Saturday, December 24, 2011

నీటిలో నిప్పు : ముల్లైపెరియార్‌


తమిళనాడు, కేరళ మధ్య రాజుకున్న ‘ముల్లైపెరియర్‌’ చిచ్చు కలవరపెడుతున్నది. సున్నితమైన ఈ సమస్యపై రాజకీయపార్టీలు చేస్తున్న స్వార్థ విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. విశాలమైన జాతి హితాన్ని మరచి ఓట్ల వేటలో రెండు రాష్ట్రా నేతలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. అంతర్‌ రాష్ట్ర వివాదాల నెగళ్లతో చలికాచుకునే కేంద్రం వైఖరి అత్యంత ప్రమాదకరం. మున్ముందు నీటి యుద్ధాలు తప్పవన్న జోస్యాలు వాస్తవరూపం దాల్చే రోజులు ఎంతో దూరంలోలేవని నదీజలాల వివాదాలు రుజువు చేస్తున్నాయి. 

దాదాపు 116 ఏళ్ల క్రితం కేరళలోని ఇడుక్కి జిల్లా తెక్కాడి ప్రాంతంలో బ్రిటిష్‌ ప్రభుత్వం (మద్రాసు రెసిడెన్సీ) నిర్మించిన ‘ముల్లైపెరియర్‌’ డ్యాం తాజా వివాదానికి కేంద్ర బిందువు. కేరళలో ప్రవహించే పెరియార్‌ నది వృథాగా సముద్రంలో కలుస్తుంటే, దాని సమీపంలోని త మిళనాడు సరిహద్దు ప్రాంతాలు కరవు కాటకాలతో అల్లాడిపోయేవి. పెరియార్‌, దాని ఉపనది ముల్లైయార్‌ కలిసేచోట ఆనకట్టకట్టితే, దక్షిణ తమిళనాడులోని ఐదు జిల్లాలకు సాగునీరు అందించవచ్చని నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం నాటి ట్రావెన్‌కోర్‌ సంస్థానం (నేటి కేరళలో అంతర్భాగం) మహారాజాతో సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. 999 ఏళ్లు అమలులో ఉండేలా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

ఈ ప్రకారం ట్రావెన్‌కోర్‌ సంస్థానంలోని తెక్కాడి ప్రాంతంలో ముల్లైపెరియార్‌ డ్యాంను నిర్మించారు. 1887లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమై 1895లో పూర్తయ్యింది. ఒప్పందం ప్రకారం ఆనకట్ట నిర్మాణం బాధ్యత మద్రాసు రెసిడెన్సీదే. ఆనకట్టకోసం ట్రావెన్‌కోర్‌ సంస్థానం 8100 ఎకరాల భుమిని ఇచ్చింది. ఇందుకుగాను- ఎకరానికి ఏడాదికి రూ. 5 చొప్పున కౌలు ఇచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డ్యాం నిర్మాణంతో తమిళనాడులోని నేటి మదురై, దిండుగల్‌, తేనీ, రామనాథపురం, శివగంగ జిల్లాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య పరిష్కారమైంది. 1970లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఈ ఒప్పందాన్ని తిరగ రాసుకున్నాయి. ఈ డ్యాం ద్వారా మదురై ప్రాంతంలోని నీటి ఎద్దడికి, పెరియార్‌ నదివల్ల ట్రావెన్‌కోర్‌ సంస్థానం ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లుయింది. 

అయితే, 1979లో గుజరాత్‌లోని మార్వి డ్యాం కూలిపోయి 25 వేల మంది మరణించడం, అదేసమయంలో ముల్లైపెరియర్‌ డ్యాం బలహీనపడిందన్న వార్తలు వెలువడడంతో కేరళలో ఆందోళనలు ప్రారంభమయినాయి. దీంతో తిరువనంతపురంలోని సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌ (సెస్‌) డ్యాం భద్రతపై అధ్యయనం చేసి రిక్టర్‌ స్కేల్‌పై 6 అంతకుమించిన తీవ్రతతో భూకంపం వస్తే డ్యాం కూలిపోతుందని వెల్లడించింది. రూర్కీ ఐఐటి, ఐఐఎస్‌సి సంస్థలు కూడా దీనిపై అధ్యయనం చేసి సెస్‌ చెప్పింది వాస్తవమేనని తేల్చాయి. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ కూడా డ్యాం భద్రతను పరిశీలించి డ్యాంలో నీటి నిల్వను 142.2 అడుగుల నుంచి 136 అడుగులకు తగ్గించాలని ఆదేశించింది. అయితే, తమిళనాడు మాత్రం తమ సేద్యపు నీటి అవసరాలు పెరిగాయని, నీటి నిల్వ ఎత్తు పెంచాలని పట్టుపట్టింది. అలా 32 ఏళ్ల క్రితం ప్రారంభమైన వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉన్నది. 

దీనికితోడు 1997లో సంభవించిన భూకంపంలో ఆనకట్టకు బీటలు వారాయి. జలాశయంలోని నీళ్ళు లీక్‌కావడం ప్రారంభమైంది. ప్రజల్లో ఆందోళనలు మరింత తీవ్రమైనాయి. డ్యాం కూలిపోవడం తథ్యమన్న భావన బలపడింది. డ్యాం కూలిపోతే కేరళకు చెందిన ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం తదితర ఐదు జిల్లాల్లోని దాదాపు 70 లక్షల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కేరళ నాయకత్వం కలవరపడింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అవిశ్వాసం పెరిగిపోయింది. బ్రిటిష్‌కాలం నాటి వందేళ్ళకు పైబడిన ఒప్పందం విశ్వసనీయతపై కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

2006లో డ్యాం నీటి మట్టం 142 అడుగుల ఎత్తువరకు పెంచుకోవచ్చుని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. 
ఈ ప్రాజెక్టు ప్రాంతం భూకంపం జోన్‌లో ఉన్నదనీ, గడచిన ఆరునెలల్లోనే అక్కడ 20 వరకు భూకంపాలు సంభవించాయనీ, భూకంపం తీవ్రత పెరిగితే డ్యాం బద్దలు కావడం ఖాయమని లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదనీ, దీన్ని నివారించడానికి డ్యాం పక్కన మరో డ్యాం నిర్మించాలని కేరళ వాదిస్తున్నది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం 2006లో కేరళ సాగు, మంచి నీటి సంరక్షణ (సవరణ) చట్టాన్ని కూడా తెచ్చింది. 

కొత్త ఆనకట్ట నిర్మాణానికి తాను సిద్ధమనీ, తమిళనాడు నిర్మించినా తమకు సమ్మతమేననీ, 999 ఏళ్ల ఒప్పందాన్ని అమలు జరుపుతామనీ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ అనేకసార్లు ప్రకటించారు. అయితే తమిళనాడు వాదనలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. డ్యాం భూకంపం జోన్‌లో ఉన్నదన్న కేరళ నిర్థారణను తోసిపుచ్చింది. అదేవిధంగా అనకట్ట బలహీనంగా లేదనీ, దీనికన్నా ఎక్కువ వయసు ఉన్న డ్యాంలు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయనీ స్పష్టం చేస్తున్నది. అదీగాక, డ్యాం భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చిట్టా విప్పుతున్నది. నీటివాటా తగించాలన్న కుట్రతోనే కేరళ కొత్త నిర్మాణాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపిస్తున్నది. 

ఈ అంతర్‌ రాష్ట్ర వివాదం పరిష్కారానికి 2010లో సుప్రీంకోర్టు- మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఎస్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 2012 ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ గడువు సమీపిస్తున్న కొద్దీ రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రి చాందీ కొత్త డ్యాం నిర్మించాల్సిందేనంటూ తన కేబినెట్‌తో తీర్మానం ఆమోదింపజేశారు. కేరళ ప్రతిపాదన తమకు సమ్మతం కాదంటూ జయలలిత ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేయించారు. డ్యాంలో నీటినిల్వ మట్టం పెంచాలని తమిళనాడు ప్రజలు, కొత్త డ్యాం నిర్మించాలని మలయాళీలు వీధుల్లోకి వచ్చారు. 

వీరి సెంటిమెంట్లకు రాజకీయపార్టీలు మరింత ఆజ్యం పోసి రెండు రాష్ట్రాల ప్రజ ల మధ్య శత్రుభావనలు పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘డ్యాం 999’ సినిమా ఉద్రిక్తతలను పెంచింది. దీంతో జయలలిత ఈ సినిమాను నిషేధించారు. కేంద్ర మంత్రులు చిదంబరం, వాయలార్‌ రవిల పొంతన లేని ప్రకటనలు రెండు రాష్ట్రాల ప్రజలను మరింత దూరం చేశాయి. అయ్యప్ప భక్తులపై దాడులకు దిగేవరకు పరిస్థితులు దిగజారాయి. చివరకు తమిళనాడులోని కొన్ని పార్టీలు కేరళకు వ్యతిరేకంగా ఆర్థిక దిగ్బంధనానికి పిలుపు కూడా ఇచ్చాయి. 

ముల్లైపెరియార్‌ డ్యాం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలనే కాదు, కొన్ని మౌలిక అంశాలను తెరపైకి తెచ్చింది. వందేళ్లు పైబడిన డ్యాంల భద్రతపై సమగ్ర అధ్యయనం జరపాల్సిన అవసరాన్ని ఇది దేశ ప్రజల దృష్టికి తెచ్చింది. మనదేశంలో వందేళ్లు పైబడిన డ్యాంలు 115 వరకు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే 13 ఉన్నాయి. వీటన్నిటి భద్రతపై కేంద్రం దర్యాప్తు చేయించాలి. ముల్లైపెరియార్‌ విషయంలో రెండు రాష్ట్రాలు సుహృద్భావ పూరితంగా వ్యవహరించాల్సింది పో యి ప్రతిష్ఠకు పోవడం దురదృష్టకరం. డ్యాం భద్రతపై మలయాళీల మనో భావాలను తమిళనాడు వారు అర్థం చేసుకోవాలి.

‘డ్యాం బద్ధలైతే’ అంటూ భీతావాహదృశ్యాలతో జనాన్ని ఆందోళనలకు గురిచేయడం కేరళ నాయకులకు సరికాదు. ఏరోటి కాడ ఆ పాట పాడే సంకుచిత రాజకీయాలను జాతీయ పార్టీలు విడనాడాలి. జాతిహితాన్ని దృష్టిలో పెట్టుకొని విశాలదృక్పథంతో వ్యవహరించాలి. కేంద్రం జోక్యం చేసుకొని త్రైపాక్షిక చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. పార్టీల్లో ఏకాభిప్రాయానికి ప్రయత్నించాలి. అది సాధ్యం కాకపోతే ఎన్నికల కమిషన్‌ తరహాలో స్వతంత్ర జల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. వృత్తి నిపుణులతో జాతీయ స్థాయిలో వివాదాల పరిష్కార వేదికగా అది పనిచేయాలి. దాని తీర్పులకు అన్ని రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆల్మట్టీలు, ముల్లైపెరియర్లు పుట్టుకొస్తాయి.


- దేవేంద్ర

No comments:

Post a Comment