Sunday, December 11, 2011

ఈ దేశానికి సొంత మతం ఏది? - దొమ్మటి ప్రవీణ్‌కుమార్


డాక్టర్ అంబేద్కర్ 1949 నవంబర్ 23న రాజ్యాంగ పరిషత్ నుంచి ఎందుకు వాకౌట్ చేశారు? అధికరణ 17ని సభ యావత్తు ఏకగ్రీవంగా తీర్మానించినందుకు నిరసనగా రాజ్యాంగ పరిషత్ నుంచి అంబేద్కర్ వాకౌట్ చేశారు. సభలోని మెజారిటీ అభిప్రాయానికి కట్టుబడి ఉండటం ప్రజాస్వామ్య సంప్రదాయం అనే వాదనకు ఆయన ఇలా సమాధానమిచ్చారు: 'అంటరాని తనానికి, కుల వ్యవస్థకు కారణమైన హిందూ మతాన్ని పాయింట్ అవుట్ చేయకుండా, అంటరాని తనాన్ని అంటరాని కులాల వాళ్లే తమ ఇష్టానుసారంగానే పాటిస్తున్నట్లు, వారిదే తప్పు అయినట్లు చిత్రించి అంటరాని తనం నిషేధానికి ఆర్టికల్ 17ను రూపొందించారు. ఇది నాకు ఇష్టం లేదు. ఈ విషయాన్ని భావి తరాల వారికి తెలియచెప్పేందుకే నేను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశాను'. ఈ ఘటన జరిగి 72 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటికీ దళితులపై ఇంకా ద్వేషభావంతో హిందూమత భావజాలం ఆధునిక శైలిలో చేస్తోన్న దాడి పర్యవసానమే మత మార్పిడిపై నేడు జరుగుతోన్న చర్చ. 

హిందూ మతాన్ని పాయింట్ అవుట్ చేయకుండా స్వామి అగ్నివేష్ లాంటి కొందరు మేధావులు మతమార్పిడి తగదని అంటున్నారు. అందుకు దళితులనే తప్పుపడుతున్నారు! దళిత, ఆదివాసీ, గిరిజన వర్గాల వారికి ఆలోచించే జ్ఞానం లేదని, కేవలం ప్రలోభాలకు మాత్రమే లొంగి మత మార్పిడికి లోనవుతున్నారని వాపోతున్నారు. దీన్ని ఒక ఆర్ధికపరమైన అంశంగా మాత్రమే చూస్తున్నారు. ఇది మరో విధమైన మతదూషణ, అవమాన ప్రక్రియ. తాను తెలుసుకున్న సత్యాన్ని విశ్వసించి, ఆ సత్యంలోనే జీవిస్తున్నారనే గౌరవం లేకుండా హాహాకారాలు చేస్తున్నారు. అసలు ఈ భారతదేశానికి సొంత మతం ఏది? 

రాజ్యాంగ సభ నుంచి ఆ రోజు అంబేద్కర్ చేసిన వాకౌట్ పరిణామ క్రమమే ఈ రోజు దళితులు, ఆదివాసీలు, గిరిజనులు హిందూ మతం నుంచి వాకౌట్ చేయటం. హిందూ మతం నుంచి విముక్తి పొందడమే వారి ముక్తిమార్గం. 1930ల తొలినాళ్ళలో లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో గాంధీ మాట్లాడుతూ ఇలా అన్నారు: 'అంటరాని వారు ముస్లిం మతంలోకి మారవచ్చు లేదా క్రైస్తవ మతానికి మారవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాని హిందూ మతంలో ఉంటూ హక్కులు అధికారాలు కోరితే నేను దానికి బద్ద విరోధిని'. మరి గాంధీకి లేని బాధ ఆయన వారసులకెందుకో? ఏ మత పీడనకు గురి అయినవారే ఆ మత మార్పిడికి జరిగే ప్రక్రియలో చురుకుగా పాల్గొంటారు. ఇది సహజమైన న్యాయం కూడా. 

3,500 ఏళ్ళ నాటి చరిత్ర మళ్ళీ గుర్తుకు తీసుకురావటం తప్పటం లేదు. ఆర్యులు పొట్ట చేత్తో పట్టుకొని సింధూ నదిదాటి ఈ దేశంలో ప్రవేశించారు. అడుక్కుతినే వారిని అక్కున చేర్చుకున్న ఈ దేశ ప్రజలదే నాగరిక చరిత్ర, మానవత్వ చరిత్ర. కాలక్రమేణా ఆర్యులు ఆర్ధికంగా స్థిరపడ్డారు. దరిమిలా ఈ దేశపు జనులపై దండయాత్రకు పూనుకున్నారు. 

విదేశీయులైన ఆర్యుల దండయాత్రను ఎదుర్కొన్న ఈ దేశ రక్షకులైన రాజులను రాక్షసులుగా చిత్రీకరించారు. ఆర్యులను వీరోచితంగా ప్రతిఘటించిన ఈ దేశ ప్రజలు చివరిదశలో విధిలేక శత్రువుకు లొంగిపోయారు. అలా లొంగిపోయినవారే నేటి శూద్రులు. చివరి కంటూ పోరాడి ఓడిన మహారాజులకు వేసిన శిక్షే అస్పృశ్యత. ఊరిబయట తాటాకు (గుడిసెలు) వాళ్ళపాటి కారాగారాలు. నాటి మగధ సామ్రాజ్యాధి నేతలే నేటి మాదిగలు. ఆ నాడు విజేతలైన ఆర్యులే నేటి బ్రాహ్మణులు. అంటే 'బ్రాహ్మణులు భారతీయులు కారన్న నిజం' ఇన్ని రోజులు దాచబడిన నగ్నసత్యం.

'అంటరానితనం హిందూ మతానికి మచ్చ అయితే హిందూ మతం భారతదేశానికి మచ్చలాంటిది' అనే సునిశ్చిత విశ్వాసంతో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా డాక్టర్ అంబేద్కర్ మతమార్పిడి ప్రక్రియ ప్రారంభించారు. సుమారు 1200 సంవత్సరాలు ఈ దేశం కులరహిత సమాజంగా ఉన్నది. ఇదే బౌద్ధ మతం గొప్పతనం. దాన్ని అంబేద్కర్ గుర్తించారు. వలస వచ్చిన ఆర్యులు మతం, ధర్మం, నీతినియమాల పేరుతో శూద్రులందరిని మూఢులుగా చేసారు. శూద్రులకు కూడా అంటరాని జనులకు మాదిరిగానే ఎటువంటి హక్కులు లేవు. విదేశీయులైన ఆర్యులు ఈ దేశ సామాన్య ప్రజలను ఇలా హైందవ మతంలోకి మతమార్పిడి చేసారు. ఇదే అసలైన బలవంతపు మతమార్పిడి. ఆయుధంతో ఇష్టం లేకున్నా మెదడులో రుద్దడమే బలవంతపు మతమార్పిడి. 

ఇపుడు మత మార్పిడి మీద నేను అడిగేది ఒకే ఒక ప్రశ్న! ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశ మూల వాసులను హిందూ మతంలోకి మార్చడం బలవంతపు మతమార్పిడి కాదా? వారిని లొంగదీసుకోవడం కాదా? ఈ దేశ ప్రజలను బానిసలుగా మార్చి, చివరికి ఈ దేశ మహారాజులను చంపిన రోజులనే పండుగలుగా జరుపుకుంటున్న హింసాప్రవృత్తిని సంస్కృతి పేరున ఈ మూల వాసులపై రుద్దారు ఆ పురాయుగాల విజేతలు. నరకాసురుడనే ఈ దేశమహారాజు జ్ఞానవంతుడు, నీతిమంతుడని పెరియార్ చెప్పారు. బలిచక్రవర్తి అంతటి కరుణామయుడు లేడని మహాత్మ జ్యోతిరావుఫూలే అభిప్రాయపడ్డారు. 

మనిషిని జంతువుగా చూడటం, జంతువును దేవతలుగా పూజించడం భారతదేశంలోనే చూస్తాం. పక్షిని గరుత్మంతుడని, కోతిని హన్మంతుడని, పామును ఆదిశేషుడని, ఎలుకను వినాయక వాహనమని, కుక్కను కాలభైరవుడని, పందిని వరాహ అవతారమని, నందిని శివ వాహనమని, దున్నను యముని వాహనమని, ఆవును గోమాత అని పూజిస్తూ వాటికి నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ తోటి మనిషి దగ్గరకు జరిగితే అంటరాని వాడని, చూడరాని వాడని, వినరాని వాడని అసహ్యించుకోవటానికి హైందవులకు కారణమేమిటి? జంతువును ప్రేమించి మనిషిని ద్వేషించే స్వభావం ఉన్న మతం మానవీయ మతమేనా? మానవుని, మానవ సంస్కృతిని అవమాన పర్చి మనుషుల్ని తరిమికొట్టే ఈ సంస్కృతిని ప్రశ్నించకుండా మతమార్పిడి విషయంలో హాహాకారాలు చేస్తున్న వారిని ఏమనాలి? 

హిందూ పుల్లిగాడు ఫిలిప్స్‌గా మారితే భూమి బద్దలౌతుందా అని ప్రశ్నించే డా.గోపీనాథ్ గారికి సమాధానం ఏది? దళితుల్ని, ఆదివాసుల్ని, గిరిజనుల్ని జంతువు కన్నా హీనంగా చేసి ఆనందించిన వ్యవస్థ, ఎవరో వచ్చి మనిషిగా గుర్తించి, తిండి, వైద్యం, చదువు, గౌరవం కల్పిస్తే గగ్గోలు పెట్టడం వెనుక అంతరార్థం ఏమిటి? మతం అయితేనేం, మానవత్వమే కదా! మేము ఈ దేశ మూల వాసులం. మాకు ఇష్టమున్న మతంలోకి స్వేచ్ఛగా మారడం మా హక్కు. అడగడానికి ఓ విదేశీయుడికి, విజాతీయుడికి హక్కులేదు. 

- దొమ్మటి ప్రవీణ్‌కుమార్
దళిత శక్తి    Andhra Jyothi Telugu News Paper Dated 11/12./2011

No comments:

Post a Comment