కెనడా అయినా, ఇంగ్లండ్ అయినా, ఇండియా అయినా కరడు కట్టిన పురుషాధిక్య పోకడ ఒకేలా ఉంటుందని రాష్ట్ర డిజిపి వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. గత ఏడాది జనవరి 24న కెనడాలో మైఖేల్ సాంగ్వినెట్టి అనే పోలీసు అధికారి "బాధితులు కాకుండా ఉండాలంటే మహిళలు వేశ్యల మాదిరిగా దుస్తులు ధరించటం మానాలి'' అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపాయి. 'స్లట్‌వాక్' పేరిట వేలాది నిరసన ప్రదర్శనలు జరిగాయి. మన దేశంలో కూడా ఢిల్లీ, బెంగుళూరు వంటి చోట్ల 'బేషర్మి మోర్చా' ప్రదర్శనలు నిర్వహించారు.
అయినప్పటికీ, ఈ పురుషాధిక్యత భావజాలం కంపుకొడుతున్న డ్రెయినేజీలా ప్రవహిస్తూనే ఉంది. డిజిపి వ్యాఖ్యలు రెండు ప్రధానమైన ఆలోచనలను లేవనెత్తుతున్నాయి. మహిళల వస్త్ర ధారణపై తీవ్ర అభ్యంతరకమైన దృష్టి కోణం ఒకటికాగా, పోలీసు యంత్రాంగం బాధ్యతలనే విస్మరిస్తున్న అంశం మరొకటి. బాధితులనే నిందితులను చేసి బోనులో నిలబెట్టిన విధంగా అత్యాచారాలకు ఆడవాళ్ళే కారణమని చెప్పటం కొత్తేమీ కాదు. కుళ్ళిన పురుషాధిక్య బుద్ధితో పలువురు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
ఆడదాని శరీరం తమ ఆనందానికి, అనుభవానికి మాత్రమే అస్తిత్వంలో ఉందని నమ్మే వక్రదృష్టి ఇంకా ఇటువంటి చాలా మాటలే పలికిస్తుంది. అత్యాచారం అనేది ఒక ఆడదాని పట్ల ఉండే చులకన భావానికి, లోకువకు నిదర్శనం. నచ్చిన స్త్రీని అనుభవించడానికి తనకు అధికారం ఉందని మూర్ఖంగా నమ్మిన ఒక 'మృగాడు' చేసే హేయమైన పనే అత్యాచారం.
ఆ నచ్చిన ఆడది ఒక పసిబాలిక కావచ్చు, పండు ముసలిదీ కావచ్చు. వీరు తమ ఏ వస్త్రధారణ ద్వారా రెచ్చగొట్టారని వీరిపై అత్యాచారాలు జరుగుతున్నాయి? పొట్టకూటి కోసం పొద్దస్తమానం పనిచేసుకునే కూలీలు ఏం కురచబట్టలు వేసుకున్నారని వారిని రేప్ చేస్తున్నారు? పాఠశాలల్లో, కళాశాలల్లో, హాస్టళ్లలో విద్యార్థినులపై అత్యాచారాలు, అకృత్యాలు వారి తప్పేనా? వారి వస్త్రధారణ సరిగా లేకపోవటమేనా?
అత్యాచారాలు జరగటానికి మగవాడిలోని జంతు ప్రవృత్తి, నాగరికత సంతరించుకోని పశుప్రవృత్తి; స్త్రీని ఒక బొమ్మగా తప్ప, ఒక సంపూర్ణమైన, స్వతంత్రమైన వ్యక్తిగా చూడలేని పురుషాధిక్య పోకడలు ప్రధాన కారణాలు కాగా, ఇందుకు బాధితులైన స్త్రీలనే నిందించటం మాటలతో వర్ణించలేని బాధ్యతా రాహిత్యం అని చెప్పకతప్పదు. ఇదే లాజిక్‌ని ఇతర పరిస్థితులకు కూడా వర్తింపచేసుకుంటే ఇక మనకు పోలీసు యంత్రాంగంతో పనే ఉండదు. బ్యాంకులు దోచుకోబడటానికి కారణం బ్యాంకుల్లో డబ్బుండటం.
బ్యాంకుల్లో డబ్బు పెట్టటం బ్యాంకు వాళ్ల తప్పు. ఆ విధంగా బ్యాంకులో డబ్బు పెట్టుకుని బ్యాంకు వాళ్లు దొంగలని రెచ్చగొట్టారు! ఇళ్లల్లో దొంగతనాలు జరగడానికి కారణం ఇళ్ల యజమానులే. తలుపులు బలమైనవి బిగించుకోక వాళ్లే దొంగలకి అవకాశం ఇచ్చారు. వరకట్న మరణాలకు ఆహుతి అయిన భార్యలదే అసలు తప్పు. భర్తల ధనదాహాన్ని తీర్చకుండా, వాళ్లే భర్తలను, వారి తల్లిదండ్రులను రెచ్చగొట్టారు. మొగుళ్లు పెళ్లాలని కొట్టడానికి కూడా పెళ్లాలే కారణం. తమని కొట్టేలా మొగుళ్లని రెచ్చగొట్టింది పెళ్లాలే. కాబట్టి గృహహింసకి ఆడవాళ్లే కారణం.
అత్యాచారాల నుంచి, హత్యల నుంచి, శారీరక హింస నుంచి ఆడవాళ్లు తమని రక్షించుకోవాలంటే, పలువిధాలుగా మగవాళ్లని రెచ్చకొట్టకుండా జాగ్రత్త పడాలన్న మాట. ఇంకా ఈ వ్యాఖ్యలో ఏమంటున్నారంటే, పల్లెటూళ్లలో అమ్మాయిలు కూడా సల్వార్ కమీజులు, చుడీదార్‌లు వేసుకుంటున్నారట! మరి అమ్మాయిలు ఏం వేసుకోవాలని శెలవిస్తారో. వంటి నిండుగా ఉండి, హుందాగా ఉండే సల్వార్ కమీజులు, చుడీదార్‌లు మన వక్రదృష్టికి అభ్యంతరకరంగా ఉన్నాయే! మగవాళ్లు లాగులతో, లుంగీలతో దర్జాగా తిరగొచ్చన్న మాట.
అంతేకాదు. పోలీసు యంత్రాంగం అవసరాన్ని, ఉపయోగాన్ని, అసలు ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి ఈ వ్యాఖ్యలు. అదనపు కట్నం కోసం భార్యను చంపితే పోలీసులు మటుకు ఏం చేస్తారట! ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటే, అది పోలీసుల వైఫల్యమెలా అవుతుందిట!! అదనపు కట్నం కోసం, ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటే వారి అత్యాశతోనే జరుగుతాయట. పోలీసులు అందులో చేయగలిగిందేమీ లేనప్పుడు ఇక పోలీసు యంత్రాంగం ఉపయోగమేమిటి? లక్షలాది మంది సిబ్బంది, అధికారులు, కోట్లాది రూపాయల బడ్జెట్‌లు ఎందుకోసం? ప్రతి ఏటా వేలాది మంది రిక్రూట్‌మెంట్లు ఎందుకు? ప్రతి నేరానికి బాధితులే కారణం అని సరిపెట్టుకుంటే, ఇక పోలీసు వ్యవస్థ ఉపయోగం ఏముంది?
ఇంటెలిజెన్స్ వ్యవస్థ నేరాలపై నిఘాకు కాకుండా, రాజకీయ జోస్యాలకే పరిమితమైంది. నిఘా ద్వారా నివారణా పద్ధతుల ద్వారా, శిక్షల ద్వారా నేరాలను, హత్యలను అత్యాచారాలను అదుపు చేయనప్పుడు పోలీసు వ్యవస్థ ఉనికికి అర్థం ఏముంది? ఏ నేరం జరిగినా, అందుకు మా పూచీ లేదనే బాధ్యతా రాహిత్యం పోలీసు యంత్రాంగంలో నరనరాన జీర్ణించుకుని పోయింది. జిల్లా స్థాయిలో కాని, రాష్ట్ర స్థాయిలో కాని జరిగే సమీక్షా సమావేశాలకు పోలీసుశాఖని మినహాయించటం వల్ల జవాబుదారీతనం పూర్తిగా అదృశ్యమైపోయింది.
మంత్రులు, కలెక్టర్లు, ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ కమిషనర్‌లు తదితరులు పాల్గొనే ఏ సమీక్షా సమావేశంలో పోలీసులు పాల్గొనరు. ఎవరికీ జవాబుదారీ కాదు. వారి వైఫల్యాలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదు. అమెరికాలో, ఇంగ్లాండులో పోలీసులు ఆ నగర మేయర్లకు జవాబు దారీగా ఉంటారు. అసలు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ (పోలీస్ చీఫ్) నియామకమే ఎన్నిక ద్వారా జరుగుతుంది. మనదేశంలో ఏ ప్రజాప్రతినిధికీ పోలీసులు జవాబుదారీ కాదు. మరి మన పోలీసు వ్యవస్థ అమెరికా, ఇంగ్లాండ్‌ల కంటే మెరుగ్గా ఉందని మనం చెప్పగలమా?
ప్రజాస్వామిక వ్యవస్థలో అధికార వ్యవస్థ ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా వ్యవహరించాలి. మన దేశంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎస్.సి, ఎస్.టి, బి.సి.లతో పాటు మహిళలను కూడా అణగారిన వర్గాలుగా భావించి వారిపట్ల ప్రత్యేక రక్షణలు ఏర్పాటు చేయాలి. అందుకు ముందుగా మారాల్సింది మైండ్‌సెట్. పోలీసు యంత్రాంగం తలచుకుంటే, మహిళలపై అత్యాచారాలను, వరకట్న హత్యలను, గృహ హింసను చక్కగా అదుపు చేయగలదు. ప్రజలందరి రక్షణ బాధ్యతలను భుజస్కందాలపై మోస్తున్న పోలీసు యంత్రాంగం ఆ బాధ్యతకు తగినట్లుగా, సరైన దృష్టితో, దృక్పథంతో, కఠిన కార్యాచరణతో వ్యవహరిస్తేనే పోలీసు శాఖ ఉనికికి అర్థం.
- సుజాత గొట్టిపాటి
Andhra Jyothi News Paper Dated 01/01/2012
No comments:
Post a Comment