Tuesday, December 20, 2011

విభజనే సామాన్యుని కామన


తెలంగాణ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. ఎమ్మెల్యేల రాజీనామాలూ అంగీకరించడం లేదు. ప్రతి ఉప ఎన్నికలో తెలంగాణ వాదం పెల్లుబికింది. ప్రజాభిప్రాయం జునాగఢ్ మాదిరి పలుమార్లు వచ్చింది. ప్రభుత్వం దగ్గర సాకులు చెప్పటానికి ఇంకా ఏమీ మిగలలేదు. ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారా లేక రాజ్యాంగంలోని మూడో అధికరణం ప్రకారం ముందుకుపోతారా? తేల్చుకొమ్మని సామాన్యుడు కోరుతున్నాడు. 

ఇండియా అంటే భారత్ అని, రాష్ట్రాల 'యూనియన్' అని, మన రాజ్యాంగంలోని మొట్టమొదటి అధికరణం స్పష్టం చేసింది. అంటే ఈ దేశపు అఖంఢత్వం ప్రకృతి అంత ప్రాచీనమయినది. భారతదేశం ఒక భౌగోళిక ఏక ఖండం. అనాది కాలం నుంచి ఈ భౌగోళిక ఖండం లోపల, ఖండమంతటినీ ఆవరించి ఒక సాంస్కృతిక ఏకత్వం ఉన్నది. రాజకీయ జాతి విబేధాలను ధిక్కరించి నిలిచిందీ సాంస్కృతిక ఏకత్వం. భారతదేశపు ప్రాథమిక ఏకత్వం వేరు, పాలనాంశం వేరు. అందుకే భారత్ అంటే రాష్ట్రాల కూడిక అని మన పెద్దలు నిర్వచించారు. 

వెంటనే రెండు, మూడు అధికరణాలలో కొత్త రాష్ట్రాల స్థాపన గురించి, కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి, వాటి భూభాగాలను పెంచడానికి, పేర్ల మార్పిడికి సంబంధించిన అంశాలను సవివరంగా మన రాజ్యాంగం విశదీకరించింది. 2 ఎ అధికరణకు సవరణ (ఇది 35వ రాజ్యాంగ సవరణ) ద్వారా 1975లో 'సిక్కిం'(చోకియా), మన దేశంలో ఒక రాష్ట్రంగా విలీనమయింది. 'బెరుబారి-యూనియన్'ను పాకిస్తాన్‌కు 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బదలాయించారు. అంటే రాష్ట్ర భూభాగాలను తగ్గించడంలోను, ఒక ప్రాంతాన్ని విదేశాలకు బదిలీ చేయడంలోను కేంద్రానికి గల అధికారం పార్లమెంట్ సాధారణ చట్టాల ద్వారా సమకూరలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగ సవరణ తప్పనిసరి అయింది. 

అయితే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని మూడవ అధికరణం స్పష్టం చేస్తుంది. ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకొని పార్లమెంట్‌లో ఏ సభలోనైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని తప్పనిసరిగా పరిగణనలోనికి తీసుకోవలసిన అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు సాధారణ మెజారిటీతో ఆమోదించబడుతుందనేది ప్రధానమైన అంశం. 

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పేరిట అధికారంలోకి వచ్చిన యు.పి.ఏ. ప్రభుత్వం కన్సెన్స్‌స్ - కాంకరెన్స్ - కన్సల్టేషన్స్ కావాలని అంటోంది. ఈ విషయమై యూపీఏ మొదటి ప్రభుత్వం వివిధ ప్రయోగాలు చేసింది. యు.పి.ఏ. రెండో ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 2009 డిసెంబరు 9న భారత ప్రభుత్వం తరపున హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని ప్రకటించారు. ఆ మేరకు పార్లమెంట్‌లోని ఉభయసభలలో స్పష్టమైన ప్రకటన చేసిన కేంద్ర హోం మంత్రి మళ్ళీ పిల్లిమొగ్గలు వేయడం ప్రారంభించారు. 

బక్రీదు పండుగ తరువాత స్పష్టమయిన ప్రకటన వెలువడుతుందని మంత్రులు ప్రకటిస్తే 'ముబారక్ బాత్' ఉంటుందని అనుకుంటే చివరికి తెలంగాణ ముర్దాబాద్ అనేదే ధ్వనిస్తుంది. పార్లమెంట్ సమావేశాల్లోనే కేవలం అభివృద్ధి మండళ్ళను ప్రకటిస్తారనే పుకార్లు వస్తున్నాయి. ఇది విశ్వాసఘాతుకం, రాజ్యాంగ ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. రాజ్యాంగంలో మొట్టమొదటే, భారతదేశాన్ని 'యూనియన్'గా పేర్కొన్నారు. సమాఖ్య అన్న పదాన్ని చేర్చలేదు. 

పరిపాలనా సౌలభ్యానికి రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా కలిసి మెలిసి ఆప్యాయంగా ఉండే అవకాశం ఉంటుంది. తెలంగాణ అంటే 1948 తెలంగాణ కాదు. ఇతర ప్రాంత ప్రజలతో పాటు కోస్తా, రాయలసీమ, తెలంగాణ బిడ్డల సమాహారం నేటి తెలంగాణ. ఇది సమైక్య తెలంగాణ, కొంపలు మునిగే పరిస్థితి లేదు. రాజ్యాంగంలో అరటిపండు ఒలిచినట్లుగా పేర్కొన్నా దాన్ని కావాలని కొందరి కోసం అందరినీ బలిచేస్తున్నారు. 

వార్తలలో వస్తున్న ప్రాంతీయ మండళ్ళ ప్రయోగం కొత్త ఏమీ కాదు. గతంలో ప్రాంతీయ కమిటీలతో పాటు, పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు స్రూతాల పథకం అన్నీ విఫలమయి ఒక్క తెలంగాణ ఏర్పాటు తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదు. తరతరాలుగా చేస్తున్న ఉద్యమాన్ని, వందలాది యువజనుల బలిదానాలను కాలరాస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. మాయావతి ప్రతిపాదించిన ప్రకారం ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం, ప్రత్యేక తెలంగాణ వాదానికి మరింత బలం చేకూర్చుతుంది. 

అయితే రెండవ ఎస్సార్సీ ద్వారానే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలని, కాబట్టి తెలంగాణ ఏర్పాటు జాప్యమవుతుందని, రాష్ట్ర శాసనసభలో తీర్మానం కావాలని వీళ్ళీ వాదన మొదలుపెడుతున్నారు.రాష్ట్ర విభజనకు శాసనసభ తీర్మానం చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇక రెండవ ఎస్సార్సీ ప్రతిపాదన అంటే తేనెతుట్టెను కదిలించినట్టే అవుతుంది. న్యాయానికి ఏ కోశాన ఆ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని ఎన్.డి.ఏ. ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడే స్పష్టం చేయడం జరిగింది. మనకు స్వాత్రంత్యం వచ్చే సమయానికి నేరుగా బ్రిటీష్ ప్రభుత్వ నియంత్రణలో వున్న ప్రాంతాలు, బ్రిటీష్ సార్వభౌమాధికారం క్రింద పనిచేస్తున్న సంస్ధానాలు ఉన్నాయి. 

కాబట్టి ఫజల్ అలీ కమిషన్ నేతృత్వంలో మొదటి ఎస్సార్పీ తప్పనిసరి అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడిది? ఎస్సార్సీ సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదని తెలంగాణ విషయంలో తొలి ఎస్సార్సీ అనుభవం చెబుతుంది. ఆ నివేదికలోని 100వ పేజీ నుంచి 111వ పేజీ వరకు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా వుండాలని చెప్పింది. కాని తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టారు. 

మొదటి ఎస్సార్సీ తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఏర్పడే విషయం గురించి చెప్పలేదు. నెహ్రూ గారు భాషాప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించారు. దీన్నే 1947లో ఏర్పాటయిన థార్ కమిషన్ కూడా ఈ అభిప్రాయాన్ని బలపరిచింది. కేవలం భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలు ఏర్పాటు చేయడాన్ని తిరస్కరించింది. అసలు 28వ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పాటు అయ్యేంతవరకు లేని అభ్యంతరాలు కేవలం తెలంగాణ కోసం ఉండడాన్ని తీవ్రంగా పరిగణించే తెలంగాణ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మొదటి ఎస్సార్సీ చెప్పినా... ఉద్యమాలు ఉధృతమైనా, 9 డిసెంబర్ ప్రకటన చేసిన తరువాతనైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ప్రజలు ఏంచేయాలని తొలుస్తున్న ప్రశ్న. హైకమాండ్ ఢిల్లీలో లేదని ఇక్కడ ఉద్యమిస్తే, ఈ ప్రజలే హైకమాండ్‌గా నిలుస్తారని 9 డిసెంబర్ నాటి ప్రకటన స్పష్టం చేస్తుంది. అందుకే తెలంగాణకు చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు ఏ విధంగానయినా రాజీనామాలను ఆమోదింపచేసుకొని రాబోయే ఉప ఎన్నికల బరిలో దిగితే, యు.పి.ఏ. దిగిరాక తప్పదు. 

ఈనాడు తెలంగాణ ప్రజల ముందు ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరించి - నైతిక విలువలను కాలరాచి బోనులోపల ఎక్కి బిక్కుబిక్కు మంటుంది. బయటపడాలంటే ఒకటి 1956 నాటి ఫజల్ అలీ కమిషన్ నివేదిక ప్రకారం, తెలంగాణ శాసనసభ్యుల అభిప్రాయం తీసుకోండి, రెండవది జునాగఢ్ పరిస్థితే ఈనాడు తెలంగాణకు దాపురించింది. నాటి 552 స్వదేశీ సంస్థానాలలో కేవలం కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు విలీనాన్ని వ్యతిరేకించాయి. చివరికి హైదరాబాద్, కాశ్మీర్ భారత్‌లో విలీన ఒప్పందం ద్వారా అంతర్భాగమయ్యాయి. కాని జునాగఢ్ రాజు పారిపోవడం వల్ల విలీన ఒప్పందంపై సంతకం చేసేవాడు లేకుండా పోయాడు. 

కాబట్టి ప్రజాభిప్రాయం ద్వారా జునాగఢ్ భారత్‌లో విలీనమయింది. ఈ విధంగా కలిసిన సంస్థానం ఇదే మొదటిది, చివరిది కూడా ఇదే! తెలంగాణ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పలాయనం చిత్తగించింది. ఎమ్మెల్యేల రాజీనామాలు కూడా అంగీకరించడం లేదు. ప్రతి ఉప ఎన్నికలో తెలంగాణ వాదం పెల్లుబికింది. ప్రజాభిప్రాయం జునాగఢ్ మాదిరి పలుమార్లు వచ్చింది. ప్రభుత్వం దగ్గర సాకులు చెప్పటానికి ఇంకా ఏమీ మిగలలేదు. ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారా... ఆర్టికల్ మూడు ప్రకారం ముందుకు పోతారా... తేల్చుకొమ్మని అతి సామాన్యుడు కోరుతున్నాడు.
- సిహెచ్. విద్యాసాగర్‌రావు
కేంద్ర మాజీ మంత్రి   Andhra Jyothi News Paper Dated 20/12/2011

No comments:

Post a Comment