Thursday, December 29, 2011

విషకన్యలూ, ఉద్యమ వైఫల్యాలూ - కంచ ఐలయ్య



కౌటిల్యుడు 'అర్థశాస్త్ర' గ్రంథంలో పాలకులు ప్రభుత్వాలను కాపాడుకునేందుకు ఏ నీతినైనా ప్రయోగించవచ్చు అన్నాడు. శత్రువును యుద్ధంలో నేరుగానైనా చంపవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే విందుకు పిల్చి విషకన్యను ఉపయోగించైనా చంపవచ్చు అన్నాడు. కౌటిల్యుడు చనిపోయాక మూడు వందల ఏండ్లకు జీసస్ పుట్టి శత్రువు ఈ చెంపపై కొడితే ఆ చెంప కూడా చూపు అన్నాడు. ఈ వాక్యం చదివే లియో తోలొస్తాయ్, జాన్ రస్కిన్‌లు అహింసా పోరాటాల తాత్వికతను రూపొందించారు. ఈ రెండో సిద్ధాంతంతో ఈ దేశంలో ఏమీ సాధించలేము అని అంబేద్కర్‌ను అంటరానివాళ్లుగా చూసినోళ్లు, గాంధీని చంపినోళ్లు నిరూపించారు. కౌటిల్య నీతి రెండు కాళ్లతో కాదు నాలుగు కాళ్లతో నడుస్తున్న దేశం మనది. 

వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీసస్‌ను ప్రార్థించినా, కౌటిల్యుణ్ణి ప్రేమించాడు. ఆయన రాజ్యాన్ని కొల్లగొట్టి జీసస్ మీద గౌరవంతో కొంత ప్రజలకు పంచాడు కానీ కౌటిల్యునిపై ప్రేమతో ఎక్కువ ధనం కుమారుడికి ఇచ్చాడు. వై.ఎస్. ప్రార్థించిన ప్రాఫెట్ విలువలకు, తాను ప్రేమించిన సంపాదన నీతి విలువలకు పెండ్లి కుదరకనో ఏమో ఆయన ఆకాశంలోనే అంతమయ్యాడు. ఆయన స్థానాన్ని ఆక్రమించాలని కుమారుడు, తండ్రి ఇచ్చిన ధనబలంతో రంగంలోకి దూకాడు. 2009 డిసెంబర్ 9 నాటికే ప్రభుత్వాన్ని పడగొట్టి తెలుగునాట రాజ్యాధికారాన్ని తన్నుకపోయే స్థితిలో ఉన్నాడు. నేను వేరే చోట చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్లు (మూడు ప్రాంతాల వారు కూడా) నయా క్షత్రియులు. 

కౌటిల్యుని గురించి వారు చదివినా చదవకపోయినా ఆయన విలువలే వారికి ప్రాణం. డబ్బు, అధికారం ఎలాగైనా సంపాదించాలనే శక్తులు వారిలో చాలా ఎక్కువ. వీరినెలా హ్యాండిల్ చేయాలో బాగా అర్ధం చేసుకున్నది లివింగ్ కౌటిల్య ప్రణబ్ ముఖర్జీ. ఆయనకూ, హార్వర్డ్ విద్యావేత్త చిదంబరానికి చాలా వైరుధ్యాలు ఉన్నప్పటికీ తెలుగు వారిని (తెలుగు నీతిని) హ్యాండిల్ చేయడంలో ఐక్యత ఉన్నది. 

వారికి నేరుగా జగన్‌తో యుద్ధం చెయ్యడం అసాధ్యమని అర్థమైంది. జగన్‌ని మట్టికరిపించి ముఖ్యమంత్రిని కాకుండా చూడడానికి కేసీఆర్‌ను రంగంలోకి దింపారు. కేసీఆర్, ఆయన చుట్టూ ఉన్నశక్తులు విషకన్యల పాత్ర పోషించారు. డిసెంబర్ 9, 2009 నుంచి డిసెంబర్ 6, 2011న అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం గెలిచి జగన్‌ను 17 మంది ఎంఎల్ఏల నాయకుని స్థాయికి తగ్గించడానికి రెండేళ్ళ తెలంగాణ ఉద్యమం నడిపారు. టీఆర్ఎస్‌కు, దాని చుట్టూ చేరిన శక్తులకు ఏది కావాలంటే అది ఇచ్చారు. 

కౌటిల్యుని కాలంలో కూడా విషకన్యలుగా పనిచేసే వారికి రోజుకింత విషమిచ్చి వారి శరీరాలే విషమయ్యే స్థితికి తెచ్చేవారు. వీరికి విపరీతమైన ఆస్తిపాస్తులను సమకూర్చేవారు. ఆ సూత్రమే ఇక్కడ అమలు చేశారు. ఒక జేఏసీ నేర్పాటు చేసి, దాన్ని అనుసంధాన పర్చడానికి జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇండ్ల వద్దకు కుక్కలు కూడా పోకుండా కాపాడారు. 

అదే కాంగ్రెస్ నుంచి ఎస్సీ, బీసీ నాయకులు ఎంత వీరోచిత తెలంగాణవాదులుగా ఎగిరితే అంత ఎక్కువ దాడులు చేయించారు. కేశవరావు, మధుయాష్కీ, హన్మకొండ ఎంపీ రాజయ్య, మంత్రులు సారయ్య, పొన్నాల లక్ష్మయ్యల మీద జరిగిన దాడులే అందుకు మంచి ఉదాహరణలు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక టీవీ చానల్‌లో మాట్లాడిన వాక్యం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఇలా అన్నాడు "we have conducted the telangana movement without any firing a single bullet' అనే పదానికి అర్థం తెలియకుండా వాడాడని ఎవరూ అనుకోలేరు. 

ప్రభుత్వం కాల్పుల్లో ఎవరినీ చంపని మాట నిజమే కానీ దాదాపు 700 మంది యువకులు- అదీ చాలా బీదవారు-ఈ రెండు సంవత్సరాల్లో 'ఆత్మహత్యలనే హత్యల్లో' చనిపోయారు కదా! వాళ్లను చ ంపి వర్ధంతులు జరిపే సంస్కృతి కౌటిల్యుని విలువల్లో భాగంగా వచ్చిందే. ఈ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతితో వేలాది కోట్ల రూపాయలు (ఎక్కువగా అగ్రకులాల వారు) వసూళ్లతో సంపాదించారు. రాజశేఖరరెడ్డి ఉండగానే ప్రభుత్వం అప్పుడప్పుడే పుట్టిన పార్టీకి బంజారాహిల్స్‌లో భూమి ఇచ్చి పార్టీ ఆఫీస్ కట్టించింది. మావోయిస్టు పార్టీ (ఒక్క న్యూడెమోక్రసీ తప్ప) లకు ఆఫీసు కాదు కదా అడ్రస్ కూడా లేదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అటు సమైక్య, ఇటు తెలంగాణ అగ్రకుల నాయకులు ప్రజలకు ఇంత అన్యాయం చేస్తే ఈ విలువల్ని ఎలా చూడాలి? 

ఒక తెలంగాణ రాజకీయ పార్టీలో పుట్టిన విషకన్యలకు ఇప్పుడు కాంట్రాక్టులు, బ్రహ్మాండమైన భవంతులు, ఆధునాతన కార్లు వచ్చాయి. పెద్దపెద్ద కంపెనీల్లో షేర్లు వచ్చాయి. డిసెంబర్ 6న కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంలోనే ఇక 2014 వరకు పాలన గ్యారంటీ వచ్చింది. డిసెంబర్ 9, 2009 ప్రకటన, దాని తర్వాత 'రాజగోపాల రాజకీయం' ఆ తర్వాత డిసెంబర్ 23 ప్రకటన, జానారెడ్డి-జానపద 'ధూంధాం' ఆయన అనుంగు తోలుబొమ్మలతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, దీని కలెక్షన్లు, డిస్ట్రిబ్యూషన్ల పర్వం జరిగి ఉండకపోతే జగన్, కేవీపీ, రోశయ్యను రోడ్డెక్కించేవారు. 

ఇప్పుడైనా తేలింది కదా, ఈ రెండేండ్లలో తెలంగాణలో ఒక కొత్త కురుక్షేత్రాన్ని నడిపారు. ఇక్కడ పోరాట యోధులెవ్వరూ చావలేదు. 700 మంది అమాయకులు 'తెలంగాణ చెండేషియాగం'లో బలివ్వబడ్డారు. వాళ్ల తల్లిదండ్రులు గోడు, గోడున ఏడుస్తున్నారు. ఈ చెండేషియాగంలోనే 'ఫామ్‌హౌస్'లు కట్టారు. అక్కడ మహావిష్ణువులా పాముల పడకపై పడుకొని తెలంగాణ ఆడపడుచులతో కాళ్లొత్తించుకునే సంస్కృతి 'ఆడికార్లు-బోడికార్లు' (వాళ్ల భాషలోనే) ఎక్కి 'రసమయి' రాజ్యమేలే స్థితి వచ్చింది. పుస్తకాలు చదువకుండా, రచనలు చేయకుండా ప్రొఫెసర్లయినా లేదా మేధావులైన వాళ్లు అతి కొద్దికాలంలో ఆక్టర్లు కూడా అయ్యారు. 

పాఠాలు చెప్పడం మానేసి రోజు రోడ్డుమీద ఉపన్యాసమిచ్చి, విద్యార్థులకు పరీక్ష రాయకున్నా సర్టిఫికెట్లు, ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు ఇస్తామని ప్రతి నిత్యం ప్రామీజు చేశారు. ఇదొక మహత్తర పోరాట సినిమా తెలంగాణ విప్లవం డిసెంబర్ ఆరున అన్ని అందించిన కాంగ్రెస్ అసెంబ్లీలో గెలిచాక, పిల్లల చావులాగిపోయి ఇంతో, అంతో పాఠాలు జరుగుతుంటే 'ఇంకెంతకాలం' చదువులనే కొత్త సినిమాతో ముందుకొస్తున్నారు. ప్రపంచ విప్లవాలన్నీ, సినిమాలతో, చీకటి భూస్వాముల షూటింగులతో, మావోయిజం చదవడం మానేసి, దొరల మంచి గురించి రాసే వ్యాసాలతో వచ్చినట్లు కొత్త సిద్ధాంత కర్తలు చెబుతున్నారు. 

ఇటువంటి సిద్ధాంతకర్తలు చుట్టూ ఉన్నాక తెలంగాణ కాదుకదా, ప్రజలకు కనీస తెలివి, ఆత్మగౌరవం ఉండనీయరు. తెలంగాణలో అగ్రకుల మేధావులు (ఎక్కువ మంది) దళిత, బహుజనుల బతుకు బాగుపడే ఏ కార్యక్రమాల్లో పాల్గొనరు. తెలంగాణమంట చాలు అదొక బంగారు గని అయినట్లు ముందుకొస్తారు. 1956 నాటి ఉద్యమంలో గానీ, 1969 ఉద్యమంలోగాని అది అంత స్పష్టంగా అర్థం కాలేదు. ఫ్యూడల్ చెన్నారెడ్డితో పాటు, వంటి మీద బంగారం అమ్మి తెలంగాణకు ఖర్చుపెట్టిన సద్మాలక్ష్మి లాంటి నాయకురాండ్రుకూడా ఆనాడు ఉద్యమంలో ఉన్నారు. ఈనాడు ఢిల్లీ అండతో, సెక్రటేరియెట్ స్నేహంతో అమాయకులను ఆత్మహత్యల్లో చంపూ, సంపాదించు అనే సిద్ధాంతమొచ్చింది. మీటింగులు పెట్టినా సంపాదన కోసమే, బతుకమ్మలాడేది ఆ బంగారం కోసమే. 

ఈ క్రమంలో నాయకులు, మేధావులు బహుపాత్రధారులయ్యారు. ఆంధ్ర వాళ్లు కావాలనే పాడినోళ్లకు పైసలిచ్చారు. ఆడినోళ్లకు కొన్ని పైసలిచ్చారు. ఇందులో కొంతమంది ఏ ట్రైనింగ్ లేకుండానే సినిమా ఆక్టర్లు కూడా అయ్యారు. చేతినిండా పైసలుంటే అన్ని రూపాల్ని పైసలే సృష్టిస్తాయి. ఇప్పుడు తెలంగాణలో కొంత మంది మేధావులకు ఒకరోజు ఇంట్లో ఉంచి, ఒక పుస్తకం చదమన్నా, ఒక వ్యాసం రాయమన్నా జైల్లో ఉన్నంత పని అవుతాంది. రోజు రోడ్డుమీద ఒక ఉపన్యాసం, పైసలిచ్ఛైనా పదిమందిని జమచేసి, 'మనం రూపొందించిన పుష్పక విమానం'లో తెలంగాణ వస్తుందని చెప్పకపోతే రాబడిలేదే! 

ఇప్పుడు ఉద్యమం ఆగిపోయింది కనుక, చావులు తగ్గి పోయాయి. ఈ స్థితి రాబడినీ తగ్గించే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికలకు ఆంధ్రులు అంత డబ్బు ఇవ్వకపోవచ్చనే అనుమానం ఉంది. అసలే తెలంగాణ ఇచ్చేది లేదని, సోనియాగాంధీ చెప్పేరోజు కూడా దగ్గరికొచ్చింది. అయితే ఈ డ్రామా ముగిస్తే 'అక్రమ సంపాదనల' ఆరా మొదలౌతుంది. అందుకు తోడు, ఒక లోక్‌పాల్, ఒక లోకాయు క్త (మరిన్ని కోరలతో) వచ్చే అవకాశం ఉంది. ఉద్యమ ఉద్యోగస్తులకు ఇన్ని ఆస్తులెక్కడివి అని ప్రశ్నించే రోజు కూడా రావొచ్చు. అందుకే ఆస్తులన్నీ క్రమబద్ధీకరణ జరిగే వరకు ఉద్యమం ఆపొద్దనే ఒక తెలంగాణ ఎత్తుగడ కూడా ఉన్నది. ఎంత గొప్ప మేధావులు వీళ్లు! 

నా తెలంగాణలో ఎంత మంది మాదిగలున్నా 'ఇది కోటి రత్నాల వీణ' గాని 'కోటి డప్పుల జాన' ఎన్నటికీ కాకూడదని మేమంతా కోరుకోవాలట. ఈ 'ఆత్మహత్యల' విప్లవం మధ్య కొంత మంది మాదిగ విద్యార్థివీరులు కూడా 'ఫామ్ హౌస్ చుట్టూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అని నినాదాలు చేస్తుంటే అవి సోనియాగాంధీకి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమంలో తాగకున్నా, తాగిన మైకంలో (డబ్బు సంపాదన కూడా ఒక మైకమే) ఉపన్యాసాలు, ప్రకటనలు దంచే మేధావులను చూస్తే మనకు పాతకాలపు పద్యం గుర్తొస్తుంది. 

'సిగ్గు యెకింతయు లేదు
పసిపిల్లల రక్తపు పాలు తాగుటకున్''
'తెలంగాణ ఇవ్వకపోతే సోనియాను బజారుకీడుస్తా, చిదంబరం లుంగీ ఊడగొడ్త' అని నినదించిన తండ్రీకొడుకులు, లోక్‌పాల్ బిల్లు చట్టం కాగానే ఎక్కడ దాక్కోవాలో తెలియని పరిస్థితి వచ్చే అట్లుంది. 'దొరసాని' బొమ్మకు తెలంగాణ తల్లి అని పేరు పెట్టినట్లు, 'బూతుపంచాంగానికి' తెలంగాణ భాష అని కూడా వీరు పేరు పెట్టారు. వీరి చుట్టూ తిరిగే మేధావులు 'నా తెలంగాణ బూతు నాయకులగన్న కోటి రతనాల వీణ' అని పుస్తకాలు రాసి ఫామ్‌హౌస్‌లో ప్రదానం చేస్తే వారికి గండపెండేరం తొడిగి ఆంధ్ర పెట్టుబడిదారులిచ్చిన పైసలతో కొన్న గుర్రం మీద ఎక్కించి ఫామ్ చుట్టూ తిప్పితే, తెలంగాణ వచ్చినా రాకున్నా విప్లవ మొచ్చిందని 'జై తెలంగాణ' అని నినదించవచ్చు. ఈ రెండేండ్లలో చనిపోయిన 700 అమరవీరులకు ఆత్మశాంతి కలుగుద్ది. వాళ్ల తల్లిదండ్రులకు తిండి ఉన్నదా, బట్ట ఉన్నదా అనే ఆలోచన మనకెందుకు, మనకు ఫామ్‌హౌజులు, పరుపు మంచాలు, చండేషియాగాలు ఉన్నాయి కదా! జై తెలంగాణ. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi News Paper Dated 29/12/2011

No comments:

Post a Comment