మిత్రులు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్‌లకు జన్మనిచ్చిన మధురమ్మ, వెంకటయ్యలూ, మీకు పాదాభివందనం. కోటేశ్వరరావు, వేణుగోపాల్‌లు అపూర్వ సోదరులు. ఈ దేశ సంపదను, సార్వభౌమత్వాన్ని తమ ప్రాణాలొడ్డి కాపాడేందుకు ప్రయత్నించిన ఎస్.ఆర్.శంకరన్, ఐవి సాంబశివరావు (పీపుల్‌వార్ పార్టీ నిర్మాతల్లో ఒకరు), మల్లోజుల బ్రదర్స్, ఆర్‌కె, చెరుకూరి రాజకుమార్... వీళ్ళంతా అన్ని అవకాశాలున్న సామాజిక వర్గానికి చెందినవారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల్ని అందిపుచ్చుకుని, చట్టాలను కాలరాస్తూ రమణ్ సింగ్, మహేంద్ర కర్మ లాంటి బడుగు వర్గాల నాయకులు ఎదిగివచ్చారు. ఇదే కుల, వర్గ రాజకీయాల్లో ఉన్న చిక్కు ప్రశ్న.
అది 1978. హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలకు మద్దతుగా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాయిని నర్సింహారెడ్డి, కన్నభిరాన్ తదితర ప్రముఖులు ప్రసంగించారు. వారితో పాటు ఒక యువకుడు. జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో జరుగుతున్న దొరల దౌర్జన్యాలు, ఆ దౌర్జన్యాలకు ప్రతిగా జరుగుతున్న ప్రజాపోరాటాల గురించి అద్భుతంగా, సవివరంగా, అనర్గళంగా మాట్లాడాడు. క్షేత్రస్థాయి కార్యకర్తగా, మేధోపరమైన విశ్లేషకుడిగా, ఒక ఆర్మీ కమాండర్‌లాగా ఉన్నాడు ఆ యువకుడు.
ఆయనే మల్లోజుల కోటేశ్వరరావు అని ఆ తర్వాతే తెలిసింది. మల్లోజుల కోటేశ్వరరావుతో అప్పుడు ఏర్పడ్డ ఆ పరిచయం 1983 అక్టోబర్‌లో బస్తర్ అడవుల్లో అతి సన్నిహితంగా మారింది. అక్కడ అతిపెద్ద మిలిట్రీ క్యాంపు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్‌వార్ అగ్రశ్రేణి నాయకత్వమంతా ఆ క్యాంప్‌లో ఉంది. నేను ఆ క్యాంప్ మిలిట్రీ డాక్టర్‌ను. ఒకసారి మాంసం వండిన రోజు నేను అన్నం తినలేదు. ఆ సందర్భంగా ప్రహ్లాద్ ఎలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు నాతో కొంతసేపు మాట్లాడారు. నా అభిప్రాయాలు, అభిరుచులను తెలుసుకున్నారు.
ఆ సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురైన కటకం సుదర్శన్(ఆనంద్-ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజినల్ బ్యూరో సెక్రటరీ)కి నేను వైద్యం చేశాను. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడడంతో కామ్రేడ్స్ అందరూ సంతోషించారు. ఆనంద్‌ని, ఎస్ఆర్ శంకరన్‌ని, కాన్షీరామ్‌ని కాపాడటం నా 35 ఏళ్ళ వైద్యవృత్తిలో నేను గర్వపడే సంఘటనలు. క్యాంపు పూర్తయి ఎవరి ప్రాంతాలకు వారు ప్రయాణమవుతూ కన్నీళ్ళ పర్యంతమవుతున్న క్షణాలు.
క్యాంప్ నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకరోజు ప్రహ్లాద్ కొరియర్ నాకిష్టమైన కొరమేను చేపల కూరతో నా దగ్గరకొచ్చాడు. ఆ సంఘటన ఆయన మానవ సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. మల్లోజుల బ్రాహ్మణిజం లేని బ్రాహ్మణుడు. ఈ దేశంలో కులాన్ని త్యాగం చేస్తే, చేసిన వ్యక్తి ఏ త్యాగానికైనా సిద్దపడుతాడని అంటాను. అటువంటి త్యాగాన్ని మల్లోజుల బ్రదర్స్ చేశారు. అపురూపమైన అన్న మల్లోజుల కోటేశ్వరావును చిదంబరం, మమతలు పొట్టనపెట్టుకున్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ అన్నట్లు ఈ దేశ సార్వభౌమత్వాన్ని, దేశ వారసత్వ సంపదల్ని కాపాడుతున్నది వాస్తవంలో ఆదివాసీలే. దేశాన్ని టోకుగా, చిల్లర చిల్లరగా అమ్ముతున్నది రాజకీయ నాయకులు, అవినీతి పరులైన ఉన్నతాధికారులే. దేశానికి చెడుచేస్తున్నవారే నిత్యం మనందరి గౌరవ మర్యాదలు పొందుతున్నారు! లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ఘరానా మనుషులు స్వాయత్తం చేసుకొంటున్నారు. ఈ దేశ సందను విదేశీ పెట్టుబడిదారుల నుంచి కాపాడే ఆదివాసీలు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, అజాద్, కిషన్‌జీలు అత్యం త ప్రమాదకారులుగా ముద్రవేయబడి కిరాతకంగా చంపబడుతున్నారు. ఈ చట్టబద్ధ అవినీతిపరులకు అండగా నిలవబట్టే ప్రజాస్వామ్యం రాజకీయ రౌడీల స్వామ్యంగా వర్ధిల్లుతోంది.
ఈ చట్టబద్ధ అవినీతిని ప్రశ్నించినందుకే డాక్టర్ బినాయక్ సేన్‌ని దేశద్రోహి అన్నారు. కాశ్మీర్‌లోని రాజ్య హింసను ప్రశ్నించబట్టే అరుంధతీరాయ్ మీద దేశ ద్రోహ నేరం పెట్టాలని కాశ్మీర్ పండిట్ సంఘం కోర్టులో 'పిల్' వేసింది. మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రాంతాలలో నిర్మిస్తున్న నూతన ప్రజాస్వామిక 'జనతన సర్కార్' వివరాలను ఆమె లోకానికి చాటి చెప్పి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. దేశ సంపదను కాపాడే వాళ్ళకు మద్దతివ్వడం కూడా దేశద్రోహమే అయినపుడు, పార్లమెంట్‌లో, అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాటలకు, వారి చేతలకు పొంతన లేకుండా పోవడమూ దేశద్రోహం కిందకే వస్తుంది.
కిషన్‌జీని మేము చంపలేకపోయామే అని బుద్ధదేవ్ బాధపడి ఉండవచ్చు, ఆ పని తాను చేసినందుకు మమతా బెనర్జీ విర్ర వీగుతూ ఉండవచ్చు. కిషన్‌జీ దీర్ఘ నిద్రలోకి వెళ్ళగా, 16 రాష్ట్రాల్లోని ప్రజా కంటకులకు నిద్ర కరవయింది. మన్మోహన్, సోనియా, చిదంబరం, మమతా బెనర్జీలకు ఇప్పుడు నిద్రలేని రాత్రులెన్నో. దేశవ్యాప్తంగా రెడ్ ఎలర్ట్. పులి అంజన్న, ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, మాధవ్, పటేల్ సుధాకర్ రెడ్డి, అజాద్, కిషన్‌జీలు ఒక్కొక్కరు చనిపోయి కూడా బ్రతికున్న పాలకవర్గాల ముఠాలకి నిద్రలేకుండా చేస్తున్నారు. రాజ్యం ఉన్నంతవరకు అణచివేత ఉంటుంది.
ప్రజారాజ్యం వస్తే అణచివేత తగ్గుతుంది. 1980ల్లో రాడికల్ ఉద్యమంలోకి ఎదిగి వచ్చిన నాయకత్వంలోని ఒక్కొక్కరు ఒరిగిపోతున్నారు. ఇది ఉద్యమాల గతితర్కం. దోపిడీ వర్గాల కొరకు ఆ దోపిడీ కులవర్గ సమాజం వాళ్ళ నాయకత్వాన్ని సృష్టించుకుంటూనే ఉంది. పది శాతం కూడా లేని నీతిమాలిన దోపిడీ వర్గాలు తమ నాయకుల్ని, మేధావుల్ని, బ్యూరోక్రాట్స్‌ని సృష్టించుకుంటే, శ్రామిక వర్గం తన నాయకుల్ని, మేధావుల్ని సృష్టించుకోలేదా? ఈ దేశ చరిత్రలో భగత్‌సింగ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అంజన్న, శ్యాం, సంతోష్, అజాద్, కిషన్‌జీల వంటి శ్రామిక వర్గ పోరాట యోధులు రాబోయే కాలంలో నిత్య నూతనంగా ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారు.
1985 నుంచి 89 వరకు తెలుగుదేశం అవలంభించిన అణచివేత విధానాలకు వ్యతిరేకంగా 1989లో వరంగల్ రైతు కూలి సభలకు తరలి వచ్చిన సకలజనులు మర్రి చెన్నారెడ్డి, దొర, వ్యాస్‌ల గుండెలదిరిపోయేట్లు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డి కుట్రతో మొదలు పెట్టిన చర్చలే అయినా ఆ నాలుగు రోజుల్లో మావోయిస్ట్ నాయకత్వం మీద అశేష ప్రజానీకం నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తటస్థ మేధావులు కూడా ఎంతో అభిమానం చూపారు. 2003లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతం నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచే సే ఉద్యోగి నా దగ్గర వైద్యం చేయించుకునేందుకు వచ్చారు.
ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారు కదా... మరి మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారని అడిగితే... వాళ్ళుండబట్టే ధైర్యంగా ఉద్యోగం చేయగలుగుతున్నామని ఆమె చెప్పారు. లేకుంటే ఈ రాజకీయ నాయకుల ఇళ్ళలో పనిచేయవలసి వచ్చేదని ఆమె వివరించారు. మరో ఉదాహరణ! 2010 లో ఒక రోజు నేను హైదరాబాద్ నుంచి తొర్రూరు మీదుగా ఖమ్మం వస్తున్న సమయంలో తెలంగాణ యువకులు రాస్తారోకో చేస్తున్నారు. నేను కారు దిగి సంఘీభావం తెలుపుతున్న సమయంలో, మాలాగే ఒక వ్యాపారస్తుడూ తన కారులోంచి దిగాడు.
దొంగలు నాయకత్వం వహిస్తుంన్నందు వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం ఆలస్యమవుతోంది, 'అన్నలు' ఉన్నట్లయితే ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో వచ్చి ఉండేది అని అన్నాడు ఆ మార్వాడీ వ్యాపారస్తుడు. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో దొర దగ్గర పనిచేస్తున్న దళిత జీతగాడు పీపుల్స్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ గ్రామ రచ్చబండ దగ్గరకు వచ్చినపుడు ఆ ఊరి దొర గతంలో తన దగ్గర పనిచేసిన దళిత జీతగాడ్ని 'నమస్తే అన్నా!' అని పిలుస్తూ దగ్గరికొచ్చాడు. పీపుల్స్‌వార్ విప్లవోద్యమం మూలాన తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అగ్రవర్ణ దొరల పెత్తనాన్ని దెబ్బతీయడమే తెలంగాణకు విప్లవోద్యమం చేసిన మేలు.
ఇదీ ప్రజాబాహుళ్యంలో పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల్లోని నక్సలైట్స్ నాయకత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకం. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోకతప్పదు. 1970 కన్నా ముందు అధికారంలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి పోలీస్ రక్షణ, జెడ్ క్యాటగిరీ రక్షణ యిప్పుడున్నంతగా ఉండేదా? వీళ్లకి పోలీసు రక్షణ లేకపోతే చంపేస్తారా? చివరికి వీళ్ళ పడగ్గది చుట్టూ కూడా రక్షణ కవచాలెందుకు ఏర్పరుచుకుంటున్నారు? ఒకసారి ఒక రౌడీ రాజకీయ నాయకుడికి గార్డ్‌గా ఉన్న పోలీసు ఆఫీసర్ తో 'ఏమనిపిస్తుందండీ ఇటువంటి నాయకునికి రక్షణ యిస్తుంటే' అని అడిగాను.
'మా ఖర్మ సార్, మా ఖర్మ', ఇలాంటి రౌడీ వారికి కూడా కాపలాకాయాల్సి వస్తోంది. నక్సలైట్లు వచ్చి వీడినెత్తుకుపోతే బాగుణ్ణు అన్నాడు. బాగా చదువుకున్న వాళ్ళు నక్సలైట్లుగా వెళుతున్నారు. చదువుకున్న వాళ్ళు మేధావులూ పార్లమెంట్, అసెంబ్లీల్లోకి వెళ్ళాలి అని అప్పుడప్పుడు అమాయకంగా సమాజ శ్రేయోభిలాషులు ఉపన్యాసాలిస్తుంటారు. మన్మోహన్‌సింగ్, సోనియా గాంధీ, చిదంబరం, రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు... వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదా! చదువు, పుస్తకజ్ఞానం ఉంటే సరిపోదు సమాజ శ్రేయస్సుకి సంబంధించిన జ్ఞానం కావాలి.
సమాజశ్రేయస్సు త్యాగాన్ని కోరుతుంది. మనిషికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణత్యాగాన్ని కోరుతుంది. పేద ప్రజల కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించటం మహోన్నతమైన మానవులకే సాధ్యం. ఆ కోవలోని వారే ఆజాద్, కిషన్‌జీలు. వారి ఆశయాలు ఈ దేశ పీడిత ప్రజల్ని ఎప్పటికీ ముందుకే నడిపిస్తాయి. వారు అమరులు! వారికివే మా జోహార్లు.
- డాక్టర్ యం.ఎఫ్.గోపీనాథ్
కార్డియాలజిస్ట్, పూలే-అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
Andhra Jyothi Telugu News Paper Dated 27/11/2011
No comments:
Post a Comment