Wednesday, December 21, 2011

విద్యా హక్కు పరినక్షణ ఉద్యమ పరిణామం



విద్యాహక్కు పరిరక్షణ ఉద్యమం జాతీయ స్థాయి లో నిర్మించడంలో చాలామంది పాత్ర ఉన్నా ఇందులో అనిల్ సద్‌గోపాల్ పాత్ర చాలా కీలకమైంది. ఆయన జీవితం విద్యారంగానికే పెద్ద ప్రయోగం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్య ఎలా జరపాలి. పాఠ్య బోధన ఎలా జరగాలి. ఎలా ప్రశ్నించాలె. ఎవరివైపు నిలబడాలి అన్న అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇప్పటి ఉపాధ్యాయ లోకానికి ఆయన రోల్ మాడల్. 

అనిల్ సద్‌గోపాల్ అమెరికాలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుంచి బయోకెమిస్ట్రీ లో డాక్టరేటు పట్టా పొందారు. ఆయన చేసిన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆ కాలంలోనే ఒక నోబెల్ బహుమతి గ్రహీత బాంబే నగరానికి వచ్చినప్పుడు భారత దేశానికి అతని సలహా సహకారాలు కావాలని ముఖ్యంగా బయోకెమిస్ట్రీ రంగానికి ఆయన మార్గదర్శకత్వం కావాలని కోరినప్పుడు, అనిల్ సద్‌గోపాల్ లాంటి శాస్త్రవేత్తలు ఉండగా తమ లాంటి వాళ్ళ అవసరమెందుకు అని అని ఆయన జవాబిచ్చారు. ఈ రంగంలోనే అనిల్ కృషి కొనసాగిస్తే చాలా మౌలికమైన, విలువైన పరిశోధన చేసేవారే. ఆయన పరిశోధన కోసం టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చిలో చేరాక గ్రామీణ పిల్లలకు సైన్స్ ఎలా బోధించాలనే ప్రయోగం చేయాలని భావించి, మధ్యవూపదేశ్‌లో చాలా ఏళ్ళు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం గురించి చదివిన వారికి అది ఎంత గొప్పదో తెలుస్తుంది. 

గ్రామీణ పిల్లలకు మౌలికమైన సైన్స్ అంశాలు బోధించేటప్పుడు ప్రతి భావనను పిల్లవాడి చుట్టూ ఉండే పరిసరాల దృష్ట్యా అతని జీవిత అనుభవం ఆధారంగా చెప్పాలని గణిత శాస్త్ర బోధన కూడా అలాగే జరగాలని భావించి, పిల్లలను ఒక కాన్‌సెప్ట్ గురించి అడిగి, వాళ్ళు గందరగోళానికి గురైనప్పుడు, పిల్లలు చూసిన ఒక దృశ్యాన్ని గురించి అడిగి, ఈ సైన్స్ భావనకు ఆ దృశ్యానికి సంబంధాన్ని పిల్లలకు వివరించడంలో పిల్లలు పొందిన అనుభవాన్ని గురించి ఆయన రచనల్లో ప్రస్తావించారు. వాస్తవం నుంచి ఊహలోకి, ఊహ నుంచి వాస్తవం లోకి ప్రయాణం చేయడమే విజ్ఞానార్జన అని ఆయన పూర్తిగా విశ్వసిస్తారు. ఒకసారి నేను బాలగోపాల్‌తో ప్రయా ణం చేస్తున్న సందర్భంలో చాలా నాగరికతలలో, భిన్న సమాజాలలో తొమ్మిది అంకె లే ఎందుకు ఉన్నాయో చెబు తూ మనుషులు ఆదిమ స మాజాలలో వేళ్ళ మీద లెక్కించడం వల్ల తొమ్మిది అంకెలు వచ్చి ఉంటాయని అన్నాడు.

అంటే మన పాఠశాల విద్యలో టెక్స్ట్‌బుక్ రావడంతో ఉపాధ్యాయుడు ఆ పుస్తకం మీద ఆధారపడి బోధన చేయడంతో అనుభవమూ, పరిసరాలు, పిల్లల సహజ తెలివితేటలు మరుగున పడి చదువు ఒక యాంత్రికమైన ప్రక్రియగా మారింది. ఈ అంశం కుటుంబరావుగారి ఆత్మకథ చదువులో చాలా గాఢంగానే వివరించబడింది. అనిల్ చేసిన ఈ ప్రయోగం ఎందుకో మన విద్యావ్యవస్థలో భాగం కాలేకపోయింది. ఇలాంటి విద్యాబోధన మాతృభాషలో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన నమ్ముతారు. చాలా మంది విద్యావేత్తలు దీనిని ఒప్పుకోవడం లేదు. 

సద్‌గోపాల్ మధ్యవూపదేశ్‌లో చేసిన ప్రయోగంలో వినాయక్‌సేన్ కూడా భాగస్వామి. శంకర్‌గుహ నియోగి ప్రభావం వీరిపైన ఉంది. ఎంత ఉందంటే నియోగి ప్రారంభించిన షహీద్ హాస్పిటల్‌లో పనిచేయడానికివినాయక్‌సేన్ వెళ్ళారు. తరువాత వినాయక్ సేన్ సాహస ప్రయాణం గురించి తెలిసిందే. అలాగే సద్‌గోపాల్‌కు, టాటా సంస్థకు భేదాభిప్రాయాలు రావడంతో సైన్స్ బోధనా ప్రయోగానికి స్వస్తి చెప్పి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా చేరారు. నిజానికి ఆయన చేసిన బోధనా ప్రయోగాన్ని గుర్తించే విద్యాబోధనా శాస్త్రశాఖలో ఆ పదవి ఇవ్వడం జరిగింది. తరువాత కాలంలో శంకర్‌గుహ నియోగి జీవితం గురించి ఆయన చేసిన అపూర్వ కార్మికోద్యమాన్ని గురించి దాదాపు ఐదు వందల పేజీల పుస్తకాన్ని హిందీలో రచించారు. 

ఆయన జాతీయ స్థాయిలో భిన్నమైన విధాన నిర్ణయ సంస్థలో సభ్యుడిగా పనిచేశారు. ఈ క్రమంలో విద్యాహక్కు చట్టం రూపొందించడానికి నియమించిన కమిటీలో కూడా సభ్యుడే ఈ చట్టం రూపొందించే క్రమంలోనే పాలకులకు ఆయనకు మౌలిక రంగాల పట్ల విభేదాలొచ్చాయి. దేశంలోని పిల్లలందరికి విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నప్పుడు కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని , ఒక నివాసంలో ఉంటున్న పిల్లలందరు ఒకే బడికి వెళ్లాలని పిల్లలందరికి ఉచితంగా వాళ్ల ఆర్థికస్థోమతతో సంబంధం లేకుండా న్యాయమైన విద్యను అందించేలా చట్టాన్ని రూపొందించాలని , విద్యను మాతృభాషలోనే బోధించాలని, ప్లిలల వయసును 0-18గా నిర్వచించాలని, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్య భావనను రద్దు చేసి మొత్తం విద్యావ్యవస్థను ప్రజా వనరులతో నడపాలని ప్రతిపాదించారు. తాను ఎంత వాదించినా పాలసీ నిర్ణేతలు అంగీకరించక పోవడంతో తన నిరసనను వ్యక్తీకరిస్తూ కమిటీనుంచి బయటకు వచ్చారు.

చట్టంలో ఈ ప్రధాన అంశాలు చేర్చాలని ఇతర సభ్యుల మద్దతు కొరకు తాను ఎలా ప్రాధేయపడ్డాడో ఒక వ్యక్తిగత సంభాషణలో చాలా వివరంగా చెప్పాడు. ఈ దేశ విద్యా వంతుల గురించి, మేధావుల గురించి అధికారానికి వాళ్లు ఎట్లా దాసోహమౌతారో చాలా బాధతో వివరించారు. ఈ దేశంలోని ఈ తరం పిల్లలందరికి కామన్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే దృక్పథాన్ని ప్రజల దగ్గరకు తీసుకు పోవాలని, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలని సంపూర్ణంగా విశ్వసించి విద్య హక్కు పరిరక్షణకు జాతీయ స్థాయిలో ప్రయత్నం ప్రారంభించాడు. నూతన ఆర్థిక విధానం దేశ పునాదుల మీద, జాతి జీవన విధానం మీద, నాగరికత మీద దాడి చేస్తున్న సందర్భంలో నిరాశలో కూరుకుపోతున్న వ్యవస్థకు కొత్త విశ్వాసాన్ని , ప్రత్యామ్నాయాల్ని ఇవ్వాలన్న దృఢ దీక్షతో ఉద్యమ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఇలాంటి విశ్వాసాలు ప్రస్తుతం నుంచి రావు, అవి ఎప్పుడూ భవిష్యత్తు మీద విశ్వాసంతోనే వస్తాయి. 

మన రాష్ట్రంలో 1985-86 లోనే నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యాపరిరక్షణ కమిటీ ఎస్‌యుసిఐ సంస్థ చొరవతో ప్రారంభమయింది. ఈ కమిటీకి చాలా కాలంగా జస్టిస్ చిన్నపడ్డి అధ్యక్షులుగా, డా. జయశంకర్, వావిలాల గోపాల కృష్ణయ్య, డా. విఎస్ ప్రసాద్, ప్రొ. చక్రధర్‌రావు, ప్రొ. డి. నర్సింహాడ్డి లాంటి ప్రముఖులతో ఏర్పడింది. ఈ కమిటీ అప్పటినుంచి నిరంతరంగా పనిచేస్తూనే ఉంది. నూతన విద్యావిధాన చట్టంతో ప్రారంభమైన ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నది. ఈ ఉద్యమం ఒక ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని కూడా ప్రచురించింది. దీంట్లో వివిధ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు భాగస్వామిగా ఉన్నారన్నది ఇంతకుముందే ప్రస్తావించాను. ఈ ఉద్యమం ఏం సాధించిందో కచ్చితంగా చెప్పలేం కానీ విద్యాపర చర్చను సజీవంగా ఉంచింది.

చంద్రబాబు సామాజిక శాస్త్రాలతో ప్రయోజనం లేదని అన్నప్పుడు పెద్ద ఎత్తున విద్యారంగాన్ని తట్టిలేపి సామాజిక శాస్త్ర అధ్యాపకుల భాగస్వామ్యంతో ఉద్యమించి , ప్రభుత్వం తన ప్రకటనను వెనక్కి తీసుకునేలా పోరాటం చేసింది. అనిల్ సద్‌గోపాల్ జాతీయ స్థాయి లో ఉద్యమం ప్రారంభానికి హైదరాబాద్‌లోనే బీజాలు పడ్డా యి. 2009లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సు (ఆల్ ఇం డియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్) ఏర్పడింది. రెండు సంవత్సరాలలో ఉద్యమం 16 రాష్ట్రాలకి పాకింది. ఈ విస్తరణకు అనిల్ సద్‌గోపాల్ చేసిన కృషి ఎంతో విలువైనది. తన ఆరోగ్యం బాగాలేకున్నా గంటల తరబడి వాదిస్తాడు. ఉపన్యసిస్తాడు. ఆయనలో అలసట కనిపించదు. ఒక సంవత్సరం క్రితం ఢిల్లీలో మార్చ్ టూ పార్లమెంట్ నిర్వహించినప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా దారి వెంట నినాదాలిచ్చారు.

ఒక యువకుడిలో ఉండే ఉత్సాహం, పట్టుదల, తాను పాల్గొంటున్న ఉద్య మం పట్ల, లక్ష్యం పట్ల రాజీలేని విశ్వాసం ఆయనలో కనిపిస్తాయి. ఈ పట్టుదలను ఇతరులతో పంచుకుంటూ ఎప్పుడూ నాయకుడుగా కనిపించకుండా కేవలం చాలా సాధారణ కార్యకర్తలా పనిచేస్తూ అందరి మధ్య పనిచేయడం చూస్తే.. బాలగోపాల్ పనిచేసే విధానమే కనిపిస్తుంది. విద్య విధ్వంసం అవుతున్న కాలంలో విద్యా పరిరక్షణ ఉద్యమంలో అనిల్ సద్‌గోపాల్‌తో పనిచేడం ఒక గొప్ప అనుభవమే.

ప్రొఫెసర్ హరగోపాల్
Namasete Telangana Dated 23/12/2011

No comments:

Post a Comment