భారతీయ ఆదివాసులు ఈ దేశం యొక్క మొదటి మానవులు. వృద్ధికి వచ్చిన ఇతర జాతుల వల్ల అనేక సంవత్సరాల నుండి వీరు తృణీకరించబడిన మంద భాగ్యులు. వారిని స్థానికంగా ఉపయోగానికివచ్చిన ఔషధం వలే మనం ఆదరించవలసి వున్నది. వారి ప్రశస్తి గల పునాదులు అత్యంత లోతైనవి.
- మహాత్మాగాంధీ
ఈ సమాజానికి తొలిమానవులు ఆదివాసులు. మన ఆంధ్రప్రదేశ్‌లో నేడు 35 గిరిజన తెగలు జీవిస్తున్నాయి. వాటిలో యానాది అనే గిరిజన తెగ ఒకటి. కాని యానాది తెగ తరతరాల నుండి ఎలాంటి ఎదుగుదల లేని జీవితాలు గడుపుతున్న మాట నిజం. యానాది జాతి చరిత్ర హీనమైనదని, పిరికివాళ్ళని, సోమరిపోతులని చాలా మంది మేథావులు అవమానకరమయిన విశ్లేషణలు చేస్తూ యానాది జాతిని కించపరిచారు. దారుణంగా నిర్లక్ష్యం చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ సమాజానికి దూరంగా, విసిరేసి దిక్కులేని వారుగా చేశారు.
నిజానికి యానాదులు చరిత్ర హీనులు కాదని చెప్పడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. యానాదులలో ఉపకులాలు కలవు అని నెల్లూరు జిల్లా గెజిట్‌లోకి తొంగిచూసే పెద్దలు లేకపోలేదు. అది కేవలం ఆ గెజిట్‌ని లిఖించినటువంటి పెద్దల అవగాహనలోపమే తప్ప వాస్తవం కాదు. కులాల పుట్టుక ఉపకులాల పుట్టుక గురించి లోతుగా పరిశీలిస్తున్న రోజులు ఇవి. ఆ వెలుగులో చూసినప్పుడు యానాదులలో వున్న ఈ ఉపకులాల వాదన గుట్టు రట్టు కాగలదు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో 1924 క్రిమినల్ ట్రైబ్యుల్ యాక్ట్ (సిటి-ఏక్టా) అనే నీచమైన, దుర్మార్గమైన చట్టం రూపొందించి దేశంలోని గిరిజన జాతులను నేరస్థ జాతులుగా పరిగణించి క్రూరమైన హింసలకు గురిచేశారు. మొత్తం గిరిజన జీవితాలను నలిపివేశారు. ఈ దమన కాండలో భాగంగా 1871 నుండి 1948 వరకు ఆంధ్ర దేశంలో కూడా యానాదులను నేరస్థులుగా పరిగణించారు. చిత్రహింసలు పెట్టారు. స్త్రీలపై అత్యాచారాలు జరిపారు.
మొత్తం యానాది జాతి బిడ్డలను స్టూవర్టుపురం, సీతానగరం, కప్పరాల తిప్ప, కావలి, సీతాపురం, పులివెందుల, శిద్దాపురం, పదరి కుప్పం, తెలంగాణ నల్లమల ప్రాంతానికి దగ్గరలోని లింగాల వద్ద సెటిల్‌మెంట్స్(నిర్బంధ శిబిరాలు)ని ఏర్పాటు చేసి కూృరాతి కూృరంగా నిర్భందించారు. మాయామర్మం తెలియని యానాదులకు తమ జీవితాలపై విసుగు పుట్టించారు. ఈ నాగరిక మనుషులంటేనే భయపడిపోయి మానవ సమాజానికి దూరంగా పారిపోయి బ్రతికేలా ఈ చట్టం చేసింది. అంటే యానాది జాతిని ఈ సమాజానికి దూరంగా ఉద్దేశపూరితంగానే బలవంతంగా నెట్టివేశారని స్పష్టంగా చెప్పుకోవచ్చు.
ఈ దుర్మార్గమైన పరిస్థితులలో దేశవ్యాప్తంగా బ్రిటీష్ వలసవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం జాతీయ పోరాటాలు అవిశ్రాంతంగా జరుగుతున్న రోజులలో ఆంధ్ర దేశంలో కూడా ఈ పోరాటం రగులుకున్నది. ఈ జాతీయ పోరాటకాలంలోనే ఎరుకల, యానాది, లంబాడి, చెంచు, గిరిజన తెగలు తమపై జరుగుతున్న రాక్షస క్రిమినల్ ట్రైబ్యుల్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ప్రముఖ గాంధేయవాది కీ.శే. 'వెన్నలకంటి రాఘవయ్య' ఇచ్చిన చైతన్యంతో అక్షర జ్ఞానం లేని యానాది పెద్దలు శాంతియుత పోరాటానికి నడుం బిగించారు.
వీరిలో ఊటుకూరు కోటయ్య, నిమ్మళ్ల శేషయ్య, కత్తి చెల్లెమ్మ, ఎర్ర సుబ్బయ్య, వేణబాక రామయ్య, చొక్కా సుబ్బయ్య, తిరివీధుల సాంబయ్య లాంటి వారు ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. అనేక సార్లు అరెస్టయి జైలుకెళ్ళారు. జాతిపిత 'మహాత్మాగాంధీ' తలపెట్టిన వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని యానాది జాతికి స్వాతంత్య్ర పోరాటంలో భాగాన్ని కలిపించారు. నాడు బ్రిటీష్ వారు అమలు జరిపిన ప్రజా వ్యతిరేక చట్టాలను ఎదిరించిన ప్రతిపోరాటం జాతీయ పోరాటంగా గుర్తింపు పొందింది. ఆ పోరాటాలలో పాల్గొన్న వారు స్వతంత్ర సమరయోధులుగా కీర్తించబడ్డారు.
నేటికీ కీర్తించబడుతున్నారు. కానీ క్రిమినల్ ట్రైబ్యుల్ యాక్ట్ అనే చట్టానికి వ్యతిరేకంగా ఈ యానాదులు జరిపిన పోరాటం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చరిత్రకారులు చూడలేకపోవడం, గుర్తించలేకపోవడం వారి వర్గ స్పృహను గుర్తించవలసి వుంటుంది. ఒకరకంగా చరిత్రలో యానాదులకు ఇది రాజకీయంగా, చారిత్రకంగా జరిగిన ద్రోహంగా భావించటం తప్పు కాదని యానాది సేవాసంఘం భావిస్తుంది.
నేడు సమాజంలో అనేక జాతులు, కులాలు తమ ఉనికి కోసం, అస్తిిత్వాల కోసం, తమ హక్కుల కోసం, పాలనాధికారంలో తమ వాటా కోసం పోరాడుతుండటం అందరికీ తెలిసిన సత్యమే. కానీ యానాదులు మాత్రం చరిత్రలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే చైతన్యం లేక భయభయంగానే బ్రతుకుతున్నారు. అడగకపోవడం ప్రశ్నించలేకపోవడం యానాదుల వినమ్రతగా చెప్పుకోవచ్చు. కానీ ఆ వినమ్రతే మా పాలిట శాపంగా మారింది. ఆ కారణంగానే చరిత్రకారులు యానాదులను పిరికివాళ్లుగా చిత్రీకరించి, నీచంగా హేళన చేస్తూ వారి వికృత మనస్తత్వాలను బహిర్గతం చేసుకుంటున్నారు.
నిజానికి యానాది జాతి పిరికిది కాదు. పెద్ద పెద్ద జమిందార్లు, భూస్వాములు, రైతుల ఇళ్లకు, పొలాలకు వారి ఆస్తులకు, గ్రామాలకు రాత్రనక, పగలనక, విష సర్పాలనక, క్రూరమృగాలనక, చావును సైతం లెక్కచేయక కాపలాదారులుగా ఉన్న యానాది జాతిని పిరికివాళ్లుగా చిత్రీకరించడంలో దాగిన సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు. యానాది జాతి పిరికివాళ్లు అని హేళన చేస్తున్నవారి కుట్ర స్పష్టంగా తేటతెల్లమవుతుంది. నిజానికి యానాది జాతి ఒకే ఒక విషయంలో భయపడుతుంది. అది సాటి మనుషులంటే, వాళ్ళ కుట్రలను చూసి, కుతంత్రాలను చూసి, వారి కాఠిన్యాన్ని చూసి భయపడటం నిజమే.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలైనా యానాదుల జీవితాలు ఎలాంటి ఎదుగుదలకు నోచుకోక అనాగరికంగా, అమాయకంగా జీవిస్తున్నారు. యానాదుల అభివృద్ధికోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపట్టిన కోట్లాది రూపాయలు వెచ్చించినా అవి యానాదుల పూరిగుడిసె సమీపంలోనికి చేరవనేది నిర్వివాదాంశం. ఒక వేళ జారిపోయి చేరినా అవి మధ్యలోనే దళారుల పాలవుతున్నాయి. నేటికీ యానాది బిడ్డలు అక్షరానికి నోచుకోలేక అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్నారు. కారణం వారికి స్థిరమయిన ఆర్థిక వనరులు లేకపోవడం. ఒకటి రెండు అవకాశాలు కల్పించినా వాటి గురించి కూడా సరైన అవగాహన లేకపోవడం.
యానాదుల అభివృద్ధి కోసం అంటూ కేవలం వారి కోసమే (ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప) నెల్లూరులో ఏర్పాటు చేసిన ఐ.ఐ.డి.ఎ(యూనిట్ ప్రాజెక్ట్)కి కేటాయించిన బడ్జెట్‌ల క్రమాన్ని చూస్తే యానాదుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతున్నది. 2007, 2008లో మూడు కోట్ల అరవై లక్షలకు బడ్జెట్ ప్రతిపాదన పంపగా ప్రభుత్వం వారు రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు విడుదల చేశారు. 2008-2009లో 3 కోట్ల 50 లక్షలకు ప్రతిపాదన పంపగా ఒక కోటి అరవై రెండు లక్షలు మంజూరు చేశారు.
2009-2010లో 3 కోట్ల 36 లక్షల 74వేలకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా కేవలం 35 లక్షల 95వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇలా ప్రతి ఏడాది బడ్జెట్‌లో కోతలు విధిస్తున్నారు. ఈ విధానాన్ని పరిశీలిస్తే యానాదుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేలికగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రాష్ట్ర గిరిజన జనాభాలో 3వ వంతు జన సంఖ్య కలిగిన యానాదులను జనాభా లెక్కలలో తక్కువ సంఖ్యగా రికార్డులలో చూపుతున్నారు. ఫలితంగా మైదాన ప్రాంతాల్లో నియోజకవర్గాల సర్దుబాటు విషయంలో, మైదాన ప్రాంతంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక్క ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గం కేటాయించలేకపోవడం వెనుక దాగివున్న అసలు సంగతి ఏమిటో తెలియాల్సి వుంది.
ఇన్ని సంవత్సరాల నుండి ప్రజాస్వామిక పాలన వ్యవస్థలో యానాది జాతి భాగస్వామ్యం లేకపోవడం, చేయకపోవడం ఆశ్చర్యకరమే. వారిని కేవలం స్థానిక సంస్థలకే పరిమితం చేయడం దురదృష్టకరమే. రాష్ట్రంలో అన్ని జాతులు, అన్ని కులాలు తమ నాయకుల ద్వారా శాసనసభలలో తమ కోసం, తమ హక్కులకోసం, తమ గొంతుకను విప్పుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 64 సంవత్సరాలు నిండినా కూడా అసెంబ్లీ, పార్లమెంట్ గేట్ల సమీపానికి కూడా యానాదులు చేరుకోలేకపోయారు. యానాది జాతికి పాలన వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది.
కనీసం నామినేటెడ్ పోస్టులకు కూడా యానాదులను అనర్హులను చేయడం యానాదులకు జరిగిన అన్యాయంగా భావించాలి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల యానాది జాతి జనాభా రాజకీయంగా, దారుణమైన వివక్షకు గురయింది. ఈ మైదాన గిరిజనులు అయిన యానాదులను ఎందుకింత నిర్లక్ష్యానికి గురిచేసారో నాయకులు ఆలోచించాల్సి వుంది. ఒకవేళ ఈ మైదాన ప్రాంతంలో గిరిజనులుగా జన్మించడమే మేముచేసిన నేరమా? లేక పాపమా? జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లలో యానాదులకు చోటు కల్పించకపోవటంగానీ, కనీసం జిల్లాల్లో మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీలలో స్థానం ఇవ్వకపోవడాన్నిబట్టి యానాదుల స్థానం ఎక్కడుందో ప్రజాస్వామికవాదులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సి వుంది.
- ఏకుల వెంకటేశ్వర్లు (ఇ.వి)
రాష్ట్ర అధ్యక్షులు, యానాది సేవా సంఘం Andhra Jyothi News Paper Dated 18/11/2011
No comments:
Post a Comment