Friday, November 18, 2011

నిర్బంధాన్ని నిలువరిద్దాం By -డాక్టర్ సి.కాశీం


‘వాడు చమురు దాహానికి రేపిన/ఇసుక తుఫాను రేణువులన్నీ ఇక్కడ/ నీ, నా కనుప్పల మెత్తని కూసాన్ని తెగ్గోస్తున్నా/ఎంత అచేతనంగా పడుకున్నాం మనం/ పాలపొడుల మీద, పడిసి చెక్కిళ్ల మీద/ తల్లి రొమ్ముల మీద వృద్ధాప్యం చేతి కర్ర మీద/ బాంబులు కురుస్తు న్నా/ బంకర్లలో దాక్కున్నామే మనం/ ముష్టి బతుకుకోసం తొండల్లా వంగి వంగి దాక్కున్నామే గాని/ మనుషుల్లా నిటారుగా నిలబడలేని నిన్నూ, నన్ను చూసి/ భూమికి సమాంతరంగా నడుస్తున్న జీవులూ వెక్కిరిస్తున్నాయి’ (కవిత్వంపై ఎర్రజెండా-పుట-183)

ఈ కవితను చెరుకు సుధాకర్ ఫిబ్రవరి 1999న రాశాడు. విరసం ప్రచురించిన ‘కవిత్వంపై ఎర్రజెండా’ సంకలనంలో అచ్చయింది. అమెరికన్ సామ్రాజ్యవాదం చమురు కోసం ఇరాన్ మీద చేసిన దాడిని సుధాకర్ ఈ కవితలో చిత్రించాడు. బలహీనుల మీద బలవంతులు చేస్తున్న దాడి సందర్భంలో మౌనంగా ఉండే మధ్యతరగతి బుద్ధిజీవుల అచేతన స్థితిని అసహ్యించుకున్నాడు. ఒక విప్లవకవిగా అమెరికా సామ్రాజ్యవాదినైనా, ఆంధ్ర వలసవాదినైనా ఒకేలా చూసే రాజకీయ దృష్టి ని, సైద్ధాంతిక బలాన్ని అతడు నడిసొచ్చిన దారే నేర్పింది. ఆ దారి సమ స్త ప్రజలను విముక్తి చేసేది. అక్కడి నుంచి కాస్త ఆగిచూస్తే...
దృశ్యం మారిపోయింది. అస్తిత్వ పోరాటంలో కూడా సుధాకర్ చాలా దారులే నడిచాడు. తెలంగాణ మహాసభ నుంచి రాష్ట్ర సాధన కోసం మడమ తిప్పని పోరాటమే చేస్తున్నాడు. తెలంగాణ కోసం పోరా ట ఆచరణ సరిగ్గానే ఉందనడానికి ఆయన పట్ల శత్రువు వైఖరే గీటురాయి. తెలంగాణ ఉద్యమంలో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మొద టి వ్యక్తిగా నిలబడ్డాడు. ఇప్పుడు శత్రు శిబిరంలో వరంగల్ కారాగారంలో తెలంగాణను కలగంటున్నాడు. ఇంత జరిగినా తెలంగాణలో ఉండే బుద్ధిజీవులు మౌనంగా ఉండటమే ఆశ్చర్యం. ‘శత్రువు మన దగ్గరకు రాలేదు కదా!’ అని మౌనంగా ఉంటే, మనల్ని చంపేసే నాటికి మాట్లాడటానికి ఇంకెవరు మిగలరనే సత్యాన్ని గుర్తించనంత జడత్వంలో తెలంగాణ బుద్ధిజీవులున్నారా? పై కవితలో చెప్పినట్టు బతుకు కోసం తొడల్లా వంగి వంగి దాక్కున్నామా?

నిర్మాణపరంగా సుధాకర్ ఒక బూర్జువా పార్టీలో ఉండవచ్చు. కాని అతడు కవి, రచయిత, వృత్తిరీత్యా డాక్టర్. అట్లాంటి వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టిన సందర్భంలోనైనా బుద్ధిజీవులు స్పందించాలి. ఒక సృజనాత్మక రచయిత విషయంలో రాజ్యం ఎంత ఫాసిస్టుగా వ్యవహరించిందో ప్రపంచానికి చాటి చెప్పాలి. నిజానికి ఆయన కవితా రచనను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. అక్టోబర్ 3న 307 సెక్షన్ కింద నకిరేకల్ పోలీసులు అరెస్టు చేసి నల్లగొండ జైలులో బంధించారు. బిడ్డ పెళ్లి పను లు చూసుకోకుండా పదిహేను రోజులు జైలులో ఉంచారు. దొడ్డి కొమురయ్య బ్యారక్ నుంచి (జైలులో ఉన్న తెలంగాణవాదులు జైలు గదులకు మార్చి రాసిన పేర్లు) అక్టోబర్ 13న రాసిన ‘ఎ పోయం ఈజ్ ఫ్లోయెమ్’ ఒక దినపవూతికలో అచ్చయింది. పాట వెన్నెల చిలుకరించినట్లు/ నెత్తురు వొలకబోసినట్లు ..అది కవితైనా, పాటైనా, కవితా పాట కలిసిన ప్రవాహమే. నడుస్తున్న తెలంగాణ ఉద్యమ ప్రవాహానికి ప్రతీకగా ఈ పోయెంను సుధాకర్ శత్రు శిబిరంలో దోబూచులాడిన నెలవంక సాక్షిగా రాశాడు.

ఉద్యమ నాయకుడిగా మారినా తనలోని కవి చేతనంలోనే ఉన్నాడు.సుధాకర్‌కు ఒక ఉజ్వలమైన గతమున్నది. పోరాట వర్తమానమున్నది. అట్లాంటి గతమే కావచ్చు ఆయనను ఈ దారిలోకి నడిపించింది. అతని తండ్రి ఉషాగౌడ్ తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టిన నాయకుడు. రజాకారులు మనుషులను సామూహికంగా బావిలో వేసి చంపిన గుండ్రాంపల్లి అనే పోరాట గ్రామంలో సుధాకర్ పుట్టాడు. ఈ చైతన్యంతో ఆయన ప్రయాణం విర సం, పౌరహక్కుల సంఘాల మీదుగా నడిచింది.
విప్లవ రాజకీయాల నుంచి పార్లమెంటరీ రాజకీయాలలోకి వెళ్లినా పోరాట రూపాలు రాజ్యాన్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటే, పాలక వర్గాలు సహించవనడానికి సుధాకర్ ఉదాహరణ.

తెలంగాణ ఉద్యమాన్ని వా యిదా పద్ధతిలో నడుపుతున్న సందర్భంలో కోస్తాంధ్ర పాలకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే మిలిటెంట్ పోరాటాన్ని సుధాకర్ నడిపించాడు. సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఆంధ్ర బస్సులను తెలంగాణ లో నడిపించాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి పన్నాగాన్ని తిప్పికొడుతూ నకిరేకల్‌లో సుధాకర్ నాయకత్వంలో 30 బస్సులను నిలువరించారు. ఇట్లాంటి పోరాట రూపాలు మొత్తం తెలంగాణ ఉద్యమానికి నమూనాగా మారవల్సినవి. కానీ అది జరగలేదు. దీంతో సుధాకర్‌తోపాటు మరో 100 మందిపై నకిరేకల్ పోలీసులు 307 సెక్షన్ కింద నిర్బంధించారు. నాడు పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాటం నిర్మించి ఉంటే నేడు పీడీ చట్టం కింద అరెస్టు చేసేవారు కాదు.

ఇప్పటికైనా కోస్తాంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమంపై అమలుచేస్తున్న నిర్బంధాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలి. సాంద్రత కలిగిన ఒక కవిని, మేధావిని, డాక్టర్‌ను అక్రమ నిర్బంధం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ బుద్ధిజీవులపై ఉంది. ఎమ్జన్సీలో పీడీయాక్ట్ కింద అరెస్టైయిన కవులను, మేధావులను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణను బుద్ధిజీవులు రూపొందించుకున్నారో అలాం టి పనిని నేటి తెలంగాణ బుద్ధిజీవులు చేయాలి.
Namasete Telangana News Paper Dated 19/11/.2011

No comments:

Post a Comment