Sunday, November 27, 2011

భావనాశక్తిని మేలుకొల్పిన పోరాటం - అరుంధతీ రాయ్

ఐదు రోజుల క్రితం జుకొట్టి ఉద్యానవనంలో ఉన్న జనులందరినీ పోలీసులు తరిమివేశారు; ఆ జనులందరూ ఈ రోజు మళ్ళీ అదే ప్రదేశానికి తిరిగివచ్చారు. అసంఖ్యాక ప్రజలు నిర్వహిస్తోన్న ఈ నిరశన ఆ ప్రదేశం కోసం చేస్తున్న యుద్ధం కాదని పోలీసులు తెలుసుకోవాలి. ఇక్కడగాని, అక్కడ గాని, మరెక్కడైనా గానీ ఒక ఉద్యానవనాన్ని ఆక్రమించుకొనే హక్కు కోసం మనం పోరాడడం లేదు. న్యాయం కోసం మనం పోరాడుతున్నాం. న్యాయం, కేవలం అమెరికా ప్రజలకే కాదు, ప్రతి ఒక్కరికి సమకూరేందుకై మనం పోరాడుతున్నాం.

అమెరికాలో సెప్టెంబర్ 17న వాల్ స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమం ప్రారంభమైననాటి నుంచీ మీరు సాధించింది సామ్రాజ్యం హృదయంలోకి ఒక కొత్త భావనా శక్తి (ఇమాజినేషన్)ని, ఒక నూతన రాజకీయ భాషను ప్రవేశపెట్టడం. ప్రతి ఒక్కరినీ కర్తవ్య మూఢుల్ని చేసిన, బుద్ధిహీన వినియోగదారీతత్వాన్ని ఆనందం, సాఫల్యాలతో సమం చేసేలా సమ్మోహనపరిచిన వ్యవస్థలోకి కలలుగనే హక్కును మీర పునఃప్రవేశపెట్టారు. ఒక రచయితగా మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి - మీరు చాలా గొప్ప విజయం సాధించారు. ఇందుకు మీకు నా కృతజ్ఞతలను నేను పరిపూర్ణంగా వ్యక్తం చేయలేను.

మనం న్యాయం గురించి మాట్లాడుతున్నాం. నేడు మనం ఇక్కడ మాట్లాడుకొంటుండగా అమెరికా సాయుధ బలగాలు ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లో ఆక్రమణ యుద్ధాన్ని చేస్తున్నాయి. అమెరికా డ్రోన్స్ (మానవరహిత విమానాలు) పాకిస్థాన్‌లో పౌరులను హతమారుస్తున్నాయి. వేలాది అమెరికా సైనిక దళాలు, హంతక బృందాలు ఆఫ్రికాలోకి వెళుతున్నాయి. మీ లక్షల కోట్ల డాలర్లను ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లో ఆక్రమణల వ్యవహారాలను నిర్వహించడానికి వినియోగిస్తున్నారు. ఆ ఆక్రమణలు చాలలేదు కాబోలు, ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించడం గురించి మాట్లాడుతున్నారు.

(1930ల) మహా మాంద్యం నాటి నుంచి ఆయుధాలను ఉత్పత్తి చేయడం, యుద్ధాన్ని ఎగుమతి చేయడం అనేవి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగిస్తున్న విధానాలలో కీలకమైనవిగా ఉన్నాయి. ఇటీవలే అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో అమెరికా సౌదీ అరేబియాతో 600 కోట్ల డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. సౌదీ అరేబియన్లు ఉదారవాద ముస్లింలు, అవునా? యుఏఇకి వేలాది బంకర్ బస్టర్లను విక్రయించగలననే ఆశాభావంతో అమెరికా ఉన్నది.

సరే, మా దేశం-భారత్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన సైనిక విమానాలను అమెరికా విక్రయించింది. ఆఫ్రికా ఖండంలోని మొత్తంపేద దేశాల జనాభా కంటే ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం మా భారత్. ఈ యుద్ధాలు అన్నీ - హీరోషిమా, నాగసాకిలను అణుబాంబులతో నేలమట్టం చేయడం నుంచి వియత్నాం, కొరియా, లాటిన్ అమెరికాలో చేసిన యుద్ధాల దాకా- లక్షలాది మందిని బలిగొన్నాయి. వీరందరూ 'అమెరికన్ జీవన విధానం'ని సమకూర్చుకొనేందుకు పోరాడిన వారే.

మిగతా ప్రపంచమంతా అనుసరించడానికి ఆకాంక్షిస్తున్న, అందుకు నమూనాగా ఉన్న ఆ 'అమెరికన్ జీవన విధానం' ఫలితాలేమిటో మనకు తెలుసు. కేవలం నాలుగు వందల మంది వ్యక్తులు అమెరికా ప్రజల సంపదలో సగానికి యజమానులుగా ఉన్నారు. ఆ ' జీవన విధానం' ఫలితంగానే వేలాది కుటుంబాలు వీధుల పాలయ్యాయి. జీవనోపాధులను కోల్పోయాయి. మరి అమెరికా ప్రభుత్వం దివాళా తీసిన బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలను వేల కోట్ల డాలర్లతో ఆదుకొంటోంది. ఒక్క అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూపుకే 18,200 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించింది.

భారత ప్రభుత్వం అమెరికా ఆర్థిక విధానాన్ని ఆరాధిస్తోంది. అమెరికాను ఆదర్శంగా తీసుకొని ఇరవై సంవత్సరాలుగా అనుసరించిన స్వేచ్ఛా విపణి ఆర్థిక విధానాల ఫలితంగా నేడు భారతదేశపు సంపన్నులు కుబేరులయ్యారు. పేదలు నిరుపేదలయ్యారు. కుబేరుల జాబితాలో అగ్రగాములుగా ఉన్న 100 మంది భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో నాల్గవ వంతుకు సమానమైన విలువ కల ఆస్తులకు యజమానులు. మరి భారత జనాభాలో 80 శాతం మంది రోజుకు 50 సెంట్ల ఆదాయంపై బతుకుతున్నారు.

రెండున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రుణాల ఊబి నుంచి బయటపడలేకే వారీ విధంగా బతుకు నుంచి నిష్క్రమించారు. దీనిని మేము అభివృద్ధిగా పిలుచుకుంటున్నాము. అంతేకాదు ఇప్పుడు మాకు మేమే భారత్‌ను ఒక అగ్రరాజ్యంగా భావించుకొంటున్నాం. మీ మాదిరిగానే మేమూ అందుకు మంచి అర్హతలు ఉన్నవాళ్ళమే సుమా. ఏమంటే మాకూ అణ్వాయుధాలు ఉన్నాయి; అసహ్యకరమైన అసమానతలూ ఉన్నాయి.

శుభవార్త ఏమిటంటే- ప్రజలు ఈ అసమానతలను ఇంకెంత మాత్రం భరించడానికి సిద్ధంగా లేరు. వారు ఇప్పటికే వాటిని ఎంతగా చవిచూడవచ్చో అంతగా చవిచూశారు. ఆక్రమణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వేలాది ఇతర ప్రతిఘటనోద్యమాలతో ఏకమయింది. ఎల్లెడలా నిరుపేదలు అసమానతలకు వ్యతిరేకంగా లేచి నిలబడుతున్నారు; కార్పొరేట్ కంపెనీల దోపిడీని ప్రశ్నిస్తున్నారు. వాటి కార్యకలాపాలను అడ్డుకొంటున్నారు.

అమెరికా ప్రజలు మా పక్షానికి వస్తారని, సామ్రాజ్యం నడిబొడ్డునే ఇలా నిరసనకు పూనుకుంటారన్న విషయాన్ని మాలో చాలా తక్కువ మందిమి మాత్రమే కలగన్నాం. ఈ ఆక్రమణ ఉద్యమపు ప్రభావం, అది కల్గిస్తోన్న అపరిమిత చైతన్యం గురించి మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. వారు, ఒక శాతం మంది (సంపన్నులు), 'మనం డిమాండ్లు ఏమీ చేయడం లేదని' అంటున్నారు. బహుశా వారికి తెలియదేమో- తమను సంపూర్ణంగా నాశనం చేసేందుకు మన ఆగ్రహం మాత్రమే చాలునని. అయితే ఇక్కడ కొన్ని విషయాల- నాకు గల 'విప్లవ పూర్వపు ఆలోచనలు'- గురించి మనం కలిసికట్టుగా ఆలోచించాలి.

అసమానతలను ఉత్పత్తిచేస్తోన్న ఈ వ్యవస్థను మనం అదుపు చెయ్యాలి. వ్యక్తులూ, కార్పొరేట్ సంస్థలూ అంతులేకుండా ఆస్తులు, సంపదలూ సమకూర్చోవడాన్ని నిరోధించాలి. మరి మన డిమాండ్లు ఇవి: (అ) వ్యక్తులుగాని, కార్పొరేట్ కంపెనీలు కాని వేర్వేరు రంగాలలోని సంస్థలకు యజమానులుగా ఉండకూడదు. ఉదాహరణకు ఆయుధాల ఉత్పత్తిదారులు టీవీ స్టేషన్లకు సొంతదార్లు కాకూడదు; మైనింగ్ సంస్థలు వార్తా పత్రికలను నడపకూడదు; విశ్వవిద్యాలయాలకు వ్యాపార సంస్థలు నిధులు సమకూర్చకూడదు; ప్రజారోగ్యనిధులపై డ్రగ్ కంపెనీలకు ఏ విధమైన నియంత్రణ ఉండకూడదు.

(ఆ) సహజ వనరులను; నీటి సరఫరా, విద్యుత్తు, ఆరోగ్య భద్రత, విద్య మొదలైన మౌలిక సేవలను ప్రైవేటీకరణ చేయకూడదు.
(ఇ) ప్రతిఒక్కరికీ గృహ వసతి ఉండాలి; విద్య, ఆరోగ్య భద్రత సదుపాయాలు ఉండాలి. (ఈ) సంపన్నుల పిల్లలు, తమ తల్లితండ్రుల సంపదను వారసత్వంగా పొందడానికి వీలులేదు.
ఈ పోరాటం మన భావనాశక్తిని మళ్ళీ మేలుకొల్పింది. న్యాయ భావనను కేవలం 'మానవ హక్కుల'కు పెట్టుబడిదారీ విధానం కుదించివేసింది. సమానత్వాన్ని స్వప్నించడం దైవ దూషణ నేరంగా పరిణమించింది. సంపూర్ణంగా నిర్మూలించాల్సిన వ్యవస్థను సంస్కరణలతో బాగు చేసుకోవడానికి మనం పోరాడడం లేదు.
మీ పోరాటానికి నా ప్రణామాలు.
సలామ్, జిందాబాద్.

- అరుంధతీ రాయ్

(న్యూయార్క్ నగరంలోని పీపుల్స్ యూనివర్సిటీలో ఈ నెల 19న ప్రముఖ రచయిత్రి, అరుంధతీరాయ్ 'ఆక్యుపై వాల్ స్ట్రీట్' ఉద్యమానికి మద్దతుగా చేసిన ప్రసంగ పాఠం)
Andhra Jyothi News Paper Sampadakiyam Dated 27/11/2011

No comments:

Post a Comment