Thursday, November 3, 2011

సామాజిక తెలంగాణ ఎలా?


సామాజిక తెలంగాణ ఎలా?

సామాజిక తెలంగాణ యాచనతో వచ్చేది కాదు. యుద్ధం చేసి సాధించేది. 'తెలంగాణలోని దళిత శక్తులు' తెలంగాణ రాష్ట్ర సాధనకై భారత ప్రభుత్వంతో నేరుగా యుద్ధం చేయాలి. అంబేద్కర్ నిర్దేశించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలి. ఓటే ఆయుధం. ఈ విధమైన పోరాటంతో ఏకకాలంలో దళితులు రెండిటిని సాధించవచ్చు. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన; రెండోది అందులో దళితుల రాజ్యం.

భారత రాజకీయాలను శాసించి తన చుట్టూ తిప్పుకున్న కాన్షీరాం తరచూ ఒక మాట అనేవారు: 'డోన్ట్ అపోజ్, వితౌట్ ప్రపోజ్' (నువ్వు ఒక విషయాన్ని వ్యతిరేకిస్తున్నావు అంటే నీ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపించు). ప్రత్యామ్నాయాన్ని చూపించకుండ శత్రువుపై విరుచుకుపడితే జరిగేదేమిటి? నీవు దాడిచేసే శత్రువు పోయి ఆ స్థానంలో మరో శత్రువువచ్చి నిలబడతాడు.

ఎందుకంటే నీ వాదనంతా ఆ రెండవ శత్రువుకి ఉపయోగపడుతుంది; నీవు ఏ ప్రజల కోసం వాదిస్తున్నావో, ఆ ప్రజా సమూహాన్ని శత్రువులంతా ముక్కలు ముక్కలు చేసుకొని తమ వెంట తిప్పుకుంటారు. అయితే విమర్శిస్తున్న వ్యక్తికి ప్రత్యామ్నాయమార్గం లేకపోవటానికి రెండు కారణాలు- వాదిస్తున్న వ్యక్తి అజ్ఞానం కావచ్చు లేదా మరో శత్రువు ఆదేశం కావచ్చు.

ఏది ఏమైనా అంతిమంగా ప్రపోజ్ (ప్రత్యామ్నాయ మార్గం) లేని అపోజ్ (వ్యతిరేకించడం) వల్ల తన దళిత సమాజానికి అణువంత ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది. చాలా కాలంగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అగ్రకుల శక్తులపై చాలా మంది దళిత నాయకుల విమర్శలు వింటున్న దృష్ట్యా పై విషయాలు ప్రస్తావించవల్సి వచ్చింది.

మన దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించక ముందు రాజుల కడుపున రాజులే పుట్టేవారు. అదే ఆనాటి (మను)ధర్మం. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా చెప్పులు కుట్టే మాదిగవాని కడుపున కూడా మహారాజులు (పరిపాలకులు) పుట్టవచ్చు. అంటే ఈ సమాజంలో అన్ని అవకాశాలపై అన్ని సామాజికవర్గాలకి హక్కు కలుగజేయడం. దీనినే కాన్షీరాం తన ముప్పైఏళ్ళ త్యాగమయ పోరాటం ద్వారా ఒక మాదిగ స్త్రీని ఉత్తరప్రదేశ్‌కు పరిపాలకురాలిని చేసి నిరూపించాడు.

అంబేద్కర్‌లో గొప్ప రాజకీయ కాంక్ష ఉందని చెప్పకుండా ఆయన తన జీవితాంతం హక్కుల కోసమే పోరాటం చేశారని కేవలం సామాజిక ఉద్యమకారుడే అన్నట్లుగా చిత్రీకరించి చరిత్రాత్మక ద్రోహం చేస్తున్నారు నేటి కుల ఉద్యమ నాయకులు. ఇలాంటి తప్పుడు వాదనలకు కారణమేమిటంటే అంబేద్కర్‌ను సామాజిక ఉద్యమకారుడే అంటే ఆ సాకుతో సామాజిక ఉద్యమాలే చేసుకోవచ్చు. ఆయన రాజకీయ కోణాన్ని గురించి మాట్లాడితే ఆయనలా బ్యాలెట్ బాక్సు పోరాటం చేయవలసివస్తుందేమోనని వీరి భయం.

ఇంతకీ సమాజంలో మౌలిక సమస్యలను పరిష్కరించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవలసివుంటుంది. మొదటిది రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా, రెండవది ఆ రాజకీయ పార్టీకి సిద్ధాంతాన్ని జోడించడం ద్వారా, మూడవది ఆ రాజకీయపార్టీకి నాయకత్వాన్ని అందించడం ద్వారా. పై మూడు అంశాలు అగ్రవర్ణ సమాజానికి పుష్కలంగా ఉన్నాయి. కానీ మన తెలంగాణలో తరచూ అగ్రకులాలను విమర్శించే దళితనాయకులకి ఈ మూడు లేవు.

అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటున్న వారు, ఆయన పోరాటం ద్వారా నేడు దళిత సమాజం లక్షల సంఖ్యలో విద్యావంతుల సమాజంగా ఆవిర్భవించిన దళితులను సమీకరించి అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని బోధించి, వారిని రాజ్యాధికార దిశగా ఎందుకు నడిపించడం లేదు? అగ్రకుల రాజకీయాలకు అభిముఖంగా అంబేద్కర్ రాజకీయాలను నిర్మించి రెండిటి మధ్య గీత గీసి ఓట్ల యుద్ధం ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ సమాజంలో అతి పెద్దమార్పుకి, అతి తక్కువ ఖర్చు కలిగిన ప్రక్రియ ఎన్నికలు.

అంత గొప్ప బ్యాలెట్ దగ్గరికి వెళ్ళడానికి భయమెందుకు? మన పోరాట చైతన్యం శరీర బలంతోనా? లేక బుద్ధి బలంతోనా? '4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు అగ్రకులాలపై పోరాటం చేసి'..... అదే అగ్రకులాలకు రాజ్యాధికారం వచ్చే 'ఎన్నికల రోజున' ఎందుకు మాయమైపోతున్నారు? అనేది అంతుచిక్కని రహస్యం. భారతదేశంలోనే అత్యంతచైతన్యం మన రాష్ట్రంలోనే, అత్యంత ఎక్కువ ధరకు ఓటు అమ్ముడుపోయేదీ మన రాష్ట్రంలోనే. బహుశా ఇదే కారణం కావచ్చు.

తెలంగాణ రాష్ట్ర సాధనకై కెసిఆర్ వాడే ఆయుధం ఓటు. తద్వారా ప్రజాప్రతినిధుల్ని సృష్టించి తనపై ఆధారపడే ప్రభుత్వాలని ఏర్పరచి ఆ ప్రభుత్వాలని ఆడించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని 'చకోర పక్షి'లా ఎదురు చూస్తున్న చతుర రాజకీయవేత్త. ఇది అర్థం కావాలంటే కాన్షీరామ్ పార్లమెంటరీ రాజకీయ క్రీడని అధ్యయనం చేయాలి. లేదా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పురికొల్పే యుద్ధ ప్రేరణతత్వాన్ని, యుద్ధక్రీడలను, సమీకరణలను అధ్యయనం చేయగలగాలి.

భావజాల వ్యాప్తిని బ్యాలెట్ బాక్సులోకి మళ్ళించే ప్రక్రియను అద్భుతంగా చేసిన గాంధీ, అద్వానీ, కాన్షీరాంల తరువాతి స్థానం నిస్సందేహంగా కెసిఆర్‌దే. అసలు రాజ్యం ఎవరికి వస్తుంది? అది తెలంగాణ రాష్ట్ర రూపంలో కానీ, బహుజనుల రూపంలో కానీ, బహుజనుల రాజ్యం కానీ 'యుద్ధం ఎవరు చేస్తే వారిదే రాజ్యం!' అంటే యుద్ధానికి ఎవరు నాయకత్వం వహిస్తే వారిదే రాజ్యం.

తెలంగాణ ఇచ్చేది భారత ప్రభుత్వం. ఆ భారత ప్రభుత్వంతో యుద్ధం చేసే నాయకులు ఎవరు? డిసెంబర్ 9న భారత ప్రభుత్వం తరఫున చిదంబరం విడుదల చేసిన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటనలో కేవలం కె.చంద్రశేఖర్ రావు అనే పేరు మాత్రమే ఉంది. ఈ ఉదాహరణ చాలు నాయకత్వం ఎవరిదో రాజ్యం వారిదే అవుతుందనడానికి. ముఖ్యమంత్రి పదవి అంటే ఒకరు ఇచ్చేది, నియమించేది కాదు యుద్ధం చేసి సాధించేది.

అసలు కెసిఆర్‌ను నడిపించే నిత్య ప్రేరణ అంశాలు 'శ్రీకృష్ణుడి మనువాద క్షత్రియ విలువలు'. అలా ఆ విలువలకు కట్టుబడి ఉండటం కూడా ఎంత గొప్ప విషయం. అదే విధంగా కాన్షీరాం పోరాటానికి నిత్య ప్రేరణనిచ్చే నడిపించే అంశాలు బుద్ధుడు, అంబేద్కర్ విలువలు. కెసిఆర్‌ది సమాజాన్ని యథాస్థితిగా ఉంచడం; కాన్షీరామ్ సమాజాన్ని మార్చడం. అలాంటి కాన్షీరామ్‌ని నడిపించిన విలువలే దేవేందర్‌గౌడ్‌కి, చిరంజీవికి ఉండి ఉన్నట్టయితే మనకు ఎంతో గర్వంగా ఉండేది.

అందుకే మనిషి-తన విముక్తి ప్రదాతలు ఇచ్చిన ఉద్యమ విలువల్లో పెరిగిపెద్దవాడు కావాలి. వారు ఈ సమాజంతో నిత్యం సంఘర్షణ పడగలరు. మార్పు తేగలరు. సామాజిక తెలంగాణ అంటే అడుక్కొనేది కాదు. యుద్ధం చేసి సాధించేది. సామాజిక తెలంగాణ కెసిఆర్‌ని అడిగితే రాదు. 'తెలంగాణలోని దళిత శక్తులు' తెలంగాణ రాష్ట్ర సాధనకై భారత ప్రభుత్వంతో నేరుగా యుద్ధం చేయాలి. అదీ కూడా అంబేద్కర్ అందించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలి. దానికి ఓటే ఆయుధం. ఓటు అణువంత కావచ్చు. కాని అది అణుబాంబుతో సమానం. ఈ విధమైన పోరాటం ద్వారా ఏకకాలంలో దళితులు రెండిటిని సాధించవచ్చు. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన; రెండోది అందులో దళితుల రాజ్యం.

తెలంగాణ సాధన కోసం అగ్రకులాల పోరాటాన్ని పరిశీలిద్దాం. అధికారం లేని తెలంగాణ అగ్రకులాలకు అవసరం లేదు. ఇది నాడు నేడు వారు చేసిన పోరాటాలను గమనిస్తే అర్థమైపోతుంది. అదే ఆదర్శంగా, అధికారం లేని తెలంగాణ దళితులకూ అవసరం లేదు. కానీ తెలంగాణ కోసం పోరాడే క్రమంలోనే తప్పక అధికారం వస్తుంది. ఇది అసలు విషయం. రామజన్మ భూమిలో రాముడి గుడి కట్టాలని పోరాడిన వారి చేతిలోకి భారత ప్రభుత్వమే వచ్చి పడలేదా? అదే సూత్రంతో తెలంగాణ కోసం పోరాడితే అధికారం తప్పకుండా వస్తుంది.

విశ్రాంతిలో జీవిస్తూ సౌకర్యంగా ఉండే ప్రెస్‌మీట్లు పెడుతూ కవితలు రాసే వారికి రాజ్యం రాదు. భావజాల వ్యాప్తిని చేస్తూ బ్యాలెట్ పోరులో యుద్ధం చేసే వీరుడి వెంట ప్రజా సంపద అనుసరిస్తుంటుంది. దానిని రాజకీయ శక్తిగా మార్చుకుంటూ పోతే అందులో నుంచి రాజ్యాధికారం విడుదలౌతుంది. తద్వారా తాను ఏ ప్రజలకు ప్రతినిధో ఆ ప్రజలను ముందుగా బాగుచేసుకుంటాడు. ఇది ప్రజాస్వామ్యంలో లభించేది. అగ్ర కులాలు తెలంగాణను సృష్టిస్తే దానికి విరుగుడు అదే తెలంగాణను అందుకొని బ్యాలెట్ పోరులో పాల్గొనడం, అధికారం సంపాదించడం చేయవచ్చు.

తెలంగాణ సాధన పోరాటంలో దళితులు ఎవరిని శుత్రువులుగా, ఎవరిని మిత్రులుగా గుర్తించాలి? తెలంగాణలో అత్యంత తక్కువ జనాభా వెలమలు. అత్యంత ఎక్కువ జనాభా మాదిగలు. కెసిఆర్ తన నాయకత్వ ప్రతిభతో అందరినీ తనవైపుకు తిప్పుకోగలిగారు. కానీ తనకి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒక సామాజిక వర్గాన్ని ఎదిరించే శక్తి, దానితో నిలబడి కలబడే శక్తి ఆయనకి లేదు. దానిని ఎదిరించాలంటే మరో రాజకీయ శక్తి అవసరం.

ఈ పరిస్థితుల్లో కాన్షీరాం బ్రతికి ఉన్నట్లయితే ఏమి చేసి ఉండేవారు? - నలభైఏళ్ళు అంబేద్కర్‌ను అవమానపరిచింది, యాభైఏళ్ళు తెలంగాణని మోసం చేసింది కాంగ్రెస్ కాబట్టి, కెసిఆర్‌తో జట్టు కట్టి ఆ పార్టీని బొంద పెట్టేవాడు. ఆ తరువాత తమ తమ లక్ష్యాల కోసం మార్గాలను వారు సులభతరం చేసుకునేవారు.

అంటే ఈ ఊహకి ఆచరణ రూపం అసంఖ్యాకంగా ఉన్న దళిత ఓట్లను బ్యాలెట్ బాక్సువైపుకు మళ్ళించగలిగేలాంటి కాన్షీరాం పని విధానాన్ని తెలంగాణలో దళితనాయకులు ఆచరించాల్సిన అవసరముంది. అంతే తప్ప దళితులంతా పోయి టిఆర్ఎస్‌లో చేరడం సరి కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం దొరకదు. క్రమక్రమంగా మార్చుకుంటూ పోవాలి. ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియ.

దళిత నాయకుల ముందున్న కర్తవ్యం అంబేద్కర్ బోధనలను, విలువలను కాన్షీరాం పని విధానాన్ని తెలుసుకొని ఈ సమాజంతో సంఘర్షణ పడాలి. త్యాగం చేయాలి. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. తద్వారా నాయకత్వాన్ని సృష్టించుకోవాలి. మరీ ముఖ్యంగా వీధి పోరాటాలను వాయిదా వేసి బ్యాలెట్ పోరాటాన్ని మొదలుపెట్టాలి. బ్యాలెట్ పోరాటం చేయకుండా ఎవరైనా అంబేద్కర్ వాదుల మని చెప్పుకుంటూ తిరిగితే వారి పట్ల అప్రమత్తంగా ఈ దళిత సమాజం ఉండాల్సిన అవసరమెంతైనా ఉంది. అందుకే సామాజిక తెలంగాణ సాధనకు, అంబేద్కర్ భావజాల వ్యాప్తికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బ్యాలెట్ పోరాటమే పరిష్కారం. తద్వారా మనచేతుల్లోకి అధికారం, తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం, మన సమస్యలకు పరిష్కారం- ఈ మూడు నెరవేరుతాయి.

- సి.హెచ్. విశారధన్
దళిత శక్తి రాష్ట్ర కన్వీనర్   Andhra Jyothi Dated 03/11/2011 

No comments:

Post a Comment