ఆదివాసీ ప్రజలు తమను గౌరవించని ఒక కార్యక్రమానికి తమను తాము నిబద్ధులుగా చేసుకోకూడదు. రెడ్ ప్లస్ అనేది ఒక మార్కెట్ ఆధారిత ధోరణి. దీని ద్వారా బయటివారు ఆదివాసీ ప్రజలకు పవిత్రమైన వాటిని సరుకులుగా మార్చటానికి ప్రయత్నిస్తారు. పూర్వీకు ల సాంస్కృతిక వారసత్వం, భావితరాలవారి జీవితాలకు కల్పించే హామీ- ఇవన్నీ కేవలం ఆదివాసులకే కాక మొత్తం మానవ జాతి మనుగడకు కూడా అవసరం.
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు 17వ సదస్సు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో సోమవారం నాడు ప్రారంభమైంది. డిసెంబర్ 9 వరకు ఈ సదస్సు జరగనున్నది. ప్రపంచ దేశాల ప్రభుత్వ, కార్పొరేషన్ల, వాతావరణ మార్పు విధానాలను, స్వేచ్ఛా విపణి విధానాలను ప్రతిపాదించే సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. భూగోళం వేడెక్కిపోకుండా ఎలా నివారించాలో వారు చర్చిస్తారు. కుప్పకూలిపోతున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను నిలబెట్టి ఆదుకోవాలి కాబట్టి ఈ ప్రతినిధులందరూ తమ సమాలోచనలతో ఒక కొత్త 'గ్రీన్ ఎకానమీ' (ప్రకృతి అనుకూల ఆర్థిక వ్యవస్థ) మాత్రమే భూగోళాన్ని రక్షించగలదని అందరినీ ఒప్పిస్తారు.
ఈ గ్రీన్ ఎకానమీలో భాగంగా కర్బనా న్ని కొనడం, అమ్మడం ద్వారా లక్షల డాలర్ల లాభాలను సంపాదించే అవకాశం ఉంటుంది. ఆదివాసీ ప్రజలమైన మేము ఈ బూటకత్వా న్ని ఖండిస్తున్నాము. పెట్టుబడిదారుల దురాశ, ఆర్థిక పెరుగుదల కలిసి మానవ సంబంధాలను, ధరిత్రీమాతను నాశనం చేస్తున్నాయి. ఈ వినాశన దుష్ఫలితాలను మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా ము. భూ తల్లి ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఆదివాసులకు భూ తల్లి పవిత్రమైనది. అందుకే మేము 'రెడ్ ప్లస్' కార్యక్రమా న్ని, కార్బన్ మార్కెట్‌ను బూటకమైనవని అంటున్నాము. ఇవి భూ గోళం వేడక్కటంపై ఎటువంటి ప్రభావాన్ని కలిగించవని భావిస్తున్నాము. మా దృష్టిలో ప్రతిదీ జీవితమే. జీవితాన్ని బేరమాడలేము; స్టాక్‌మార్కెట్‌లో అమ్మలేము. ఈ విధానం చాలా పెద్ద ప్రమాదంతో కూడుకున్నది. పర్యావరణ సంక్షోభాన్ని ఇది పరిష్కరించలేదు.
కాన్‌కున్(మెక్సికో)లో గత ఏడాది జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు 16వ సదస్సు రెడ్, రెడ్ ప్లస్ అనే ఒప్పందాలను ఆమోదించింది. రెడ్/రెడ్ ప్లస్ అంటే 'రెడ్యూస్‌డ్ ఎమిషన్స్ ఫ్రమ్ డీ ఫారెస్ట్రేషన్ అండ్ డిగ్రేడేషన్' (అడవుల నరికివేత, అడవు ల వినాశనం వల్ల కలిగే ఉద్గారాల తగ్గింపు). తమ జీవన శైలి ద్వారా వెలువడుతున్న కర్బన ఉద్గారాలను, వర్ధమాన దేశాలలోని అడవులు, కొత్తగా పెంచే తోటలు పీల్చుకునేటట్లు చేసినందుకు, ఆ దేశాలకు డబ్బు చెల్లించి తమ నేరాన్ని మాఫీ చేసుకోవడానికి ఆ రెండు ఒప్పందాల ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
రెడ్ అనేది అడవుల నరికివేతను నివారించడానికి, రెడ్ ప్లస్ అనేది కర్బనాన్ని పీల్చుకునేందుకు కొత్త అడవుల లేదా తోటల పెంపకానికి వర్తిస్తాయి. 'గ్రీన్ ఇండియా మిషన్' అనేది భారతదేశపు వాతావరణ మార్పు జాతీయ కార్యాచరణ ప్రణాళికలోని అడవులకు సంబంధించిన భాగం. దీని మొత్తం ఖర్చు రూ.46,000 కోట్లు. ఆదివాసుల భూములపై బలవంతంగా రుద్దిన తోటల పెంపకం దుష్ఫలితాలను మేము ఇప్పటికే అనుభవిస్తున్నాము. మామిడి, కానుగ, జట్రోఫా, రబ్బర్, నీలగిరి ఇత్యాది చెట్ల పెంపకాన్ని నిరాకరిస్తే మా రేషన్ కార్డులను, ఉపాధి హామీ జాబ్ కార్డులను రద్దు చేస్తామని బెదిరించారు. బలవంతంగా ఆ మొక్కలను నాటిస్తున్నారు.
ఈ నెల 24, 25 తేదీల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసి ప్రజల ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సదస్సు జరుగుతున్న డర్బన్ నగరంలోనే సమావేశమయ్యారు. భారత్ తరఫున నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను. వాతావరణ మార్పు సమస్య పరిష్కారానికి ముందుకు తెస్తోన్న బూటకపు ప్రతిపాదనలను ఖండించడం, ప్రపంచ ఆదివాసీ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ప్రపంచస్థాయి ఏకాభిప్రాయాన్ని నిర్మించేందుకై సంబంధిత అంశాలపై చర్చలు, సమాలోచనలు జరపడం ఆదివాసీ ప్రతినిధుల సమావేశ లక్ష్యం.
వాతావరణ మార్పు వల్ల నష్టపోయే విషయంలో ఆదివాసీలే అందరి కంటే ముందుపీఠీన ఉన్నారు. అయినా ఈ ఆదివాసీలనే, తమ జాతీయ, అంతర్జాతీయ రాజ్యాంగపరమైన రక్షణలను వదులుకోవాలని, ప్రపంచ నాయకులు కోరుతున్నారు! కార్బన్ విక్రయాలు భూగోళపు వేడిని తగ్గిస్తాయనే బూటకపు వాదనలను ప్రపంచానికి చెప్పటంలో భాగస్వాములు కావాలని ఆదివాసీలను అడుగుతున్నారు. ప్రజలలో ఒక ప్రత్యేక వర్గాన్ని మాత్రమే స్థానిక ప్రజలుగా పరిగణించడం కాక, ప్రజలందరినీ స్థానిక ప్రజలు (ఇండిజినస్ పీపుల్)గా గుర్తించాలని స్థానిక ప్రజల హక్కులపై 2007లో ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం ఆమోదించింది. అయితే అంతర్జాతీయ వేదికలపై మన ప్రభుత్వం ఎన్నడూ ఆదివాసులను 'ఇండిజినస్ పీపుల్'గా పేర్కొనలేదు. కాని అడవులు-రెడ్ ప్లస్‌లో మమ్మల్ని భాగస్వాములను చేయటానికి సంబంధిత డాక్యుమెంట్లలో అకస్మాత్తుగా మా ఆదివాసులను 'ఇండిజినస్ పీపుల్' అనే పదాన్ని ఉపయోగించటం మొదలుపెట్టింది.
మా భూములలో మైనింగ్ సాగించడానికి, మా నదులపై ఆనకట్టలు కట్టడానికి, మా అడవుల నుంచి మమ్మల్ని తరిమేయడానికి ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి. మా హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగం ఇచ్చిన హమీలను, వాటి ప్రకారం చేసిన చట్టాలను భారత ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఒకవైపు మా ప్రాంతాలను, వనరులను దోచుకుంటూ ఇప్పుడు మా గాలితో వ్యాపారం చేయాలనుకుంటున్నది. అదే సమయంలో భారతదేశపు అడవులను, కర్బనాన్ని పీల్చుకునేందుకు వీలు కల్పించడం ద్వారా ఆదివాసీ ప్రజల హక్కులను పరిరక్షిస్తామని ప్రపంచానికి భారత ప్రభుత్వం చెబుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లోకి ఆర్థిక ప్రయోజనాలు ప్రవహిస్తాయనే అబద్ధం చెబుతోంది.
భారత ప్రభుత్వం అనుసరించే ఈ బూటకత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బూటకపు కర్బన వ్యాపారంలో వాతావరణ మార్పులకు మార్కెట్ ఆధారిత పరిష్కారాలను సూచించడంలో నిజానికి తరతరాలుగా వస్తున్న మా పుట్టినిల్లైన అడవులే ప్రమాదంలో పడుతున్నాయి. దక్షిణ అమెరికాలోని ఈక్వడార్‌లో రెడ్‌ప్లస్‌ను ప్రారంభించిన తరువాత, అక్కడి స్థానిక ప్రజలు ఏ విధంగా తమ సొంత భూములలో బందీలుగా అయ్యారో, అడవిని ఉపయోగించుకోవడంలో వారికి ఉన్న సంప్రదాయ చట్టాలు ఎలా కాలరాయబడ్డాయో, జీవనోపాధులు ఎలా నాశనమయ్యాయో డర్బన్ సమావేశంలో దక్షిణ అమెరికాకు చెందిన మా ఆదివాసీ అన్నలు, చెల్లెళ్ళు చెప్పగా విన్నాము. ఈ రెడ్ ప్లస్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా స్థానిక సమూహాలు, ఆదివాసిీ ప్రజల సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టింది.
చర్చలు, సంభాషణల ద్వారా ఆదివాసీ ప్రజలమైన మేము 'స్థానిక ప్రజల బయో కల్చరల్ క్లైమేట్ ఛేంజ్ అసెస్ మెంట్' సభ్యులమైన మేము రెడ్ ప్లస్ కార్యక్రమంలోని అంతర్గత ప్రమాదాలను, ప్రతికూల ప్రభావాలను గుర్తించాము. ఈ క్రింద పేర్కొన్న అంశాల పట్ల ప్రపంచ ప్రజలను అప్రమత్తులను చేస్తున్నాము: (అ) రెడ్‌ప్లస్ అనేది ఒక నయా సరళీకరణ, మార్కెట్ ఆధారిత కార్యక్రమం. ఇది బ్రతుకును ఒక సరుకుగా మార్చివేసి సమగ్రమైన సమష్టి విలువలను, పరిపాలనా వ్యవస్థలను కాలరాయడానికి దారితీస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రైవేటీకరణ వంటి ఆర్థిక కార్యక్రమాలు, ప్రపంచ బ్యాంకు వంటి కర్తలు శాసించే ఒక నయా సరళీకరణ ధోరణి ఈ రెడ్‌ప్లస్; (ఆ) రెడ్‌ప్లస్ విధానాలు, ప్రాజెక్టులు ప్రత్యక్షంగా ఆదివాసులను, వారి భూభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఎందుకంటే అటవీ ప్రాంతాలన్నీ ఈ భూ భాగాలలోనే ఉన్నాయి కనుక.
కార్పొరేషన్లు, అటవీ సంరక్షణ సంస్థలు శక్తిమంతమైన ప్రభుత్వ సంస్థలు అటవీ నివాసులైన స్థానిక ప్రజలతో అన్యాయమైన, వక్రీకరించని ఒప్పందాలను కుదుర్చుకొని అటవీభూములను ఆక్రమించుకొని, ఆర్థిక లాభాలను సొంతం చేసుకుంటాయి. రెడ్ ప్లస్ కార్యక్రమం అనేక తగవులను, అవినీతిని పెంచి ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టడం వంటి అనేక మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తుంది; (ఇ) రెడ్ ప్లస్ విధానాలు, ప్రాజెక్టులు స్థానిక ప్రజల, ప్రత్యేకించి ఆదివాసీల సంప్రదాయక పరిపాలనా వ్యవస్థలను కాలదన్ని, ఉల్లంఘిస్తున్నాయి; (ఈ) రెడ్ ప్లస్ కార్యక్రమం స్థానిక ప్రజలు తమ అడవులను సంప్రదాయకంగా వినియోగించుకోవడాన్ని, అడవులలోకి ప్రవేశించడాన్ని ఆపివేసి, అడవులను వారికి అందుబాటులో లేకుండా చేస్తాయి.
ఇది వారి సంప్రదాయ జ్ఞానం పైన, ఆహార సార్వభౌమత్వం, ఆహార భద్రత పైన, సంప్రదాయ ఆరోగ్య భద్రతా వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది; (ఉ) రెడ్ ప్లస్ విధానాలను ప్రోత్సహించే ప్రభుత్వాలే జీవ ఇంధనం, గనుల తవ్వకం, చమురు వెలికి తీయడం, ఆనకట్టల నిర్మాణం, పారిశ్రామిక పద్ధతిలో ఒకే రకమైన పంటలు, తోటలు పెంచటం వంటి ఆర్థికరంగాలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. అడవుల ఆక్రమణకు వినాశనానికి ఇవే ప్రధాన కారణాలు; (ఊ) రెడ్ ప్లస్ విధానాలలో కర్బనంపై కేంద్రీకరించిన దృష్టి, ఒకే రకమైన తోటల (జన్యు మార్పిడి చెట్లతో సహా) పెంపకాన్ని ప్రోత్సహిస్తాయి. అడవుల సామాజిక, సాంస్కృతిక విలువలను పట్టించుకోవు; (ఎ) రెడ్ ప్లస్ ఉమ్మడి బాధ్యతా సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు, వాటి పరిశ్రమలకు కాలుష్యాన్ని పెంచే హక్కును మంజూరు చేస్తుంది. ఆ విధంగా అసమానతలను సృష్టిస్తుంది.
రెడ్ ప్లస్‌లో భాగస్వాములైన వారందరూ ఆదివాసుల హక్కులను పూర్తిగా గౌరవించాలని మేము నొక్కిచెబుతున్నాము. అయితే ముందుగా సమాచారం అందించి, అనుమతి తీసుకునే సూత్రం అన్ని ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడానికి మార్గం కాదు. రెడ్ ప్లస్‌ను సమర్థించుకోవడానికి ఈ సూత్రాన్ని ఉపయోగించుకోకూడదు. ఆదివాసి ప్రజల స్వయం నిర్ణయ హక్కును భూభాగాల వినాశానాన్ని సమర్థించటానికి ఉపయోగించకూడదు. ఆదివాసీ ప్రజలు తమను గౌరవించని ఒక కార్యక్రమానికి తమను తాము నిబద్ధులుగా చేసుకోకూడదు. రెడ్ ప్లస్ అనేది ఒక మార్కెట్ ఆధారిత ధోరణి. దీని ద్వారా బయటివారు ఆదివాసీ ప్రజలకు పవిత్రమైన వాటిని సరుకులుగా మార్చటానికి ప్రయత్నిస్తారు.
మా పూర్వీకుల సాంస్కృతిక వారసత్వం, భావితరాలవారి జీవితాలకు కల్పించే హామీ, ఇవన్నీ కేవలం ఆదివాసులకే కాక మొత్తం మానవ జాతి మనుగడకు కూడా అవసరం. చాలా ఆదివాసి సమూహాలు, తెగలకు రెడ్ ప్లస్ కలిగించే ప్రమాదాలు, ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన లేదు. రెడ్ ప్లస్ ఒక రాజకీయ ఉచ్చు; వాతావరణ మార్పును పెంచడానికే ఇది దారి తీస్తుంది. ఆదివాసీ సమూహాలన్నీ ఈ విషయంలో సమగ్రతను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాము. వాతావరణ న్యాయాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితో ఉన్న ప్రజలందరు జీవిత విలువలకు కట్టుబడి ఉండాలని కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను చేపట్టాలని, రెడ్ ప్లస్‌ను బూటకపు పరిష్కారంగా పరిగణించి, తిరస్కరించాలని పిలుపునిస్తున్నాము.
Andhra Jyothi Telugu News Paper Dated 30/11/2011
Andhra Jyothi Telugu News Paper Dated 30/11/2011