్థితిగతులను చూసి ఎంతో ఆవేదన చెందితే తప్ప ఇది సాధ్యం కాదు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం మాత్రమే సమసమాజ స్థాపనకు పీడుతుల విముక్తికి మార్గమని నమ్మి అందుకోసం తనను తాను అంకితం చేసుకోవడం వల్ల వచ్చింది. భూమికోసం, భుక్తికోసం, పేద ప్రజల విముక్తికోసం తన ప్రాణాలర్పించుకోవడానికి సిద్ధం కావడం వల్ల వచ్చింది. తన ఆశయ సాధన కోసం అడుగడుగునా ప్రమాదాలను కౌగిలించుకునే సాహసం చేయడంవల్లనే సాధ్యమైంది. తానెప్పుడోసారి బలికాక తప్పదని తెలిసినా.. ఓ ఆశయం కోసం బలికావడానికి సిద్ధం కావడం వల్లనే వచ్చింది. 1968-69 తెలంగాణ పోరాటం నాటికి కోటన్న పాఠశాల విద్యార్థి అయినా అతనికెంతో స్ఫూర్తినిచ్చింది. ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్లలో చాలామంది వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగారు. ‘కోటి’ ఈ స్థితిలోకి ఎదగడానికి మూలాలు తెలంగాణ మట్టిలోనే ఉన్నాయి. 

కోటి ఆంధ్రజ్యోతిలో అమ్మకు రాసిన లేఖ అతని హృదయాన్ని విప్పి చెబుతోంది. చర్చల కోసం అతడిచ్చిన స్టేట్‌మెంట్లు అతని ప్రజాస్వామిక దృక్పథాన్ని తెలియజేస్తున్నవి.అతని పేరు భారత విప్లవోద్యమ చరివూతలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అతని సిద్ధాంతంతో ఏకీభవించని వాళ్లు కూడా అతని త్యాగ శీలతను , సిద్ధాంత నిబద్ధతను కీర్తిస్తారు. బతికినంత కాలం ప్రజల కోసం బతికిన కిషన్‌జీ కోట్లాది మంది తల్లుల కన్నీరు తుడువడానికి తనను తాను అర్పించుకున్న ధన్యజీవి. భౌతికంగా అతడు మరణించినా కోట్లాది మంది గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు. విప్లవోద్యమ చరివూతలో అతనో లెజెండ్. మాకోటన్నకు సాశ్రునయనాలతో క్షమాపణలతో వీడ్కోలు పలుకుతున్నాను. భగత్‌సింగ్ పక్కన నిలబెట్ట గలిగిన మణి మా కోటన్న.
Namasete Telangana telugu news paper Dated 03/12/2011


No comments:

Post a Comment