Wednesday, November 2, 2011

విరమణ కాదు - విద్రోహమే By - దరువు ఎల్లన్న Andhra Jyothi 02/11/2011


విరమణ కాదు - విద్రోహమే

నా తెలంగాణ కోటి గాయాల గేయమేనా..?
రాజకీయ చదరంగంలో, ఇగ రాజీపడ్డ బతుకులేనా?

సకల జనుల సమ్మె దాదాపు 42 రోజుల వరకు కొనసాగింది. మధ్యమధ్యన ఆర్.టి.సి. ఎంప్లాయీస్ విరమణ 32వ రోజు చేసినా.. డిపార్ట్‌మెంట్‌ల వారీగా... క్రమక్రమంగా సీమాంధ్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం సమ్మె పూర్తిస్థాయిలో విరమిస్తున్నట్లు ప్రకటించే వరకు... విరమణల వెనుక ఒక విద్రోహపూరితమైన కుట్ర దాగున్నట్లు సగటు తెలంగాణ వాదికి కనిపించే నగ్నసత్యం. అసలు సకల జనుల ప్రారంభం నుండే ఏదో సంశయం కనిపించింది. మొదట 6వ తేదీ నుండి 13వ తేదీకి వాయిదా వేయడం. వాయిదా వెనుక రాజకీయ నాయకుల ప్రయోజనాలు ఉన్నట్లు కనిపించింది.

సమ్మె ఉద్యమ రూపాలు ఏ ఒక్కటీ ఉద్యమాన్ని ఉధృతం చేసేవిగా లేకపోవడం బాధాకరం. కాని సమ్మె ప్రారంభ కాలంలో మొట్టమొదటిసారిగా కోదండరాం విరమించినా, మేం నడిపిస్తాం అని గద్దర్ ప్రకటించడం వలన సమ్మెల్లో పాల్గొనాలనుకునే వారికి ఎంతో గుండె ధైర్యాన్ని నింపింది. అయితే మొట్టమొదటిసారి సకలజనుల సమ్మెలో ముందు వరుసలో నిలబడ్డది సింగరేణి కార్మికులే. అటు తర్వాత అన్ని డిపార్ట్‌మెంట్లు, ఆర్.టి.సి, విద్యుత్, పాఠశాలలు/టీచర్లు, డాక్టర్లు, లైబ్రరీ ఉద్యోగులు, టూరిజం, న్యాయవాదులు, టి.ఎన్.జి.ఓ.లు, గెజిటెడ్ ఉద్యోగులు అన్ని ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, అన్ని కార్మిక సంఘాలు ఆఖరికి హమాలీ సంఘంతో సహా సమ్మెలో భాగస్వాములై పనిచేశారు.

అయితే క్రమక్రమంగా అన్ని రంగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నప్పటికీ ప్రభుత్వం నుండి తగిన స్పందన ఎందుకు రాలేదు? ప్రభుత్వ ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేటట్లు ఉద్యమం జరిగినా ప్రభుత్వానికి ఎందుకు భయం కలగలేదు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు తాళాలేసినా, కేంద్రం నుండి కదలిక రాలేదెందుకు? ఏ ప్రకటన రాకముందే రాజకీయ జెఎసి విరమించింది ఎందుకు? ఉద్యోగులు విరమించేటప్పుడు చర్చలు సఫలమైనట్లు 9 డిమాండ్‌లకు ప్రభుత్వం అంగీకరించినట్లు, సంతకాలు చేసినట్లు నేతలు ప్రకటించారు.

అసలు సమ్మె ఈ తొమ్మిది డిమాండ్ల కోసం కాదు కదా? సమ్మె ప్రధాన లక్ష్యం రాష్ట్రం కోసం కదా? విద్యార్థులు/యువకులు బలిదానాలు చూసి చలించిపోయాం, జీవితాలే కోల్పోతున్న నేల మీద మా జీతాలొక లెక్క కాదని ఉద్యోగులు ఎన్నోసార్లు ప్రకటించారు. ఎంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు. పవిత్రమైన కార్యంగా భావించారు, ఇంతలోనే ఏం జరిగినట్లు? విరమణల రోడ్ మ్యాప్ ఎవరిది? కాంగ్రెస్‌దా? టిఆర్ఎస్‌దా? జె.ఎ.సి.దా? ఎవరి ప్రభావం ఉద్యోగులపై పడింది? ఏ ప్రలోభాలు, ఎవరి రాజకీయ స్వార్థాలు, ఈ సమ్మెను విరమింప చేశాయి? అంటే అది కచ్చితంగా కెసిఆర్-కోదండరాంల కుట్రనే (కే.కో.కుట్ర) అని స్పష్టమవుతుంది.

ఉద్యోగుల నిజాయితీ మీద కె.సి.ఆర్ కోదండరాంల రహస్య ఒప్పంద స్వార్థపు బురద చల్లారు. మనకోసం - మన భవిష్యత్ తరాల కోసం చేస్తున్నామని ఉద్యోగులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సైతం నానా కష్టాలు పడ్డారు. సామాన్య ప్రజానీకం ఆర్‌టిసి బస్సులు బందు ఉన్నందుకు ఎన్నో ప్రయాణాలు మానేసుకున్నారు. చిన్నా చితకా వ్యాపారులు పోతే పోయే తెలంగాణ కోసమే కదా అని త్యాగం చేశారు. ఇలా ప్రత్యక్షంగా ఉద్యోగులు ఉద్యమాల్లో ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని వర్గాల ప్రజలు ఆయా మండల కేంద్రాల్లో, డివిజన్‌లలో, గ్రామాల్లో నిరహార దీక్షలు చేసి సంఘీభావం తెలిపారు.

వారం రోజుల క్రితం ఆర్మూర్‌లో తెలంగాణ సాధన కోసం '1500 డప్పుల దరువు' ర్యాలీ సభ పెట్టినప్పుడు నేను హాజరైన సందర్భంగా ఒక పెద్దాయన... "బిడ్డా... ఇన్ని రోజులు బస్సులు తిరుగకుండ ఉండుడు నా జీవితంలో మొదటి సారి అని చెప్తూ, తెలంగాణ వస్తదంటవా బిడ్డా..'' అని అనుమానంగా అడిగాడు. ఈ అనుమానం ఒక పెద్దమనిషిదే కాదు నాలుగు కోట్ల ప్రజల అనుమానమే అని నాకనిపించింది. ఎందుకంటే ఉద్యమం ఇంతగా నడుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదంటే అందులో ఖచ్చితంగా ఈ ప్రాంతపు రాజకీయ నాయకుల లాలూచీతనం ఉందనే అనుమానం కలుగక మానదు.

కాంగ్రెస్ ద్రోహపూరితమైన పార్టీ అయినప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు చేసే డ్రామాలు చూస్తూ టి.ఆర్.ఎస్ ఎందుకు మౌ నం వహించినట్లు? ఉద్యమంలో రాజీనామాలు ఆమోదం పొందకుండా నామమాత్రంగా ఎందుకు మిగిలాయి? సమ్మెకాలంలో ఉద్యోగులు జీతాలు త్యాగం చేస్తుంటే, రాజకీయ నేతలు జీతాలు ఎందుకు తీసుకున్నట్లు? రాజీనామాలు ఆమోదించేది వీరి చేతిలో లేకున్నా, జీతాలు తీసుకునేది వీళ్ళ చేతుల్లోనే వుంది కదా? అంటే ఇది పార్టీల ద్వంద్వ వైఖరి కాదా? ఇలా ఏ అంశాన్ని చూసినా... అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నాయన్నదే చారిత్రక వాస్తవం.

ఈ సందర్భంలో పార్టీల/నేతల మాటలు, ప్రధానంగా కెసిఆర్-కోదండరాంలు, నిజాయితీతో ఉద్యమంలోకి వచ్చిన ఉద్యోగుల్ని నిర్వీర్యం చేశారు. ఇన్ని డిపార్ట్‌మెంట్లు లక్షలాది ఉద్యోగులకు ఒక ఉమ్మడి కార్యక్రమం లేకపోవడం వెనుక కోదండరాం ఉద్యమ ఉధృతి వైపు కాకుండా ఉద్యమ నిర్వీర్యం వైపు అడుగులేసినట్లు అర్థమౌతుంది. తెలంగాణ ఏకైక ప్రధాన లక్ష్యమని చెప్పిన ఉద్యోగులకు, విరమణ కోసమే రూపొందించుకున్న 9 డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకున్నట్లు పొలిటికల్ జెఎసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పద అనుమానమే. గతంలో సింగరేణి కార్మికులు ఏ సమ్మె చేసినా అది విఫలమైనట్లు కార్మికుల చరిత్రలోనే లేదు.

వేతన ఒప్పందం కోసం గతంలో సికాస పిలుపు మేరకు దాదాపు 55 రోజులు సమ్మె చేసి వేజ్ బోర్డు సాధించుకున్న చరిత్ర సింగరేణి కార్మికులది. అలాంటి కార్మికులను సైతం ఏ ఫలితం లేకుండా విరమింపచేసిన ద్రోహులెవరు? టీచర్లు, లెక్చరర్లు, ఏ ఒక్కరు మనస్ఫూర్తిగా విరమించలేదన్నది వాస్తవం. గతంలో విద్యార్థి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్న స్వార్థ రాజకీయ పార్టీలే, ఇప్పుడు ఉద్యోగుల ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసినట్లు కనిపిస్తోంది.

ఉద్యోగ సంఘాల్లోని కొంతమంది నేతలు రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం వల్లనే రాజకీయ పార్టీల సూచనల మేరకు ఉద్యమ విరమణ ప్రకటన చేసినట్లు కన్పిస్తోంది. ఇది 60 సంవత్సరాల ఉద్యమంలో ఒక కొత్త కోణం. ఇంతటి మహత్తర ఉద్యమం మరోసారి సాధ్యమా అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఇదొక నిరాశనే మిగిల్చింది.

60 ఏళ్ల చరిత్రలో రాజకీయ పార్టీలది మోసపూరితమైన పాత్రనే. చెన్నారెడ్డిని మించిన ద్రోహం ప్రస్తుతం మన కండ్లముందు ప్రత్యక్షంగా కనబడుతుంది. తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించమని కొట్లాడిన ఉద్యమకారులను వక్రదారి పట్టిస్తూ ఉద్యమాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలో, ఏఏ దశల్లో ఎవర్ని విరమింప చేయాలనే 'విరమణల రోడ్ మ్యాప్' తీసుకొని కేంద్రంతో కుమ్మక్కై తమ వ్యాపార లావాదేవీల కోసం, తమ కుటుంబ రాజకీయాల కోసం, ఉద్యమాన్ని వాడుకునే ఏ రాజకీయ పార్టీ నేతలకైనా ప్రజల మధ్యన గుణపాఠం తప్పదు. విరమణ వెనుక దాగిన విద్రోహాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం.

సకలజనుల సమ్మెలో సర్వం కోల్పోవడానికి సిద్ధపడ్డది ఉద్యోగులు, కాని సర్వనాశనం చేసింది రాజకీయ పార్టీ నేతలే. 'ఇది విరమణ కాదు పార్టీల విద్రోహమే.' మళ్ళీ తెలంగాణ ప్రజలకు భరోసానివ్వాల్సింది, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన విద్యార్థి యువతరమే. ఉద్యమం ఆగిపోయిందని, ఇక తెలంగాణ రాదని ఆవేశంతో, మనస్సు కలత చెంది ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. నిస్వార్ధంగా పనిచేసే యువకులు రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యాలయాల్ని ఉద్యమ కేంద్రాలుగా చేసి పోరాడే సమయం ఆసన్నమైంది.

- దరువు ఎల్లన్న
ఉస్మానియా పరిశోధక విద్యార్థి

1 comment: