Friday, November 4, 2011

నిష్కామ కర్మ సిద్ధాంతమా శ్రీరామా!?----జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్, కనీజ్ ఫాతిమా, సుధాకర్ అరూరి, సిలువేరు హరినాథ్, గుడిపల్లి రవి,


వర్గీకరణ సాధనలో మందకృష్ణ వైఫల్యం చెందాడనేది శ్రీరాములు ఆరోపణ. ఒకవేళ నిజంగానే వర్గీకరణ విషయంలో మాదిగలు వైఫల్యం చెందారు అని అంగీకరిస్తే, వారికి సామాజిక తెలంగాణ అడిగే హక్కు ఉండదా? విశాలమైన బహుజనులను ఏకతాటి మీదికి తీసుకురాలేకపోయారు కాబట్టి అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతమంతా పనికి రాకుండాపోతుందా?

సామాజిక తెలంగాణ డిమాండ్ గురించి జరుగుతున్న చర్చ మందకృష్ణ నాయకత్వంలోని దండోరా కేంద్రంగా సాగుతున్నది. మందకృష్ణ రాసిన వ్యాసంపై స్పందిస్తూ మావోయిస్టు రాజకీయ ఖైదీ శ్రీరాముల శ్రీనివాస్ మార్క్సిస్టు దృక్పథం నుంచి తెలంగాణ సమస్యను విశ్లేషిస్తూ మందకృష్ణ మీద, దండోరా మీద తీవ్రమైన విమర్శలే చేశారు. ‘బుద్ధిగా ఆలోచించు, తెలివిగా మసలుకో!’ అని హితవు పలుకుతూ మరికొంత మంది మాదిగ మేధావులు, ఉద్యమకారులు మందకృష్ణ లక్ష్యంగా విమర్శలు చేశారు. సామాజిక తెలంగాణ డిమాండ్ గురించి మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకొని వెలువడుతున్న విమర్శల ప్రాసంగికతను పక్కకు పెడితే, అవి తెలంగాణ బహుజనులు కోరుకుంటున్న సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అనే ఆశయాలను సాధించేందుకు ఉపకరిస్తున్నాయా? లేక వారి పరా స్తం చేసేందుకు ఉపయోగపడుతున్నాయా అనేది అవలోకించాలి.
సామాజిక తెలంగాణ అనే నినాదం మందకృష్ణతో ప్రారంభమైంది కాదు. మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభతో 1996లో ప్రారంభమైంది.

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనుకూలమైన వ్యవస్థ నిర్మాణం ఆ సంస్థ సదాశయం. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ మారోజు వీరన్న ఉద్యమాన్ని ఆక్రమించు కొనేందుకు తెలంగాణ జనసభ పేరుతో ఉద్యమం మొదలుపెట్టింది. ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్‌ను మావోయిస్టు పార్టీ వేదిక మీదికి తెచ్చింది. ఆ డిమాండ్ కోసమే కేసీఆర్‌ను అనేకసార్లు పార్టీ విమర్శించింది. కానీ శ్రీరాముల శ్రీనివాస్ వ్యాసం వల్ల మావోయిస్టు పార్టీ కేవలం భౌగోళిక తెలంగాణ డిమాండ్ ను మాత్రమే అంగీకరిస్తున్నదని బోధపడుతున్నది. ఆయన ప్రకారం ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాలంటే సాయుధ పోరాటం ద్వారా విప్లవం తీసుకురావాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యం. ఇప్పుడు ప్రజలంతా భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నారు కాబట్టి, ప్రజాభీష్టం మేరకు ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్‌ను మావోయిస్టు పార్టీ వదిలేసుకుందన్నమాట.

అంటే ప్రజాభీష్టం మేరకు మాత్రమే విప్లవ సంస్థలు, ఉద్యమ సంస్థలు పనిచేయాలనే సూత్రం తర్కబద్ధమా? ఆమోదనీయమా అనేది. మెజారిటీ ప్రజలకు కుల వ్యవస్థ అంగీకారయోగ్యమైంది కాబట్టి దాని నిర్మూలన కోసం ఎవరూ పోరాడ కూడదు. ప్రజలంతా కమ్యూనిస్టు పరిభాషలో బూర్జువా భూస్వామ్య గుత్తా/దళారీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకతతో లేరు. కనుక మావోయిస్టు పార్టీ దుకాణం మూసేసుకొని రామనామ జపం చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి కరసేవకులుగా మారాలన్న మాట! అన్నా ఓ శ్రీరామ! ఎంత గొప్ప తర్కం నీదయ్యా!
సామాజిక తెలంగాణ కోరుతున్నది తొంభై శాతం మంది బహుజనులు. అది కేవలం మాదిగల డిమాండ్ మాత్రమే కాదు. అయితే సుదీర్ఘ కాలంగా మాదిగలు పోరాడుతున్నందున, కుల వ్యవస్థ పట్ల తీవ్రమైన తిరస్కారం మాదిగలకు మాత్ర మే ఉండటం వల్ల బహుజనులకు నాయకత్వం వహించే స్థానంలో ఉన్నారు.

కోటి మంది మాదిగలకు మందకృష్ణ నాయకుడనేది ఎవరూ కాదనలేరు. ఆయనకు సామాజిక తెలంగాణ కావాలి. దొరల తెలంగాణ కాదు అన్నందుకు దొరలు ఉలిక్కిపడాలి కానీ, మావోయిస్టు ఖైదీలు, మావోయిస్టు సాయుధులు భయపడటంలో అర్థం లేదు. దొరల తరఫున శ్రీరాములు మాట్లాడుతున్నాడంటే బహుజనులు ఆలోచించాలి. దండోరా ఉద్యమంలోని నిర్మాణపరమైన, వ్యూహాత్మకమైన సమస్యలను చూపిస్తూ మీకు సామాజిక తెలంగాణ అడిగే హక్కు లేదనడం ఏ రకమైన మావోయిజం. ఈ దేశంలో విప్లవం తీసుకొస్తామని బయల్దేరిన మావోయిస్టులు ముప్ఫై ఏళ్ల తర్వాత కూడా విజయం సాధించలేదు. కాబట్టి మావోయిజం పనికి రాదు. మీకు విప్లవం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు అని అంబేద్కరైట్లు దబాయిస్తే సరే అంటారేమో!మందకృష్ణ మావోను, స్టాలిన్‌ను కోట్ చేయడం శ్రీరాములకు నచ్చలేదు. మావోను కోట్‌చేస్తే తప్పకుండా సాయుధ పోరాటం వైపు మాదిగలను సమాయత్తం చేయాలా? ఇప్పటి దాకా విప్లవం పేరుతో మాదిగలను చంపింది చాలదా శ్రీరామా!? మావో స్ఫూర్తి తీసుకుంటున్నాము అంటే విప్లవ పంథాలోనే పనిచేస్తామని శీల పరీక్షకు సిద్ధపడాలా?

తెలంగాణ ఉద్యమంలో కుల సమస్యను పరిశీలించటం గురించి శ్రీరాములు అసహనం వ్యక్తం చేశాడు. తెలంగాణను ఆయన మాత్రం మార్క్సిస్టు పద్ధతిలో విశ్లేషిస్తారు. అంబేద్కరిజం వెలుగులో మాత్రం తెలంగాణ ఉద్యమాన్ని బహుజనులు పరిశీలించరాదట. ఈ ద్వంద్వ వైఖరి బ్రాహ్మణవాదం అంటే తప్పెలా అవుతుంది? కులం ఒక సామాజిక వాస్తవం అనే విషయాన్ని అంగీకరించలేని శ్రీరాములు మాత్రం ‘సింగరేణి మొత్తాన్ని రెడ్లు, కమ్మలు, వెలమలు గుల్ల గుల్ల చేసి జనాలను ఊర్లు విడిచిపోయేలా ఓపెన్ కాస్ట్ గనులు నిర్వహిస్తున్నారు’ అని సూత్రీకరిస్తున్నారు. ఇది శ్రీరాములు అవగాహనా? లేక మావోయిస్టు పార్టీ అవగాహనా? కులం కోణం నుంచి ఆర్థిక దోపిడీని విశ్లేషించటం మార్క్సిస్టు పద్ధతి కాదు. కానీ శ్రీరాములు మాత్రం నిర్భయంగా చేస్తున్నారు. కులం గురించి మాదిగల కన్నా, బహుజనుల కన్నా మావోయిస్టులకే ఎక్కువ తెలుసు అనే విషయాన్ని ప్రదర్శిస్తూ కింది కులాలను మోసం చేసే ఎత్తుగడ తప్ప మరోటి కాదు.


మందకృష్ణ చేసిన సైకిల్ యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ధైర్యాన్ని నింపలేకపోయిందనీ శ్రీరాములు ఉటంకిస్తున్నాడు. మందకృష్ణ సైకిల్ యాత్ర చేసింది 2004లో. మందకృష్ణ ఉద్యమం వల్ల మాదిగలు ఆత్మహత్యలు చేసుకొనే చైతన్యం పొందలేదు. ఇప్పటికీ మాదిగలు వర్గీకరణ కోసం ఆత్మహత్య మార్గం కాకుండా పోరాట పంథానే అనుసరిస్తున్నారు. కానీ, బహుజనులు ఆత్మహత్యచేసుకోవడానికి కేసీఆర్, ఆయన నాయక గణం మాత్రమే కార ణం. 2009 తర్వాత జరుగుతున్న ఉద్యమాన్ని నైరాశ్యం, నిస్పృ హ మార్గంలో కేసీఆర్, రాజకీయ జేఏసీ నడిపిస్తోంది. ఈ వాస్తవాన్ని బహుజన సంస్థలు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాయి.

వర్గీకరణ సాధనలో మందకృష్ణ వైఫల్యం చెందాడనేది శ్రీరాములు ఆరోపణ. ఒకవేళ నిజంగానే వర్గీకరణ విషయంలో మాదిగలు వైఫల్యం చెందారు అని అంగీకరిస్తే, వారికి సామాజిక తెలంగాణ అడిగే హక్కు ఉండదా? విశాలమైన బహుజనులను ఏకతాటి మీదికి తీసుకురాలేకపోయారు కాబట్టి అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతమంతా పనికి రాకుండాపోతుందా? కులం వల్ల బాధితులైన ప్రజలు కూడా కుల ధర్మాన్ని సమర్థించిన గాంధీ వెంట వెళ్లారు. కాబట్టి గాంధీ ప్రవచించిన మనుధర్మం న్యాయసమ్మత అవుతుందా? సామాజిక తెలంగాణ అంటేనే మావోయిస్టులకు ఇంత వెగటు ఎందుకు కలుగుతుంది? మావోయిజం మనువాదానికి ఉగ్రరూపం కావటమే అందుకు కారణం. విప్లవం పేరుతో బ్రాహ్మణవాద వ్యవస్థను నిర్మించొచ్చు. కానీ, సామాజిక విప్లవం పేరుతో కుల రహిత సమాజం నిర్మిస్తే ఇంకేమైనా ఉందా? ధర్మం నాశనమైపోదూ రామా! రామా! ఎంత పాపం!?
బహుజనులు సామాజిక తెలంగాణ అడగకుండా సకల జనుల సమ్మెలో బేషరతుగా పాల్గొని సార్వవూతిక తిరుగుబాటుగా సమ్మెను మార్చాలని శ్రీరాములు మాదిగలకు సూచిస్తున్నాడు.

అడగకుండానే ఉద్యమకారులకు ఒక కార్యక్షికమాన్ని నిర్దేశించే అలవాటు ఈ మావోయిస్టులు పొరపాటున కూడా వదులుకోరు. ఉపదేశం బ్రాహ్మణుల హక్కు. అధి ధర్మబద్ధమైంది. శ్రీరాములు కూడా అదే ధర్మాన్ని అనుసరిస్తున్నారు. మావోయిస్టు సిద్ధాంతం నిష్కామ కర్మ సిద్ధాంతానికి మారు రూపం. ఎలాంటి ఆపేక్ష లేకుండా బహుజనులు సమ్మెలో పాల్గొనాలనే వాదం కర్మ సిద్ధాంతం కాకపోతే మరేమిటి? ఇదేనా మావోయిజం? అదే మావోయిజం అయితే దానికి వ్యతిరేకంగా బహుజనులు శక్తిమేరకు పోరాడుతారు.

సామాజిక తెలంగాణ కోరుకోని మాదిగ మేధావుల అభివూపాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వారు కేసీఆర్ మెహర్బానీ కోసం మాట్లాడుతున్నారనే భావించాలి. మందకృష్ణ ఆచరణ, ఆలోచనకు సంబంధించిన సమస్య కాదిది. సామాజిక తెలంగాణ డిమాండ్‌ను ఆయన వరకే పరిమితం చేసి, దాని అవసరాన్ని నిరాకరించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది తెలంగాణ బహుజనుల అందరి సమస్య.

-జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్, కనీజ్ ఫాతిమా, సుధాకర్ అరూరి, సిలువేరు హరినాథ్, గుడిపల్లి రవి, హరికృష్ణ, పురుషోత్తం, అంబాల దేవేందర్, మహేందర్, బిర్రు రవి

No comments:

Post a Comment