Wednesday, November 23, 2011

మంద కృష్ణతో బిసిలు కలవాలి - గోవిందు నరేష్ మాదిగ


గత రెండేళ్ళుగా అగ్రకులాల వారి నాయకత్వంలో నడిచిన భౌగోళిక తెలంగాణ ఉద్యమం సూత్రప్రాయంగా విఫలమయింది. అంబేద్కర్ సిద్ధాంతం పునాదిగా బిసి, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యానికి డిమాండ్ చేస్తోన్న సామాజిక తెలంగాణ వాదానికి సమాజంలో విస్తృతంగా మద్దతు పెరుగుతోంది. ఈ పరిణామాలని హర్షించాల్సిన సమయాన కొంతమంది బిసి వాదులు 'దగాపడ్డది బిసిలే' (నవంబర్ 17, ఆంధ్రజ్యోతి) అని వాపోయారు. 

వివక్షకు గురైన వర్గాలవారి కోసం పోరాడుతోన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ, అంబేద్కర్ సిద్ధాంతాన్ని బిసిలకు అందించడం కోసం కృషిచేస్తోన్న ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై విమర్శలు గుప్పించారు. ఒకవైపు బిసిలకు నాయకత్వం లేదని ఒప్పుకుంటూనే మరోవైపు బిసిల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసే సామాజిక ఉద్యమకారులపై నిందలు మోపే ప్రయ త్నం చేశారు. గత అరవై నాలుగేళ్ళుగా బిసిలను ఓటు బ్యాంక్‌గా మార్చుకొని తమ ఆధిపత్యాన్ని, అధికారాన్ని నిలబెట్టుకొంటున్న అగ్రకుల పాలకులను, అదే విధంగా తమ లాగే వివక్షను అభవించిన బిసిలను చైతన్యపరిచి పాలకులుగా ఉన్న వారిని పాలకులుగా మార్చాలని పోరాడుతున్న సామాజిక ఉద్యమ నేతలను ఒకే విధంగా చూడడం వారి వివేకానికి నిదర్శనం. 

అసలు సామాజిక తెలంగాణ అంటే సామాజిక న్యాయమే. సామాజిక న్యాయం అంబేద్కరిజమ్‌లో నుంచి పుట్టిన భావనే. అలాంటి అంబేద్కరిజమ్ పునాదిపైన సామాజిక న్యాయాన్ని సాధించుటకు గత పద్దెనిమిదేళ్ళుగా మంద కృష్ణ మాదిగ తన జీవితాన్ని పణంగా పెట్టి ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆయన పోరాటమంతా అంబేద్కర్ సిద్ధాంత స్ఫూర్తితోనే కొనసాగుతున్నది. ఆ క్రమంలోనే 'సామాజిక తెలంగాణ'ను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని పరిశీలించి గుర్తించాల్సిన అవసరం బిసి కులాల ప్రజలకు ఉన్నది. 

తెలంగాణలో 90 శాతం జనాభా కలిగిన అణగారిన కులాలలో ఏ కులానికి లేని సామాజిక ఉద్యమ చైతన్యం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతి అందిపుచ్చుకుంది. తద్వారా మాదిగలు సమాజానికి నాయకత్వం వహించే స్థాయిలో ఎదిగారు. అందుకనుగుణంగానే తెలంగాణలో 50 శాతం జనాభా కలిగిన బిసిలను, 12 శాతం జనాభా కలిగిన ముస్లింలను తమ రాజకీయ హక్కుల సాధన కోసం మేలుకొలపడాన్ని ఒక సామాజిక బాధ్యతగా మందకృష్ణ భావిస్తున్నారు. ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకెళుతున్నారు. ఇది అంబేద్కర్ వారసుడిగా ఆయన నిర్వహిస్తోన్న మహత్తర కర్తవ్యం. 

వర్తమాన తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తే 'సామాజిక తెలంగాణ' ద్వారానే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని విశ్వసించాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు చట్టసభలలో ఉన్న రిజర్వేషన్లలాగే, మెజారిటీ బిసి, ముస్లిం ప్రజలకు కూడా చట్టసభలలో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కలిగివుంటే రేపు ఏర్పడబోయేది ఖచ్చితంగా 'సామాజిక తెలంగాణ'నే. దీన్ని కోరుకోవడం వలనే బిసిలను అడ్డుపెట్టుకొని తెలంగాణ ఏర్పడకుండా అడ్డుతగులుతున్నారని కృష్ణపై నిందలు మోపుతున్నారు. 

బిసిల కోసం కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడాలని అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బిసిల కోసం మాట్లాడక పోవడాన్ని ఆయనకు లేని అర్హతలేమిటో చెప్పగలరా? వైకల్య వివక్షను ఎదుర్కొన్న వికలాంగులను సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకొచ్చిన త్యాగపూరిత పోరాటం చాలదా? నిరుపేద గుండె జబ్బుల చిన్నారుల హృదయాలకు తన పోరాటంతో భద్రతనిచ్చి రాష్ట్రంలోని ఏడు కోట్ల మంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీని అందించిన మానవతా ఉద్యమస్ఫూర్తి సరిపోదా? 

2006లో కరీంనగర్‌లో టిఆర్ఎస్ నిర్వహించిన నిండు సభలో బిసికులానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను కించపరిచేలా, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మట్లాడిన కెసిఆర్‌కు ఎదురుతిరిగి ప్రశ్నించి, క్షమాపణలు చెప్పించిన మంద కృష్ణ మాదిగ సామాజిక స్పృహను మరచిపోయారా? దొరల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దొరసానులకు 'ప్రతిరూపమైన' తెలంగాణ తల్లిని ఒక బొమ్మ మాత్రమేనని చెప్పి, నిజజీవితంలో దొరల దౌర్జన్యాలపై తిరగబడ్డ వీర వనిత 'చాకలి ఐలమ్మే మా అమ్మ' అని బిసి కులానికి చెందని మహిళను తెలంగాణ తల్లిగా మంద కృష్ణ ప్రకటించిన విషయాన్ని గర్తుంచుకోవాలి. 

అంబేద్కర్ స్వాతంత్య్రానికి పూర్వమే ఎస్సీ, ఎస్టీ హక్కులకై ఒకవైపు బ్రిటిష్ వారితో, మరోవైపు గాంధీజీతో పోరాడి విజయం సాధించారు. ఆ సమయంలోనే బిసి ప్రజల హక్కుల కోసం కూడా మాట్లాడాలని సిద్ధపడిన అంబేద్కర్‌ను, గాంధీజీ పెట్టిన భ్రమలకు లోబడిన బిసిలు వదిలివేశారు. స్వాతంత్య్రానంతరం న్యాయం చేస్తానన్న గాంధీజీని నమ్మి, అంబేద్కర్ నాయకత్వాన్ని వదిలివేయడం ఈ దేశచరిత్రలో బిసిలు చేసిన చారిత్రక తప్పిదం. ఆ తప్పిదం వలనే బిసి కులాలు శాశ్వతంగా రాజకీయ హక్కులకు దూరమయ్యారు. 

ముప్పై ఏళ్ళ గాంధీ పోరాటం బిసిలను మభ్యపెట్టింది. ఆరున్నర దశాబ్దాల గాంధీ వారసుల పాలన బిసి ప్రజలను మోసం చేసింది. ఈ చరిత్ర నేటికీ సాక్ష్యం కదా! అయితే స్వాతంత్రోద్యమ కాలంలో చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఈ దేశంలోని ఒక్క తెలంగాణ ప్రాంత బిసి ప్రజలకే వచ్చింది. అది తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ వారసత్వ నాయకత్వాన్ని స్వీకరించడం ద్వారానే సరిచేసుకోవచ్చు. 

ఈరోజు తెలంగాణ విముక్తి ఉద్యమంలో గాంధీ వారసుడైన కెసిఆర్‌కి, అంబేద్కర్ వారసుడైన మందకృష్ణ మాదిగకు అణగారిన కులాల 'వాటా' విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉన్నది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎస్సీ, ఎస్టీ హక్కుల కోసం అంబేద్కర్ పోరాడినట్లుగానే తెలంగాణ ఉద్యమంలో బి.సి, ముస్లింల రాజకీయ హక్కుల కోసం మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని బలపరచడం ద్వారానే బి.సి. కులాలు తమకు తాము న్యాయం చేసుకోగలరు. లేకుంటే గుడ్డిగా దొరలను నమ్ముకుంటే తరతరాలుగా మోసపోవడానికే బి.సి.లు బ్రతికున్నట్లవుతుంది. 

అంబేద్కరిజాన్ని అందుకోకుండా, మందకృష్ణ మాదిగ వాదనను బలపరచకపోతే మరో వందేళ్లు బి.సి.లు బానిసత్వంలో కూరుకుపోతారు. అన్నింటినిమించి ఒక చారిత్రక సత్యం ఏమిటంటే ఈ దేశ, రాష్ట్ర రాజకీయాలను మార్చగలిగే జనాభా కలిగిన బి.సి.లు ఫూలే, అంబేద్కర్ సిద్ధాంత మార్గాలను స్వీకరించకపోవడం వలనే 60 ఏళ్లుగా నిశ్చేష్టులుగా మిగిలిపోయారు. ఇకనైనా మేల్కోవాలి. 

- గోవిందు నరేష్ మాదిగ
ఎమ్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  Andhra Jyothi News Paper Dated 24/11/2011

No comments:

Post a Comment