Saturday, November 19, 2011

తీర్పులతో బడుగులకు తిప్పలు..-పాపని నాగరాజుధర్మాసనంపై ఉన్న వారు అధర్మాన్ని తిరస్కరించి ధర్మాన్ని రక్షించాలి. ధర్మ పాలనకై తోడ్పాటును అందించాలి. పరిపాలనను నాలుగు పాదాలపై నడిపించాలి. మహాభారత కాలంలో పాండవులు ధర్మపాలనను నడిపారని పురాణాలు చెపుతున్నవి. అలాంటి పాలననే తామూ అందిస్తామని ప్రమాణాలు చేసి మన పాలకులు పాలనను కొనసాగిస్తున్నా రు. అంటే ఆ బ్రాహ్మణీయ తాత్విక భావజాలం నేటికీ వివిధ రూపాలలో మన సమాజాన్ని నడిపిస్తోంది. బ్రాహ్మణీయ సమాజానికి నాలుగు పాదాలుగా ఉన్న బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య, శూద్ర వర్ణాలు అతి శూద్ర వర్గాలుగా సృష్టించిన అయిదో వర్ణంపై ఆధారపడి బతుకుతున్నాయి. ఈ పంచ వర్ణాలను పది కాలాలపాటు రక్షించాల్సిన బాధ్యత ఈ రాజ్య పాలకులపై, ముఖ్యంగా ధర్మాకృతులపై ఉందని బ్రాహ్మణిజం చెబుతోంది. నాడు ఏకలవ్యుడి బొటనవేలును తెగ్గోసినట్లుగా.. ఈ ఆధునిక కాలంలో సైతం ఈ శూద్ర, అతి శూధ్రులైన బడుగు వర్గాల ప్రజలు ప్రాథమిక విద్య మొదలు శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్యలను బ్రాహ్మణీయ అగ్రకుల ఉన్నత వర్గాలతో సమానంగా చదువుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ బ్రాహ్మణిజం అగ్రకుల ఉన్నత వర్గాలకు అనుకూలతతో శూద్ర, అతిశూద్ర పీడితులపై ఆధిపత్యంతో శాసించమని పాండవుల వారసులైన మన పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. ఈ విధానాల వల్లనే బడుగులకు చాలా నష్టం జరుగుతున్నది. ఈ తరుణంలో వృత్తి విద్యా కళాశాలలో అందరికీ ఒకే ఫీజు విధా నం పేరుతో గతనెల హై కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 

క్యాపి ఫీజు చట్టంలోని సెక్షన్-7 ప్రకారం విద్యాసంస్థలు ప్రతిపాదించిన ఫీజు మొత్తాన్ని పరిశీలించాలి. సంబంధిత సంస్థ లాభాపేక్షతో వ్యవహరించడం లేదని క్యాపి ఫీజు వసూలు చేయడం లేదని నిర్ధారించుకొని, ప్రభుత్వం తగిన సవరణలు మాత్రమే చేయాలి. అలా కాదని ప్రభుత్వమే ఫీజులు నిర్ణయిస్తే ఆర్థిక స్వయం ప్రతిపత్తి గల సంస్థల విషయంలో జోక్యం చేసుకోవడం అవుతుంది. మరో మార్గదర్శకంలో ఒక విద్యాసంస్థలో ఒక కోర్సుకు ఎంత ఫీజు వసూలు చేయాలి? అనే విషయాన్ని సంబంధి త కాలేజీ ఆ సీటుపై పెట్టే వ్యయం ఆధారంగా నిర్ణయించాలి. ఇంకా ఎన్‌ఆర్‌ఐ కోటాలో ని 15శాతం సీట్లకు ప్రభుత్వం ఎక్కువ ఫీజును నిర్ణయించవచ్చు అని చెప్పింది. ఈ మూడు మార్గదర్శకాలలో వెల్లడించిన సారం మొత్తం విద్యను ప్రైవేటు పరం చేయడమే. ప్రైవేటు విద్యాసంస్థల్ని నెలకొల్పిన యాజమాన్యాలకు అవకాశం ఉన్నంత దోచుకొమ్మని చెప్పడమే అవుతుంది. అంతే కాదు ఈ తీర్పు వల్ల గ్యారంటీగా భర్తీ అయ్యే కన్వీనర్ కోటా సీట్ల ఫీజు పెరిగితే కాలేజీలన్నింటికీ లాభదాయకమే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ దేశ అగ్రకుల పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టి ప్రభుత్వ అజమాయిషీ లేకుండా దోచుకోవడానికి చట్ట బద్దతను కల్పించినట్లు ఉంది ఈ తీర్పు. నిజానికి రాష్ట్రంలోని ఏ ప్రైవేటు విద్యాసంస్థ అయినా.. ప్రభుత్వ అనుమతితో క్యాపి ఫీజులను వసూలు చేయడంలేదు. తమకు అందినంత దండుకుంటున్నాయి. ఆ తర్వాత తాము వసూలు చేస్తున్న ఫీజుల అనుమతికై ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నారు.

కళాశాలలో కోట్లాది రూపాయలతో విద్యార్థులకు సకల వసతులు, వనరులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ముందు ప్రైవేటు యాజమాన్యాలు చెప్పుకుంటున్నాయి. దీంతో.. తాము పెడుతున్న ఖర్చుకు, పెట్టుబడికి అనుగుణంగా ఫీజులు వసూలు చేసుకొనే అధికారం, అవకాశం ఇవ్వాలని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రతి వృత్తి విద్యా కోర్సు సీటుకు 15 నుంచి 20 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఈ విచక్షణారహిత ఫీజుల దోపిడీ పై విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఏదో మాట వరుసకు నిర్బంధంగాఫీజులు వసూలు చేస్తే కాలేజీల గుర్తింపు రద్దుచేస్తామని పభుత్వం హెచ్చరికలు జారీ చేసినా, కాలేజీ యాజమాన్యాలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. సౌకర్యాలు, వనరులు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలు రాష్ట్రంలో వేళ్లమీద లెక్కించవచ్చు. మిగతా కాలేజీల్లో నామమావూతపు వనరులు, సౌకర్యాలు కూడా లేకుండా విద్యావూపమాణాలను మంటగలుపుతున్నాయి. కానీ ఫీజులు మాత్రం విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. మరోవైపు విద్యను వ్యాపారంగా మార్చే క్రమంలోనే గత కొన్ని ఏళ్లుగా దరఖాస్తు చేసుకున్న ప్రతి వారికీ కాలేజీ స్థాపనకు అనుమతులు మంజూరు చేసింది ప్రభు త్వం. దీంతో రాష్ట్రంలో వృత్తి విద్యా కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. ఇప్పుడు ఏ కళాశాలలోనూ ఏ కోర్సులలోనూ సీట్లు నిండడం లేదు. ఈ క్రమంలో ఒకే ఫీజు విధానం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వ ఫీజు 60 వేలకు పైగా ఉన్నందున ఆ విధానాల్ని మన రాష్ట్రంలోని కళాశాలలకు వర్తింప చేయాలని యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. 

ఈ తరుణంలో 2009 విద్యాసంవత్సర ప్రారంభంలో యాజమాన్యాల తరఫున హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కొనసాగింపుగానే ప్రభుత్వం ఫీజు మాఫీ విధానాన్ని ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తున్నది. సరిగ్గా ఈ సమయంలోనే హైకోర్టు తీర్పు వెలువడింది. నిబంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను రెండు లక్షల రూపాయలకు అమ్ముకోవాలి. కానీ.. ఆయా కాలేజీల యాజమాన్యాలు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. కోర్టు కూడా ఈ ఎన్‌ఆర్‌ఐ సీట్లకు అధిక ఫీజులను వసూలు చేసి, ఆ పీజుతో పేద విద్యార్థులకు రాయితీలు కల్పించాలని సూచించింది. కానీ..యాజమాన్యాలు దీనిని సాకుగా తీసుకొని రెచ్చిపోయి దండుకుంటున్నాయి.ఇక హైకోర్టు తీర్పు పేద బడుగు వర్గాల విద్యార్థుల భవితవ్యాలను గాలికి వదిలేనట్టు గా ఉంది. విద్యావూపమాణాలు, సామాజిక స్థితిగతులు పట్టించుకోకుండా.. సాంకేతిక అంశాల ప్రాతిపదికగా తీర్పును ఇచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు వేల వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయి. వీటిలో మూడువేల రకాల సమస్యలూ ఉన్నా యి. దీనిని జెఎన్‌టీయూ-హెచ్, ఉన్నత విద్యామండలి, మంత్రి వర్గ ఉపసంఘం కూడా ధృవీకరించింది. అలాంటప్పుడు ఈ సమస్యలు పరిష్కరించకుండా, విద్యా ప్రమాణాలు పాటించకుండా.. ఫీజులు మాత్రం ఇతర రాష్ట్రాల మాదిరిగా వసూలు చేయాలని కోరుకోవడం బడుగు వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేయడం తప్ప మరేమీ కాదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బహుజనులు గత దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేశారు. చేస్తున్నారు. 

ఈ పోరాటాల ఫలితంగా దక్కిన ఉన్నత విద్యా హామీని కూడా ఇప్పుడు కోర్టు తీర్పుల సాకుతో.. దక్కకుండా చేస్తున్నారు. హైకోర్టు తీర్పుతో బడుగు వెనుకబడిన వర్గాల విద్యార్థులు కోరుకున్న కాలేజీలో సీటు పొందకుండా కావడంతోపాటు.. క్యాపి ఫీజు కట్టి చదువుకునే స్థితిలేని పరిస్థితిని సృష్టిస్తున్నారు. అగ్రకుల బ్రాహ్మణాధిక్య సమాజంలో.. కోర్టు తీర్పులు కూడా అందుకు అతీతంగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. వర్ణ వర్గ వ్యవస్థలో ఆ వర్గాల ప్రయోజనాలను నెరవేర్చే న్యాయమే ఉంటదని సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పి దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడూ ఈ తీర్పులతో దళిత బహుజనుల ప్రయోజనాల కు గొడ్డలి పెట్టు అని గుర్తించి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలపై ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా.. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు పోవాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం బడుగు వర్గాల విశ్వాసాన్ని, మద్దతును పొందుతుంది. 

Namasete Telangana News Paper Dated 20/11/2011.

తెలంగాణ బహుజన విద్యార్థిసంఘం అధ్యక్షులు

No comments:

Post a Comment